యూనిట్
Flash News
సెకండ్ అటాప్సీ

''ఫిమేల్
బాడీ..గుర్తుపట్టని విధంగా కాలిపోయివుంది.. తల, శరీరం, కాళ్ళు ముక్కలుగా వున్నాయ్..
తలకు ఒక ప్రక్క పుర్రె బయటకు కనబడుతోంది.. ఒక ప్రక్క పొడవాటి జుట్టు, దానికి ప్లాస్టిక్ హెయిర్
క్లిప్సూ వున్నాయ్... పేగులు బయటకు వచ్చేశాయి...'' పాఠంలా చెప్పుకుపోతున్నాడు
నటేశం. దూరంగా చైర్‌లో కూర్చున్న డాక్టర్ సారంగి రాసుకుంటున్నాడు. ఇద్దరూ మద్యం
మత్తులోనే వున్నారు.
మందేసుకుని రాకపోతే ఈ వాసనలో
ఇన్నేసి శవాలను, అందునా కుళ్ళిపోయిన శవాలను
పోస్ట్‌మార్టం చేయలేమంటాడు నటేశం.
ఢిల్లీలోని ఒక
ప్రభుత్వాసుపత్రి అది. 20 ఏళ్ళనుండీ నటేశం అక్కడ పోస్ట్‌మార్టం అసిస్టెంట్‌గా
పనిచేస్తున్నాడు. రోజుకి 20 వరకు శవాలు వస్తాయి. మెడికోలీగల్ కేసులు అందులో 6
నుంచి 8 వరకూ వుంటాయి. ఆ హాస్పటల్‌లో వున్న ఫ్రీజర్‌కి ఉన్న పరిమితికి మించి 4
నుంచి 5 రెట్లు శవాలు వస్తూండటంతో వాటిని నేలమీద, బల్లమీద పడేసి వుంచుతారు.
ఢిల్లీ చలికి శీతాకాలంలో ఈ శవాల సంఖ్య మరింత పెరుగుతుంది. అనాథలు, అడుక్కునేవాళ్ళు, యాత్రికులూ.. ఇలా నటేశం
చేతులు చకచకా పనిచేస్తున్నాయి. మెడనుంచి క్రింది మొలవరకూ నిలువుగా చీల్చి
శరీరాన్ని విడదీశాడు. లివర్, కిడ్నీ, గుండెలాంటి సున్నిత భాగాలనుండి చిన్ని ముక్కలను
కట్‌చేసి ప్రక్కనే వున్న ఉప్పుద్రావణం గల సీసాలో వేసి వివరాలు రాసి అంటించాడు.
తలకట్టు ప్రాంతంలో ముందునుంచి కట్‌చేసి డిప్పను తెరిచాడు. ''బ్రెయిన్ ఇంటాక్ట్'' అని అరిచాడు. డాక్టర్
రాసుకున్నాడు. అంతలో ఒక కుర్రాడు ప్లాస్క్‌లో టీ తెచ్చి పేపర్ గ్లాసుల్లో పోసి
ఇచ్చాడు. నటేశం చేయికూడా కడుక్కోకుండానే టీ తాగేశాడు. శవాన్ని ఆదరాబాదరా మూడు, నాలుగు కుట్లు వేసి ఫ్రీజర్‌లో
పెట్టేశాడు. ''లంచ్ తర్వాత ఇంకా మూడు చెయ్యాలిసార్' అన్నాడు.
''శవం తాలూకూ
బంధువులు రాలేదా!' డాక్టర్ అడిగాడు.
'దిక్కుమాలిన
కేసు, నిన్నంట ఈమె తల్లీ తండ్రీ వచ్చి చూసి
లోపల్లోపలే ఏడ్చారంట. చివరికి మా అమ్మాయి కాదు అని వెళ్ళిపోయారంట. ఈ రోజు ఈమె బాయ్‌ఫ్రెండ్
వచ్చి గుర్తుపట్టాడంట' నిరాశగా చెప్పాడు నటేశం.
బంధువులుంటే వారి దగ్గర్నుండి బాడీని సరిగ్గా కూడతానని చెప్పి, ఓ అయిదొందలు రాబట్టేవాడు.
అదీ అతని బాధ.
