యూనిట్

ప్రజలకు మరింత చేరువవుతున్నాం

రాష్ట్ర డిజిపి శ్రీ ఆర్‌పి ఠాకుర్‌గారి ప్రత్యేక చొరవతో హోం మంత్రి శ్రీ యన్‌. చినరాజప్పగారి సంపూర్ణ సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో హెడ్‌ కానిస్టేబుల్‌, ఏఎస్‌ఐ ప్రమోషన్స్‌కు ముఖ్యమంత్రి శ్రీ యన్‌. చంద్రబాబు నాయుడుగారు ఆమోదం తెలిపి ఆచరణ సాధ్యం చేశారు. దీనితో రాష్ట్ర పోలీసు శాఖలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఇందుకుగాను ముఖ్యంత్రి గారికి పోలీసు శాఖ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తమ కృతజ్ఞతలను తెలియజేసుకుంది. పదోన్నతులు స్వీకరించిన సిబ్బంది అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ఆపదలో ఉన్న మహిళల రక్షణ ప్రధాన ధ్యేయంగా చిత్తూరు పోలీసులు రూపొందించిన 'ప్రాణ రక్ష' యాప్‌ను ముఖ్యంత్రి శ్రీ యన్‌. చంద్రబాబు నాయుడుగారు ఆవిష్కరించారు. ఈ యాప్‌ సహాయంతో రద్దీ కూడళ్ళు, ప్రమాద భరిత స్థలాలు, రహదారుల స్థితిగతులు, వాహనదారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అదే విధంగా ఆపదలో ఉన్న మహిళలుకూడా పోలీసువారి వద్దనుండి ఈ యాప్‌ ద్వారా తక్షణ సహాయం పొందే అవకాశం ఉంది. సాంకేతికతను అందిపుచ్చుకుని అన్వయించుకొనడంలో రాష్ట్ర పోలీసులు ముందంజలో ఉంటారనడానికి ఇది మరో నిదర్శనం.

బాలికలు, మహిళల సంరక్షణకు పోలీసు శాఖ ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా గుంటూరు రూరల్‌ ఎస్పీ రాజశేఖర్‌ బాబు 'సబల మేలుకొలుపు' కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 300 మంది కళాకారులు విద్యార్థులతో కలిసి లఘునాటికలు, మూకీ నాటికల ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు ఆధ్వర్యంలో రూపొందించబడిన 'హిత సంహిత' పుస్తకం వెయ్యి ప్రతులను జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ పుస్తకం ద్వారా బాలికలు, మహిళల రక్షణ చట్టాలు మరియు ఇతర సంబంధిత అంశాలపై విద్యార్థులు సులభంగా అవగాహన ఏర్పరచుకునే సౌలభ్యం ఉంటుంది. 

విశాఖ సిటీ పోలీస్‌ కమీషనర్‌ మహేష్‌ చంద్ర లడ్హా నూతన సంవత్సర వేడుకలను విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. అదే విధంగా విశాఖ రూరల్‌ ఎస్పీ అట్టాడ బాబూజీ జి.మాడుగుల ఆశ్రమపాఠశాల మైదానంలో గిరిజన విద్యార్థులకు వాలీబాల్‌ పోటీలు నిర్వహించి విజేతల జట్లకు రూ. 50,000, 15,000, 10,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. విజయనగరం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న 2009 బ్యాచ్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్స్‌ తమ 9 సంవత్సరాల సర్వీసు పూర్తయిన సందర్భానికి గుర్తుగా రూ. 50,000లను అత్యాచార బాధితురాలైన మైనర్‌ బాలికకు ఎస్పీ జి. పాలరాజు చేతుల మీదుగా అందజేశారు. 

ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు మన పోలీస్‌ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడానికి దోహదంచేస్తున్నాయి.

వార్తావాహిని