యూనిట్

మానవత్వం పరిమళించే పోలీసు విధులు

ఒకటికాదు రెండు కాదు... ఏకంగా 10 వరుస హత్యలు చేసిన నరరూప రాక్షసుడు. హత్యకాబడిన వారి శరీరంపై ఎటువంటి గాయాలు, పెనుగులాడిన గుర్తులు లేకపోవడంతో అవి హత్యలని కుటుంబ సభ్యులే గుర్తించలేనంతగా పక్కా వ్యూహం. వీటికి మూలం మూఢ నమ్మకాలు, నాటు వైద్యమనే అనాగరిక విధానాలు. వెల్లంకి సింహాద్రి అలియాస్‌ శివ అనునతను పరిచయస్తులను, బంధువులను వారి వద్ద గల డబ్బులను రెట్టింపు చేస్తానని, దీర్ఘవ్యాధులకు నాటుమందులు ఇస్తానని నమ్మించేవాడు. ప్రసాదం, నాటు మందుల్లో సైనేడ్‌ కలిపి ఇచ్చి, గుట్టు చప్పుడు కాకుండా ప్రాణాలు తీసి నగదు, బంగారం దోచేవాడు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌.పి. నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌ పర్యవేక్షణలో ఏలూరు డిఎస్‌పి దిలీప్‌ కిరణ్‌ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరిలో విస్తరించిన ఈ మారణకాండను వెలుగులోకి తెచ్చి నిందితున్ని అరెస్టు చేశారు. దర్యాప్తు బృందం యొక్క ప్రశంసనీయ విధి నిర్వహణతో మరిన్ని ఘోరాలు జరుగకుండా నిరోధించబడ్డాయి.

'స్పందన' కార్యక్రమాన్ని మన శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆదర్శపూర్వక రీతిలో నిర్వర్తిస్తుంది. కడప జిల్లా పోలీసులు మరో అడుగు ముందుకు వేసి 'స్పందన'కు వచ్చే ఫిర్యాదిదారులకు భోజన సదుపాయాలు కల్పిస్తూ.. తమ మానవత్వాన్ని చాటుతున్నారు. జిల్లా కేంద్రానికి దూర ప్రాంతాలనుంచి వచ్చే ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి డిఎస్‌పి సూర్యనారాయణ తన సిబ్బందితో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి పోలీసుల వద్దకు వస్తే, భోజనం పెట్టి మరీ పరిష్కరిస్తున్నారని ఫిర్యాదిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సామాజిక సేవా దృక్పథ కార్యక్రమాలే ప్రజల్లో మన వ్యవస్థపై మరింత విశ్వాసాన్ని, అభిమానాన్ని పెంపొందిస్తాయి. 

తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడితే పిల్లల భవిష్యత్‌ ఎలా మారుతుందో గుంటూరులో పోలీసులకు పట్టుబడ్డ ముగ్గురు విద్యార్థుల ఉదంతం తెలియజేస్తుంది. గంజాయికి బానిసైన విద్యార్థి తన తల్లిదండ్రులను తీవ్రంగా వేధిస్తున్నాడన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సమగ్ర విచారణ తదుపరి గంజాయి స్మగ్లర్ల ముఠాను అదుపులోనికి తీసుకుంది. వీరిలో బీటెక్‌, బీఎస్సీ, సీఏ ఫైనల్‌ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఉండటం గమనార్హం. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై తగు శ్రద్ధ చూపకపోవడం ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో ఈ ఘటన ఒక ప్రత్యక్ష ఉదాహరణ. 

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు వైద్య సహాయం అందేలోపు ప్రథమ చికిత్స అందించే లక్ష్యంతో 'రహదారి భద్రత మిత్ర'ను విశాఖ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో రాష్ట్ర డిజిపి శ్రీ డి.గౌతమ్‌ సవాంగ్‌ గారు ప్రారంభించారు. 149 మంది ట్రాఫిక్‌ పోలీసులు, 50 మంది జాతీయ రహదారిపై షాపులు, పెట్రోల్‌ బంక్‌లలో పనిచేసే వారిని వాలంటీర్లుగా నియమించి, డాక్టర్లచే ప్రథమ చికిత్సలో శిక్షణ ఇప్పించారు. వారందరికీ రేడియం జాకెట్స్‌ మరియు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌ను అందజేశారు. వారు పనిచేస్తున్న పరిధిలో ప్రమాదాలు జరిగితే 108కి, పోలీసుకు సమాచారం అందించడమే కాకుండా ఈలోగా గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేసి ఆదుకుంటారు. రహదారి ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని నివారించడానికి మన పోలీసు శాఖ ప్రయత్నం అభినందనీయం.


వార్తావాహిని