డాక్టర్ దూరం నుండే చూస్తూ పోస్టుమార్టం
(అటాప్సీ) రిపోర్ట్ రాసుకుంటున్నాడు. అది చాలా యధాలాపంగా జరిగిపోతూ వుంటుంది.
సిఆర్‌పిసి 174 సెక్షన్ ప్రకారం వ్యక్తి అనుమానాస్పదమృతి, ఆత్మహత్య, హత్య, ఆక్సిడెంట్స్ మొదలైన
కేసుల్లో ఆ వ్యక్తి యొక్క మరణం ఏ సమయంలో ఎందుకు ఎలా సంభవించిందీ అని
తెలుసుకోడానికి ''అటాప్సీ''ని విధిగా
నిర్వహించాలని చెప్తుంది. కానీ మనదేశంలోని ఏరియా, జిల్లా ఆసుపత్రులనుండి
నగరాల్లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల దాకా అటాప్సీ నిర్వహణ అనేక లోపాలతో కూడుకొని
వుంది. తుప్పుపట్టిన పరికరాలు, నీళ్ళు వుండవు, చిరిగిన ఏప్రాన్, గ్లౌజ్‌లు, ఫ్రీజర్ కెపాసిటీని మించి
శవాలు, సిబ్బంది కొరత దానికి తోడు
నైపుణ్యం లేని ఎంబిబిఎస్ డాక్టర్లు, ఇతర స్పెషలిస్ట్‌లతో (అటాప్సీని పాథాలజిస్ట్‌లు
నిర్వహించాలి) జరిపించడం.
ఇంక అంతులేని డాక్టర్ల
నిర్లక్ష్యం మెడికోలీగల్ కేసుల్లో కేసుల ఇన్వెస్టిగేషన్‌ని తప్పు దోవపట్టించి
నేరస్థులను తప్పించుకునేలా చేస్తుంది. శవాన్ని ముట్టుకుని అటాప్సీ చేసే డాక్టర్‌లు
అత్యంత అరుదుగా వుంటారు. డాక్టర్ సారంగి తన అటాప్సీని ముగించి రిపోర్ట్ ఇన్స్‌పెక్టర్‌కి
పంపాడు.
అటాప్సీ రిపోర్ట్ చదివిన
ఇన్స్‌పెక్టర్ నిరంజన్ నిర్ఘాంతపోయాడు.
''మరణానికి
ముందు ఆమె శరీరంకు అయిన తీవ్ర గాయాల వల్ల తీవ్ర రక్తస్రావం (హెమరేజిక్ షాక్)
జరిగి ఆమె మరణించి వుండచ్చు. శరీరమంతా వున్న కాలిన గాయాలు మాత్రం ఆమె మరణానంతరం
ఆమె శరీరాన్ని తగలబెట్టడం వల్ల కలిగి వుండచ్చు'' అని వుంది.
ఇన్స్‌పెక్టర్ తన పి.ఎమ్.
రిక్వస్ట్‌లో బాడీని ఎక్స్‌రే తీయించమని కూడా పెట్టాడు. కానీ డాక్టర్ ఎక్స్‌రే
తీయించలేదు. అదే విషయాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు నిరంజన్.
''ఎక్స్‌రే
మిషన్ చెడిపోయింది. అందుకే తీయించలేదు'' నిర్లక్ష్యంగా అన్నాడు
డాక్టర్.
''అయితే మీరు
ఆ విషయమే తెలుపుతూ బాడీని ఎక్స్‌రే సౌలభ్యం వున్న వేరొక ఆసుపత్రికి పంపండి'' అని రిక్వెస్ట్ చేశాడు
నిరంజన్.
''అది నా
పనికాదు.. కావాలంటే మీరు బాడీని తీసుకెళ్లండి'' అని డాక్టర్ చిరాకుగా
చూశాడు.
ఇంక ఇతన్ని బ్రతిమాలి
లాభంలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. అయినా ఇండియన్
ఎవిడెన్స్ ఆక్ట్‌లో అటాప్సీకి అత్యంత ప్రాధాన్యముంది (ఎక్స్‌పర్ట్ ఒపీనియన్
కనుక) కేవలం ఈ రిపోర్ట్‌ను సాక్ష్యంగా నేరాన్ని ఖచ్చితంగా నిరూపించొచ్చు అని
తెలిసీ డాక్టర్లెందుకింత నిర్లక్ష్యంగా చేస్తారు.?
