యూనిట్
Flash News
టెంపుల్ కిల్లర్
కైవార
తాతయ్య ఆశ్రమంలో కూర్చుని భగవద్యానంలో వున్న రేణుకను రెండు నిమిషాలు చూస్తే ఆమె
ఏదో తీవ్ర మానసిక వేదనతో వున్నట్టు ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ధ్యానంలోనే
దేవుడ్ని ఏదో ప్రశ్నిస్తున్నట్లు, అభ్యర్థిస్తున్నట్లు, దు:ఖాన్ని ఆపుకుంటున్నట్టు మెల్లిగా
గొణుగుతోంది. 36 ఏళ్ళున్న రేణుక పెళ్ళైన యువతిలా ఆమె మెడలోని
బంగారు నల్లపూసలు, తాళితో
వున్న గొలుసు చెప్పకనే చెప్తున్నాయి. ఇంత చిన్న వయసులో ఏం కష్టమొచ్చిందో అని
ప్రక్కనే కూర్చున్న జయమ్మ జాలిగా కాసేపు చూసిి తన ధ్యానంలోకి వెళ్ళిపోయింది. అరగంట
తర్వాత మంత్రోచ్ఛారణ శబ్ధానికి కళ్ళుతెరిచింది రేణుక. తన ప్రక్కనే కాషాయరంగు చీరలో
నుదుటి విభూతితో, మెడలో
రుద్రాక్షమాలతో చేతిలోని రుద్రాక్షలను లెక్కపెడుతూ మంత్రాలను వల్లెవేస్తున్న 42 ఏళ్ళ
జయమ్మను చూసింది. వేదపండితులకు ఏమాత్రం తీసిపోని ఆమె మంత్రోచ్ఛారణకు ముగ్ధురాలై
ఆమెనే చూస్తూ వుండిపోయింది. కాసేపటికి కళ్ళుతెరిచినజయమ్మ, రేణుకవైపు ప్రేమగా చూసింది. ఆమెను పలకరించకుండా
వుండలేకపోయింది రేణుక. చిన్నతనం నుండే ఆశ్రమంలో సన్యాసిగా పెరిగిన జయమ్మకు నా
అనేవాళ్ళెవరూ లేరనీ, శివభక్తులతో
కలిసి దేశంలో ఉన్న అన్ని శివాలయాలను దర్శిస్తూ మంత్రాలు, సిద్ధులు నేర్చుకుందనీ, ఆమె నేర్చుకున్న సిద్ధులకు ఎలాంటి సమస్యనైనా
తీర్చేశక్తి వుందనీ జయమ్మనే చెప్పింది.
అది
విన్న రేణుక మొహం ఆనందంతో వెలిగిపోయింది. వెంటనే తన సమస్యను ఆమె ముందు ఏకరువు
పెట్టింది. పెళ్ళై పదిహేనేళ్ళయినా తనకి పిల్లలు
పుట్టలేదని ఆమె తిరగని గుడీ, మొక్కని
దేవుడూ లేడనీ ఎందుకు దేవుడింకా కరుణించట్లేదో అర్థం కావట్లేదంది. పిల్లలు లేనందుకు
ఇంట్లో భర్తా, అత్తమామల ఆరళ్ళు, సూటిపోటి
మాటలకు చచ్చిపోవాలనిపిస్తుందనీ, చివరికి
ఈ సంవత్సరం కానీ ఆమె కడుపు పండకపోతే తన భర్త మరో పెళ్ళి చేసుకుంటానని వార్నింగ్
ఇచ్చేవరకూ వచ్చిందనీ చెప్పి ఏడ్చింది. అంతేకాక చుట్టాలు, బంధువులూ ఆమెను గొడ్రాలంటూ పేరంటానికి పిలవక
పోవడం కూడా తట్టుకోలేకపోతున్నానని విలపించింది. జయమ్మ ఆమెను ఓదార్చి '' ఆ
సిద్ధేశ్వరుడు తలచుకుంటే 40 రోజుల్లో నీవు శుభవార్త వింటావు'' అంది.
