యూనిట్

నవ్యాంధ్ర అభివృద్ధిలో పోలీసు పాత్ర - ప్రజల భాగస్వామ్యం ఆవశ్యకత

''ఏదేశం చరిత్ర చూసినా - ఏమున్నది గర్వకారణం' అని మహాప్రస్థానం చేసిన ఓ శ్రీశ్రీ - నాదేశ, రాష్ట్ర పోలీసు చరిత్రలో చూడు ఎన్ని విధులో, ఎన్ని సేవలో, ఎన్నెన్ని ప్రాణత్యాగాలతో నిండి ఉన్నాయో అర్థమవుతుంది.

''సత్యమేవ జయతే'' అనేది పోలీసులకు కేవలం ఒక నినాదం కాదు, అది మన పోలీసుల విధి విధానం - అంతేకాదు, 'శ్రీమయేవ జయతే'కి ప్రత్యక్ష సాక్షి పోలీసు - శ్రమైక జీవన సౌందర్యానికి విరామ మెరుగని నిత్య పరిశ్రమించిన వాడు. నిరంతర ప్రజా సేవకుడు పోలీస్‌.

''ఎందెందు వెతికి చూచినా అందందేకలడు చక్రీ సర్వోపగతుండు'' అని బమ్మెర పోతన చెప్పిన ఈ పద్యం ఆ మహావిష్ణువుకు వర్తిస్తుందో లేదో గాని, ఎక్కడ సంఘ విద్రోహాలు, నేరగాళ్ళు, రౌడీలు, గూండాలు, దొంగలు, చట్ట విరోధులు, శాంతి భద్రతల విఘాతకులు, అక్రమార్కులుంటారో, ఎక్కడ భయాందోళనలుంటాయో అక్కడ పోలీసు ఉంటాడు. ఇది జన మెరిగిన నిజం. జగమెరిగిన సత్యం.

లోక కళ్యాణము కోసం శంఖు చక్రగదాయుధములు ఆ మహా విష్ణుమూర్తి ధరిస్తే... ఒక చేతిలో లాఠీ, పాకెట్‌లో గన్ను, ఒంటిపై ఖాకీ దుస్తులు వేసుకున్న పోలీసు ఆ విష్ణుమూర్తి ప్రతి రూపం. ఎందుకంటే విష్ణుమూర్తి లోక కళ్యాణము కోసమైతే, పోలీసు ప్రజా సేవా, శాంతి పరిరక్షణకు అనుటలో అతిశయోక్తి లేదు.

ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21న మనం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవము జరుపుకుంటున్నాము. అయితే ఇదే రోజు ఎందుకు జరుపుకుంటున్నామో ఆ మహోన్నత చరిత్రను ఈ సందర్భముగా మనమొకసారి క్లుప్తంగా చెప్పుకోవడము ఉచితమని నా భావన.

భారత్‌-చైనా సరిహద్దులో ఉన్న లడక్‌ ప్రాంతంలోని 'అక్యూయ్‌చిన్‌'' వద్ద కేంద్ర రిజర్వు పోలీసు దళము (సిఆర్‌పిఎఫ్‌) సరిహద్దు రక్షణలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమములో 1959 సంవత్సరము అక్టోబర్‌ 21న రక్తము గడ్డుకట్టె చలిలో సిఆర్‌పిఎఫ్‌ జవానులు విధులు నిర్వహిస్తుండగా, చైనాకు చెందిన సైనికులు భారత సరిహద్దులోనికి చొచ్చుకువచ్చారు. వారిని మన దళం ధైర్యంతో ఎదిరించి చివరి రక్తపు బొట్టువరకు పోరాడి అందులో 10 మంది సైనికులు దేశం కోసం వీరమరణం పొందారు. ఈ క్రమంలో భారతదేశ రక్షణ కోసం పోలీసు ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశమై నాటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించాలని తీర్మానించడమైనది. ఆనాటి నుండి నేటివరకు దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తూ.. ఆ అమరవీరుల త్యాగాన్ని స్మరించుకొని, వారి కుటుంబాలకు మానసిక స్థైర్యాన్ని, సానుభూతిని, సహకారాన్ని ప్రకటించి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము.

2014 జూన్‌ 2న పుట్టిన నవ్యాంధ్రప్రదేశ్‌ 5 సంవత్సరాల వయసుగల పసికూన. అమరావతి రాజధానిగా 13 జిల్లాలు, 175 శాసనసభ స్థానాలతోను భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటిగా వెలిసింది. దేశంలో 2వ అతిపెద్ద కోస్తాతీరం మన రాష్ట్రంలో ఉంది, అదేవిధంగా వివిధ జాతులు, మతాలు, కులాలతో నిండిన రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్‌. వీటితో పాటు సైబర్‌ నేరాలు వంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఏ రాష్ట్రానికైనా ఇది సహజం. 

నవ్యాంధ్ర అభివృద్ధిలో పోలీసు పాత్ర: 

1. శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల ప్రాథమిక కర్తవ్యం, విధి. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎంతో చాకచక్యంగా రాబోయే సమస్యలు ముందుగా ఊహించి తగిన చర్యలు తీసుకొనుటలో ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు కీలక పాత్ర వహించి ప్రజల తోడ్పాటులో ఫ్రెండ్లీ పోలీస్‌ విధానం ద్వారా పరిష్కరిస్తున్నారు.

