యూనిట్
Flash News
ట్రూత్ డ్రగ్
''పాపం! నిండా
ఇరవయ్యేళ్ళయినా లేవు. అపుడే నూరేళ్ళూ నిండిపోయాయి.'' బావిలోలికి తొంగిచూస్తున్న జనంలోంచి ఒకరన్నారు. ''ఆత్మహత్య చేసుకుంది కాబోలు, ఇంకెవరో అన్నారు.
''ఎందుకో'' ఇంకొకరి ఆరా....
''పరీక్షల్లో
ఫెయిలవుతానని భయంతో కాబోలు'' జవాబు.
'తప్పుకోండి...
తప్పుకోండి పోలీసులొస్తున్నారు' ఒకరు
హడావిడి.పోలీసులు బావి దగ్గరకు వచ్చారు.
ఏఎస్‌ఐ రాఘవన్ తన కూడా
వచ్చిన ఫైర్ డిపార్ట్‌మెంట్ వారికి బావిలో నుండి శవాన్ని పైకి తీయమని
పురమాయించాడు. వారాపనిలో ఉండగా క్రైమ్‌సీన్ అయిన ఆ బావి, అది వున్న కాంపౌండ్ ఎవరిదీ అనే వివరాల సేకరణలో
మునిగిపోయాడు.
కేరళలోని కొట్టాయం జిల్లాలో
వున్న సెయింట్ పియస్ కేథొలిక్ చర్చికి అనుంబధంగా వున్న కాన్వెంట్
హాస్టల్‌లోని బావి అది. సెయింట్ పియస్ X కేథొలిక్ చర్చికి ఒక
ప్రత్యేకమైన చరిత్ర వుంది.
భారతదేశానికి క్రైస్తవమతం
బ్రిటిష్ వారితో లేదా పోర్చుగీస్ వారితో వచ్చిందని చాలా మంది అనుకుంటారు. కానీ
అది పూర్తిగా అబద్ధం.
క్రీస్తు చనిపోయిన 19 సంవత్సరాలకే
(క్రీ.శ. 52వ సంవత్సరంలో) క్రైస్తవ మతం
వచ్చింది. ఆయన 12 మంది శిష్యులలో ఒకరైన తోమా (సెయింట్ థామస్)
క్రీస్తు సువార్తను ప్రచారం చేస్తూ మధ్య ఆసియా (సిరియా) నుండి సముద్ర మార్గంలో
ఉత్తర కేరళ తీరాన్ని (ప్రస్తుతం కొడుంగల్లూర్‌గా పిలువబడే ముజారిస్ అనే ప్రాంతం)
చేరుకున్నాడు. ఆయన బోధనలకు ఆకర్షితుడైన ఆ ప్రాంత రాజుతో సహా 2000 మంది
కుంటుంబాలు (కేరళ, తమిళనాడుకు
చెందిన) క్రైస్తవ మతాన్ని స్వీకరించాయి. వీరిలో 6850 బ్రాహ్మణ, 2800 క్షత్రియ, 3750 వైశ్య, 4250 శూద్రులు, ఇతరులు. వీరంతా సెయింట్ థామస్ కేథలిక్కులు
లేదా నార్తిస్టులుగా పేరు గాంచారు.
క్రీ.శ. 345 సంవత్సరంలో
సిరియాకు చెందిన యూదు క్రైస్తవ వర్తకుల 72 కుటుంబాలు కేరళకు వలసవచ్చాయి. దక్షిణ కేరళలో
వీరు స్థిరపడ్డారు కనుక వీరిని సౌతిస్టులు అంటారు. వీరు కూడా సెయింట్ థామస్
కేథలిక్కులుగానే పిలువబడ్డారు. కానీ వీరంతా క్రీస్తు మాతృభాషయైన 'అరిమేయ భాషను, హిబ్రూ, సిరియా
భాషలను మాట్లాడుతూ వారి ప్రత్యేక సంస్కృతిని కాపాడుకుంటూ వున్నారు. వారు నజరానీలు
(క్రీస్తు పుట్టిన ప్రదేశం నజరేతు కనుక), కన్నయన్స్, సిరియో మలబార్, సిరియో
మలంకార ఇలా అనేక శాఖోపశాఖలుగా తర్వాత కాలంలో ఏర్పడ్డారు.