''నిజంగానా? ఎలా?'' రేణుక సంతోషంగా అడిగింది. జయమ్మ కళ్ళుమూసుకుని
ధ్యానంలోకి వెళ్ళి 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచింది. ''40 రోజులపాటు
మండల పూజ చేస్తే 41వ రోజు నీవు
గర్భవతివన్న వార్త డాక్టరే ధృవీకరిస్తాడు'' నవ్వుతూ
చెప్పింది.
''మరి మండల పూజ ఎలా చెయ్యాలి? ఎక్కడ? ఆత్రంగా అడిగింది.''
''అది నేనే చేస్తాను, కానీ ఇక్కడ కాదు.
శక్తివంతమైన
కైవారయోగి నారాయణ ఆశ్రమంలో నీవు మొదటిరోజు, 40వ రోజు వస్తే సరిపోతుంది.
అన్నట్టు ఈ పూజ సంగతి 40 రోజుల వరకూ ఎవరికీ చెప్పొద్దు నీ భర్తకి కూడా'' అంది.
''అలాగే మరి మండలపూజ ఎప్పుడు ప్రారంభిస్తావు'' అడిగింది రేణుక.
''రేపు చాలా మంచి రోజు. ఇదే టైంకి రేపు నువ్వొస్తే 2,3 గంటల్లో
పూజ ముగించుకుని ఇక్కడికి వచ్చేస్తాం'' అంది. ''అన్నట్టు తలస్నానం చేసి, పట్టుచీరతో లక్ష్మీదేవిలా రావాలి'' అంది.
జయమ్మ, రేణుక ఆటోలో గంటన్నర ప్రయాణం చేసి కోలార్‌లోని
కైవార యోగి నారాయణ ఆశ్రమం దగ్గర దిగారు. బెంగళూరుకి చివరగా వుంది ఆ ఆశ్రమం. జనాలు
పెద్దగా లేరు. రేణుకను అక్కడే వుండి లోపలున్న కౌంటరు వద్దకు వెళ్ళింది జయమ్మ.
ఆశ్రమం అతిథిగృహంలోని ఒక రూంని తనపేరుమీద బుక్ చేసి తాళం చెవితో రేణుక వద్దకు
వచ్చింది.
క్షణాల్లో
ఆ గది పూజగదిలా మారిపోయింది. సిద్దేశ్వరుడి పటం ముందు, కొబ్బరికాయ కొట్టి అగరొత్తులు వెలిగించి, నిమ్మకాయలు ఇతర పూజా సామాగ్రి పెట్టింది. చిన్న
స్టీలు గిన్నెలో నీళ్ళు పోసి పటం ముందు పెట్టి మంత్రాలు చదవటం మొదలుపెట్టింది
జయమ్మ. అరగంట తర్వాత పూజ ముగించి దేవుడి ముందు పెట్టిన స్టీలు గిన్నె చేతిలోకి
తీసుకొని తమలపాకుతో ఈ నీళ్ళని పటం చుట్టూ చిలకరించి మిగిలిన నీటిని త్రాగమని
రేణుకకిచ్చింది. భక్తిగా కళ్ళకద్దుకొని ఆ నీటిని తాగింది. తీయగా వున్నాయని ఆమె
అనుకునేలోపే 10 సెకండ్లలో
ఆమె గొంతునెవరో పిసికినట్లు ఊపిరాడక గిలాగిలా కొట్టుకుంది. ఏమైందో గ్రహించేలోపే
ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
రేణుక
వంటిమీదున్న నగలను క్షణాల్లో తీసి అక్కడ్నుంచి మాయమైంది జయమ్మ.
రాత్రి
పొద్దుపోయేవరకూ ఎదురుచూసిన రేణుకభర్త బెంగళూర్‌లోని చింతామణి పోలీస్టేషన్‌లో
ఫిర్యాదు చేశాడు.
