యూనిట్
Flash News
ఎన్‌కౌంటర్ల దర్యాప్తుపై సుప్రీంకోర్టు చెప్పిన 16 సూత్రాలు
పోలీస్ ఎన్‌కౌంటర్లు(ఎదురుకాల్పులు)
జరిగినప్పుడు, వాటి దర్యాప్తు స్వతంత్రంగా, సమగ్రంగా జరగడానికి వీలుకల్పించే ఒక ప్రామాణిక ప్రక్రియను
అనుసరించేందుకు సుప్రీంకోర్టు ఈ కింది మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది.
1. దారుణమైన క్రిమినల్ నేరం
జరగడానికి సంబంధించి నేరస్థుల కార్యకలాపాలు, లేదా వారి
కదలికలకు సంబంధించి ఏదయినా రహస్య సమాచారం లేదా సంకేతాలు పోలీసులకు అందినప్పుడు -
దాన్ని ఏదో ఒక రూపంలో లిఖితపూర్వకంగా (ముఖ్యంగా కేసు డైరీల్లో) లేదా ఎలక్ట్రానిక్
పద్ధతిలో నమోదు చేయాలి. అలా నమోదు చేసేటప్పుడు నేరస్థుడి వివరాలు కానీ, పోలీసులు ఏ ప్రాంతంవైపు వెళ్ళారన్న వివరాలు కానీ తెలపాల్సిన అవసరం లేదు.
ఒకవేళ అటువంటి రహస్య సమాచారం లేదా సంకేతాలు ఒక ఉన్నతాధికారికి అందితే అనుమానితుడి
వివరాలు కానీ, ఆ సమాచారం ఏ ప్రాంతానికి సంబంధించినదని కానీ వివరాలు వెల్లడించకుండా
దాన్ని ఏదో ఒక పద్ధతిలో నమోదుచేయాలి.
2. పైన చెప్పినట్లు ఏదైనా
రహస్యసమాచారం లేదా సంకేతాలు అంది తదనుగుణంగా చర్యలు తీసుకునే క్రమంలో ఎన్‌కౌంటర్
జరిగి, పోలీసు బృందం మారణాయుధాలు ప్రయోగించి తత్ఫలితంగా
ప్రాణనష్టంకూడా జరిగినప్పుడు, ఆమేరకు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలి.
సెక్షన్ 157 కింద ఏ మాత్రం జాప్యం లేకుండా దాన్ని కోర్టుకు
సమర్పించాలి. సెక్షన్ 157 కింద రిపోర్టు
కోర్టుకుసమర్పించినా, 158 కింద నిర్దేశించిన విధివిధానాలను
పాటించాలి.
3. ఆ సంఘటన/ఎన్‌కౌంటర్
విషయంలో సి.ఐ.డి తో కానీ లేదా ఒక పోలీస్ బృందంతో కానీ స్వతంత్ర దర్యాప్తు
జరిపించాలి. ఈ బృందం మరో పోలీస్ స్టేషన్‌కు చెంది ఉండాలి. ఎన్‌కౌంటర్‌లో
పాల్గొన్న పోలీస్ బృందానికి నేతృత్వం వహించిన అధికారికంటే పైస్థాయి అధికారి
పర్యవేక్షణలో దర్యాప్తుబృందం ఏర్పడాలి. దర్యాప్తు బృందం
మిగిలిన వాటితోపాటూ ఈ కింద తెలిపిన కనీస జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎ) బాధితుడిని
గుర్తించడానికి బాధితుడి కలర్ ఫొటోలు తీసుకోవాలి.
బి) మరణానికి
సంబంధించి నెత్తురుతో తడిసిన మట్టి, వెంట్రుకలు, ఫైబర్, దారాలతో సహా అన్ని సాక్ష్యాధారాలను
సేకరించాలి, భద్రపరచాలి.
సి) మరణానికి
సంబంధించిన స్టేట్‌మెంట్ (వాఙ్మూలం)తీసుకోవడానికి, ఎన్‌కౌంటర్
సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల(ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్ సిబ్బందితోసహా) పూర్తి
పేర్లు, చిరునామా, టెలిఫోన్ నంబర్లు
సేకరించాలి.
