యూనిట్

చిరకాల స్వప్నం 'వారాంతపు సెలవు' సాకారం

దశాబ్దాలుగా పోలీసు సిబ్బందికి మరియు వారి కుటుంబాలకు చిరకాల స్వప్నమైన 'వారాంతపు సెలవు'ను దేశ పోలీస్‌ చరిత్రలోనే మొదటిసారిగా సగర్వంగా సాకారం చేసాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి ఆదేశానుసారం, త్వరితగతిన అధ్యయనం పూర్తిచేసి వారాంతపు సెలవును కార్యాచరణలోకి తీసుకువచ్చాం. కానిస్టేబుల్‌ స్థాయినుండి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకు ఈ సౌలభ్యం వినియోగించుకునే అవకాశం వున్నది. వివిధ విభాగాలలో అందుబాటులో వున్న సిబ్బంది, వారి విధి నిర్వహణ స్వభావాలను బట్టి వారాంతపు సెలవుకు పంతొమ్మిది విధానాలు రూపొందించడమైనది. ఆయా విభాగాధిపతులు తమకు అనుకూలంగా వుండే సెలవు విధానాన్ని ఎంచుకుని, అమలు పర్చే అవకాశాన్ని కల్పించాం. రాష్ట్ర పోలీస్‌ సంక్షేమంలోనే ఈ వారాంతపు సెలవు కలికితురాయిగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారికి పోలీస్‌ సిబ్బంది మరియు వారి కుటుంబాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 

గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యాన ఉండవల్లి ప్రజావేదికలో జరిగిన శాంతిభద్రతల సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భముగా ముఖ్యమంత్రిగారు మాట్లాడుతూ గతంలో జరిగిన తప్పిదాలవలన పోలీస్‌ శాఖపై ప్రజల విశ్వాసం సడలిందని, మరలా అటువంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా ప్రజామోదంగా, పారదర్శకంగా అత్యుత్తమ పనితీరు కనబర్చాలని మార్గనిర్దేశం చేసారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై గౌరవ ముఖ్యమంత్రి గారికి సోదాహరణంగా వివరించాను. క్రమానుగతంగా ఆత్మపరిశీలన చేసుకుంటూ పోలీస్‌ వ్యవస్థను మరియు పోలీస్‌ సిబ్బందిని ఆదర్శ పాలనా సంస్కరణలతో దృఢతరం చేస్తూ, సమున్నత సేవలతో ప్రజలకు చేరువవుతామని విన్నవించాను. ప్రజల ఆశలకు మరియు ప్రభుత్వం యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తామని గౌరవ ముఖ్యమంత్రిగారికి తెలియజేయడమైనది.

ర్యాగింగ్‌ అమానుష సంస్కృతిని రూపుమాపడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రముఖ విద్యాలయాలలోను యాంటీ ర్యాగింగ్‌ కమిటీలను ఏర్పాటు చేయనున్నాము. ఇటువంటి విపరీత ధోరణుల కారణంగా ఒక్క విద్యార్ధి కూడా విద్యకు దూరం కాకుండా చూడాలన్నదే వీటి ప్రధాన ఉద్దేశ్యం. విద్యార్ధులుకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఈ విషయమై పూర్తి అవగాహన కల్పించి, ర్యాగింగ్‌ నిరోధనకు భాగస్వామ్యం వహించేటట్లు ప్రోత్సహిస్తాం. అదేవిధంగా బాలికలు, మహిళలపై దాడులు, వేధింపులు, అత్యాచారాల కట్టడికి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నాము. హోం మంత్రిగా శ్రీమతి మేకతోటి సుచరిత గారి వంటి మహిళ వుండడం మహిళలు, బాలికల భద్రత, రక్షణ కల్పనకు మరింత భరోసానిస్తుంది. 

గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో 'స్పందన' కార్యక్రమం మొదలు పెట్టాం. క్రమం తప్పకుండా ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును స్వీకరించి, ఖచ్చితంగా తగు రశీదు ఇస్తారు. అందులో సమస్య ఎప్పటిలోగా పరిష్కరిస్తారో కూడా తెలియపర్చి వుంటుంది. ఈ విధానం మన శాఖ యొక్క జవాబుదారీతనాన్ని మరింతగా పెంపొందించే భాద్యతాయుత పాలనా ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'స్పందన' కార్యక్రమానికి ప్రజల నుండి భారీ ఎత్తున స్పందన వెల్లువెత్తుతున్నది. 

ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా మన పనితీరు వుండాలనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి ఆలోచనా విధానం. దీనికి అనుగుణంగా పోలీస్‌ సిబ్బంది సామాన్య ప్రజలకు మరింత చేరువ అవ్వాలి. వారి భద్రత మన ప్రథమ కర్తవ్యంగా భావించి, పోలీస్‌ వ్యవస్థపై వారికి నమ్మకం కలిగేలా వ్యవహరిస్తూ, మన విధి నిర్వహణా పథాన్ని ముందుకు పరిగెత్తించడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉంటారని ఆశిస్తున్నాను.

వార్తావాహిని