క్రీ.శ. 1911లో పదవ పోప్ సెయింట్ పియస్‌ను
పీఠాధిపతిగా అంగీకరించిన కొందరు సౌథిస్ట్ కన్నయన్ కేథలిక్కులు కొట్టాయంలో
సెయింట్ పిఎస్ X చర్చి నిర్మించారు. దాని ఆధ్వర్యంలో అనేక చర్చ్‌లు, స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళూ, హాస్పిటళ్ళూ
మొదలగున్నవి వున్నాయి. అందులో ఒకటే సెయింట్ పియస్ X కాథలిక్ కాన్వెంట్ హాస్టల్. 100 మంది
పైగా అమ్మాయిలు హాస్టల్‌లో వుండి చదువుకుంటున్నారు. అందులో 20 మంది
నన్స్. వీరిలో కొందరు ప్రి డిగ్రీ, డిగ్రీ
చదువుతున్నారు. హాస్టల్ ఇన్‌చార్జ్ మదర్, సీనియర్
సిస్టర్స్ కూడా హాస్టల్లో వున్నారు. హాస్టల్ కాంపౌండ్‌లో పది మందికి పైగా పని
వాళ్ళు, వంట వాళ్ళు కూడా వున్నారు. వాచ్‌మన్, కాపలాగా రెండు జాతి కుక్కలు కూడా వున్నాయి.
ఫైర్ సిబ్బంది బావిలోంచి
శవాన్ని వలతో పైకి తెచ్చారు. 21 ఏళ్ల ఆ అమ్మాయి శవం అర్చనది. అప్పటికే అక్కడికి
చేరుకున్న ఆమె తల్లిదండ్రులు ఆమె శవంపై పడి బావురుమన్నారు.
టెన్త్ పాసవగానే అర్చన నన్‌గా
మారిపోయింది. ఆమె తండ్రి కూడా ఒక చర్చి ఫాదర్ కావడంతో ఆమె నిర్ణయానికి పెద్దగా
అభ్యంతరం చెప్పలేదు. సెయింట్ పియస్ శ కాన్వెంట్ హాస్టల్ల్ చేరి, ప్రీ డిగ్రీ చదువుతోంది. రోజూ ఉదయం
నాలుగ్గంటలకే లేచి చదవటం అర్చన అలవాటు. రోజూలాగే ఆ రోజు కూడా 4 గంటలకు
అలారం పెట్టుకుని లేచి, తన
రూంమేట్ మేరీని కూడా లేపింది. క్రిందకు వెళ్ళి చల్లటి నీళ్ళు తాగి వస్తానని
క్రింద డైనింగ్ రూమ్‌కి వెళ్లింది. అర్చన ఎంతకూ తిరిగి రాకపోయేసరికి మదర్‌కు
చెప్పింది మేరీ. కాంపౌండ్ అంతా వెతికాక ఇదుగో ఇక్కడ బావిలో ఇలా కనబడింది అని ఏఎస్‌ఐకి
స్టేట్‌మెంటిచ్చింది మేరీ.
బావి ప్రక్కన అర్చన ఇంట్లో
ధరించే ఒక స్లిప్పర్ వుంది. అర్చన తలపై, భుజంపై
పదునైన వస్తువుతో చేసిన గాయాలున్నాయి. శవపరీక్ష తర్వాత బాడీని పోస్ట్‌మార్టంకి
పంపి ఏఎస్‌ఐ డైనింగ్ రూంకి వెళ్ళాడు.
