యూనిట్
Flash News
సత్వర స్పందనతో మెరుగైన విధులు
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన
ఒంగోలు బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితులను గంటల వ్యవధిలోనే ప్రకాశం
పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. మొత్తం ఆరుగురిలో ముగ్గురు మైనర్ బాలురు
కావడం ఆందోళన కలిగించే విషయం. ఒక వ్యక్తిని కలవడం కోసం ఒంగోలు వచ్చిన బాలికను, సహాయపడే
నెపంతో వీరు వశపరుచుకొని ఈ దారుణానికి ఒడిగట్టారు. నేరం వెలుగుచూసిన తక్షణమే
స్పందించి నిందితులను అరెస్టుచేయడం అభినందనీయమే అయినప్పటికీ, ఈ ఘటన సమాజంలో యువత నడవడికపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను
తెలియజేస్తున్నది.
పాస్‌పోర్టు
వెరిఫికేషన్‌లో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ.. ఆదర్శసేవలు అందిస్తుందన్నందుకు
గాను రాష్ట్ర పోలీసు శాఖకు కేంద్ర ప్రభుత్వ విశిష్ట పురస్కారం దక్కింది. కేవలం
మూడు రోజుల్లోనే పాస్‌పోర్టు వెరిఫికేషన్లను సత్వర వేగం, పారదర్శకతతో
పూర్తిచేస్తున్నందుకు ఈ గౌరవం వరించింది. న్యూఢిల్లీలో విదేశాంగ వ్యవహారాల
మంత్రిత్వ శాఖవారు పాస్‌పోర్ట్ అధికారులతో కలిసి నిర్వహించిన 'సేవా దివస్ 2019' కార్యక్రమంలో ఈ అవార్డును
బహుకరించారు. రాష్ట్ర పోలీసుశాఖ తరఫున గుంటూరు రూరల్ ఎస్.పి. శ్రీమతి ఆర్. జయలక్ష్మీ
ఈ పురస్కారాన్ని గౌరవ విదేశాంగ మంత్రి డాక్టర్ శ్రీ ఎస్. జయశంకర్ గారి
చేతులమీదుగా స్వీకరించారు. ఇది అంతకంతకు పురోగతిసాధిస్తున్న మన పోలీసుశాఖ
నైపుణ్యానికి, పనితీరుకు దర్పణంగా నిలుస్తున్నది.
నెల్లూరు
ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోజు వయసు గల మగ శిశువు అపహరణ ఉదంతం కలకలం సృష్టించింది.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసు బృందాలు నగరంలోని అన్ని మార్గాలలో
ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఆస్పత్రిలోని సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించిన
మీదట కోవూరుకు చెందిన ఇరువురు మహిళలను నిందితులుగా గుర్తించారు. రెండు గంటల
వ్యవధిలోనే వారిని అదుపులోనికి తీసుకొని బిడ్డను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
మరో ఘటనలో దైవదర్శనార్థం తాడిపత్రి వచ్చిన కర్నాటక దంపతుల నాలుగేళ్ళ బాలుడు
బస్టాండులో తప్పిపోయాడు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు
వెంటనే అన్ని దిశల్లో గాలింపులు చేపట్టి, గంటలోనే బాలుడిని
తల్లిదండ్రులకు అప్పగించారు. సత్వరం స్పందించి తగు చర్యలు చేపట్టడం వలన ఇద్దరు
బాలురు తమ కుటుంబాలతో ఆనందాలను పంచుకుంటున్నారు. ఇటువంటి బాధ్యతాయుత విధులే
ప్రజలలో మన ప్రతిష్ట ఇనుమడించడానికి దోహదం చేస్తాయి.
సుదీర్ఘకాలంగా మనం ఎదురుచూస్తున్న 'వారాంతపు సెలవు' సౌలభ్యం అమలులోనికి రావడంతో పోలీసు కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారికి, హోంశాఖామంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారికి, రాష్ట్ర డిజిపి మరియు 'సురక్ష' చీఫ్ ఎడిటర్ శ్రీ డి.గౌతమ్ సవాంగ్ గారికి పోలీసు కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.