యూనిట్
Flash News
' ప్రతీకారం'
సమాజంలో
ప్రతినిత్యం చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనలు అనేకం ప్రతీకారం తీర్చుకోవడానికి
చేసినవే. ప్రతీకారం అనే మానసిక భావోద్వేగాన్ని సరయిన పద్ధతుల్లో విశ్లేషించి
ప్రతీకారం తీర్చుకోవడానికి పురికొల్పుతున్న అంశాలను కనిపెట్టవచ్చు.
మనిషనే
వాడు పుట్టి భూమ్మీద పడినప్పటినుంచీ 'ప్రతీకారం' అనేది కూడా ఒక లక్షణంగా వర్ధిల్లుతున్నది.
చరిత్రలో, ప్రాచీన సాహిత్యంలో
దీని ఆనవాళ్ళు మనకు చాలా కన్పిస్తాయి. మనల్ని నలుగురిలో అవమానపరిచిన వారిపై, మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి హాని
కలుగచేయడానికి పెంపొందించుకునే భావనే-ప్రతీకారం. అయితే మానసిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇప్పుడు ఈ భావోద్రేకాన్ని కొత్త
కొత్త కోణాల్లో పరిశీలిస్తున్నారు. ప్రతీకారం తీర్చుకోవడానికి మనల్ని పురికొల్పే అంశమేది ? అన్నది
ప్రస్తుతం వీరిముందున్న ప్రశ్న.
కోపగించడం, మనకు హాని తలపెట్టిన వారిని బాధించాలన్న ఆలోచన
అన్ని సమాజాల్లో సహజంగానే కన్పిస్తుంది. తుపాకీకి ట్రిగ్గర్ బటన్ ఎలాగో
కార్యరంగంలోకి దూకేటట్లుచేసే బటనే ప్రతీకారం-అని మియామీ విశ్వవిద్యాలయానికి చెందిన
పరిణామక్రమ మనస్తత్వ శాస్త్రవేత్త మైకేల్ మెకెల్లో అంటారు. ప్రతీకారం, క్షమించడం అనే లక్షణాలను ఆయన దశాబ్దానికిపైగా
అధ్యయనం చేస్తున్నారు.
అమెరికాలో
ప్రతీకార జ్వాలలవల్ల 20% వరకు హత్యలు జరిగితే, 60% పాఠశాలల్లో కాల్పులు జరుగుతున్నాయని ఒక అధ్యయనం
పేర్కొన్నది. మొన్నటికి మొన్న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి
కూడా శ్రామిక వర్గ ప్రతీకారేచ్ఛే కారణమని 'వాషింగ్టన్
పోస్ట్'లో ప్రచురితమయిన ఒక వ్యాసం వివరించింది.
దౌర్జన్యపరంగా
దూకుడు లక్షణాన్ని లోతుగా అధ్యయనం చేసినప్పుడు బయటపడ్డ కారణాలు -ఆల్కహాల్, అవమానాలు, వేధింపులు, స్వాభిమానంపాలు ఎక్కువగా ఉన్నట్లు
తెలుసుకున్నారు తప్ప ప్రతీకారాన్ని పూర్తిగా అధ్యయనం చేయలేకపోయారు.
దౌర్జన్యపూరితంగా ప్రవర్తించడాన్నిబట్టి ప్రతీకారాన్ని అంచనా వేయలేకపోవడంతో, దీని అధ్యయనం క్లిష్ట తరమయింది. ప్రేరణ, దూకుడు మధ్య జరిగే ఆలోచనలు, భావలనేవి మానసిక దళారులుగా వ్యవహరిస్తున్నాయని
ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతీకారం తీర్చుకోవాలన్న కోర్కె కీలకమవుతున్నది. అందువల్ల
దూకుడుప్రవర్తనను పరిశీలించడంకంటే ప్రతీకారాన్ని అధ్యయనం
చేయడం ఆరంభించాను'' అని
ఆయన చెప్పాడు.
కెంటక్కీ
విశ్వవిద్యాలయానికి చెందిన సహచరుడు నాథన్ డీవల్‌తో కలిసి ఆయన దానికి మొదటకారణాలను
అన్వేషించడం మొదలు పెట్టాడు. అవమానానికి గురయినవాడు లేదా సామాజికంగా
వెలివేయబడ్డవాడు ఉద్రేకపూరితమైన బాధ అనుభవిస్తాడని తెలుసుకున్నాడు. ఇటువంటి వారికి
అటువంటి అనుభవాలు ఎదురయి దౌర్జన్యంగా ప్రతిస్పందించినప్పుడు నొప్పికి కారణమైన మెదడులోని ఒక
నిర్దిష్ట ప్రాంతంలోని కణజాలం చాలా చురుగ్గా పనిచేస్తుంటుంది. 'ఇటువంటి సందర్భాల్లో
దౌర్జన్యపూర్వకంగా హాని కలుగ చేయడానికి లోగడ జరిగిన
దృష్టాంతాల తాలూకు ధోరణులను మననం చేసుకుంటుంది' అని ఛెస్టర్ చెప్పారు.