డైనింగ్ హాలు బయట నుండి గడి
వేసి వుంది. గడియ తీసి మెల్లగా లోపలికి తన టీంతో వెళ్ళాడు. 50 మంది
కూర్చుని తినే పెద్ద డైనింగ్ హాలు. దాని వెనుక చిన్న స్టోర్ రూం. దాని వెనుక
పెద్ద కిచన్. డైనింగ్ హాల్ మధ్యలో ఫ్రిజ్ డోర్ తెరిచే వుంది. క్రింద నీళ్ళ
బాటిల్ పడి ఉంది. నీళ్లు కారినట్టుగా తడిగా వుంది ఫ్రిజ్ క్రింద అర్చన ధరించిన
రెండవ కాలిజోడు వుంది. హాల్ డోర్‌కి ఇరుక్కుని ముసుగు (నన్స్ తలకు ధరించే వెయిల్)
వుంది. క్రైమ్ సీన్ చూశాక అది ఖచ్చితంగా హత్యేనని నిర్ధారణకు వచ్చాడు ఏఎస్‌ఐ.
డైనింగ్ హాలుకి, శవం
వున్న బావికి 100 గజాల
దూరం వుంది. డైనింగ్ హాలు ప్రక్కవున్న మరొక గదిలో ఇద్దరు సిస్టర్స్ వుంటున్నారు.
వాళ్ళకి ఏ శబ్దాలు రాలేదా! అర్చన నీళ్ళు త్రాగబోతుండగా ఎదైనా చూడకూడనిది చూసి
వుండాలి. ఆమె ఆ విషయం అందరికీ చెప్పేస్తుందని భయంతో ఆమెను హత్యచేసి బావిలో పడేసి
వుండాలి? అది ఎవరు?
హాస్టల్‌లో వున్న సిస్టర్స్, మరియు విద్యార్థులను 40 మందినిపైగా
విచారించాడు ఏఎస్‌ఐ. పోస్ట్‌మార్టంను దగ్గరుండి చూసాడు. ఆమె ఊపిరి తిత్తుల్లో
డయాటమ్స్ (నీళ్ళలో వుండే శైవలాలు) వున్నాయి!! అంటే ఆమెను ప్రాణంతో వుండగానే
నీళ్ళలోకి విసిరేసారా!? పోస్ట్‌మార్టం
రిపోర్ట్‌లో మరణానికి కారణం నీళ్ళలో మునిగినందున ఊపిరి ఆడక చనిపోయింది
(ఆస్పిక్సియా డ్యూ టూ డ్రౌనింగ్)అని వుంది. అంటే ¬మిసైడ్
డ్రౌనింగ్!?
మర్నాడు పేపర్లలో టీవీల్లో ఈ
వార్త తుఫాన్‌ను సృష్టించింది. హంతకులు ఖచ్చితంగా ఇన్‌ప్లుయెన్స్ వున్నవారు కనుక
కేసును క్రైం బ్రాంచ్‌కి అప్పగించాలని 'అర్చన ఏక్షన్
టీం' పేరుతో ఏర్పడ్డ కొందరు
డిమాండ్‌చేసారు. 17 రోజుల తర్వాత కేస్ క్రైం బ్రాంచ్‌కి మారింది.
హాస్టల్లో నన్స్‌తోపాటు
వుండే ఇతర అమ్మాయిలు కొట్టాయం దగ్గర్లోనే వున్న అలప్పూజ పట్టణానికి వెళ్ళి బాయ్‌ఫ్రెండ్స్‌తో
షికార్లు చేస్తారని, ఒకటి
రెండు సార్లు ఆ అబ్బాయిల్లో ఇద్దరు హాస్టల్‌కి వచ్చినప్పుడు మదర్ వాళ్ళని
మందలించి పంపిందని ఆ యిద్దరబ్బాయిల అడ్రెస్‌లు ఇస్తూ పోలీసులకు సమాచారమిచ్చారు.