తను ఎస్.ఐ.గా సెలక్ట్ అయ్యాక
ట్రైనీగా వున్నప్పుడు ఒక ఏరియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టంకి అటెండ్ అయ్యాడు. ఆ
రోజు చూసిన సంఘటన ఇప్పటికీ కళ్ళముందున్నట్టే వుంటుంది. అటాప్సీ చేసే హాలు
ఆసుపత్రికి దూరంగా వుంది. పాడుబడిన ఆ ఒక్క గదే వున్న బిల్డింగ్‌కి తలుపులు కూడా
సరిగా కూడా లేవు. గదినిండా బూజులు, హాలు మధ్యలో ఎత్తుగా సిమెంట్ బల్ల. దానిమీద
ఎప్పటిదో రక్తం గడ్డకట్టి ఎండిపోయి వుంది. నేలమీద రక్తం, మురికి కలగలిసిన జిగురు. ఆ
రోజు అటాప్సీ చేయబోయేది ఒక అమ్మాయి శవం, డాక్టర్‌తోపాటు ఒక స్వీపర్ బకెట్‌తో నీళ్ళు
పట్టుకొని వచ్చాడు. శవాన్ని దాని తాలుకు బంధువులే రిక్షాలో వేసి తెచ్చారు. స్వీపర్
శవాన్ని బల్లమీద పడుకోబెట్టి మృతురాలి బట్టలు ఎక్కడికక్కడ కట్‌చేసి గోడవతల
విసిరేశాడు.
మృతురాలి చెవులకు బంగారు
దిద్దులున్నాయి. కత్తెర తీసుకుని చెవి తమ్మెను కట్‌చేసి వాటిని మొరటుగా లాగి
బంధువులకిచ్చాడు. బాడీని కట్ చేసి లోపలున్న అవయవాల ముక్కలను ఉప్పునీటిలో వేసి, తల దిప్ప తెరచి
అయిపోయిందన్నాడు. డాక్టర్ దూరం నుండే ఒకసారి చూసి 'ఓకే' అన్నాడు. అసలు ఆ రోజు
అటాప్సీ చేయడం అతని డ్యూటీ కాదంట. తన తోటి డాక్టరైన ఒక లేడీ డాక్టర్‌దట. ఈ రోజు
అటాప్సీ వుందని ముందే తెలుసుకుని ''అర్జెంట్ పని'' అంటూ లీవ్ శాంక్షన్
చేయించుకుందంట. ఇలా చేయడం ఆమెకు ఇది నాలుగోసారి. అందుకే ఆమె స్త్రీ అని కూడా
చూడకుండా డాక్టర్ బండబూతులు తిడుతూనే వున్నాడు. అటాప్సీ అయిపోయాక స్వీపర్ శవం
తాలుకా బంధువులను పిలిచి శవాన్ని బాగా కుట్టి ఇవ్వాలంటే మూడొందలవుతుంది అన్నాడు.
అంత ఇవ్వలేమంటూ వంద రూపాయలు చేతిలో పెట్టారు ఆ పేద బంధువులు. స్వీపర్ సణుక్కుంటూ మృతురాలి
దుస్తుల్లో ఒక గుడ్డను నాలుగు పేలికలుగా కట్ చేశాడు. మెడనుండి కింది వరకూ అటూ ఇటూ
చీల్చిన పొట్టకిరువైపులా నాలుగేసి రంధ్రాలు కత్తితో పొడిచాడు. ఆ గుడ్డ పీలికలను ఆ
రంధ్రాల్లో దూర్చి ముడివేశాడు. తలని మాత్రం అలాగే వదిలేసి పోయాడు. ఆ తర్వాత
బంధువులే పాత దుప్పటి చుట్టి తాడుతో కట్టేసి అట్నుండటే శ్మశానానికి
తీసుకెళ్ళిపోయారు. ఆసుపత్రులలో తమ ప్రియమైన బంధువు, దేహానికి జరుగుతున్న
అవమానానికి గుండె తరుక్కుపోకమానదు. మన సమాజంలో చనిపోయిన వ్యక్తిని, దైవంతో పూజిస్తారు కానీ ఆ
వ్యక్తి శవంగా వున్నప్పుడు మాత్రం దయ్యంలా భావించి భయపడ్తారు.