తాళం
వేసివున్న గదిలోంచి దుర్వాసన రావడంతో కైవారయోగి నారాయణ ఆశ్రమ సిబ్బంది గది తాళాలు
పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా ఒక స్త్రీ మృతదేహం వుందనీ మైకో లే అవుట్
పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపిన పోలీసులకు
అక్కడ రిజిస్టర్‌లో జయమ్మపేరు తప్ప మరే ఆధారాలు దొరకలేదు. ఆమె రాసిన అడ్రెస్ కూడా
తప్పుడు అడ్రెస్ అని నిర్ధారించుకున్నారు. సిటీలో అన్ని
పోలీస్‌స్టేషన్‌లకూ సమాచారం అందటంతో రేణుక భర్తని వెంటపెట్టుకొని వచ్చారు చింతామణి
పోలీసులు. ఆమె తన భార్యేనని, అక్కడికెందుకు, ఎవరితో వచ్చిందో తెలీదని ఇంట్లో ఎవరికీ
చెప్పలేదని చెప్పాడు. ఫోరెన్సిక్ రిపోర్టులో ఆమె మరణం ''సైనేడ్ విషం కడుపులోకి
వెళ్ళడం వల్ల సంభవించినట్లు వచ్చింది.
బెంగళూర్‌లోని
ఈఎస్‌ఐ ఆసుపత్రిలో నర్స్ గా పనిచేస్తుంది 52 ఏళ్ళ ఎలిజబెత్. ఆమెకి ఆరేళ్ళ మనవరాలు స్వీటీ
అంటే పిచ్చి ప్రేమ. వారం క్రితం బిస్కెట్స్ కొనుక్కుంటానని వీధి చివర షాప్‌కి
వెళ్ళిన స్వీటీ తిరిగి రాలేదు. ఆ రోజే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఎలిజబెత్
ఉద్యోగానికి సెలవుపెట్టి రోజూ వీధులన్నీ వెతుకుతూ తిరుగుతోంది. మనుమరాలి ఫోటో
చేత్తో పట్టుకుని కనపడిన వారందర్నీ అడుగుతోంది. కనపడిన గుడికి వెళ్ళి అందరు
దేవుళ్లనూ మొక్కుతోంది. ఆరోజు కూడా
వెతుక్కుంటూ ప్రక్కఊరిలోని శివాలయానికి వెళ్ళింది. ఫొటో చూపుతూ అందర్ని అడగటం
అక్కడే వున్న సావిత్రమ్మ చూసింది. ఎలిజబెత్‌ని పిలిచి విషయం తెలుసుకుంది. అంతా విని ''ఓస్ ఇంతేనా! అంజనం వేస్తే నీ
మనుమరాలెక్కడుందో రెండు నిముషాల్లో చెప్తాను'' అంది.
పట్టరాని
ఆనందంతో ''మరి చెప్పు'' అంది ఎలిజబెత్. ''చెప్తాను.
కానీ ఇక్కడ కాదు. సాతూర్‌లోని కబ్బలమ్మ సన్నిధిలో అడిగితేనే ఆ తల్లి చెప్తుంది'' అంది సావిత్రమ్మ ''అయితే పద, అక్కడికే వెళ్ళి అడుగుదాం'' తొందర పెట్టింది ఎలిజబెత్.
ఇద్దరూ
వెంటనే ఊరికి 30 కి.మీ.ల
దూరంలో వున్న కబ్బలమ్మ గుడికి వెళ్ళారు. అద్దెకు తీసుకున్న గదిలో వుంచిన కబ్బలమ్మ
చిత్రపటం ముందు ఒక చిన్న గుండ్రటి అద్దం పెట్టింది. నిమ్మకాయలు, అగరొత్తులు, కొబ్బరి
కాయలు, ఒక గిన్నెలో నీళ్ళ ప్రసాదం సిద్ధం చేసి, పూజ మొదలుపెట్టింది సావిత్రమ్మ. 10 నిమిషాల
తర్వాత కళ్ళు తెరిచి నీళ్ళ గిన్నె చేతిలోకి తీసుకుని ''మంత్రించిన ఈ నీళ్ళు తాగి ఈ
అద్దంలోకి చూడు. వెంటనే నీ మనుమరాలు కనపడతాది'' అని అందించింది.
భక్తిగా
ఆ నీటిని కళ్ళ కద్దుకొని త్రాగింది ఎలిజిబెత్. క్షణాల్లోనే గిలాగిలా కొట్టుకుని
ప్రాణాలు వదిలింది.