ఆ ఇద్దరు అబ్బాయిల్ని
హాస్టల్ యాజమాన్యం ఇంటరాగేట్ చేసాక వాళ్ళు నేరస్థులు కాదని అర్థమైంది. బయట వారు
వస్తే కుక్కలు ఎందుకు మొరగలేదు? 9 నెలలు
ఇన్వెస్టిగేషన్ చేసి అర్చనది ఆత్మహత్యే నంటూ కేస్ క్లోజ్ చేయమని ఫైనల్
రిపోర్ట్ కోర్టుకు సమర్పించారు క్రైం బ్రాంచ్ వారు.
కానీ, క్రైం బ్రాంచ్ రిపోర్ట్‌ని నిరశిస్తూ
కొట్టాయంలోని 100 మందికిపైగా
సిస్టర్స్, మదర్‌తో కలిసి 'అర్చనది
ఖచ్చితంగా హత్యేనని, కేసును
సిబిఐకి అప్పగించాలని' కేరళ
ప్రభుత్వాన్ని కోరారు. దాంతో కేసు సిబిఐ చేతిలో పడింది.
కేసు ఇన్వెస్టిగేషన్
చేపట్టిన సిబిఐ డి.యస్పీ. ఉన్నతాధికారుల ఒత్తిడిని భరించలేనంటూ రెండు నెలల్లోనే తన
ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. తర్వాత ఐ.ఓ.గా వచ్చిన యస్పీ ఒక సంవత్సరంపాటు
పరిశోధించి అర్చనది హత్యో, ఆత్మహత్యో
చెప్పలేమంటూ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చాడు. కోర్ట్ దాన్ని తిరస్కరించి ఇన్వెస్టిగేషన్‌ని
కొనసాగించమంది.
3 సంవత్సరాలు పరిశోధించిన తర్వాత 3వ ఐ.ఓ.అయిన సిబిఐ డి.యస్పీ.
అర్చనది హత్యే అని తేల్చాడు. కానీ, దోషులను
పట్టుకునేందుకు తగిన ఆధారాలు లేని కారణంగా కేసును ఇన్వెస్టిగేట్ చేయలేమని మరొక
ఫైనల్ రిపోర్టు ఇచ్చాడు. కోర్టు దాన్ని కూడా తిరస్కరించి తిరిగి విచారించమంది.
కేసు చేపట్టిన 4వ సిబిఐ డి.యస్పీ. నరేంద్రన్
చాలా నిశితంగా కేసును స్టడీ చేసాడు. కుక్కలు మొరగలేదంటే హాస్టల్‌కి తరచుగా
వచ్చేవాళ్ళు కానీ, హాస్టల్‌లోనే
వున్న వాళ్ళుగానీ హంతకులై వుంటారు. తరచుగా ఆ హాస్టల్‌కి మగవాళ్ళెవరు వస్తారని
ఎంక్వైరీ చేసాడు. అర్చన చదువుతున్న కాలేజీ ప్రిన్స్‌పాల్ 50 ఏళ్ళ
ఫాదర్ జోసఫ్, 46 ఏళ్ళ చర్చి ఫాదర్ థామస్
హాస్టల్‌ను సందర్శిస్తుంటారని వాళ్ళు ఎక్కువగా 26 ఏళ్ళ సిస్టర్ శారా, ఆమె రూమ్‌మేట్ మార్తాతో మాట్లాడుతుంటారని
సమాచారం ఇచ్చారు.
సిస్టర్ శారా రూమ్ డైనింగ్
హాల్‌కు చాలా దగ్గరగా కూడా వుంది. ఖచ్చితంగా అర్చన మరణ రహస్యం వీళ్ళ వద్ద
దొరుకుతుంది అని వారిని విచారించాడు డి.యస్పీ. నరేంద్రన్. అందర్లాగే వాళ్లు
ముగ్గురూ కూడా తమకేపాపం తెలీదు అన్నారు. ఫాదర్స్ ఇద్దరూ అసలు ఆరోజు అక్కడికి
రానేలేదన్నారు.