అతని జ్ఞాపకాలకు బ్రేక్
వేస్తూ జీప్ కమీషనర్ ఆఫీస్ ముందు ఆగింది. అటాప్సీ రిపోర్ట్‌తో లోపలికి
వెళ్ళాడు. కమీషనర్‌కి రిపోర్ట్ చూపించి ''సర్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
డెత్ ఫాక్ట్స్ సరిగా రాయలేదు. డాక్టర్స్ టీంతో సెకండ్ అటాప్సీకి రిక్వెస్ట్
పెట్టాను'' అన్నాడు.
''అసలు కేస్
ఫాక్ట్స్ ఏంటి? వివరంగా చెప్పండి'' ఇంట్రస్టింగ్‌గా ముందుకు
వంగాడు కమీషనర్. ఇన్స్‌పెక్టర్ చెప్పడం ప్రారంభించాడు.
1995 జులై2, రాత్రి 11 గంటలు. ఢిల్లీలోని
కన్నాట్‌ప్లేస్ పి.యస్. పరిధిలో వున్న అశోక్ యాత్రీనివాస్ ఎదురుగా చిన్న
కూరగాయల షాప్. షాప్ ఓనర్ అనారూదేవి షట్టర్ క్లోజ్ చేసి వెనక్కు తిరగగానే
అశోక్ యాత్ర నివాస్‌లోని 'భాగియా బార్బిక్యూ' రెస్టారెంట్ నుండి పెద్ద
ఎత్తున దట్టమైన పొగలూ, మంటలూ రావడం గమనించింది. 'హోటల్ తగలబడిపోతోంది, హోటల్ తగలబడిపోతోంది'' అని గట్టిగా అరుస్తూ రోడ్‌వైపు
పరుగెట్టింది. అప్పుడే పెట్రోలింగ్‌కి బయల్దేరిన హెడ్‌కానిస్టేబుల్ కుంజు, హోంగార్డు చంద్రపాల్
అరుపులు విని బండిని ఆపి హోటల్‌వేపు చూశారు. బాగియా రెస్టారెంట్ చుట్టూ అనేక
బిల్డింగ్స్ వున్నాయి. మంటలను అర్జెంట్‌గా ఆపకపోతే అవన్నీ తగలబడే ప్రమాదం వుంది
అనుకుంటూ హెడ్‌కానిస్టేబుల్ దగ్గర్లోని టెలిఫోన్ బూత్‌వైపు పరుగుపెట్టాడు. కానీ
అది మూసివుండటంతో హోంగార్డ్‌ని హోటల్‌వైపు వెళ్ళమని తను కొంచెం దూరంలో వున్న
పోలీస్‌పోస్ట్‌కి పరుగెట్టి వైర్‌లెస్‌లో కంట్రోల్ రూంకి సమాచారమిచ్చి అంతేవేగంగా
వెనక్కి వచ్చాడు. హోంగార్డ్‌తో కలిసి హోటల్ లోపలికి పరుగెత్తాడు. మంటలు మొదటి
అంతస్థులో వున్న వంటగది నుండి వస్తున్నాయి. పైకెళ్ళి వంటగదిలో అడుగుపెట్టారు. ఏదో
కాలుతున్నట్టు భయంకరమైన వాసన, కిచెన్‌లో ఒక పెద్ద తందూరి పొయ్యి ముందు నిలబడి
ఒక వ్యక్తి దేన్నో తగలబెడ్తున్నాడు. ఒక చేత్తో కట్టెలు పెడ్తూ మరో చేత్తో వెదురు
గొట్టంతో ఊదుతూ.. వీళ్ళని చూడగానే కొయ్య బారిపోయాడు.
''ఏయ్ ... ఏం
చేస్తున్నావ్, దేన్ని అంత పెద్ద పెద్ద మంటలు పెట్టి తగలబెడ్తున్నావ్?'' అని గట్టిగా అడిగారు.
ఆ వ్యక్తి తేరుకొని 'నాపేరు కేశవ్, నేను కాంగ్రెస్ పార్టీ
వర్కర్‌ని, పార్టీకి సంబంధించిన పాత
బానర్లూ...పోస్టర్లూ ఎక్కువైపోతే వాటిని తగలబెడ్తున్నాను'' అన్నాడు.. కానీ అక్కడ అంతగా
బ్యానర్లూ, పోస్టర్లూ లేవు అనుమానంతో
మంటలు ఆర్పడానికి నీళ్లకోసం వంటగదిలో వున్న సామానుతో నీళ్ళు పట్టి ఎలాగోలా మంటలు
ఆర్పగలిగారు.