ఆమె
వంటిమీదున్న నగలతో మాయమైంది సావిత్రమ్మ.
రెండ్రోజుల
తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులకు సావిత్రమ్మ పేరు తప్ప ఏ ఇతర ఆధారాలు దొరకలేదు.
ఫోరెన్సిక్ రిపోర్ట్ ''సయనైడ్ విష
ప్రభావం వల్ల ఆమె మరణించినట్లు'' తెలిపింది.
బిక్క
కెంపన్న గుడిలో పూజారి భార్య పిళ్ళమ్మ. 60 ఏళ్ళ పిళ్ళమ్మ మెడలో కంటె, ముక్కు బేసరతో పార్వతీదేవిలా వుంటుంది. రోజూ
క్రమం తప్పకుండా ఆ గుడికి వచ్చే మల్లిక ఆమె దృష్టినాకర్షించింది. 40 ఏళ్ళుండొచ్చు, ఖరీదైన చీరలు, నగలతో
చూడగానే ధనవంతురాలిలా కనపడ్తుంది మల్లిక. వారం రోజుల్లోనే పూజారి భార్య పిళ్ళమ్మకి
ఆప్తురాలై పోయింది మల్లిక.
''మీ మీదున్న అభిమానానికి గుర్తుగా ఈ గుడికి డోమ్ కట్టించాలనుకుంటున్నాను'' అంది మల్లిక. పిళ్ళమ్మ ఉబ్బితబ్బిబ్బై పోయింది. ''అలాగే, ఎప్పుడు మొదలుపెడ్తావ్ మరి'' అనడిగింది.
''మద్దూర్‌లోని వైద్యనాదేశ్వరస్వామి గుడికి మీరెప్పుడైనా వెళ్ళారా''
''లేదు'' అంది
పిళ్ళమ్మ.
''ఆ గుడి డోమ్ చూడ చక్కగా వుంటుంది మీరు ఒకసారి వచ్చి అది చూడండి. నచ్చితే
అదే నమూనాతో కట్టిద్దాం'' అంది
మల్లిక. మర్నాడు పూజారికి చెప్పి ఇద్దరూ ఆటోలో బయల్దేరారు.
అరగంట
పాటు డోమ్ చుట్టూ తిరిగాక మధ్యాహ్నం అయింది. ''ఇక్కడే
భోజనం చేసి బయల్దేరదాం'' అని
అతిథిగృహంలో ఒక గది అద్దెకు తీసుకుంది. ఆ గదికి వెళ్ళి భోజనాలు తెప్పించుకున్నారు.
తన వాటర్ బాటిల్ తీసి రెండు గ్లాసుల్లో నీళ్ళు పోసింది మల్లిక. రెండు ముద్దలు
తిని నీళ్ళుతాగింది పిళ్ళమ్మ. అంతే రెండు క్షణాల్లో గొంతు పట్టుకుని
క్రిందపడిపోయింది. మల్లిక వెంటనే లేచి ఆమె మెడలో నగలు, దిద్దులు, గాజులు
లాఘవంగా తీసుకుని గది బయట తాళం వేసి మాయమైంది. పిళ్ళమ్మ మరణం కూడా సయనైడ్ విష
ప్రభావమని రిపోర్ట్ వచ్చింది.
ఆస్మాతో
బాధపడుతున్న 60 ఏళ్ళ
యశోదమ్మకు గుళ్ళో పరిచయమైంది లక్ష్మి. కెంపన్న గుడిలో ప్రత్యేక పూజ చేస్తే ఆస్మా
ఇట్టే మాయమవుతుందని లక్ష్మి చెప్పడంతో ఆమె వెంట వెళ్ళింది. పూజయ్యాక లక్ష్మి
ఇచ్చిన ప్రసాదం తినగానే విగతజీవిగా మారిపోయింది యశోదమ్మ. ఆమె వంటిమీద నగలు
తొలగించి మాయమైంది లక్ష్మి. యశోదమ్మ మరణానికి సయనైడ్ కారణమని తేల్చింది లాబ్.
మగపిల్లాడి
కోసం పూజలు చేస్తున్న 35 ఏళ్ళ నాగవేణికి గుళ్ళో తారసపడింది కెంపమ్మ.