వాళ్ళు చెప్పేది నిజమో
అబద్ధమో తెలియాలంటే నార్కొ అనాలసిస్, బ్రెయిన్
మ్యాపింగ్, లైడిటెక్షన్ ద్వారానే తెలుస్తుందని భావించి
వాళ్ళ ముగ్గురికి పై పరీక్షలు జరపటానికి కోర్టు అనుమతి తీసుకున్నాడు నరేంద్రన్.
అది బెంగుళూరులోని సెంట్రల్
ఫోరెన్సిక్ సైన్స్‌లాబ్, బెడ్‌పై
సిస్టర్ శారా పడుకొని వుంది. ఆమె చేతి నరానికి ఐ.వి. ద్వారా మెల్లగా 'సోడియం పెంటథాల్' ఎక్కిస్తున్నాడు అనస్థటెస్ట్ (మత్తు మందు
నిపుణుడు) మెల్లిగా ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి.
'సోడియం
పెంటథాల్' దీన్నే 'ట్రూత్ డ్రగ్' అంటారు. ఇది 'నార్కొ
అనాలసిస్'లో ప్రధానంగా ఉపయోగించే మత్తు పదార్థం. దీన్ని
బార్బిట్యూరేట్‌గా (నిద్ర మత్తుకోసం)వాడతారు.సైకియాట్రిస్ట్‌లు తమ పేషెంట్స్‌కు
చికిత్స కోసం కొన్ని ఇస్తూవుంటారు. నొప్పి నివారిణిగా కూడా ప్రసవ సమయంలో గర్భిణికి
దీన్ని ఇస్తారు. హెరాయిన్‌లాగే ఇది కూడా మాదక ద్రవ్యం. 1934లో ప్రపంచ యుద్ధ సమయంలో
దీన్ని కనుగొన్నారు. తీవ్ర భయాందోళనకు గురైన సైనికులకు ఈ మందు ఇవ్వడం ద్వారా
వారిలో భయాందోళనని తగ్గించి మనసు ప్రశాంతంగా వుంచేందుకు బాగా ఉపయోగపడింది ఈ డ్రగ్.
ఈ మందు కేంద్రీయ నాడీ
వ్యవస్థ (సెంట్రల్ నెర్వస్ సిస్టమ్)పై పని చేసి మనిషి ఆలోచనలను
నిలిపివేస్తుంది. ఆలోచించే శక్తిని మందు ప్రభావం వున్నంతవరకు మెదడు కోల్పోతుంది.
కేవలం మెదడులో నిక్షిప్తమైవున్న సమాచారాన్ని మాత్రమే ప్రశ్నలకు సమాధానాల రూపంలో
రాబట్టగలము.
త్రాగినవాడు నిజం చెప్తాడు
అని ఒక సామెత. అంటే తాగినప్పుడు మెదడు మొద్దుబారిన స్థితిలో
ఉంటుంది. అబద్ధాన్ని
చెప్పాలంటే మెదడుకు క్రియేటివిటీ కావాలి. ఆలోచనా శక్తి కావాలి. మత్తులో వున్న
వ్యక్తి ఆ శక్తిని కోల్పోతాడు.
కనుక అబద్దం చెప్పలేడు.
నార్కొ అనాలిసిస్ టెస్ట్
కూడా అలాంటిదే. కృత్రిమంగా మనిషిని మత్తులోనికి పంపి మెదడు క్రొత్తగా ఆలోచించే
శక్తిని ఆపివేసి మెదడులో నిక్షిప్తమైన విషయాన్ని మాత్రమే రాబట్టటం, సోడియం పెంటథాల్ తీసుకున్న వ్యక్తి (తక్కువ
మోతాదులో 3 పిపిఎం)
ఒక అనిర్వచనీయమైన హాయిని పొందుతాడు గాల్లో తేలిపోతున్నట్లుగా. అందుకే మెర్సీ
కిల్లింగ్ (దయా మరణం)లో కూడా డాక్టర్స్ కొన్ని దేశాల్లో రోగికి సోడియం పెంటథాల్‌నే
ఇస్తారు. కొన్ని దేశాల్లో మరణశిక్ష అమలుకు కూడా ఈ డ్రగ్‌నే ఎక్కువ మోతాదులో
ఇస్తారు. ఇలా దీన్ని ఇవ్వడం వల్ల నేరస్థుడు బాధలేకుండా చనిపోతాడు.