అప్పటికే సమాచారమందుకున్న
కన్నాట్‌ప్లేస్ పోలీసులు జీప్‌తో అశోక్‌యాత్రినివాస్‌లోకి ప్రవేశించి, భాగియా రెస్టారెంట్ ముందు
ఆగింది. రెస్టారెంట్ బయట ఒక ప్రక్కగా ఒక మారుతీకారు ఆగివుంది. అందులో ఒక వ్యక్తి
కూర్చుని వున్నాడు. రెస్టారెంట్ లోపల్నుండి భయంకరమైన వాసన రావడంతో పైకి
పరుగెట్టారు. అప్పటికే కేశవ్‌ని అదుపులోనికి తీసుకున్న కానిస్టేబుల్, ఇన్స్‌పెక్టర్ రాగానే
తందూరీపొయ్యి వైపు చూపించాడు. అందులో కాలిపోయిన మానవ శరీర భాగాలు!!!
తల, మొండెం, కాళ్ళు విడివిడిగా!!!
కడుపులోనుండి పేగులు బయటకు వచ్చాయి. కాళ్ళకు చేతులకు వేళ్ళులేవు. తలకు వున్న సగం
జుట్టును బట్టి అది స్త్రీ శవంగా అర్థమైంది. వెంటనే క్రైం సీన్ అంతా వెతికారు.
పొయ్యి ప్రక్కనే రక్తంతో తడిసిన ప్లాస్టిక్ బ్యాగ్, కేశవ్ దుస్తులపై రక్తం
మరకలు!!!
''లేదు .. ఈ
హత్య నేను చేయలేదు. ఇది చేసింది యూత్ కాంగ్రెస్ లీడర్ సుశీల్‌శర్మ'' ఏడుస్తూ చెప్పాడు.
''ఎక్కడున్నాడు
అతను? ఎవర్ని చంపాడు?'' అన్నారు పోలీసులు.
''బయట
మారుతీకార్‌లో వున్నాడు, చంపింది అతని భార్యనే'' ఎందుకో నాకు తెలీదు.'' అన్నాడు.
వెంటనే బయటకు పరుగెట్టారు
పోలీసులు. మారుతీకారు మాయం. ''డామిట్! హంతకుడు పారిపోయాడు'' కేశవ్ సంగతి చూద్దాం..
అనుకుంటూ పైకి వెళ్ళి కేశవ్‌ని కాస్త గట్టిగా అడిగేసరికి నోరువిప్పాడు.
సుశీల్‌శర్మ ఢిల్లీ యూత్‌కాంగ్రెస్
లీడర్. రాజకీయాల్లో బాగా రాణించి మంత్రి పదవులు పొందాలని అతని ఆశ. ఉమన్ యూత్
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన నైనా సాహ్నితో పరిచయం కాస్తా ప్రేమగా
మారింది. 1992లో సుశీల్‌శర్మ వుంటున్న అపార్ట్‌మెంట్‌కు తరచూ వెళ్ళి వస్తూ
వుండేది. నైనా పెళ్ళికోసం సుశీల్‌ను వత్తిడి చేయడం మొదలుపెట్టింది. నైనా సిక్కు
మతానికి చెందినది కావున ఇంట్లో ఒప్పుకోరని ప్రస్తుతం రహస్యంగా వివాహం చేసుకొని
మెల్లగా ఇంట్లో చెప్దామని ఆమెని వొప్పించాడు. నైనా ఇంట్లో వాళ్లుకూడా వారి
వివాహాన్ని వ్యతిరేకించడంతో తల్లిదండ్రులతో గొడవపడి సుశీల్ ప్లాట్‌కి వచ్చేసింది.
వారు రహస్యంగా పెళ్లి చేసుకుని అదే ప్లాట్‌లో కాపురం మొదలుపెట్టారు. మూడేళ్ళయినా
తమ వివాహ విషయాన్ని బహిర్గతం చేయకపోవడంతో రోజూ ఇద్దరి మధ్య గొడవలయ్యేవి. సుశీల్‌శర్మ
ఆమెపై చేయి చేసుకొనేవాడు. నైనా మంచి విద్యాధికురాలు, పైలెట్ ట్రైనింగ్ పూర్తి
చేసింది. సుశీల్‌శర్మ రాజకీయాల్లో వుంటూనే అశోక్‌యాత్రి నివాస్‌లోని ''భాగియా రెస్టారెంట్‌ను' లీజ్‌కు తీసుకుని
నడుపుతున్నాడు.
