యూనిట్

18 ఏళ్లలోపు వయసున్న భార్యతో శృంగారం అత్యాచారమే

- సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు

మైనర్‌ బాలికల మనోభావాలకు విలువలేకుండా, వారికి వివాహం చేసుకుని వారితో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం క్రిందకే వస్తుందని భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం అయిన ది.11.10.2017న ఈ చారిత్రాత్మకమైన తీర్పును జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం 127 పేజీల్లో స్పష్టంగా వెలువరించింది. ఈ తీర్పు ఇప్పటినుండి వర్తిస్తుందని పేర్కొంది. దేశంలో బాల్య వివాహాలు జరుగుతుండడం బాలికల హక్కులను కాలరాయడమేనంటు ఘాటైన వ్యాఖ్యలను చేసింది. భారతదేశంలో అన్ని చట్టాలలో బాలికల వివాహ కనీస వయస్సు 18 ఏళ్లుగా వుంది. కానీ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ - 1860 ప్రకారం సెక్షన్‌ 375లో 15 నుండి 18 ఏళ్లలోపు భార్యతో శృంగారం అత్యాచారం కిందకి రాదంటూ ఇచ్చిన మినహాయింపు పూర్తిగా ఏకపక్షమని, రాజ్యాంగానికి అది విరుద్దంగా వుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పదిహేనేళ్ల పైబడిన స్వంత భార్యతో ఆమె సమ్మతితో సంబంధం లేకుండా కలయికలో పాల్గొన్నా అది నేరం కాదని ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌ 375లో మినహాయింపునిచ్చారు. ఈ సెక్షన్‌కు వున్న మినహాయింపులని అసాధారణ రీతిలో సుప్రీం కోర్టు సవరించింది. బాలిక శరీరంమీద ఆమెకు సహజంగా వుండే హక్కులను ఇతర నిబంధనల స్ఫూర్తికి ఈ మినహాయింపు విరుధ్ధంగా వుందని తెలిపారు. 18 ఏళ్ల లోపు బాలికను వస్తువుగా చూడలేమని, ఆమెకు తన దేహంపై ఎలాంటి హక్కులు లేనట్లు భావించలేమని స్పష్టం చేసింది. 18 ఏళ్ల పైబడిన భార్యతో ఆమె సమ్మతి లేకుండా లైంగిక చర్య జరపడం వైవాహిక అత్యాచారం అవుతుందా అనే విస్తృత అంశం ఈ కేసులో తమ ముందుకు ప్రస్తావన తీసుకురాకపోవడం వలన దాని జోలికి తాము వెళ్లడం లేదని పేర్కొంది.

కర్ణాటక ప్రభుత్వం స్త్రీ, పురుషుల వివాహ వయస్సులను వరుసగా 18 ఏళ్లు, 21 ఏళ్లుగా నిర్ణయిస్తూ చట్టం చేసింది. వధువు వయస్సు 18ఏళ్లకు తక్కువ, వరుడి వయస్సు 21 ఏళ్లకు తక్కువగా వున్నట్లయితే వారి వివాహం చెల్లదని చట్టం చేసింది. ఇలాంటి చట్టం దేశమంతటా ఉండేలా చర్యలు తీసుకోవాలని కొందరి వాదన

మన దేశంలో సెక్షన్‌ 375, 1860 ఇండియన్‌ పీీనల్‌ కోడ్‌ ప్రకారం మైనర్‌ వివాహితతో కలయిక మినహాయింపు వయస్సు 10 ఏళ్లుగా వుండేది.దీనిని 1891లో మార్పు చేసి 12ఏళ్లుగా మార్చారు. మరలా 1925లో అమెండ్‌మెంట్‌ చేసి 13ఏళ్లుగా మార్చారు. 1929లో రూపాంతరం చెందిన ఛైల్డ్‌ మ్యారేజ్‌ ఏక్ట్‌ ప్రకారం బాలిక వివాహ వయస్సు 14 ఏళ్లుగా నిర్ణయించారు. 1940లో చేసిన అమెండ్‌మెంట్‌లో సెక్షన్‌ 375 ఇండియన్‌ పీీనల్‌ కోడ్‌ ప్రకారం మైనర్‌ వివాహితతో కలయిక  మినహాయింపు వయస్సు 15 ఏళ్లుగా మరియు వివాహ వయస్సు 15 ఏళ్లుగా మార్పు చేసారు. మరలా 1978లో చేసిన అమెండ్‌మెంట్‌ ప్రకారం వివాహ వయస్సు 18 ఏళ్లకు ర్పు చేసినా మైనర్‌ బాలితో వివాహనంతర శారీరక కలయిక వయస్సును 18ఏళ్లకు మార్పు చేయలేదు. ది.11.10.2017న సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు తో 18 ఏళ్లు నిండని భార్యతో జరిపే శృంగారం అత్యాచార నేరంగా పరిగణించబడును.

మారిటల్‌ రేప్‌

వివాహానంతరం భార్యకు ఇష్టం లేకపోయినా భర్త చేసే లైంగిక చర్యను మారిటల్‌ రేప్‌గా పరిగణిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా డభ్బై దేశాల్లో మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణిస్తారు. మొట్టమొదటి సారిగా 1922లో ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో మారిటల్‌ రేప్‌ నేరంగా పరిగణిస్తూ చట్టం చేసారు. 1932లో పోలాండ్‌లో కూడా నేరంగానే పరిగణిస్తూ చట్టం చేసారు. ఇలా యూరప్‌ ఖండంలో 22 దేశాల్లో, అమెరికా ఖండాల్లో 22 దేశాల్లో, అఫ్రికా ఖండంలో 11 దేశాల్లో ఆసియాలో 14 దేశాల్లో మరియు ఆస్ట్రేలియా లో మారిటల్‌ రేప్‌ నేరంగా పరిగణిస్తూ చట్టం చేసియున్నారు.

భారత దేశంలో పెళ్లయితే భార్యపై భర్తకు సర్వహక్కులు కలిగి, ఆమె అతని ఆస్తి అవుతుందనే భావజాలంతోనే వివాహ స్త్రీతో భర్త చేసే సంభోగ చర్య నేరంగా భావించక మినహాయింపు కల్పించారు. లైంగిక దాడి జరిగినప్పుడు వారిరువురు భార్య, భర్తలని చెప్పి నిందితుడు సమర్ధించుకోజాలడు. లైంగిక దాడి భావోద్రేక చర్య కాదు. అవతలి వ్యక్తిపై బల ప్రదర్శన. భాదితురాలు, నిందితుడి మధ్య సంబందం ఏమిటనేది అనవసరం. సంభోగానికి ఆమె సమ్మతి ఉన్నదా? లేదా? అనేది పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి మారిటల్‌ రేప్‌కు మినహాయింపు ఎత్తివేయాలని మహిళా అభ్యుదయ వాదులు వాదిస్తున్నారు.

భిన్న సంస్కృతుల కలయిక గల భారతదేశంలో భర్త జరిపే లైంగిక దాడి నేరంగా పరిగణించేలా చేయడం ఎప్పటికి జరుగుతుందో.....

వార్తావాహిని