ఇక ఇన్వెస్టిగేషన్‌లోకి...
ఇది ట్రూత్ డ్రగ్‌గా ప్రవేశించడానికి కారణం శత్రుదేశ గూఢచారుల నుండి రహస్యాన్ని
రాబట్టేందుకు అనేక దేశాలు ఇదే ఇవ్వడం పరిపాటి. (పాకిస్థాన్ తీవ్రవాది కసబ్‌కు
కూడా నార్కొ అనాలసిస్ టెస్ట్ జరిపారు).సిబిఐ హైప్రొఫైల్ కేసుల్లో నార్కొటెక్
జరిపిస్తుంది.
సిస్టర్ శారా సెమీ
కాన్సియస్ స్థితిలోకి చేరుకుంది. మత్తునివ్వడం ఆపాడు నిపుణుడు.
'మీ పేరు'
'శారా, సిస్టర్
శారా' మెల్లిగా జవాబిచ్చింది.
కొన్ని
మామూలు ప్రశ్నలయ్యాక ఫోరెన్సిక్ నిపుణుడు అసలు ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు.
ఫోరెన్సిక్
నిపుణుడు: 'సిస్టర్ అర్చన ఎలా చనిపోయింది?'
శారా: 'ఆమెని హత్య
చేసారు'
ఫో.ని: 'ఎందుకు'? ఎవరు?
శా: ఆరోజు ఫ్రిజ్‌డోర్
తెరిచి నీళ్ళు తాగుతూ. ఫాదర్ జోసఫ్, నేను
డైనింగ్ హాలు వెనుక వున్న చిన్న రూపంలో వుండటం చూసి దొంగలు అనుకొని గట్టిగా
అరవబోయింది. మా ప్రక్కనే వున్న మరొక ఫాదర్ థామస్ పరుగున వెళ్ళి అరవకుండా ఆమెను
పట్టుకొని నోరు నొక్కేసాడు. నేను వంటగదిలో వున్న గొడ్డలి తీసి ఆమె వెనుక నుండి
నాలుగైదు సార్లు కొట్టాను. ఒక దెబ్బ ఆమె తలకి తగలడంతో స్పృహ తప్పి కింద
పడిపోయింది.బ్రతికివుంటే మా సంగతి అందరికీ చెప్పేస్తుందని మేం ముగ్గురం వెంటనే
ఆమెను ఎత్తుకెళ్ళి బావిలో పడేశాం. ఆమె నీటిలో మునిగి చనిపోయే వరకూ అక్కడే వుండి
వెనక్కి వచ్చి డైనింగ్ రూం గడియ వేశాం.
ఇవన్నీ త్వరత్వరగా
జరిగిపోవడంతో అప్పటికి రక్తం కారలేదు. ఫాదర్ జోసఫ్, ఫాదర్ థామస్ కూడా ఇంచుమించుగా ఇవే విషయాలు
చెప్పారు.
అర్చన హత్య జరిగిన 15 సంవత్సరాల
తర్వాత నార్కొ అనాలసిస్ టెస్ట్‌లో బయటపడిన ఈ రహస్యాలకు పోలీసులతోపాటు ప్రజలు
నిర్ఘాంతపోయారు.
