యూనిట్
Flash News
'కర్తవ్య' నిర్వహణ దిశగా పోలీసు అడుగులు...
'సురక్ష'
38 వసంతాలు పూర్తి చేసుకుని 39వ వసంతంలోకి అడుగిడుతున్నందుకు
సంతోషిస్తున్నాను. గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్, గౌరవ ముఖ్యమంత్రివర్యులు, హోంశాఖమంత్రివర్యులు, రాష్ట్ర డిజిపిగారు సురక్షకు శుభాకాంక్షలు
తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మున్ముందు 'సురక్ష' పత్రిక మరింత అభివృద్ధి దిశగా పయనించి, పాఠకులకు మరింత విజ్ఞానాన్ని అందిస్తామని హామీ
ఇస్తున్నాను.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని
జిల్లాల పోలీసులు ప్రశంసాత్మక సేవలు అందిస్తున్నారనడంలో సందేహం లేదు. ఇందుకు
మచ్చుకు కొన్ని సందర్భాలు.. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని
చాలా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రం
వరదలో చిక్కుకుంది. సహాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్న తరుణంలో జిల్లా ఎస్.పి.
భూసారపు సత్యయేసుబాబుకు సమాచారం అందింది. వెంటనే స్వయంగా తన బృందంతో రంగంలోకి దిగి
ఇళ్ళపైకి చేరి శరణార్థులుగా మిగిలిపోయిన 400 నుంచి 500 కుటుంబాలను రక్షించడమే కాకుండా, వారికి ఆశ్రయం కల్పించడం అభినందనీయం. ఇలాంటి
చర్యలతోనే పోలీసు ఇమేజ్ మరింత ఇనుమడింపచేస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా 'పోలీసు అమరవీరుల' సంస్మరణ దినం సందర్భంగా సమాజంలో పోలీసు పాత్రపై
ప్రజలకు తెలియజేసేందుకు ర్యాలీలు, ఓపెన్‌హౌస్‌లు, రక్తదాన శిబిరాలు, మారథాన్‌లు నిర్వహించి అందులో ప్రజలను
భాగస్వామ్యం చేయడంలో సఫలీకృతులయ్యామని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల
సంక్షేమం, తక్షణ న్యాయం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'స్పందన' కార్యక్రమాన్ని మన పోలీసు శాఖ తు.చ. తప్పకుండా
పాటిస్తూ ప్రజలకు మరింత చేరువయిందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇందుకు కడప
జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఉదాహరణ. జిల్లాలోని రాజంపేటకు చెందిన ఓ బాలింత 'స్పందన' కార్యక్రమంలో ఎస్.పి.గారితో తమ సమస్యను చెప్పుకునేందుకు
పురిటి నొప్పులు లెక్కచేయకుండా వారి కార్యాలయం చేరుకుంది. వెంటనే స్పందించి ఎస్.పి.
కే.అన్బురాజన్ బాధితురాలు కూర్చున్నచోటుకే వచ్చి ఆమె సమస్యలను స్వయంగా
తెలుసుకున్నారు. ఓబులవారి పాలెం మండలం, కాకర్లవారి
పల్లెకు చెందిన తాను మగబిడ్డకు జన్మనిచ్చానని, తన
అత్తమామలు తన బిడ్డను తీసుకొని, తనను
పుట్టింటికి పంపించివేశారని తన ఆవేదనను ఎస్.పి.ముందు విన్నవించింది. వెంటనే రాజంపేట డిఎస్‌పికి ఫోన్‌చేసి
తక్షణమే ఈమె సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అంతేకాదు స్వయంగా పోలీసు వాహనంలో
ఆమెను స్వగృహానికి చేరవేశారు. ఎస్.పి. ఆదేశాలతో డిఎస్‌పి నారాయణస్వామి రెడ్డి
అత్తమామలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి, బిడ్డను
తల్లిచెంతకు చేర్చి, అందరూ
కలిసి మెలసి ఉండాలని వారికి సూచించారు.
విశాఖలో జరిగిన అమరవీరుల
సంస్మరణంలో గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌గారు
కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని పోలీసుల సేవలను కొనియాడడం మాకు ఎంతో
స్ఫూర్తిదాయకమని భావిస్తున్నాం. పోలీసు సేవలను, అమరవీరులను
గుర్తుచేసుకుంటూ ర్యాలీ నిర్వహించడంతో పోలీసు శాఖ గవర్నర్‌గారికి కృతజ్ఞతలు
తెలియజేస్తోంది.
చివరగా 39వ వసంతంలోకి అడిగుడుతున్న 'సురక్ష'కు
పోలీసు కుటుంబ సభ్యులు, పాఠకుల
ఆదరాభిమానాలు చిరస్థాయిగా నిల్చుంటాయని భావిస్తున్నాను.