యూనిట్
Flash News
నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ
ఎప్పటిమాట.
పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే
ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు చాలాసేపు
మాట్లాడింది అబ్బూరి వరదరాజేశ్వరరావుగారితో. 'లోహిత'నుప్రారంభించినప్పుడు జయ ప్రభతో కలిసి బాగ్‌లింగంపల్లిలోని
ఛాయాదేవిగారింటికి వెళ్ళినపుడు ఆయన గలగలా మాట్లాడుతుంటే ఆవిడ లోపల్నించి తినడానికి
ప్లేటులో అమర్చిన జంతికలో, మురుకులో తెచ్చారు. అంతకుముందు
ఫోటోలో చూసానేమోగానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఆవిడ ముఖంలో ఆవరించి ఉన్న ప్రశాంతత,
మెత్తటి మాట.. నా మనసులో ముద్రపడిపోయింది. ఆరోజు ఆవిడ ఎక్కువగా
మాట్లాడలేదు. ఆయన మాట్లాడారు. పచ్చటి కుటీరంలో ప్రశాంత మూర్తిని చూశాను. ఛాయాదేవి
గారితో నా పరిచయం అలా మొదలైంది. రెండున్నర దశాబ్దాల అనుబంధం. ఎన్ని సార్లు ఆ
ఇంటికెళ్ళానో, ఏమేమి కబుర్లు చెప్పుకున్నామో! కాలింగ్‌బెల్‌తో
సహా ఎంత కళాత్మకంగా ఆ ఇంటిని అలంకరించుకున్నారో ఆ ఇంటికి వెళ్ళగానే కాళ్ళకు
చుట్టుకునే ఆమె పెంపుడు పిల్లులు. తనకి ఇష్టమని ఎక్కడి వెళ్ళినా ఏదో ఒక పిల్లి
బొమ్మని తెచ్చి ఇస్తే ఎంత సంబరపడిపోయేవారో! పిల్లులంటే ఎంత ప్రేమో! భుజానికి ఒక
బ్యాగ్ తగిలించుకుని బాగ్‌లింగంపల్లి రోడ్ల మీద నడయాడిన ఛాయదేవి గారు ఎవ్వరికీ ఏ
పనీ చెప్పేవారు కాదు. పోస్టాఫీసుకి, బ్యాంకుకి, షాప్‌లకి అలా అలవోకగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. వాటర్ బిల్లు,
కరెంటు బిల్లు కట్టడానికి కూడా తనే వెళుతుంటే నాకివ్వండి నేను
కట్టిస్తాను అంటే 'అబ్బే! ఎందుకమ్మా. మీకు శ్రమ నడిస్తే
ఆరోగ్యంకదా!' అని ఏదో ఒక జోక్ వేసేవారు. చాలా తరచుగా
భూమిక ఆఫీసుకు వచ్చేవారు. ఏదో పుస్తకం కావాలని తీసుకునే వారు. ఫోన్ చేసి ఈ
పుస్తకం తెచ్చిపెట్టు అని ఏనాడూ అడగలేదు. తన పనులన్నీ తనే చేసుకోవాలి.
మూర్తీభవించిన ఆత్మగౌరవరూపం. భూమికతో అలరారిన రెండున్నర దశాబ్దాల ఆత్మీయ అనుబంధం.
భూమిక సంపాదక సభ్యులుగా కొనసాగుతూ ఎప్పటికప్పుడు నేనేమీ చేయడం లేదంటూ, నా పేరు తీసేయమంటూ అడిగేవారు. మీరేమీ చెయ్యక్కరలేదు మీరు భూమికకు ఎంతో
చేశారు. భూమిక ఎప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మీరే కదా ఆదుకున్నారు. మీ పేరు
తియ్యం అని నేను పోట్లాడేదాన్ని. కానీ మొన్న మే నెలలో నా పేరు సంపాద వర్గంలో
తీసేయండి. ఇంకెవరినైనా పనిచేసేవాళ్ళని పెట్టుకోండి. ఇది నా రిక్వెస్ట్ ప్లీజ్ నా
మాట వినండి అంటూ బలవంతంగా తన పేరు తీసేయించారు. ఆవిడ అంత గట్టిగా కోరుతుంటే
కాదనలేక పోయాను. పేరు తీసేసినంత మాత్రాన భూమికతో తన అనుబంధం తగ్గిపోతుందా ఏమిటి?
