యూనిట్

మహిళా భద్రతకు రక్షణ కవచం ''సైబర్‌ మిత్ర''

మహిళలు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా స్వేఛ్చా, సాధికారతలతో ఉన్నతంగా జీవించగలిగే ప్రశాంత పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత మనపై వుంది. బాలికలు, మహిళల భద్రతకు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి అనుగుణంగా హోం మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారి ఆధ్వర్యంలో వినూత్న విధానాలకు శ్రీకారం చుడుతున్నాము. అందులో భాగంగా బాలికలు, మహిళలను సైబర్‌ నేరాల నుండి కాపాడే రక్షణ కవచం ''సైబర్‌ మిత్ర'' ఫేస్‌బుక్‌ పేజ్‌, 9121211100 వాట్సాప్‌ నెంబర్‌ను హోం మంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించాము. ఇది బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు రాకుండానే తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకొని వచ్చే సులభతర సాంకేతిక విధానం. దీని ద్వారా బాధితుల వివరాలు గోప్యంగా వుండడమే కాకుండా వారికి సత్వరమే రక్షణ, న్యాయ సహాయం లభిస్తుంది.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ''స్పందన'' కార్యక్రమం అమలు విధానంపై ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రధ్ధ వహిస్తున్నారు. ''స్పందన''లో వచ్చే ప్రతి ఫిర్యాదుపై నియమిత గడువులోగా తప్పకుండా తగిన పరిష్కారం చూపాలని సమీక్షా సమావేశంలో సూచించారు. ముఖ్యంగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రజలను చిరునవ్వుతో ఆదరించి, వారి సమస్యలను సావధానంగా తెలుసుకొని, తగు న్యాయం చేయాలన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతి పోలీస్‌ స్టేషన్‌లోను ప్రజా సంబంధాలపై అవగాహన, శిక్షణ పొందిన సిబ్బందితో రిసెప్షన్‌ విభాగాన్ని నిర్వహించాలన్నారు. లంచం, అవినీతికి ఏ మాత్రం ఆస్కారం లేని పారదర్శక విధులను ప్రజలకు చేరువ చేయాలని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. గత నాలుగు వారాలలో స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులలో 97 శాతం పరిష్కరించాము. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ శాఖలన్నింటిలోకెల్లా అత్యుత్తమ రీతిలో చిత్తశుద్దితో నిర్వర్తించి మన సమర్థతను సగర్వంగా చాటుతున్నాం.

కొద్దికాలంగా పెండింగ్‌లో వున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తుది రాత పరీక్షా ఫలితాలు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేశాము. ముఖ్యమంత్రి గారి ప్రత్యేక చొరవతో ఈ ఫలితాల ప్రక్రియను వేగవంతం చేసి, ఒక కొలిక్కి తెచ్చాము. దీనితో మొత్తంగా 333 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (సివిల్‌), రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఆర్‌, ఏపీఎస్‌పీ), డిప్యూటీ జైలర్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, పోస్ట్‌లు భర్తీ కానున్నాయి. ఎంపిక అయిన వారికి తుది దశ పరిశీలనలు త్వరిత గతిన పూర్తి చేసి శిక్షణకు పంపనున్నాము. ఇదే విధంగా పెండింగ్‌లో వున్న కానిస్టేబుల్‌ పోస్ట్‌ ఫలితాలను కూడా త్వరలో వెల్లడించడానికి వేగవంతమైన చర్యలు చేపట్టాము.

లక్నోలో జరిగిన ఆలిండియా 62వ పోలీస్‌ డ్యూటీ మీట్‌లో రాష్ట్ర పోలీసులు మూడు బంగారు, ఒక కాంస్యం, రెండు రజత పతకాలుతోపాటుగా రెండు ఇన్నర్‌ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీలను సాధించడం మనకు ఎంతో గర్వ కారణం. పతక విజేతలకు మన అందరి తరపున అభినందనలు తెలియజేస్తూ, ఇదే ఉత్సాహాన్ని, నైపుణ్యాన్ని భవిష్యత్‌లో కూడా కొనసాగించి మన శాఖకు మరింత ఖ్యాతి తీసుకు రావాలని  ఆకాంక్షిస్తున్నాను.

వార్తావాహిని