యూనిట్
Flash News
సమన్వయంతో సమర్థవంతమైన సేవలు...
క్రమబద్ధమైన పర్యవేక్షణ
లోపిస్తే పసిహృదయాలు కూడా ఎంతగా మొండి బారతాయో తెలియజేసే విషాదఘటన కృష్ణా జిల్లా
చల్లపల్లి బిసి వసతి గృహంలో చోటు చేసుకుంది. తన తల్లిని దూషించాడన్న నెపంతో మూడో
తరగతి విద్యార్ధిని పదో తరగతి విద్యార్ధి దారుణంగా హతమార్చాడు. రాత్రి సమయంలో తన
బకెట్ పోయింది వెతుకుదామని బాత్‌రూంకు తీసుకు వెళ్ళి, పెన్సిల్ చెక్కే చాకుతో మెడపై తీవ్రంగా గాయపర్చి చంపాడు. చాకు కడిగి,
దుస్తులు మార్చుకుని ఏమి తెలియని వాడిలా నిద్రపోయాడు. ఉదయం అప్పుడే
తనకు ఈ విషయం తెల్సినట్లుగా ప్రవర్తించాడు. సునిశిత పరిశోధనతో బాలుడు పట్టుబడడంతో
పాటు, హత్యలోను, హత్యానంతర
పరిణామాలలోను ఇంటర్నెట్ ద్వారా బాలుడు గ్రహించిన నేర పరిజ్ఞానం అన్వయించడం
పోలీసులను దిగ్బ్రాంతి పర్చింది. ఈ దుర్ఘటన బాల్య, కౌమార
దశల్లో వున్నవారిపై సోషల్ మీడియా దుష్ప్రభావాన్ని హెచ్చరింపజేస్తుంది.
కృష్ణానది
ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజికి పెద్ద ఎత్తున వరద
పోటెత్తింది. ప్రమాద భరిత స్థాయికి చేరడంతో బ్యారేజ్ నుండి దిగువకు నీరు వదలడం
జరిగింది. దీనితో అవనిగడ్డ, నాగాయలంక, శ్రీకాకుళం, పాపనాశనం, గోగినేనిపాలెం
తదితర పరీవాహక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. పోలీస్ శాఖ, రెవిన్యూ, నీటిపారుదల శాఖల సమన్వయంతో ముందుగానే
తీసుకున్న జాగ్రత్తలు, చేపట్టిన సంరక్షణ చర్యల వల్ల ప్రాణ
నష్టం, భారీ ఆస్తి నష్టం నివారించబడింది. ఇందుకు ఎంతగానో
శ్రమించిన ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ఆధ్వర్యంలోని కృష్ణా జిల్లా పోలీసులను ప్రజలు ప్రశంసించారు.
అనంతపురం
జిల్లా ఎస్పీ బి. సత్యయేసుబాబుకు 'ఫిక్కీ
స్మార్ట్ పోలీసింగ్ - 2019' అవార్డు దక్కింది. గతంలో
ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించిన సమయంలో అవలంబించిన నూతన సాంకేతిక
విధానాలకు గాను ఈ అవార్డు వరించింది. ప్రస్తుతం సి.ఐ.డిలో పనిచేస్తున్న ఎస్పీ
జి.వి.జి. అశోక్ కుమార్ లోగడ అనంతపురం జిల్లా ఎస్పీగా పంచసూత్రాలు అమలు
పర్చినందుకు గాను 'స్పెషల్ జ్యూరీ' అవార్డు
దక్కించుకున్నారు. ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ)
సంస్థ వారు ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రీ జితేంద్ర సింగ్
గారి చేతుల మీదుగా ఇరువురు అవార్డులను అందుకున్నారు. పోలీస్ విధులలో సాంకేతికతకు,
వినూత్నతకు పెద్దపీట వేయడం ద్వారా జాతీయ స్థాయి పురస్కారం పొందిన
వీరిరువురికి అభినందనలు తెలియజేస్తున్నాను.
విజయవాడ
నగర పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తులసి చైతన్య చైనాలోని 'చెంగ్‌డూ' లో జరిగిన 18వ
అంతర్జాతీయ 'పోలీస్ ఫైర్ గేమ్స్ - 2019' స్విమ్మింగ్ క్రీడాంశంలో విశేష ప్రతిభ కనబర్చాడు. ట్రైయాథ్లాన్ జెట్
విభాగంలో బంగారు పతకం, ఇతర విభాగాలలో రెండు వెండి పతకాలు
మూడు కాంస్య పతకాలు సాధించి రాష్ట్ర పోలీస్ ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై సగర్వంగా
చాటాడు. గతంలో కూడా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ విజయాలను
సాధించిన తులసి చైతన్య భవిష్యత్తులో మరిన్ని క్రీడా ఖ్యాతులు అందుకోవాలని
ఆకాంక్షిస్తూ, అభినందిస్తున్నాను.