యూనిట్

డిజిపిగారి సందేశం

దేశంలోనే ఎంతో ఘన చరిత్ర, విశిష్టత గల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి డిజిపిగా పదవీ బాధ్యతలు చేపడుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను, గర్వకారణంగా భావిస్తున్నాను. నా మీద అపార నమ్మకంతో ఈ గురుతర బాధ్యతను అప్పగించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర విభజన జరిగి ఐదు సంవత్సరాలు గడిచినా మన శాఖలో విభజన సంబంధిత సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర పోలీసు వ్యవస్థ బహుముఖ సవాళ్ళను ఎదుర్కొంటున్నది. మనకున్న పరిమిత వనరులతోనే వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టవలసిన ఆవశ్యకత ఉన్నది. అందుబాటులో లేని అవకాశాల కోసం కాలాయాపన చేయకుండా... స్వయం సిద్ధ శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను మెరుగుపరుచుకొని మనం ముందుకు అడుగు వేస్తామని నమ్మకం ఉంది.

ప్రజలు ఎన్నో ఆశలతో మార్పుని ఆశించి నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. నూతన ప్రభుత్వం చేపట్టిన మార్పులో భాగంగా ఈ బాధ్యతలను నాకు అప్పగించింది. పోలీసుశాఖ తమ రక్షణ, సేవా బాధ్యతలు నిర్వర్తించడానికే ఉన్నదని సమాజంలోని సామాన్య ప్రజలు భావించేలా మన పని తీరు ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. అవినీతి రహితంగా, నిష్పక్షపాతంగా, ఎటువంటి ఒత్తిడులకు, ప్రలోభాలకు తలొగ్గకుండా.. అన్ని వర్గాలు ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, మహిళల సంరక్షణే ప్రధాన ధ్యేయంగా పయనించాలని ఆయన సూచించారు. ప్రజలు మనమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రతిక్షణం వారి రక్షణ బాధ్యతలను మనం కంటికి రెప్పలా కాచుకుంటున్నామని భరోసాతో ఉన్నారు. మానసికంగా, శారీరకంగా ఎన్ని అవరోధాలు, ఆటంకాలను ఎదుర్కోవాల్సి వచ్చినా, ప్రజలు మనపై ఉంచిన విశ్వాసానికి భంగం కలుగకుండా కాపాడుకోవాలి.

రాష్ట్రంలో బాలలు, బాలికలపై దాడులు, లైంగిక వేధింపులు, అపహరణ, అత్యాచార ఘటనలు, రోడ్డు ప్రమాద ఘటనలు విరివిగా జరుగుతున్నాయి. మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం, క్రికెట్‌ బెట్టింగ్‌, ఇతర జూదాల వంటివి యువతను పెడత్రోవ పట్టించే అసాంఘిక కార్యకలాపాల కట్టడికి సమగ్ర కార్యాచరణ రూపొందించి ప్రణాళికాబద్ధంగా అమలు పరుస్తాం. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్‌ నేరాలు కూడా విజృంభిస్తున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకొని అన్వయించుకోవడంలో మన రాష్ట్ర పోలీసుశాఖ ఎల్లప్పుడు ముందంజలో ఉంటుంది. సాంకేతిక నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకొని ఈ సైబర్‌ నేరాల కట్టడికి కృషి చేస్తాము.

ఎంతో ఒత్తిడి, శారీరక శ్రమతో కూడిన పోలీస్‌ ఉద్యోగంలోని కష్టాలను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రిగారు సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ ద్వారా విశ్రాంతి అవసరమని ఆపేక్షించారు. దీని అమలుకు అడిషనల్‌ డిజి (లా అండ్‌ ఆర్డర్‌) రవిశంకర్‌ అయ్యన్నార్‌గారి నేతృత్వంలో కమిటీని నియమించాము. అతిత్వరలో ఈ సదుపాయాన్ని పోలీస్‌ సిబ్బంది అందరికీ అందుబాటులోకి తెస్తాము. పోలీస్‌ సంక్షేమానికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తానని ముఖ్యమంత్రిగారు హామీ ఇచ్చారు. సిబ్బంది సంక్షేమం, పనితీరు మెరుగు, నేరాల నియంత్రణ, ప్రజా సంబంధాల మెరుగు తదితర అంశాలపై అనేక ప్రణాళికలు నా మనస్సులో ఉన్నాయి. వాటి అమలుకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తాము.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్‌. జగన్‌మోహన్‌ రెడ్డిగారి స్ఫూర్తితో మనలో ప్రతి ఒక్కరి సంపూర్ణ సహాయ సహకారాల మద్దతుతో, అచిర కాలంలోనే దేశానికే మార్గదర్శకంగా నిలిచేలా రాష్ట్ర పోలీసుశాఖను బలోపేతం చేసుకుందాం..

వార్తావాహిని