దొడ్డ బల్లాపూర్‌లోని శివాలయంలో తెల్లవారుఝామున 5 గంటలకు పూజ చేస్తే మగపిల్లాడు పుడ్తాడని
నమ్మించింది కెంపమ్మ. మర్నాడు పొద్దున్నే ఆమె వెంట వెళ్ళిన నాగవేణి శవంగా మారింది.
ఆమె వంటిమీద నగలు మాయం సైనేడ్ ప్రభావం వల్ల మరణించినట్లు తేల్చేసింది లాబ్
రిపోర్ట్.
50 ఏళ్ళ రాజమ్మ వితంతువు. ఆమెకు ఇంటినిండా
సమస్యలే. ఆస్తికోసం కొడుకులు, కోడళ్ళు
రోజూ వేధించడంతో మన:శ్శాంతి కోసం గుళ్ళూ, గోపురాలు
తిరుగుతుంది. అక్కడే పరిచయమైంది మల్లిక. 'జలగేరమ్మ
టెంపుల్‌లో మండల పూజ చేస్తే సమస్యలన్నీ పోతాయని నమ్మించడంతో ఆమె కూడా వెళ్ళింది
రాజమ్మ. మర్నాడు ఆమె మరణవార్త కుటుంబసభ్యులకు తెలిసింది. ఆమె వంటిమీద నగలు లేవు, పైగా ఆమె మరణవార్త కూడా సైనేడ్ కారణమని
తేలింది.
కేవలం 2007 నవంబర్ 1 నుండి
డిసెంబర్ లోపు ఆరుగురి స్త్రీల హత్యలు జరిగాయి. అన్నీ బెంగళూరు శివారు
ప్రాంతాల్లోని గుళ్ళలో ఈ టెంపుల్ కిల్లర్స్ ఖచ్చితంగా స్త్రీలే అని రికార్డ్‌లోని
పేర్లు చెప్తున్నాయి. హత్యలకు ఉపయోగించిన పద్ధతి (మోడస్ ఆపరెండి) సైనేడ్. కనుక
ఇవన్నీ ఒకే స్త్రీ చేసిన హత్యలా!! రెండుసార్లు టెంపుల్ రిజిస్టర్‌లో మల్లికగా
నమోదైంది. ఎవరీ సైనేడ్ మల్లిక? భారతదేశంలో
మొదటి లేడీ సీరియల్ కిల్లర్ కాదు కదా!! సీరియల్ కిల్లర్ అయితే నెక్ట్స్
టార్గెట్ ఎవరు?! బెంగళూరు పోలీసులు సైనేడ్
మల్లిక వేటలో పడ్డారు. మఫ్టీలో అన్ని గుళ్ళదగ్గర, పబ్లిక్
ప్రదేశాల్లో పోలీసులు కాపు కాస్తున్నారు.
అగ్రికల్చర్
యూవర్శిటీలో పనిచేసిన మునియమ్మ రిటైరయ్యాక గుళ్ళూ, గోపురాలు
తిరగటమే పనిగా పెట్టుకుంది. ఒక గుడిలో పరిచయమైంది కెంపమ్మ. వారి మధ్య స్నేహం
పెరిగింది. అడయార్ లోని సిద్ధ లింగేశ్వరస్వామి చాలా మహిమగలవాడు. నీకున్న కీళ్ళ
వ్యాధులన్నీ ఇట్టే మాయమౌతాయి.' అని
నమ్మించింది కెంపమ్మ. తర్వాత రోజు చెప్పి కంపమ్మ వెంట వెళ్తున్నట్లు కుటుంబ
సభ్యులకు చెప్పి వెళ్లింది మునియమ్మ.
రెండ్రోజులైనా
తల్లి రాలేదు సరికదా ఆమె సెల్ స్విచాఫ్‌లో ఉండటంతో అనుమానం వచ్చి
బెంగళూరు సిటీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు కుటుంబసభ్యులు. తర్వాత రోజే అడయార్
పోలీసులు మునియమ్మ శవాన్ని పోస్టుమార్టంకి పంపిన సమాచారం తెలుసుకున్న బెంగళూర్
పోలీసులు, మునియమ్మ కుటుంబ సభ్యులు, అక్కడకు వెళ్లి ఆమెను గుర్తించారు. ఆమె వంటిమీద
వుండాల్సిన నగలు మాయం. సైనేడ్ విషం మరణానికి కారణమన్న రిపోర్ట్‌తో ''టెంపుల్ కిల్లర్''ని పట్టుకోడానికి ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు బెంగళూరు పోలీసులు.