నైనాసాహ్నికి తన క్లాస్‌మేట్
అయిన మత్‌లూబ్‌కరీంతో 1982నుండీ స్నేహం వుంది. వారిద్దరూ పెళ్ళిచేసుకోవాలనుకున్నారు
కానీ కరీం తల్లిదండ్రులు అతన్ని బెదిరించి వారి మతం అమ్మాయితో 1989లో వివాహం
చేసేశారు. తర్వాత నైనాతో దూరంగా వున్నాడు. నైనా సుశీల్‌శర్మల వివాహం అయ్యాక నైనా
తిరిగి కరీంతో పాత స్నేహాన్ని కొనసాగించింది. ఇద్దరు కలుసుకోవడం, ఫోన్లో మాట్లాడుకోవడంతో
సుశీల్‌శర్మ కరీంతో మాట్లాడొద్దని నైనాకి తీవ్రంగా వార్నింగ్ ఇచ్చాడు.
1995 జులై 2న మధ్యాహ్నం 3
గంటలకు బయటకు వెళ్ళిన సుశీల్ అరగంటలో వెనక్కి వచ్చేశాడు. నైనా ఫోన్లో
మాట్లాడుతూ.. సుశీల్‌ని చూడగానే ఫోన్ క్రెడిల్ చేసేసింది. వెంటనే అనుమానంతో
సుశీల్‌శర్మ రీ డయల్ చేయగా అవతల.. కరీం!! అంతే.. తీవ్ర ఆగ్రహావేశాలతో ఆమెను
కొట్టి, తిట్టి, ఇంకా కోపం చల్లారక తన
దగ్గరున్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో టకటకా 3 రౌండ్లు పేల్చాశాడు. తలలోకి ఒక
బుల్లెట్, మెడలోకి ఒక బుల్లెట్
దూసుకుపోయాయి. మూడవది గురితప్పి ప్రక్కనేవున్న కార్ట్‌బోర్డ్‌లో నుండి పోయింది.
నేలమీద కుప్పకూలి పోయింది
నైనా. తలచుట్టూ రక్తం మడుగు కడ్తోంది. అప్పటికి కానీ అతనేం చేశాడో అర్థం కాలేదు.
అతని ఆవేశం స్థానంలో భయాందోళనలు ఆక్రమించాయి.
''అయిపోయింది.
తన రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది. ఆమె శవాన్ని లేకుండా చేస్తే తప్ప తను
ఈ కేసునుండి తప్పించుకోలేడు'' అనుకుని వెంటనే లోపలికి
వెళ్ళి ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ని తెచ్చి ఆమె తలను అందులో వుంచి కట్టాడు. మరికొన్ని
బట్టలు, కవర్లతో శవాన్ని చుట్టేశాడు.
చీకటి పడేవరకు మందు తాగుతూ కూర్చున్నాడు. రాత్రి పది దాటాక మెల్లగా ఎవరూ చూడకుండా
నైనా శవాన్ని తన మారుతీ కార్ డిక్కీలో వేసి, కార్‌ని బాగియా రెస్టారెంట్‌వైపు పోనిచ్చాడు.
