యూనిట్

కిరీటాల దొంగ ఎట్టకేలకు చిక్కాడు

ఎబిసిడి అవార్డ్‌లలో మొదటి బహుమతి - 2019

తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో కిరీటాలు చోరీకి గురయ్యాయన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకిత్తించింది. తిరుపతి అర్భన్‌ ఎస్పీ అన్బురాజన్‌ తక్షణమే డీఎస్పీ రవిశంకర్‌ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించారు. ఈ కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించిన తిరుపతి పోలీసులకు ఏ విధమైన ఆధారాలు లభించలేదు.

తొలుత ఇది పేరు మోసిన అంతర్రాష్ట్ర ముఠా పనిగా భావించి ఆ దిశలో పరిశోధన సాగించినా తగు ఫలితం దక్కలేదు. తరచి తరచి ఆలయ చుట్టుప్రక్కల సిసి టివిలను పరిశీలించగా ఒక వ్యక్తి సంచారం అనుమానాస్పదంగా తోచింది. అంతకు మించి అతని వివరాలు తెలియకపోవడంతో నగరంలోని అన్ని వైన్‌షాప్‌ల వద్ద గల సిసి టివిలను పరిశీలించారు. రేణిగుంట సమీపంలోని ఒక వైన్‌షాప్‌ వద్ద ఆ వ్యక్తి మద్యం తాగినట్లు గుర్తించారు. ఆ షాప్‌ వాళ్ళను సదరు వ్యక్తి గురించి ప్రశ్నించగా అతను హిందీలో మాట్లాడినట్లు చెప్పారు. ఇంకొంచెం శ్రద్దగా సిసిటివి ఫుటేజ్‌లను వీక్షించగా, అనుమానితుడు రెండు సెల్‌ఫోన్స్‌లో నుండి సిమ్‌ కార్డ్స్‌ బయటకు తీసి పడేసినట్లు గుర్తించారు. ఆరోజు నగరంలో సెల్‌ఫోన్స్‌ చోరీకి గురయ్యాయా అని విచారించగా, ఫిర్యాదులో వచ్చిన ఆ రెండు సెల్‌ఫోన్స్‌ను ఆ వ్యక్తే దొంగిలించినట్లుగా నిర్ధారించుకున్నారు. ఆ ఫోన్స్‌లో కొత్త సిమ్‌ వేస్తాడని చూస్తుంటే ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు.

అదే రోజు సాయంత్రం తిరుపతి రైల్వేస్టేషన్‌లో అనుమానితుడు సంచరించినట్లు అక్కడి సిసి కెమెరాల ద్వారా నిర్థారించుకున్నారు. ఆ సమయంలో కాచిగూడ వెళ్ళే రైలు ఉండేటప్పటికి ఆ దిశలో ముందుకు సాగారు. కాచిగూడ వెళ్ళిన బృందం అక్కడ స్టేషన్‌లో అనుమానితుడు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ దిగినట్టుగా గుర్తించారు గానీ తదుపరి అతను ఎటు వెళ్ళాడో తెలియలేదు. అతను ఉత్తరాది వాడుగా అనుమానిస్తుండడంతో మహా రాష్ట్ర వైపుగా కాచిగూడా, వికారాబాద్‌ల మీదుగా ఒక్కో పోలీస్‌ స్టేషన్‌లో ఫోటోని తనిఖీ చేసుకుంటూ ముందుకు సాగారు. ఎట్టకేలకు నిజామాబాద్‌ స్టేషన్‌ పరిధిలో నేరాల చిట్టాలో ఆ వ్యక్తి ఆచూకీ చిక్కింది.

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఖాందార్‌ గ్రామస్థుడైన ఆకాష పోవార్‌గా నిర్థారణ అయ్యింది. ఇతను చిన్నతనం నుండే దొంగత నాలకు అలవాటుపడి పలు చోరీ కేసులలో ముద్దాయిగా వున్నాడు. ఆ చిరునామా ప్రకారం వెళ్ళగా దొరకలేదు. అక్కడ సేకరించిన ఫోన్‌ నెంబర్‌ మరికొన్ని ఆధారాల సహాయంతో నిందితుడ్ని చెన్నైలో అదుపులోకి తీసుకొని చోరీసొత్తును స్వాధీనపరుచు కున్నారు. ఈ క్రమంలో తిరుపతి పోలీసులు ఎనిమిది రాష్ట్రాలలో గాలింపు చర్యలు చేపట్టారు. కఠోర శ్రమ, దీక్ష, దక్షతలతో ఆ కేసును ఛేదించినందుకు గాను ఎబిసిడి అవార్డ్‌లలో మొదటి బహుమతి సాధించింది. ఇందుకుగాను డీఎస్పీ రవిశంకర్‌ రెడ్డి, సిఐ చంద్రబాబునాయుడు, ఎస్‌ఐలు నాగార్జున రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ రవిప్రకాష్‌, కానిస్టేబుళ్ళు ప్రభాకర్‌, గౌరినాయుడులు డిజిపి గారి చేతులు మీదుగా అవార్డ్‌లు అందుకున్నారు.

వార్తావాహిని