యూనిట్
Flash News
నూతన అధ్యాయాన్ని లిఖిస్తున్న పోలీసు హౌసింగ్ కార్పొరేషన్
రాష్ట్ర పోలీసు శాఖ నిర్మాణాలను
చేపట్టడానికి ఆవిర్భవించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నేడు ఇతర ప్రభుత్వ శాఖల
భవనాలను కూడా సమర్థవంతంగా నిర్మిస్తూ నూతన అధ్యాయాన్ని లిఖిస్తున్నది. నలభైయేళ్ళ
సుదీర్ఘ ప్రస్థానం ఉన్న కార్పొరేషన్ వార్షిక పనుల విలువ గతంలో ఏడాది గరిష్టంగా 250 కోట్లు ఉండగా ప్రస్తుతం అది 1,750 కోట్లకు చేరుకొని
సరికొత్త రికార్డును నెలకొల్పింది. సంస్థ పనితీరు మెచ్చి సాంఘిక సంక్షేమ శాఖ,
పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్
అంధ్రప్రదేశ్, శ్రీ వెంకటేశ్వర, శ్రీ
పద్మావతి మహిళా, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ, ఆచార్య యన్‌జి రంగా విశ్వవిద్యాలయాలతోపాటుగా ఇతర ప్రభుత్వ శాఖలు మన సేవలు
వినియోగించుకుంటున్నాయి. కార్పొరేషన్ ఉన్నతికి కారకులైన ఉద్యోగులకు చాలా కాలంగా
పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించడమైనది. అదే విధంగా ఔట్ సోర్సింగ్
సిబ్బందికి ఎక్కడా లేని విధంగా భీమా సౌకర్యాన్ని కల్పించి డిజిపి శ్రీ డి. గౌతమ్
సవాంగ్ గారి చేతుల మీదుగా బాండ్‌లను అందజేశాము. కార్పొరేషన్ పురోభివృద్ధికి,
సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న డిజిపి గారికి
సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
సత్వర స్పందనతో
కేసులు ఎలా పరిష్కారమౌతాయో తిరుపతిలో జరిగిన చిన్నారి కిడ్నాప్ ఉదంతం
తెలియజేస్తుంది. స్థానిక సినిమా హాల్ కాంప్లెక్స్‌లో పనిచేసే దంపతుల మూడేళ్ళ
బాలికను గుర్తుతెలియనివారు కిడ్నాప్ చేశారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన
పోలీసులు కమాండ్ కంట్రోల్ ద్వారా ఆ కాంప్లెక్స్ పరిసరాల సిసి టివీ పుటేజిలు
పరిశీలించారు. 30-35 సంవత్సరాల వయస్సుగల వ్యక్తి చిన్నారిని కిడ్నాప్
చేసి బస్టాండ్‌కు తీసుకువెళ్ళి చిత్తూరు బస్ ఎక్కినట్లుగా గుర్తించారు. వెంటనే
అనుమానితుని గురించి చిత్తూరు పోలీసులకు తెలియజేసి, ప్రింట్,
ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలలో కూడా విరివిగా ప్రచారం
చేశారు. పోలీసువారి గాలింపు చర్యలకు భయపడి కిడ్నాపర్ చిత్తూరు 1వ టౌన్ పరిధిలో బాలికను వదిలిపెట్టి పారిపోయాడు. స్థానిక పోలీసుల సహాయంతో
బాలికను కిడ్నాప్ అయిన ఆరు గంటలలోనే తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఎస్పీ అంబురాజన్
మరియు వారి సిబ్బంది పనితీరు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
తూర్పు గోదావరి
జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడి కరకట్ట దిగువలో ఉన్న కాజ్ వే పై వరద ఉద్ధృతంగా
రావడంతో నడిచి వెళుతున్న ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. ఇద్దరు యువకులు
గల్లంతవగా స్థానిక పోలీస్ కానిస్టేబుల్ సూరిబాబు సాహసోపేతంగా ప్రవాహంలోకి దూకి
ఒక యువకుడిని కాపాడాడు. ప్రాణాలకు తెగించి మరొకరి ప్రాణాలను కాపాడిన సూరిబాబును
స్థానికులు, తోటి సిబ్బంది మరియు ఉన్నతాధికారులు
అభినందించారు.
సోషల్ విూడియా ద్వారా పుకార్లను, అసభ్య సందేశాలను ప్రచారం చేసేవారు పోలీస్ చర్యలకు గురికాకతప్పదని 'తిరుమల కొండపై అన్యమత నిర్మాణాలు' ఉదంతం తెలియజేస్తుంది. తిరుమల కొండపై అన్యమత మందిరాలు వెలిశాయని సోషల్ విూడియాలో అసత్యాలను ప్రచారం చేసిన ముగ్గురు యువకులను తిరుపతి పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు. పుకార్లను సృష్టించేవారు మాత్రమే కాకుండా వాటిని ఇతరులకు పంపించి ప్రోత్సహించేవారు కూడా శిక్షార్హులవుతారన్న వాస్తవాన్ని ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా వీటికి అడ్డువేయగలము.