యూనిట్

ట్రావెల్స్‌ బస్సులో భారీ చోరీ కేసు ఛేదించిన నెల్లూరు పోలీసులు

ఎబిసిడి అవార్డ్‌లలో కన్సొలేషన్‌ బహుమతి - 2019

గత సంవత్సరం నవంబర్‌ 16 వ తేదీన ఉదయం సూళ్ళూరుపేట జాతీయ రహదారిపై ఒక హోటల్‌ వద్ద నిలిపి వున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్‌ నుండి 1.47 కిలోల బంగారం, 2 లక్షల నగదు గల ప్రయాణీకుడి బ్యాగ్‌ చోరీకి గురయ్యింది. చెన్నైలో ఒక బంగారు నగల దుకాణంలో పనిచేసే సుధాకర్‌ అనే వ్యక్తి తన వ్యాపార వ్యవహారం నిమిత్తం హైదరాబాద్‌ వచ్చి పని ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఈ సొత్తు పోగొట్టుకున్నాడు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గూడూరు రూరల్‌ సీఐ అక్కేశ్వరరావు, సూళ్ళూరుపేట సీఐ కిషోర్‌బాబులతో కూడిన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఆ బృందం అన్ని కోణాలలో తమ పరిశోధన ముందుకు ఉరికించింది. అదే విధంగా జాతీయ రహదారి వ్యాప్తంగా అన్ని సిసి టివి ఫుటేజ్‌లను పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో గుజరాత్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ గల కారు ట్రావెల్స్‌ బస్‌ సమీపంలో ఆగి వున్నట్టు గుర్తించారు. ఆ కారు చాలా దూరం నుండి బస్‌ను వెంబడించి వచ్చినట్లుగా గమనించారు. నేరం తదుపరి ఆ కారు ప్రయాణించిన మార్గం వెంట సిసి ఫుటేజ్‌లు పరిశీలించగా, చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద మరో నెంబర్‌ ప్లేట్‌ మార్చుకుని బెంగుళూరు, పూణె, ముంబయ్‌ మీదుగా సూరత్‌ వెళ్ళినట్లు నిర్థారణకు వచ్చారు. కారు రిజిస్ట్రేషన్‌ బట్టి యజమాని గుజరాత్‌ చెందిన వాడిగా గుర్తించి అక్కడకు వెళ్ళారు. తీరా అక్కడకు వెళ్ళిన తరువాత అతను చాలా కాలం క్రిందటే మధ్యప్రదేశ్‌ వెళ్ళిపోయినట్లుగా తెలిసింది. అతని ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలించగా ఈ చోరీకి మధ్యప్రదేశ్‌ థార్‌ జిల్లా మనవార్‌ తాలూకా ఖంజర్‌ భైరవ గ్రామంలో వుండే ఖంజర్‌ గ్యాంగ్‌గా పూర్తి నిర్థారణకు వచ్చారు. ఆ ప్రకారం గ్రామానికి వెళ్ళి విచారించగా వారు అక్కడ లేకపోవడంతో తిరిగి వచ్చారు. వారి కదలికలపై ప్రత్యేక నిఘా వేసి వుంచడంతో ఈ ఫిబ్రవరిలో ఈ ముఠా గుజరాత్‌లోని సూరత్‌జిల్లా జాంగావ్‌లో వున్నట్లు తెలిసి అక్కడికి వెళ్లగా ఇద్దరు సభ్యులు మాత్రమే చిక్కారు. వారిని తీసుకొని రావడానికి కూడా అక్కడి గ్రామస్థులు తీవ్ర అడ్దంకులు ఏర్పరచడంతో స్థానిక పోలీసుల సహకారంతో అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్దనుండి నేరానికి వినియోగించిన కారుతోపాటుగా రూ. 32.94 లక్షల విలువ చేసే 1.1 కిలో బంగారాన్ని స్వాధీనపరుచుకొని ముద్దాయిలిద్దరిని కోర్ట్‌లో హాజరుపరిచారు. బహు సంక్లిష్టమైన ఈ కేసును ఛేదించడానికి గాను 5 రాష్ట్రాలలో 1600 కిలోమీటర్లు సుదీర్ఘంగా ప్రయాణించారు మన నెల్లూరు పోలీసులు. వారి ప్రతిభాపూర్వక విధులకు గాను ప్రతిష్టాత్మక ఏబిసిడి అవార్డ్‌లలో నాలుగవ బహుమతిని గెలుచుకుంది ఈ కేసు దర్యాప్తు. రాష్ట్ర డీజిపి గారి చేతుల మీదుగా సూళ్ళూరుపేట సీఐ కిషోర్‌బాబు, గూడూరు రూరల్‌ సీఐ అక్కేశ్వరరావు. గూడూరు ఒన్‌ టౌన్‌ ఎస్‌ఐ హుస్సేన్‌ బాషా, సైబర్‌ క్రైమ్‌ ఎస్‌ఐ ఎస్‌ సురేష్‌బాబు, హెడ్‌ కానిస్టేబుల్‌ ఆర్‌ వి రాజు, కానిస్టేబుళ్ళు ఆదినారాయణ, టీ నవీన్‌ విజయకృష్ణ, ఏఆర్‌పిసి కమలాకర్‌లు అవార్డ్‌లు అందుకున్నారు.

వార్తావాహిని