యూనిట్

స్ఫూర్తిదాయక విధులతోనే ప్రేరణ

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం తొలిదశలోనే మన రాష్ట్ర ఎన్నికలు పూర్తి కానున్నాయి. అతి తక్కువ సమయంలో ఎన్నికలను సజావుగా, క్రమబద్ధంగా నిర్వహించుటకు డిజిపి దిశానిర్దేశంలో ప్రతి ఒక్కరూ నిర్విరామ కృషి సల్పుతున్నారు. ఈ ఎన్నికల విధులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఏప్రిల్‌ 11న జరిగే పోలింగ్‌ను  స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వర్తించి తదుపరి ఎన్నికలకు ఉత్తేజభరిత ప్రేరణగా నిలుద్దాం. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని జిల్లాల్లో ర్యాలీలు, సభలు, సమావేశ కార్యక్రమాలు ఉత్సాహభరితంగా నిర్వహించాము. పోలీసు ప్రధాన కార్యాలయంలో 

 డిజిపి దంపతుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ వేడుకలలో మన శాఖలో ప్రతిభావంత విధులు నిర్వర్తిస్తున్న మహిళా మూర్తులతోపాటుగా సమాజంలో విభిన్న రంగాలలో రాణిస్తున్న వారిని సత్కరించి మనకర్తవ్యం నిర్వర్తించాము. 

అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో చిన్నారి కిడ్నాప్‌ ఉదంతం తీవ్ర కలకలం రేకెత్తించింది. తమిళనాడుకు చెందిన దంపతుల మూడు నెలల చిన్నారిని గుర్తుతెలియని వారు అపహరించారన్న ఫిర్యాదు అందగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. లోగడ ఘటనల దృష్ట్యా తిరుపతి అర్బన్‌ ఎస్‌.పి. అన్బురాజన్‌ వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించడం, ఇతర సాంకేతిక అంశాల సహాయంతో 24 గంటల్లోనే నేరానికి పాల్పడిన నిందితురాలిని అదుపులోనికి తీసుకొని చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రజల భద్రత పరంగా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుతున్న తిరుపతి పోలీసుకు అభినందనలు తెలుపుతున్నాను. 

ఆలిండియా పోలీస్‌ ఆక్వాటిక్‌, క్రాస్‌ కంట్రీ ఛాంపియన్‌ షిప్‌ విశాఖపట్నంలో ఐదురోజుల పాటు ఉత్సాహభరితంగా జరిగింది. రాష్ట్ర డిజిపి  గారు సతీసమేతంగా ఈ క్రీడల ముగింపు కార్యక్రమానికి విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌ బిఎస్‌ఎఫ్‌, స్టేట్‌ ఛాంపియన్‌షిప్‌ను కేరళ పోలీస్‌, క్రాస్‌ కంట్రి విభాగంలో సిఆర్‌పిఎఫ్‌ జట్లు విజేతలుగా నిలిచాయి. కేరళకు చెందిన సజ్జన్‌ ప్రకాశ్‌ బెస్ట్‌ స్విమ్మర్‌గా ట్రోఫీ దక్కించుకున్నారు. నగర పోలీస్‌ మరియు ఏపీఎస్‌పి పోలీసుల సంయుక్త భాగస్వామ్యంలో ఈ ఛాంపియన్‌షిప్‌ను దిగ్విజయంగా నిర్వహించారు. 

విశాఖ రూరల్‌ పోలీసువారు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గిరిజన యువతతో మమేకమై వివిధ సన్నిహిత కార్యక్రమాలు చేపట్టి వారి అభిమానం చూరగొంటున్నారు. డుంబ్రిగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 'యువహో' మెగా వాలీబాల్‌ టోర్నమెంట్‌ను నిర్వహించారు. సుమారు వంద జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో మొదటిస్థానం పొందిన జట్టుకు రూ.30వేలు, రెండవస్థానం పొందిన జట్టుకు రూ.20వేలు, మూడవ స్థానం పొందిన జట్టుకు రూ.10వేలు ఫ్రైజ్‌మనీగా బహూకరించారు. పోలీసు అందిస్తున్న ప్రోత్సాహంతో గిరిజన యువత తమ ఖాళీ సమయాన్ని క్రీడలకు కేటాయించడం ద్వారా సమాజ వ్యతిరేక పంథాకు దూరంగా ఉంటున్నారు. 

 

వార్తావాహిని