యూనిట్

ట్రాఫిక్‌లో దారి చూపే స్నేహితులు

పూసిన నగర గుల్మొహర్‌ పూల మీదా పూసిన పట్టణ గులాబీ పూల మీదా, పూసిన పల్లె కనకాంబరపు పూల మీదుగా వాన కురుస్తుంటే మనసంతా వానపువ్వుల సుగంధం కమ్ముకొంటుంటే  వేడి వేడి పొగలు చిమ్మే కాఫీ అరోమాని ఆస్వాదిస్తూ లతనో, రఫీనో, బాలు గారివో పాటలు వింటూ కిటికీ లోంచి కురిసే వానని చూస్తు వానని యిష్టపడకుండా వుండటం అసాధ్యం.

ఆషాఢ మేఘాల తీరే వేరు... వొక్క సారిగా నల్లని మేఘాలు వత్తుగా కురుస్తాయి. తెరలు తెరలుగా గాలి వొక్క వుదుటన వీసీ వీయగానే నేరేడు పళ్ళు సరదాగా నేల రాల్తాయి. పారే వర్షపు నీళ్ళలో నేరేడు పళ్ళు తేల్తూ వాన నీటి రంగునే మార్చేస్తాయి. ఆ చిక్కని వూదా వర్షం కాళిదాసుని, రవీంద్రుల వారిని కదిలించేస్తే ఆ రచనలని మనం ఆషాఢ వర్ష ఛాయల్లో యిప్పటికీ చదువుతూ ఆనంద పడుతూ వానని యిష్టపడకుండా వుండటం అసాధ్యం.

నిలువెల్లా మునకలు వేసే శ్రావణ మాస వాన గుసగుసని వింటూ రాత్రంతా వింటుంటే కలల రేకులు వొకొక్కటిగా కనురెప్పల్ని నెమలీకల మధుత్వంతో నిమురుతుంటే వానని యిష్టపడకుండా వుండటం అసాధ్యం.

మరో వైపు కొండలపైకి సాగే మేఘరాశి గాలుల సంగీతం మనలని అటువైపు లాక్కొంటుంది. కానీ యిలా యిరవై నాలుగు గంటలూ వానాకాలమంతా మనం వానని ఆస్వాదిస్తూ గడపలేం. శ్రావణ మాసం వానలై కురిసినా, రోహిణి  ఏండలై వుక్క పెట్టినా, కార్తీకం చలైనా మునగ దీసుకోమంటున్నా  క్రమం తప్పకుండా  మనం మన పనులని చేసుకోవలసిందే.  తమతమ కర్తవ్యాలని విధులని నిర్వహింఛాల్సిందే కదా.

 వాన పడగానే వూర్లన్నీ మేల్కుని విత్తనాల్ని జల్లే పనిలో పడతాయి. యింటి కప్పులని సరి చేసుకొంటాయి. వేసవిలో పట్టిన ఆవకాయని వేడివేడి అన్నంతో కలిపి యింట్లో వారికి రుచి చూపించాలని స్త్రీలు వెన్నపూసని మరిగిస్తుంటారు. అప్పటి వరకు శెలవులతో ఆటకెక్కిన పలకా బలపం పెన్సిల్‌ నోట్‌ బుక్‌ స్కూల్‌ బ్యాగ్‌ల్లోకి సర్ధుకొంటాయి. ముడుచుకొన్న గొడుగులు విచ్చుకొంటాయి. రెయిన్‌ కోట్‌ బట్టల కొక్కేనికి తగిలిస్తారు. రోడ్లపై సందడి పెరుగుతుంది.

ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వారు కాలమేదైనా యెండనకా వాననకా పని చెయ్యాల్సిందే. అటువంటి విధుల్లో  ట్రాఫిక్‌ పోలీస్‌ విధులు చాల ముఖ్యమైనవి. వానల్లో వీరి పని రెట్టింపు అవుతుంది. దాదాపు రోజంతా బిజీబిజీగా వుండే రోడ్లపై మనం వాహనం నడుపుతున్నా నడుస్తున్నా ఆగే కూడలి దగ్గర మన  చూపులు ఆ కూడలిలో వుండే  ట్రాఫిక్‌ పోలీస్‌  వైపుకి  చూపులు మళ్ళుతాయి.