2. ఇంటర్‌నెట్‌, ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్‌ టెక్నాలజీ వల్ల జరుగుతున్న సైబర్‌ నేరాలు అరికట్టడములో పోలీసులు విజయవంతమవుతున్నారు. అధునాతన టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ-సైబర్‌ నేరస్తులను వెనువెంటనే గుర్తించి వారిని కస్టడీలోకి తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరు మోసపోవద్దని, సైబర్‌ నేరస్థులు ఏవిధంగా ప్రజలను మోసం చేస్తున్నారో, వాటిని మనం ఎలా త్రిప్పికొట్టాలో వారి వలలో ఎలా పడకుండా ఉండాలో ప్రజలను హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.

3. సంఘ విద్రోహులను తమదైన శైలిలో నియంత్రించడములో సఫలమవుతున్నారు. కొత్త టెక్నాలజీలో సీసీ కెమెరాల సహాయంతో ఎన్నో నేరాలను, విద్రోహులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నారు.

4. ముఖ్యంగా రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సరిహద్దులలో మావోయిస్టుల అలజడులు అక్కడక్కడే గోచరమవుతున్నాయి. మావోయిస్టులు రాష్ట్రంలో లేకుండా చేయుటకు, వారిని జనజీవన స్రవంతిలోకి తెచ్చుటకు, అవసరమైన చోట అణచివేయడంలోను రాష్ట్ర పోలీసు యంత్రాంగము 90శాతం విజయమయ్యారు. సమాజ మార్పు తుపాకి గొట్టం ద్వారా జరగదని, ప్రజాస్వామ్యయుతంగా, చట్ట పరిధిలోనే సాధించవచ్చుననే నమ్మకం వాళ్ళయందు కలిగించి వారిని జనజీవన స్రవంతిలోనికి తేవడం పోలీసుల కర్తవ్యం.

5. రాష్ట్రంలో పసిపిల్లల కిడ్నాపులు, మహిళలపై అత్యాచారాలు అప్పుడప్పుడు జరుగుతున్నాయి. నేర ప్రవృత్తి తగ్గినప్పటికీ పూర్తిగా సమసిపోలేదు. ఇలాంటి వారిని ఉపేక్షించకుండా చట్ట పరిధిలో న్యాయంగా శిక్షలు విధింపునకు పోలీసు వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది, ఇంకా చేయవలసి ఉంది. 

6. దోపిడీ దొంగలు వివిధ నేరగాళ్ళు, 

మోసగాళ్ళు పెట్రేగి పోకుండా ప్రజా సహకారంతో, టెక్నాలజీ ఉపయోగించుకొని వీరి ఆటలను కట్టించడములో పోలీసుల పాత్ర ఎంతో శ్లాఘనీయం.

7. ఇవే కాకుండా పండగలు, పబ్బాలు, ఊరేగింపులు, ప్రజా ప్రతినిధులు, సమావేశాలు, పర్యటనలు, జాతరలు, చెక్‌పోస్టుల వద్ద, ముఖ్యంగా ట్రాఫిక్‌ నియంత్రణకు, బందోబస్తులు, పుస్కరాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజా జీవనంలో ప్రతి అడుగులోను, ప్రతి కార్యములోను ప్రతి నిమిషములో, ప్రతి వ్యవహారములోను, ప్రతి సందర్భంలో పోలీసు పాత్ర ఎనలేనిదని, ఎంచలేనిదని గర్వంగా చెప్పుకోవచ్చును.

ప్రజల భాగస్వామ్యం- ప్రజా సేవ:

ఇది వరకు పోలీసులంటే ప్రజలకు భయం, అపనమ్మకం ఊరికనే వేధిస్తారనే భావన ఉండేది. కాని ప్రస్తుతం ప్రజలు దాని స్థానంలో మిత్రులుగా, సేవకులుగా భావించడములో పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. దాని కోసము ప్రజా సంబందాలు నెలకొల్పుకుంటూ, నిత్యం ప్రజల్లోకి వెళ్తూ వారి యందు తమ పట్ల నమ్మకం కలిగించే మంచి పనులు, వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ''ఫ్రెండ్లీ పోలీస్‌' వ్యవస్థను నెలకొల్పడానికి కృషి చేస్తున్నారు. ప్రజల కోసము ఎల్లప్పుడూ మేమున్నాము అనే భరోసా కల్పిస్తున్నారు. విద్యావంతులు, సత్ప్రవర్తన కలిగిన యువకులతో మైత్రి కమిటీలు ఏర్పాటు చేసి, వారి సహాయంతో రాబోయే దుర్ఘటనలను ముందే ఊహించి తగ్గట్టు వ్యవహరిస్తున్నారు.