ఈ
అధ్యయనాన్ని మరింత లోతుగా కొనసాగించినప్పుడు ఆశ్చర్యకరమైన
ఫలితాలు కన్పించాయి. ఉద్రేకపూరితమైన బాధతో ఉల్లాసం కూడా జతకట్టి కనిపించింది. అవమానం
సంఘటన తొలుత బాధించినా, ప్రతీకారం
తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు ఉల్లాసమనే తెర దాన్ని కప్పేసింది. కష్టంతాలూకు ఫలితాలు
అందుకున్నప్పుడు ఆనందాన్ని కలుగచేసే మెదడులోని మరోభాగం -న్లూక్లియస్
యాక్కుంచెన్స్‌ను కూడా చురుగ్గా మార్చేసింది.ఇలా ప్రేరేపింపబడినవాడు అంత
దౌర్జన్యకరంగా ప్రవర్తించడానికి కారణం- 'ఆనందమే అన్నిటికీ మూలం' అన్న భావోద్దీపనకలగడం-అని ఛెస్టర్ అధ్యయనంలో
తేలింది. అంటే క్లుప్తంగా చెప్పాలంటే ప్రతీకారం ఘాటుగానే కాదు, తియ్యతియ్యగా కూడా ఉంటుందని.
దౌర్జన్యానికీ, ఆనందానికీ మధ్య లంకెకు సంబంధించి మనస్తత్వ
శాస్త్ర పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం
చేసినా, ప్రతీకారం అనేది ప్రత్యేక తరహా సంతోషాన్ని కలగచేస్తుందని ఇటీవలి అధ్యయనాలు
వెల్లడిస్తున్నాయి.
దీన్ని నిర్ధ్ధారించుకోవడానికి వీరు
చాలా ప్రయోగాలు చేసారు. కొంతమందిని రెండు బృందాలుగా ఎంపికచేసుకుని కంప్యూటర్
సహాయంతో ఆన్‌లైన్‌లో బంతి విసిరే ఆటాడిస్తూ ఒక బృందం వారిని ఉద్దేశ
పూర్వకంగా ఔటయ్యేటట్లు(వారికి అనుమానం రాకుండా) చేసారు. తర్వాత రెండు బృందాలవారికి
చేతబడికి వాడే గుడ్డబొమ్మలను, గుండుసూదులను
ఇచ్చారు. ఔటయిన బృంద సభ్యులు వారికిచ్చిన బొమ్మలకు కసిదీరా ఎక్కువ గుండుసూదులు
గుచ్చారు. తర్వాత ఆన్‌లైన్‌లో అలా వారిని ఔట్‌చేయడానికి కారణమయిన వారువీరే అంటే
కొంతమందిని వీరి ముందుంచితే చెడామడాతిట్టి ఎడతెరిపిలేకుండా అరుపులు, కేకలతో హడలగొట్టేసారు.ఇలాగే
మరికొన్ని ప్రయోగాలు చేసి తీర్మానించిదేమిటంటే-ప్రతీకారం అనేది ప్రతివారికీ
ఆనందాన్నిస్తుందనీ, కానీ
ప్రతివారూ అలా ప్రతీకారం తీర్చుకోవడంలో ఆనందం కలుగుతుందనే భావనలోనే అలా
చేస్తున్నారని తీర్మానించారు.
అలాగే అవకాశం దొరికిన తర్వాత రోజులు, వారాలుగడిచిన తర్వాత ప్రతీకార ప్రభావం ఎలా
ఉంటుందనే దానిమీద పరిశోధనలేవీ
జరగలేదు. అయితే బయటికి వెల్లడించని ప్రాథమిక పరిశీలనల ప్రకారం ఆ ఆనందం క్షణికమే.
మొదట్లో బాగానే ఉన్నట్లుంటుంది. తర్వాత అలవాటైనట్లు అనిపిస్తుంది.ఆ తర్వాత మాత్రం
అసహ్యమనిపిస్తుంది'' అని
ఆయన వివరించారు. ప్రపంచకప్ పోటీలవంటి ఆటల్లోకూడా ఇటువంటివి
కనిపించి చివరకు ప్రతీకార ప్రయత్నాలు వారి జీవితాలను ఎలా అల్లకల్లోలం చేసాయో ఆయన
విశదీకరించారు. అందరికీ ప్రతీకార
వాంఛ ఒకేలా ఉంటుందా అంటే చెప్పలేం. 2006లో జరిగిన
ఒక అధ్యయనం ప్రకారం తమను మోసం చేసిన ఒక బృందం ఎలక్ట్రిక్ షాక్‌కు గురయినప్పుడు
ప్రతీకారం ఆలోచనలు ఆడవారికంటే మగవారిలో ఎక్కువ ఆనందాన్ని కలిగించినట్లు గమనించారు.
అవమానాలకు బాధపడే సున్నిత మనస్కులలో అందరూ దౌర్జన్యానికి దిగరు. కొందరు వారిని
వారే నష్టపరుచుకుంటారు. ఆ విధంగా పరిస్థితులను తాము నియంత్రించగలుగు తున్నామని
వారు భావిస్తారు. దౌర్జన్యం అనేది ఒక విధమైన స్పందన మాత్రమే'' అంటాడు ఐడక్. ఏదిఏమైనా అన్ని సమాజాల్లో పరిస్థితులు ఒకేలా
ఉండాలని లేదు. అయితే ఎక్కడికక్కడ పరిస్థితులను
ఆయా ప్రాంతాల మనస్తత్వ శాస్త్రజ్ఞులువిశ్లేషించి మానవ వికాసానికి, సమాజ వికాసానికి
తోడ్పడగలరని ఆశిద్దాం.