కానీ రెస్టారెంట్‌లో ఇంకా
సర్వర్లూ ఇతర స్టాఫ్ వున్నారు. అరగంట బయటే వెయిట్ చేసి రెస్టారెంట్ మేనేజర్
కేశవ్‌ని పిలిచి విషయం చెప్పాడు. కేశవ్ లోపలికి వెళ్ళి రెస్టారెంట్‌లో వున్న ఇద్దరు
పనివాళ్ళను వెళ్ళిపొమ్మన్నాడు. తిరిగి వచ్చి ఇద్దరూ ఆ శవంవున్న మూటను బయటకు తీసి
పైకి తీసుకెళ్ళారు. దాన్ని తగలబెట్టమని చెప్పి కిందకు వచ్చి కాపలాగా వున్నాడు
సుశీల్‌శర్మ, తర్వాత జరిగింది మీకు
తెలిసిందే'' ముగించాడు కేశవ్. కేసు
రిజిస్టర్ చేసి కేశవ్‌ని అరెస్ట్ చేసి, క్రైంసీన్‌ను ప్రొటెక్ట్ చేశారు. మర్నాడు
(జులై 3వ తారీఖు) ప్రొద్దున్నే ఇన్స్‌పెక్టర్ శవపంచనామా చేయించి, శవాన్ని దాని తాలుకూ
బంధువులు గుర్తుపట్టేవరకూ ఆర్‌ఎండబ్ల్యూ హాస్పిటల్ మార్చురీలో భద్రపరచమని
రిక్వెస్ట్ చేశారు పోలీసులు. నైనా తల్లిదండ్రులకు కబురు పంపి, కేశవ్‌ను తీసుకుని సుశీల్‌శర్మ
ప్లాట్‌కి వెళ్ళాడు ఇన్స్‌పెక్టర్. ఊహించినట్టుగానే తాళం వేసి వుంది. సెర్చ్
ప్రొసీడింగ్స్‌తో క్లూస్ టీంతో మర్నాడు ప్లాట్ తెరిచి చూడగా హాలులో నేలమీద
గడ్డకట్టిన రక్తం, మూడు ఖాళీ బుల్లెట్ షెల్స్, ఒక బుల్లెట్, బుల్లెట్ రంధ్రం చేసిన
కార్డ్ బోర్డ్ మొదలైన కీలకమైన ఆధారాలను బట్టి హంతకుడు తన భార్యను ఫైర్‌ఆర్మ్‌తో
కాల్చి చంపినట్లు స్పష్టంగా అర్థమైంది ఇన్స్‌పెక్టర్ నిరంజన్‌కి. నిందితుడి కోసం
వేట మొదలైన మర్నాడే ఢిల్లీకి దూరంగా బాక్లానగర్‌లో అనుమానాస్పదస్థితిలో ఒక మారుతీకారు
దొరికింది. కారును పరిశీలించిన పోలీసులకు కార్ డిక్కీలో రక్తంతోపాటు, పొడవైన వెంట్రుకలు, కొన్ని రక్తంతో తడిసిన
దుస్తులు కన్పించాయి. అది సుశీల్‌శర్మదే. 'భార్యను ముక్కలుగా నరికి, తందూరీ పొయ్యిలో తగలబెట్టిన
యూత్ కాంగ్రెస్ లీడర్ సుశీల్‌శర్మ' అంటూ టీవీ, న్యూస్ పేపర్లు హోరెత్తడంతో అప్పటికే కీడు
సంకిస్తున్న 'మత్‌లూబ్ కరీం' వెంటనే పోలీసులను కలిశాడు.
మృతురాలి తల్లిదండ్రులు
మార్చురీలో వున్న శవాన్ని తమ అమ్మాయే అని చెప్పలేకపోయారు. మౌనంగానే రోదిస్తూ
వెళ్ళిపోయారు.
పోలీసులు కరీంను మార్చురీకి తీసుకెళ్ళి శవాన్ని చూపగా తను నైనా సాహ్నియే అని గుర్తుపట్టాడు కరీం. దాంతో పోలీసులు పోస్ట్‌మార్టం చేయాల్సిందిగా కోరగా డాక్టర్ సారంగి ఇచ్చిన రిపోర్టు ఇది. కేస్ డిటెయిల్డ్‌గా వివరించి ముగించాడు ఇన్స్‌పెక్టర్ నిరంజన్ సింగ్.
కమిషనర్ అతని
ఇన్వెస్టిగేషన్‌కు సంతృప్తిని వ్యక్తం చేసి సెకండ్ అటాప్సీ (రీ పోస్ట్‌మార్టం)ని
ముగ్గురు డాక్టర్ల టీంతో చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాడు.
''ఇంతకీ
సెకండ్ అటాప్సీతో ఏమి నిరూపించదలచుకున్నారు'' కమిషనర్ అడిగాడు.