''మాకు లాఠీలు ముఖ్యంకాదు, ప్రజల మనోభావాలే ముఖ్యం'' అన్నట్లు వ్యవహరించి ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజలు తమ సమస్యల కోసం వచ్చినప్పుడు ఫిర్యాదులు చేయదలచుకునప్పుడు వారిని సాదరంగా ఆహ్వానించి, కూర్చోబెట్టి, వారి సమస్యలు సావదానంతో విని, తగిన పరిజ్ఞానం లేని వారికి పోలీసులే కంప్లయింట్‌ను తయారుచేసి, నమోదు చేసి వాళ్ళలో నమ్మకం కలిగించాలి, ధైర్యం నింపాలి, అలాగే ఫ్యాక్షన్‌ గ్రామాల సందర్శన, పల్లెనిద్ర, సేవా కార్యక్రమాలు వంటివి నిర్వహించాలి. ఈ విధంగా ప్రజలలో మమేకమై నిూట ్‌ష్ట్రవ జూవశీజూశ్రీవ, ఖీశీతీ ్‌ష్ట్రవ జూవశీజూశ్రీవ, పవ ్‌ష్ట్రవ జూవశీజూశ్రీవకు ప్రజాస్వామ్య నిర్వచనం. 

ప్రజా సహకారంతో, ప్రజల్లో ఒక్కరిగా, ప్రజల కొరకు పోలీసులు అనే నిర్వచనంలా కృషి చేయాలి 'మానవ సేవే మాదవసేవ' అన్నట్లు 'ప్రజాసేవే పరమాత్మంగా' పోలీసులు భావించాలి. ప్రజలకు ఎంత చేశామన్నది ముఖ్యంకాదు, ఎలా చేశాం, ఎలా వారి మనసులు గెలుచుకున్నాము అన్నట్లు చేయాలి. ప్రజా సేవలో ఉన్నవారి నుండి నీతి, నిజాయితీ, అంకితభావం, మానవత్వం, త్యాగం వంటి లక్షణాలు సమాజం ఆశిస్తుంది.

పోలీసులు విధి నిర్వహణ ఎంతో శ్రమతో కూడుకున్నది. దీనికి పనికాలం అంటూ పరిమితిలేదు. 24 గంటలు విధి నిర్వహణే ముఖ్యం. వీరులేని సమాజం మనం ఊహించలేము. ప్రభుత్వమంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది పోలీసులే. ఏ పరిస్థితిలోనైనా, ఏ ఆపదలోనైనా, ఏ సమయంలోనైనా ముందు ఉండవలసింది. పోలీసులే. దేశాన్ని కాపాడే వాడు సైనికుడైతే, అంతర్గత శత్రువుల నుండి ప్రజలను కాపాడేవారు పోలీసులు. ప్రజల భద్రతకు భరోసా ఇచ్చేవారు పోలీసులు. ప్రజల భద్రత పరిరక్షణ కోసం ఒక్కొక్కసారి ప్రాణత్యాగం చేయవలసి వస్తుంది. అయినప్పటికీ ప్రజలు తగినంత గుర్తింపు నివ్వటం లేదు. వారి త్యాగాలను గుర్తించి వారిని స్మరించుకోవటం మన కర్తవ్యం.

ప్రపంచమంతా నిద్రలో ఉంటే అనుక్షణము మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణలో కాపలా కాస్తుంటాడు పోలీసు. ఎండా, వాన, పగలు, రాత్రి తేడాలేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగలను త్యజించి, ప్రజల కోసం జీవించి, వారికోసం మరణించే పోలీసుకి తన ప్రాణం ఫణముగా పెట్టి ప్రజల కోసం చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం, నిరంతరం ప్రజలకు అన్ని సమయాలలో అందుబాటులో ఉండి విధుల నిర్వహణ విభిన్నమైనది. నిత్యం అప్రమత్తమై విధులు నిర్వర్తించడం వలన అనేక ఒత్తిడులకు గురవుతూ తీవ్ర మానసిక సంక్షోభంలో కూరుకుపోయి అనారోగ్యాలకు గురవుతున్నారు. కొన్ని సమయాలలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేస్తున్నారు. 

పోలీసులుగా బాధ్యతలు నిర్వర్తించడానికి ముందు రాబోతున్న వారికి విధి నిర్వహణ నూతనుత్తేజాన్ని స్పూర్తిని నింపడమే అమరవీరుల సంస్మరణ దినం యొక్క ముఖ్యోద్దేశం.

''నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్లనలు పోతాను''

''నేను సైతం ప్రపంచాల్బపు తెల్లరేకై పల్లవిస్తాను''

''నేను సైతం భువన భువనపు బాహుటాలై పైకి లేస్తాను''

యన్నట్లు పోలీసులు కూడా-

''మేము సైతం సమాజ శాంతికి బద్దులమై ఉంటాము''

''మేము సైతం ప్రజా భద్రతకి భరోసాన్నిస్తాము''

''మేము సైతం విధి నిర్వహణకు ప్రాణత్యాగాన్ని లెక్కచేయం, అంటూ - ప్రజాసేవకి, శాంతికి, భద్రతకి నమ్మకమైన నిరంతర శ్రామికులుగా సమాజం గుర్తించేటట్లు కృషి చేయాలి!


వార్తావాహిని