యూనిట్
Flash News
అత్యంత ప్రతిభావంతంగా విధులు
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అథ్యాయాన్ని భేషుగ్గా
నిర్వర్తించాము. ఇక కౌంటింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి వున్నది. ఎటువంటి అవాంఛనీయ
ఘటనలకు తావు లేకుండా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిపించి, రాష్ట్ర పోలీస్ సమర్థతను సగర్వంగా చాటి చెప్పాము. గతంలో కంటే తక్కువ
పోలీస్ బలగాలతో అత్యుత్తమ ఎన్నికల నిర్వహణ సాథ్యం చేశాం. ఈ ఘనతకు భాగస్వామ్యం
వహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఎన్నికలను నిష్పక్షపాతంగా, ఎటువంటి
ప్రలోభాలకు ఆస్కారం లేకుండా నిజాయితీగా జరిపించే క్రమంలో ఎప్పటికప్పుడు, ఎక్కడిక్కడ విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టాము. ఎన్నికల కోడ్ అమలులోకి
వచ్చినప్పటి నుండి ది 30.4.2019 వరకు రూ. 120 కోట్లకు పైగా నగదు, రూ. 2
కోట్ల 99 లక్షలకు పైగా విలువ కలిగిన 49,944 లీటర్ల మద్యం, రూ. 78 లక్షల
విలువ గల 406 కేజిల గంజాయి, రూ. 35 కోట్లకు పైగా విలువ కలిగిన బంగారం, వెండి మరియు రూ.
8 కోట్లకు పైగా విలువ చేసే చీరలు, కుక్కర్స్,
ల్యాప్‌టాప్ తదితర ఇతర వస్తువులను పట్టుకున్నాము. ఎన్నికలలో
ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిని సమర్థవంతంగా అడ్డుకున్నామనడానికి నిదర్శనమే
పోలీసు శాఖ తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్న ఈ రూ. 168
కోట్లకు పైగా నగదు, ఇతర వస్తు రూపేణా విలువ గల మొత్తం.
ఎన్నికల విధులను అత్యంత ప్రతిభావంతంగా
నిర్వర్తించడమే కాకుండా, ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వయో
వృద్ధులు, వికలాంగుల పట్ల ఎంతో ఆదరాభిమానాలను చూపించి,
తోడ్పాటునందించి ప్రజల మన్ననలు అందుకున్నారు మన పోలీస్ సిబ్బంది.
మన విధి నిర్వహణా పథం ఎంత కఠినతరమైనా, కాస్తంత సహనం, సేవా దృక్పథంతో నెరవేర్చే ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు మనల్ని చేరువ
చేస్తాయి.
ప్రశాంతతకు, ప్రకృతి
అందాలకు నెలవుగా వుండే విశాఖ నగరంలో రేవ్‌పార్టీ, డ్రగ్స్
వినియోగం పెచ్చరిల్లుతున్నదన్న సమాచారం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిజిపి
శ్రీ ఆర్‌పి ఠాకుర్ గారు విశాఖ సందర్శించి, క్షేత్ర స్థాయి
వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం,
విక్రయాలపై కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతపై అధికారులకు
దిశానిర్ధేశం చేశారు. నూతన రాష్ట్రంలో పారిశ్రామిక, పర్యాటక
రంగాల పరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకొని వున్న విశాఖ నగర ప్రశాంతతను మరింతగా
పరిరక్షించవలసిన గురుతర బాధ్యత మనపై వుంది.
చిల్లర దొంగతనాలకు అలవాటుపడిన
వ్యక్తి.. అనుకోకుండా తన కంటబడిన దేవాలయ భద్రతాపర లోపాలను ఆసరాగా చేసుకొని భారీ
దొంగతనానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరిలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు
చోరీకి గురయ్యాయన్న వార్త తీవ్ర సంచలనం కలిగించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా
తీసుకున్న తిరుపతి పోలీసులు, అత్యంత శ్రద్ధ, విశ్లేషణా
చాతుర్యం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుడిని
సొత్తుతో సహా అదుపులోనికి తీసుకున్నారు. కరడుగట్టిన అంతర్రాష్ట్ర ముఠాల పనిగా
తొలుత భావించిన పోలీస్ వర్గాలు, చివరికి ఒక సాదాసీదా
నేరగాడు కారకుడని తెలిసి విస్మయం చెందాయి. ఈ ఘటన దేవాలయాల భద్రతా ప్రమాణాలను మరింత
పటిష్టపరిచి, నిరంతరం పర్యవేక్షించ వలసిన ఆవశ్యకతను
తెలియజేస్తున్నది. ఎంతో చాకచక్యం, నైపుణ్యంతో ఈ కేసును
పరిష్కరించిన తిరుపతి పోలీసులను అభినందిస్తున్నాను.