''ముందుగా
డెడ్‌బాడీని ఎక్స్‌రే తీస్తే బుల్లెట్స్ ఎక్కడెక్కడ ఇరుక్కున్నాయో, బుల్లెట్ గాయాలు ఎక్కడ
ఉన్నాయో తెలుసుకొని, అటాప్సీలో వాటిని తొలగించి
ఫోరెన్సిక్ లాబ్‌కి పంపుతాం. క్రైం సీన్‌లో ఖాళీ బుల్లెట్ షెల్స్‌కీ, మృతురాలి శరీరంలోని
బుల్లెట్స్‌కీ, నేరస్థుడికి వున్న లైసెన్స్‌డ్
రివాల్వర్‌కి ఖచ్చితమైన లింక్ వున్నందున కేసులో తప్పక శిక్ష పడుతుంది.'' అన్న సమాధానంతో సంతృప్తి
చెందాడు కమిషనర్.
జులై 10వ తారీఖున బెంగళూర్‌లో
ఒక హోటల్‌లో బ్రీఫ్ కేస్‌లో రివాల్వర్, లైవ్ బుల్లెట్స్, పాస్‌పోర్ట్‌తో పోలీసులకు
పట్టుబడ్డాడు సుశీల్‌శర్మ.
జులై 12వ తారీఖున ముగ్గురు
డాక్టర్ల టీం నైనా శవానికి రెండవసారి అటాప్సీని చేశారు. ముందుగా ఎక్స్‌రే తీయించి
ఆమె తలలో ఒకటి, మెడలో ఒకటి ఇరుక్కున్న
బుల్లెట్స్‌ను గుర్తించి, అటాప్సీలో తొలగించి లాబ్‌కి
పంపారు. డాక్టర్లు నైనా సాహ్ని మరణానికి కారణం ''ఫైర్ ఆర్మ్ వల్ల కలిగిన
బుల్లెట్ గాయాలు నైనాను కోమాలోకి, వెంటనే మరణానికి
కారణమయ్యాయి. శరీరంపై కాలిన గాయాలు మరణం తర్వాత సంభవించినవే'' అని తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ మృతురాలు
యొక్క డిఎన్‌ఏ, ఆమె తల్లిదండ్రుల డిఎన్‌ఏతో సరిపోయినందున ఆమె
నైనా సాహ్నిగా నిర్ధారించింది. అంతేకాక సుశీల్‌శర్మ ప్లాట్‌లోని రక్తం, అతని కార్‌లోని రక్తం, రెస్టారెంట్‌లోని రక్తం ఒకటే
గ్రూప్ మరియు అది నైనా బ్లడ్ గ్రూప్ అని తేల్చింది. బాలిస్టిక్ ఎక్స్‌పర్ట్
ఇచ్చిన రిపోర్ట్‌లో నైనా తలలో దొరికిన బుల్లెట్స్, ప్లాట్‌లో దొరికిన బుల్లెట్
షెల్స్ కార్డ్‌బోర్డ్ రంధ్రం, బుల్లెట్ మొదలైనవి సుశీల్‌శర్మ రివాల్వర్
నుండి వచ్చినవే అని కూడా వచ్చింది. ఫోరెన్సిక్ ఎక్స్‌ఫర్డ్స్ రిపోర్ట్‌లు సెకండ్
అటాప్సీ రిపోర్ట్‌ను బలపరుస్తున్నందున భార్యను అత్యంత క్రూరంగా హత్యచేసి, ముక్కలుగా నరికి తగలబెట్టడం (Rarest of the rare) అత్యంత
అరుదైన కేసుగా భావించి సుశీల్‌శర్మకు ట్రయల్ కోర్ట్ ఉరిశిక్ష వేయగా హైకోర్ట్
దాన్ని నిర్ధారించింది.
నిందితుడు ఆవేశంలో చేసిన
హత్యేకాని ప్రీ ప్లాన్డ్ మర్డర్ కాదు మరియు అతను సమాజానికి హానికరం కాదు కనుక
ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది సుప్రీంకోర్టు.
2015లో 20 ఏళ్ళ తర్వాత
పెరోల్‌పై విడుదలైన సుశీల్‌శర్మ మీడియా ముందు మాట్లాడిన మొదటి మాట ''ఒకే ఒక్క క్షణం కోపం 20
సంవత్సరాల శిక్ష ఖరీదు'' అన్నాడు. నైనా సాహ్ని హత్య కేసు రెండవ
అటాప్సీకి ఒక బెంచ్ మార్క్‌గా భారత న్యాయవ్యవస్థలో నిలిచిపోయింది.
శ్రీమతి
జి. స్వరూప రాణి
డి.ఎస్.పి., విజయవాడ