తన లైబ్రరీ అంతా భూమికకే ఇచ్చారు. లైబ్రేరియన్‌గా తన అనుభవాన్ని
రంగరించి కాటలాగ్ ఎలా తయారుచేసుకోవాలో, పుస్తకాలు ఎలా
అమర్చుకోవాలో ఎన్నోసార్లు నేర్పారు. ఆవిడ క్రమశిక్షణలో ఆరోవంతు కూడా నాకు
అలవడకపోవడానికి కారణం నా స్వభావం వల్లనే. ఛాయాదేవిగారితో నా అనుబంధం, నా అనుభవాలు ఈ సంపాదకీయంలో ఎక్కడ ఇముడుతాయి. జ్ఞాపకాలు ఒక దానికి
ఇంకొకటి ఒరుసుకుంటూ కళ్ళ ముందుకొస్తున్నాయి. మనసంతా కిక్కిరిసి పోతోంది.
అక్షరాలుగా అమరాలంటే ఇక్కడ చాలదు. ఓ పుస్తకమే రాయల్సి ఉంటుంది. ఆవిడతో నా
జ్ఞాపకాలు 2012కి ముందు ఆ తర్వాతగా విడిపోయాయి. బాగ్‌లింగంపల్లి
ఇంట్లోను, అన్ని సాహిత్య సమావేశాల్లోను రోడ్ల మీద నడుస్తూ,
తన పనులు చేసుకుంటూ తిరిగిన ఛాయదేవిగారు, అన్నీ వదిలేసి, ఆఖరికి తన జ్ఞాపకాలతో నిండిన
పచ్చటి పొదరిల్లులాంటి ఇంటిని హఠాత్తుగా అమ్మేసి, సి.ఆర్.
ఫౌండేషన్‌లో ఓ గదికి పరిమితమైపోయిన ఛాయదేవి గారుగా నా జ్ఞాపకాలు విడిపోయాయి. కానీ
అది నా భ్రమ మాత్రమే. ఎంతో ప్రేమగా, కళాత్మకంగా
అమర్చుకున్న ఇంటితో బంధాన్ని పుటుక్కున్న తెంపేసుకుని, ఎలాంటి
వేదనని, మానసిక క్షోభని మచ్చుకైనా కనబడనివ్వకుండా తన ఒకే
ఒక గదిని మరింత కళాత్మకంగా అమర్చుకున్న ఛాయదేవి ఎప్పుడూ ఒకేలా ఉన్నారు.
తనెక్కడున్నా ఆ పరిసరాల్ని సజానాత్మకంగా తయారుచేసుకోగల అద్భుతమైన కళాహదయం ఆమెకే
పరిమితం. జిడ్డు కష్ణమూర్తి జీవన తాత్వికతని పుణికిపుచ్చుకుని, తన జీవితంలోకి, తన మార్గంలోకి
అనువదింపచేసుకున్న అపురూప వ్యక్తిత్వం ఆమెకే సొంతం. ఆవిడ కథల గురించి, ఆవిడ సాహిత్యం గురించి, ఆవిడకొచ్చిన అవార్డుల
గురించి నేను రాయబోవడం లేదు. ఆమె సాహిత్యాన్ని తూకం వేసే పని నేను
చెయ్యదలుచుకోలేదు. వ్యక్తిగా, స్ఫూర్తి ప్రదాతగా మాత్రమే
నేను రాయాలనుకుంటున్నాను. చరిత్ర చీకటిలో మరుగున పడిపోయిన భండారు అచ్చమాంబను
వెలుగులోకి తెచ్చింది, నా చేత అచ్చమాంబ జీవిత చరిత్రను
రాయించిందీ ఛాయాదేవిగారే అని మాత్రం సగర్వంగా చెప్పదలచుకున్నాను. ఒకానొక కథా వర్క్
షాప్ రిపోర్ట్‌ని యధాతధంగా యాభైపేజీలు రాసిన ఛాయాదేవి గారు కె. లలిత
ప్రస్తావించిన అచ్చమాంబ కథ గురించి రాయడం, అది చదివి నేను