బస్టాండ్‌లో
నిలబడ్డ వ్యక్తుల దగ్గరకు వెళ్ళి 'సెల్‌ఫోన్
అమ్ముతాను తీసుకుంటారా' అని
అడుగుతోంది ఒక స్త్రీ. మఫ్టీలో వున్న ఇద్దరు పోలీసులు ఆమెను వెంటనే అదుపులోని
తీసుకుని స్టేషన్‌కి తీసుకెళ్ళారు. ఆమె బ్యాగ్‌లోని వస్తువులను టేబుల్‌పై
గుమ్మరించగా అందులో సిద్ధలింగేశ్వరస్వామి ఆశ్రమ అతిథిగృహం రశీదు, తాళం చెవి, బంగారు
దిద్దులు దొరకడంతో వెంటనే అక్కడి పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు.
పెద్దగా శ్రమ పెట్టకుండానే గతంలో తను చేసిన 7 హత్యలను కూడా అంగీకరించింది. కానీ బెంగళూర్‌లో
జరిగినవి ఆరే కదా! 7వ హత్య
ఎవరిది అని అడుగగా... 1999లో
మద్రాస్ బోర్డర్‌లో మమతారాజన్ అనే 30 సంవత్సరాల స్త్రీని ఇలాగే పూజ పేరుతో ఆమె
ఇంట్లోనే సైనేడ్ కలిపిన ప్రసాదం ఇచ్చి హత్యచేసినట్లు తెలిపింది. మొత్తం 8 హత్యలు!!!
ఎందుకు ఆమె ఇలా మారిందో కూడా చెప్పింది.
టైలర్‌గా
పనిచేస్తున్న కెంపమ్మ భర్త చాలీచాలని సంపాదన, ఇద్దరు
కుమార్తెల పోషణ భారంగా మారింది. తోటి స్త్రీలతో కలిసి చిట్టీల బిజినెస్ చేసి
వారికి తిరిగి డబ్బివ్వకుండా మోసం చేయడంతో జైలు పాలయ్యింది. భర్తా, పిల్లలు ఆమెను ఇంటికి రానివ్వకపోవడంతో ఇళ్ళల్లో
పనులు చేస్తూ, అవకాశం దొరికితే దొంగగా మారేది. అలా ఒక ఇంట్లో
దొంగతనం చేస్తూ పట్టుబడి మళ్ళీ ఆర్నెల్లు జైలు కెళ్ళింది. అప్పుడే తెలిసింది ఆమెకు సైనేడ్‌తో
మనుషులను చాలా ఈజీగా తొందరగా చంపొచ్చని. అంతే కాదు అది చాలా ఈజీగా, దొరుకుతుంది. రాగిగిన్నెలకు తగరం కోటింగ్ వేసే
వారి దగ్గర, ఫొటో డెవలపింగ్‌లోను, అనేక పరిశ్రమలలో కూడా దీన్ని వాడుతారని
తెలుసుకుంది.
జైలు
నుండి విడుదలయ్యాక తగరపు కోటింగ్ వేసేవారితో పరిచయం పెంచుకుని సైనేడ్‌ని
సేకరించింది. దాన్ని నీటిలో కలిపి ఆ బాటిల్‌ని ఎప్పుడూ తన బ్యాగ్‌లో వుంచుకొని గుళ్ళూ, గోపురాల దగ్గర భక్తురాలి ముసుగులో మాటు
వేసింది. ఆమెకు దొరికిన బాధితులు అందరూ సమస్యలతో బాధపడ్తూ వాటి నివారణకు మూఢ
భక్తులుగా మారిన మధ్యతరగతి మహిళలే. వంటి మీద కొద్దోగొప్పో బంగారం వుంటే చాలు.