నార్కొ అనాలసిస్ రిపోర్ట్‌ను
సపోర్ట్ చేస్తూ ఇతర సాక్ష్యాధారాలైన, ఫాదర్స్
తరచూ ఆ హాస్టల్‌కి లేట్‌నైట్స్‌లో రావడం చూసినట్లు ఆ హాస్టల్ చుట్టు ప్రక్కల వారు
చెప్పటం, సిస్టర్ శారా రూం డైనింగ్ హాల్ పక్కనే
ఉండడం, సిస్టర్ శారాకు ఆ ఇద్దరు పాస్టర్లతో చనువు
వుండటమే కాక సిస్టర్ శారా 'హైమనోప్లాస్టీ
ఆపరేషన్' (కన్నె పొరను పునర్మించుకొనే ఆపరేషన్)
చేయించుకుందన్న వైద్యుల ధృవీకరణ పత్రాన్ని కూడా కోర్టుకు సమర్పించి ఛార్జిషీట్
వేశాడు సిబిఐ అధికారి.
2008లో ఛార్జ్‌షీట్
వేసినప్పటికే కోర్ట్ ఇంత వరకు ఈ కేసు విచారణ పూర్తి చేయలేదు.
నార్కొ అనాలసిస్ టెస్ట్
టాంపరింగ్ జరిగిందని అది నిజమైన వీడియో రికార్డులు కావని ముద్దాయిల తరఫు
న్యాయవాదులు బెయిల్ పిటీషన్ కోసం వాదించారు. నిజమైన వీడియోలు సీల్డు కవర్‌లో
తిరిగి సమర్పించమని కోర్టు సిబిఐని ఆదేశించింది.
సిబిఐ మరలా వీడియో రికార్డ్‌లను
కోర్ట్‌కు సమర్పించింది.
ఇక్కడ నార్కొ అనాలసిస్
టెస్ట్ కోర్ట్‌లో దాని సాక్ష్యాధార విలువను తప్పక చర్చించాలి. 1936 నుండే
ఇన్వెస్టిగేషన్‌లో దీన్ని ప్రవేశపెట్టారు. మత్తులో వున్న వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్‌ను
ఆడియో, వీడియో తీసి కోర్టులో సాక్ష్యంగా ఇవ్వడం.
నార్కొ అనాలసిస్ ద్వారా వ్యక్తులు ఇచ్చే సమాచారం ఇన్వెస్టిగేషన్‌ను కొనసాగించి
అసలు నేరస్థుల్ని పట్టుకోవడానికే కాక, నేరం
జరగబోతున్న విషయాన్ని తెలుసుకుని వాటిని ఆపడానికి కూడా ఉపయో గపడ్తుంది. కసబ్‌లాంటి
తీవ్ర వాదులు చేసే కుట్రలు, వారి
సహచరుల సమాచారం, సహాయకులు మొదలగు ఎంతో
అమూల్యమైన సమా చారాన్ని రాబట్టవచ్చు కనుకనే నార్కొ అనాలసిస్ టెస్ట్‌లపై కోర్టులు
మౌనంగా వున్నాయి. ఒకరకంగా అనుమతి ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి కూడా.
కానీ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 (3) ప్రకారం 'ఏ వ్యక్తి అయినా ఒక నేరంలో
ముద్దాయిగా భావించబడ్తే, తనకు
తానే నేరస్థుడినని కోర్టులో బలవంతంగా సాక్ష్యం చెప్పించరాదు.'
అందుకే సిఆర్‌పిసి 162, ఇండియన్
ఎవిడిన్స్ ఏక్ట్ 25 సెక్షన్‌ల ప్రకారం పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్
(నేరాంగీకారం) కానీ, పోలీసుల
సమక్షంలో ఇచ్చిన కన్ఫెషన్ కానీ సాక్ష్యంగా కోర్ట్ పరిగణించదు.