చాలా ఉత్సాహంగా అచ్చమాంబ గురించి శోధించి ఓ పెద్దవ్యాసం రాయడం, బ్రౌన్ అకాడమీ కోసం పుస్తకం రాయమని ఛాయాదేవి గారు అడగడం ఫలితం,
అచ్చమాంబ 'సచ్ఛరిత్ర పుస్తకర' నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సందర్భం. ఆవిడకు శిరస్సువొంచి
నమస్కరించడం మినహా ఏమి చెయ్యగలను. 2012లో బాగ్‌లింగంపల్లి
నుంచి కొండాపూర్ వెళ్ళిపోయినప్పుడు తనని చూడడానికి వెళ్ళినప్పుడు 'మీ పేరుమీద రెండు ఉత్తరాలు పోస్ట్ చేసాను నిన్ననే. మీరొస్తారని
తెలియదు. తెలిస్తే మీకే ఇచ్చేదాన్ని' అన్నారు. భూమికకు
ఏదైనా కథో, వ్యాసమో రాసి పంపారేమో అనుకున్నాను. కానీ అది
కథకాదు. 'ఈహోమ్‌కి వచ్చాక వాళ్ళు ఒక ఫారమ్ ఇచ్చి పూర్తి
చేయమన్నారు. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే ''మీకు అనారోగ్యం
కలిగినా, ఇంకేమైనా ప్రమాదం జరిగినా వెంటనే మేము
తెలియచేయాల్సిన వ్యక్తి పేరు, ఫోన్, అడ్రస్ రాయమన్నారు. నేను మీ పేరు రాయాలని అనుకున్నాను. ఆ విషయమే మీకు
ఉత్తరం రాశాను'' అన్నారు. ''తప్పకుండా
మీరు నా పేరు రాయండి. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేనొచ్చేస్తాను.'' అని చెప్పాను. చాలా సార్లు ఆ ఉత్తరం చదవాలనుకునేదాన్ని ఇప్పుడెందుకులే
అని విరమించుకునేదాన్ని, ఆవిడ కన్నుమూశాకే ఆవిడిచ్చిన
కవర్ తెరిచాను. ఇప్పుడు నాతోపాటు అందరూ చదివారు. నా మీద ఆవిడకున్న నమ్మకం,
విశ్వాసం, నన్ను తన కూతురుగా భావించిన ఆ
విశాలత్వం నన్ను వివశురాలిని చేశాయి. అందరి సహకారంతో ఆవిడ కోరుకున్న విధంగా ఎలాంటి
కర్మకాండలూ లేకుండా, తన కళ్ళని ఎల్‌వి ప్రసాద్ ఐ
ఆసుప్రతికి, తన పార్థివ శరీరాన్ని వైద్యవిద్యార్థుల
పరిశీలనార్థం ఇఎస్‌ఐ మెడికల్ కాలేజీకి డొనేట్ చేశాం. ఇంక ఆవిడ నా మీద పెట్టిన
పెద్ద బాధ్యత తను రాసిన విధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆయా వ్యక్తులకు అందించడం.
వీలు వెంబడి ఆ పని పూర్తి చేస్తాను. అబ్బూరి ఛాయాదేవి గారితో నాకున్న మానసిక
సాన్నిహిత్యం, అనుబంధం గురించి రాయడానికి ఈ సంపాదకీయం
సరిపోదు. భూమిక సంపాదక సభ్యులుగా తన స్మతికి నివాళిగా మాత్రమే ఇది సరిపోతుంది.
మనందరికీ అత్యంత ఆత్మీయురాలు, గొప్ప మానవీయతతో అలరారే
అద్భుత చైతన్యమూర్తి అబ్బూరి ఛాయాదేవి గారికి నా అశ్రునివాళి.