డి) ప్రాణనష్టం
జరగడానికి దారితీసిన కారణాలు, వైఖరులు, ప్రదేశం, మరణ సమయం, ఇతరత్రా
మరణానికి కారణమైన పద్ధతులను గుర్తించడానికి సంఘటన ప్రదేశం వివరాలు తెలిపేవిధంగా ఒక
స్కెచ్ (రేఖాచిత్రం) సాధ్యమైతే ఫొటో/వీడియో చిత్రీకరణ, వస్తు
సంబంధ సాక్ష్యాధారాలతోసహా).
ఇ) చనిపోయిన
వ్యక్తి వేలిముద్రలు రసాయన పరీక్షకుపంపేలా జాగ్రత్తపడాలి. ఇంకా ఇతరత్రా
వేలిముద్రలేవయినా ఉంటే గుర్తించి, అభివృద్ధి చేసి వాటిని
కూడా రసాయన పరీక్షకు పంపాలి.
ఎఫ్) శవపరీక్షను
జిల్లా ఆస్పత్రికి చెందిన ఇద్దరువైద్యులు నిర్వహించాలి. వీరిలో ఒకరు వీలయినంతవరకు
జిల్లా ఆస్పత్రి అధిపతి లేదా ఇన్‌చార్జి డాక్టర్ అయి ఉండాలి. శవపరీక్షను వీడియో
తీసి భద్రపరచాలి.
జి) తుపాకులవంటి
ఆయుధాలు, క్షిపణులు, తూటాలు, కార్‌ట్రిడ్జ్ కేసులవంటి సాక్ష్యాధారాలు సేకరించి భద్రపరచాలి. పేలిన
తూటాల అవశేషాల, ట్రేస్‌మెటల్ ఆచూకీ పరీక్షలు నిర్వహించాలి.
హెచ్) మరణానికి
కారణాలు-అది సహజమరణమా, ప్రమాదం వల్ల జరిగిందా, ఆత్మహత్యా, హత్యా అనేది తేల్చాలి.
4. పోలీస్ కాల్పుల్లో జరిగిన
అన్ని మరణాల్లో తప్పనిసరిగా సెక్షన్ 176 కింద మేజిస్టీరియల్
దర్యాప్తు జరపాలి. సెక్షన్ 190 పరిధిలోకి వచ్చే
జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు దర్యాప్తు నివేదిక అందచేయాలి.
5. స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తుపై గాఢమైన అనుమానాలుంటే తప్ప జాతీయ మానవ హక్కుల
సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సి) జోక్యం అవసరం ఉండదు. అయితే సదరు సంఘటన సమాచారాన్ని ఏ మాత్రం
జాప్యంలేకుండా సందర్భాన్నిబట్టి ఎన్‌హెచ్‌ఆర్‌సి కి లేదా దాని రాష్ట్ర్ర సంఘానికి
చేరవేయాలి.
6. గాయపడిన
నేరస్థుడికి/బాధితుడికి వైద్యచికిత్స చేయించాలి. అతని వాఙ్మూలాన్ని మేజిస్ట్రేట్, ఫిట్‌నెస్
సర్టిఫికేట్‌ను వైద్యాధికారి తీసుకోవాలి.
7. ఎఫ్.ఐ.ఆర్, డైరీ ఎంట్రీలు, పంచనామా, స్కెచ్‌లవంటివి
సంబంధిత కోర్టులకు పంపడంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా జాగ్రత్తపడాలి.
8. ఈ సంఘటన మీద పూర్తి
దర్యాప్తు జరిగిన తరువాత,సెక్షన్ 173
కింద సంబంధిత న్యాయస్థానానికి నివేదిక పంపాలి. దర్యాప్తు అధికారి చార్జిషీటు
సమర్పించిన అనంతరం విచారణ త్వరగా ముగించాలి.
9. ప్రాణనష్టం జరిగిన
సందర్భాలలో చనిపోయిన నేరస్థుడి తాలూకు కుటుంబ సభ్యులకు వీలయినంత త్వరగా సమాచారం
అందించాలి.
10. పోలీస్‌కాల్పుల్లో
ప్రాణనష్టం జరిగిన సందర్భాల్లో డిజిపిలు ఆర్నెల్లకు ఒకసారి స్టేట్‌మెంట్‌లు
తయారుచేసి ఎన్‌హెచ్‌ఆర్‌సి కి పంపాలి. అంటే ప్రతిసంవత్సరం జనవరి 15, జులై 15నాటికల్లా ఆ నివేదికలు తప్పనిసరిగా సంఘానికి
అందేలా చూడాలి. శవపరీక్ష, దర్యాప్తు నివేదికలతోపాటూ కింది
అంశాలు కూడా ఆ ఆర్నెల్ల-నివేదికలో ఉండాలి.