నిర్దాక్షిణ్యంగా ఆ బంగారం కోసం నిండుప్రాణాలు ఒకటికాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది
మంది స్త్రీలను మట్టుపెట్టిన ఆమెకు రెండు కేసుల్లో కోర్టు ఉరి శిక్షవేయగా మిగిలిన
కేసులు ఇంకా విచారణలో వున్నాయి. మూఢ భక్తితో ఎవరేం చెప్పినా నమ్మి మోసపోయేవారికి
ఇదో కనువిప్పు కథ.
కిల్ పిల్: అత్యంత ప్రమాదకర విషాలలో ఆర్సెనిక్‌ని కింగ్
ఆఫ్ పాయిజన్స్ అంటారు. దాని తర్వాతి స్థానం సైనేడ్‌దే. హైడ్రోజన్ సైనేడ్, పొటాషియం సైనేడ్, సోడియం సైనేడ్.. ఇలా అనేక రూపాలలో
దొరుకుతుంది. అంతేకాక ఇది ఘన, ద్రవ, వాయు రూపాలలో కూడా దొరుకుతుంది. భోపాల్ గ్యాస్‌గా
పేరుపొంది అనేక వేలమంది మరణానికి కారణమైంది మిక్ (మిథైల్ ఐసో సైనేడ్) ఎలుకలు, క్రిమి సంహారకాలలో విరివిగా వాడేది కూడా సైనేడ్‌నే.
సైనేడ్‌ను కిల్‌పిల్, సూసైడ్
పిల్, లీథల్ పిల్, అని
కూడా అంటారు.
తీసుకున్న
పరిమాణాన్ని బట్టి (100-200ఎం.జి.) 10 సెకన్లలోపు
కూడా మరణం సంభవిస్తుంది. సైనేడ్ అణువులు రక్తంలోకి చేరిన వెంటనే ఆక్సిజన్‌ను
రక్తం నుండి విడదీసి (ఆక్సి హిమోగ్లోబిన్) మెదడుకు, గుండెకు, శరీరానికి ఆక్సిజన్ అందక వెంటనే మరణం
సంభవిస్తుంది. అందుకే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్, అమెరికా గూఢచార విభాగం సైనేడ్‌ని 'ఆత్మహత్య గుళిక' (లీథల్ పిల్) రూపంలో తయారు చేసి గూఢచారులకు ఇచ్చేవారు. అది చిన్న బఠాని
గింజంత పరిమాణంలో అండాకారంగా వుండి. దాని చుట్టూ పలుచని గాజుతో కూడిన కవర్‌తో
చేయబడేది. దానిలా అత్యంత గాడత కల్గిన పొటాషియం సైనేడ్ ద్రవం వుంటుంది. అది చాలా
సహజంగా నోటిలో ఒక పన్ను రూపంలో అమర్చబడేది. ఒకవేళ ప్రమాదవశాత్తు గూఢచారులు అది
మింగినా దానిగ్లాస్ కోటింగ్ వల్ల జీర్ణం కాకుండా, పగలకుండా మలంతో బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ తమ
గూఢచారులు శతృవులకు దొరికితే వారి రహస్యాలను రాబట్టడానికి చిత్రహింసలు పెడతారు
కావున దాన్నుండి తప్పించుకోడానికి అలాగే తమ దేశ రహస్యాలు బయట పడకుండా వుండటానికి
నోటిలో వున్న సైనేడ్‌ను గట్టిగా కొరికి పగలగొడతారు. వెంటనే సైనేడ్ ద్రావణం
రక్తంలో చేరి క్షణాల్లో మరణం సంభవిస్తుంది. ఇప్పటికీ తీవ్రవాదులు సైనేడ్ పిల్స్‌ని
రకరకాలుగా వారితో వుంచుకుంటున్నారు. శ్రీలంక తమిళ తీవ్రవాదులు (ఎల్టీటీఈ) సైనేడ్
క్యాపుల్స్‌ని మెడలో వేసుకు తిరిగేవారు.
శ్రీమతి జి. స్వరూప రాణి, డి.ఎస్.పి., సి.ఐ.డి., హైదరాబాద్.