డిడిటి (డిసెప్షన్
డిటెక్షన్ టెస్ట్‌లు) అయిన నార్కొ టెస్ట్, పాలిగ్రాఫ్
(లై డిటెక్షన్) టెస్ట్, బ్రెయిన్
మ్యాపింగ్ టెస్ట్‌లు పెట్టే ముందు తప్పనిసరిగా ఆ వ్యక్తుల అనుమతి, మరియు వైద్యులు ఆ వ్యక్తిని ఆ టెస్ట్ కండక్ట్
చేయవచ్చనే ధృవీకరణ వుండాలని, ఆ
టెస్ట్‌లను కండక్ట్ చేయమని కోర్ట్ అనుమతి కూడా తప్పక ఉండాలని సుప్రీం కోర్టు 'సెల్వి హ/ర కర్ణాటక' కేసులో చెప్తూ కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చింది.
అదే సుప్రీం కోర్టు 'సిస్టర్ అభయ' హత్య కేసులో నార్కొ అనాలసిస్‌కి అనుమతి
నిరాకరించిన ఇద్దరికి టెస్ట్ జరపమని అధికారులను అదేశించింది.
ఈ మధ్యే ఉత్తర ప్రదేశ్‌లోని
ఫైజాబాద్ సెషన్స్ కోర్ట్ 'నార్కొ
అనాలసిస్ టెస్ట్'ని ఎవిడెన్స్‌గా తీసుకుని నేరస్తులకు
శిక్ష విధించింది.
సంచలనం సృష్టించిన నిఠారి
సామూహిక హత్యల కేసులో దోషులను నిర్ధారించడంలో, శిక్షపడటంలో
నార్కొ టెస్ట్‌దే ముఖ్యపాత్ర.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 (3)ఇచ్చిన రక్షణ నేరస్థుడికే
కానీ, సాక్షికి కాదు. టెస్ట్
పెట్టాలంటే అతని అనుమతి తప్పనిసరి కాదని కూడా న్యాయమూర్తులు కొన్ని సందర్భాల్లో
తెలిపారు.
పోలీసుల ముందు, పోలీసుల సమక్షంలో ఇచ్చిన నేరాంగీకారం చెల్లదు.
కానీ, నార్కొటెస్ట్‌లో నేరస్తుడు డాక్టర్‌కి కన్ఫెషన్
ఇస్తున్నందున పోలీసులు అక్కడ ఉండరు కనుక ఇది ఎక్స్‌ట్రా జుడీషియల్ కన్ఫెషన్
అవుతుంది కనుక సాక్ష్యంగా అంగీకరించబడుతుంది అని కొందరి సమర్థన.
నార్కొటెస్ట్‌లో ఏ విషయాన్ని
రాబట్టలేకపోయిన కేస్‌లు కూడా వున్నాయి. సంచలనం సృష్టించిన ఆరుషి, హేమరాజ్ జంట హత్యల కేసులో ఆరుషి
తల్లిదండ్రులకు నార్కొ పరీక్ష జరిపినప్పటికీ ఎలాంటి క్లూలు లభించలేదు.
కానీ గృహ యజమానులు కానీ, అందులో నివసించే వారు కానీ, నేర విచారణలో మౌనంగా వున్నంత మాత్రాన
తప్పించుకోలేరు. నేరం వారి సమక్షంలో జరిగినప్పుడు అందులో వారి ప్రమేయం వుందని ఇతర
సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ నిరూపిస్తున్నప్పుడు వారు మౌనంగా వున్నప్పటికీ
శిక్షార్హులే అని వ్యాఖ్యానిస్తూ తాల్వార్ దంపతులకు జీవిత ఖైదు విధించింది
కోర్టు.
న్యాయవ్యవస్థ వైఫల్యం వల్ల
ఒక నిరపరాధికి శిక్ష పడితే ఎంత పాపమో ఒక నేరస్థుడిని సమాజంలోకి వదిలేయటం కూడా అంతే
పాపమని పై తీర్పులో జడ్జి వ్యాఖ్యానించారు.
న్యాయం జరగటమే ముఖ్యం కాదు
న్యాయం జరిగినట్టు అందరికీ
అన్పించడం కూడా ముఖ్యం అని ఒక తీర్పులో జడ్జి పలికిన మాటలు అక్షర సత్యాలు.