ఱ. సంఘటన
జరిగిన తేదీ, ప్రదేశం
ఱఱ. సంఘటన
జరిగిన పోలీస్ స్టేషన్‌పరిధి, జిల్లా
ఱఱఱ. ప్రాణ
నష్టానికి దారితీసిన పరిస్థితులు
ఎ) ఎన్‌కౌంటర్‌కు
స్వీయ సమర్ధన
బి) అక్రమంగా
గుమిగూడిన గుంపును చెదరగొట్టే క్రమంలో
సి) అరెస్ట్
చేసే క్రమంలో
ఱఙ. సంఘటనకు
సంబంధించిన వాస్తవాలు-క్లుప్తంగా
ఙ. క్రిమినల్
కేసు నంబరు.
ఙఱ. దర్యాప్తు
సంస్థ
ఙఱఱ. మేజిస్టీరియల్
దర్యాప్తులో, సీనియర్ అధికారుల దర్యాప్తులో వెల్లడైన అంశాలు
ఎ) ముఖ్యంగా
మరణానికి బాధ్యులుగా తేలిన పోలీస్ సిబ్బంది పేర్లు, వారి
హోదాల వెల్లడి.
బి) బలప్రయోగం
సమర్దనీయమేనా? అలాగే తీసుకున్నచర్య చట్టబద్ధమేనా ?
11. దర్యాప్తు ముగిసిన తరువాత
ఒకవేళ లభించిన సాక్ష్యాధారాలనుబట్టి మారణాయుధం వల్లనే మరణించినట్టు తేలితే ఐపిసి
కింద నేరమవుతుంది. కాబట్టి సంబంధిత అధికారిపై క్రమశిక్షణ
చర్యలు ప్రారంభించాలి. సదరు అధికారిని సస్పెండ్ చేయాలి.
12. పోలీస్ ఎన్‌కౌంటర్లో
చనిపోయిన మృతుడి కుటుంబ సభ్యులకు చెల్లించే నష్టపరిహారం విషయంలో సెక్షన్ 357-ఎ లో పేర్కొన్న పథకాన్ని అమలుపరచాలి.
13. రాజ్యాంగంలోని 20వ అధికరణ కింద పేర్కొన్న హక్కులకు లోబడి దర్యాప్తు
బృందం ఆదేశాలమేరకు సంబంధిత అధికారులు వారి ఆయుధాలను ఇతరత్రా సామాగ్రితో సహా
ఫోరెన్సిక్, బాలిస్టిక్ పరీక్షలకోసం అప్పగించాలి.
14. సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని
సదరు పోలీస్ కుటుంబానికివిధిగా తెలియపరచాలి. ఒకవేళ ఆయన కుటుంబం
న్యాయవాది/కౌన్సిలింగ్ సేవలను కోరితే వారికి అవి అందే ఏర్పాటు చేయాలి.
15. సంఘటన జరిగిన వెంటనే సదరు
అధికారులకు తక్షణం సాహస అవార్డులను, ఔటాఫ్ టర్న్ ప్రమోషన్‌లను
ప్రకటించకూడదు. ఏదిఏమయినా సంబంధిత అధికారుల సాహసం అనుమానాలకు అతీతంగా
ధృవపడినప్పుడు మాత్రమే అటువంటి రివార్డులు ఇవ్వాలి లేదా సిఫార్సు చేయాలి.
16. పైన తెలిపిన ప్రక్రియ ఏదీ అనుసరించలేదని, స్వతంత్ర దర్యాప్తు కొరవడిందని, ప్రస్తుత దర్యాప్తు దుర్వినియోగమయిందని, దర్యాప్తు బృందం సభ్యులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని మృతుడి కుటుంబం భావించినట్లయితే సంఘటన జరిగిన ప్రాంతం పరిధి లోని సెషన్స్ జడ్జికి ఫిర్యాదుచేయవచ్చు. అటువంటి ఫిర్యాదు అందిన తర్వాత - సెషన్స్ జడ్జి ఆ ఫిర్యాదులోని నిజానిజాలు పరిశీలించి, వారు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి.