యూనిట్

వినూత్న పథంలో విధులు

మన పోలీస్‌ శాఖ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆరంభించిన 'ఈ-లెర్నింగ్‌' సాంకేతిక బోధనా విధానం ఇరవై వేల సర్టిఫికెట్లను అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది. నాటి డిజిపి 

శ్రీ ఎన్‌. సాంబశివ రావు గారి ఆదేశానుసారం సి.ఐ.డి మరియు ఇన్నోయెల్‌ సంస్థల సాంకేతిక కృషితో పురుడు పోసుకున్న ఈ ఆన్‌లైన్‌ శిక్షణా విధానం అనతి కాలంలోనే ఇంతటి ఘనతను సాధించడం విశేషం. ఈ సాంకేతిక అంశాలు సులభరీతిలో రూపొందించబడి అనుకూల సమయాల్లో నేర్చుకోవడానికి అనువుగా వుండడంతో సిబ్బంది ఈ విధానంపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. పోలీస్‌ శాఖలోని ప్రతి ఒక్కరూ చట్టాలు, వృత్తి సంబంధిత అంశాలలో నైపుణ్యం సాధించడానికి, తరచుగా వాటిని మననం చేసుకోవడానికి దోహదపడే అభ్యాసం ఇది. 

బాలికలు, మహిళలపై వేధింపుల కట్టడికి చిత్తూరు పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. అధికశాతం బాలికలు, మహిళలు తమ సమస్యలను పోలీస్‌ వారికి చెప్పుకోవడానికి వెనుకంజ వేస్తుంటారు. అందుచేత స్కూళ్ళు, కళాశాలలు, వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్స్‌ వద్ద ఫిర్యాదుల మరియు సలహాల బాక్సులను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసారు. స్త్రీ శక్తి బృందాలు ఈ బాక్సులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అందులోని ఫిర్యాదులను, సలహాలను అధికారులకు అందజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. మంచి ఆలోచనతో ప్రజల మన్ననలు చూరగొంటున్న చిత్తూరు పోలీసులు అభినందనీయులు. 

గుంటూరు అర్బన్‌ ఎస్పీ సి.హెచ్‌. విజయారావు ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా 'సమ సమాజ సందర్శన' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దళిత మరియు గిరిజన కాలనీలను సందర్శించి, అక్కడివారితో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం, సంబంధిత అధికారులచే వాటిని పరిష్కరింప జేయడం కార్యక్రమం ముఖ్య ఉద్ధేశ్యం. ఆ ప్రాంతాలవారితో కలిసి సహపంక్తి భోజనాలు చేయడంతోపాటు వృద్ధులకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. 

విశాఖపట్నం రూరల్‌ పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 'ప్రేరణ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన యాభై మంది గిరిజన విద్యార్ధినులను విహారార్ధమై విశాఖపట్నం తీసుకు వచ్చారు. వారికి పెరేడ్‌ మైదానంలో గణతంత్ర దినోత్సవం, అనంతరం సినిమా, బీచ్‌, మ్యూజియం, పార్కులకు సందర్శింప చేసారు. జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ ఆ విద్యార్ధినులతో ఆత్మీయభాషణం చేసి భవిష్యత్తు దిశానిర్ధేశం చేసారు. 

కాళ్ళ మీద తీవ్ర పుండ్ల గాయాలతో, నడవలేని స్థితిలో పుట్‌పాత్‌ మీద పడివున్న మతిస్థిమితం లేని వ్యక్తిని తిరుపతి ఎస్పీ అన్బురాజన్‌ గమనించారు. వెంటనే రక్షక్‌ సిబ్బందిని రప్పించి వైద్య సహాయం అందజేసి, అనంతరం అనాధాశ్రమంలో చేర్పించారు. 

ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజలకు మనల్ని మరింత చేరువ చేస్తాయి. 

గణతంత్ర దినోత్సవం సందర్భముగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి చెందిన ఇద్దరికి ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌ (పిపిఎం), పదిహేను మందికి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ (ఐపిఎం)లను ప్రకటించింది. ఈ పతక గ్రహీతలకు 'సురక్ష' తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను.....  


వార్తావాహిని