 

వాహనాలని పంపటం రోడ్డు దాటే వారిని దాటించటానికి  సహాయం చెయ్యటం ఆఫీసులవో ఆసుపత్రులవో, స్కూల్స్‌ వో  వీధులవో యిలా అడ్రస్‌ అడిగే వారికి దారుల ఆనవాలు చెప్పటం వొక్కటా రెండా యిలా అనేక రకాలుగా రోడ్ల మీద మనకి సహాయ పడే ట్రాఫిక్‌ పోలీసులని రోజూ అదే దారమ్మట వెళ్ళే వాళ్ళు బానే గుర్తు పెట్టుకొంటారు. ముఖ్యంగా స్కూల్స్‌ దగ్గర పోలీసులు చిట్టిచిట్టి పిల్లల్ని జాగర్తగా రోడ్‌ దాటించటానికి అవసరమైనప్పుడు ట్రాఫిక్‌ని ఆపి చేసే పనిని యెందరో గుర్తు పెట్టుకొంటారు. పిల్లల్ని తల్లులు రోడ్‌ దాటేటప్పుడు జాగ్రత్త అని చెప్పినప్పుడు పోలీస్‌ అంకుల్‌ వుంటారు అని పిల్లలు తల్లులకి యిచ్చే భరోసా వింటున్నప్పుడు అది విధి నిర్వహణలో భాగమైనా కాకపోయినా సరే వారికి పిల్లల పట్ల వుండే బాధ్యతకి, ఆత్మీయతకి రోజూ మనసులో యెంతోమంది తల్లులు కతజ్ఞతగా  వారిని ఆశీర్వదిస్తూనే కతజ్ఞతలు చెప్పుకొంటుంటారు మనసులో.  

రోడ్‌ మీద యిన్ని రకాల వాహనాలు, వ్యక్తులు మరే దేశంలో కనిపించవు అంటే అతిశయోక్తి కాదు. చాల దేశాల్లో ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ చాలా పటిష్టంగా పనిచేస్తుంటుంది. రోడ్స్‌ మరీ యింత గుంటలు పడి వుండవు. వాన కురిసిన ప్రతిసారి అప్పటికప్పుడు వూర్లలో చెరువులు యేర్పడవు. మేన్‌ హోల్స్‌  పై మూతలు తీసేసి వుండవు. వాననీటి ప్రవాహానికి అనువుగా వున్న దారుల్లో యిళ్ళు షాపింగ్‌ మాల్స్‌ యిలా రకరకాల కట్టడాలు కట్టి కనబడవు. నడిచే వారికి ఫుట్‌ పాత్‌ లు లేని వెడల్పాటి రోడ్స్‌ వుండవు.  వాహనాలు నడిపే వారికీ  ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తుంటారు.

మనకి యిక్కడ యివి యేవి లేక వాన కురిస్తే గంటలుగంటలు రోడ్స్‌ పై యిరుక్కోవాలి... వాన వచ్చినప్పుడు ఆ వానలో తడుస్తూ యీ యిరుకునంతా క్లియర్‌ చేసేది ట్రాఫిక్‌ పోలీసులే.  వాళ్ళు కనిపిస్తే హమ్మయా కాసేపటికైనా యిక్కడ నుంచి బయట పడొచ్చు అనిపిస్తుంది.      

సరే వాన లేనప్పుడైనా ట్రాఫిక్‌  మామూలుగా యీ ట్రాఫిక్‌ కదులుతుందా అంటే అదీ లేదు. ప్రజలకి వాహనాలు నడిపేటప్పుడు వుండాల్సిన క్రమశిక్షణా తక్కువే. వోవర్‌ టేక్‌ని చెయ్యటానికి చాలా యిష్టపడతారు. సహనమూ తక్కువే. హెల్మెట్‌ పెట్టుకోమంటేనే వినరు కానీ స్పీడ్‌ని యిష్టపడతారు. పైగా యిప్పుడు అత్యంత వేగవంతమైన కార్లు, బైక్స్‌ మన రోడ్లకి అవి అనువైనవా కాదా అనే ఆలోచనే లేకుండా పోటీ పడుతూ రోడ్‌ యెక్కాయి. పోటీ అనేది యెప్పుడు యెక్కడ పడాలో తెలీనప్పుడు యిలా రోడ్స్‌ మీదా పోటీ  పడతారేమో... యివి వాళ్లకి యేం కిక్కు  యిస్తుందో వారే చెప్పాలి కానీ సాధారణ మనుష్యులకి అర్ధం కాదు.

 

యిన్ని రకాల వాహనాలు మనుష్యులని ప్రతి రోజూ చూస్తున్న ట్రాఫిక్‌ పోలీస్‌లు వారి చుట్టూ వున్న యీ పరిస్థితుల గురించి యేం అనుకుంటారో కానీ ప్రజలకి వాళ్ళు లేని నగర, పట్టణ రోడ్ల మీద ప్రయాణించటమంటే  ముందుకు కదలటం అసాధ్యంగా అనిపిస్తుంది... అమ్మో అసలా వూహే యిరుగ్గా వుంది...   

 

కుప్పిలి పద్మ

ప్రముఖ తెలుగు రచయిత్రి

హైదరాబాద్‌

వార్తావాహిని