యూనిట్

నరహంతక ముఠా ఆటకట్టించిన పశ్చిమ పోలీస్‌

ఎబిసిడి రెండవ బహుమతి - 2019

పశ్చిమగోదావరి జిల్లా తడికలపూడి పోలీస్‌ స్టేషన్‌ పరిదిలో గల ప్రసిద్ధ బౌద్దారామ విహార ప్రాంతంలో ఒక ప్రేమ జంటపై దాడి జరిగిన ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ఘటనలో మైనర్‌ బాలిక అత్యాచారానికి గురి కాబడి అక్కడిక్కడే హత్య చేయబడగా, ఆమె స్నేహితుడు మాత్రం తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పోలీసులు కనుగొన్నారు. వెంటనే అతనిని హాస్పిటల్‌కు తరలించి తక్షణ వైద్య సేవలందించి ప్రాణాన్ని నిలిపారు.

జిల్లా ఎస్పీ ఎం. రవిప్రకాష్‌ హుటాహుటిన ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాలలో పరిశోధన పరుగులెత్తించారు. ముందుగా ఆ జంట యొక్క కుటుంబాలు, స్నేహితుల దిశగా దర్యాప్తు సాగించిన పోలీసులు ఎటువంటి అనుమానాస్పద వివరాలు పొందలేకపోయారు. ఘటనా స్థలంలో బాదితుల ఫోన్‌లు లభించకపోవడంతో, వాటి ఈఎంఐ నెంబర్లతో కాల్‌ డేటా సేకరించారు. ఘటన తరువాత బాలిక ఫోన్‌లో కొత్త సిమ్‌ వేసి కొన్ని కాల్స్‌ చేసినట్లు కనుగొన్నారు. సిమ్‌ కార్డ్‌ పేరిట నమోదు అయిన అడ్రస్‌ సరి అయినది కాకాపోవుటతో, అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ వెళ్ళిన నెంబర్లకే నేరుగా ఫోన్‌ చేసారు. అంకమరావు అనే వ్యక్తి ఫోన్‌ చేసి కూలిపని ఏమైనా వుందా అని అడినట్లు మాత్రమే వారు చెప్పారు. ఆ చుట్టు ప్రక్కల అతని గురించి అడుగగా ఆచూకీ చిక్కలేదు. ఇంతలో ఆ ప్రాంతాలలో అడవిలో వేటకు పోయే వారి గురించి విచారించగా గంగయ్య, సోమయ్య అనే ఇద్దరు వున్నట్లు తెలిసింది. వారిని పిలిచి విచారించగా వారి హావభావాలు, నడవడికలో తొట్రుపాటును పోలీసులు గమనించారు. దీనిపై మరింత లోతుగా విచారించేటప్పటికి  వారు తమతోపాటు అంకమరావు, నాగరాజు అను మరో ఇద్దరితో కలిసి ఈ నేరాన్ని చేసినట్టు ఒప్పుకున్నారు.

దీనితోపాటుగా వీరు గత రెండున్నరేళ్ళుగా ఖమ్మం, కృష్ణాజిల్లా తిరువూరు, మచిలీపట్నం పరిసర నిర్జన ప్రదేశాలలో ఏకాంతం కోసం వచ్చే జంటలపై దాడి చేసి 33 అత్యాచారాలు, 4 హత్యలు చేసిన ఘోరాలను కూడా బయటపెట్టారు. కేసును సమర్థవంతంగా ఛేదించడమే కాకుండా మరిన్ని భయంకర నేరాలను వెలుగులోకి తెచ్చి నరహంతక ముఠాను అదుపులోనికి తీసుకున్నందుకు ఎబిసిడి రెండవ బహుమతి సాధించింది. ఇందుకుగాను జిల్లా అదనపు ఎస్పీ కె ఈశ్వరరావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ సి హెచ్‌ మురళీ కృష్ణ, చింతలపూడి సీఐ యు జె విల్సన్‌, తడికలపూడి ఎస్సై సతీష్‌, ఏఎస్సై సత్యనారాయణ, హెడ్‌ కానిస్టేబుల్‌ రాజేంద్రలకు డీజిపీ గారు అవార్డ్‌లతో పాటు రూ. 75 వేలు క్యాష్‌ రివార్డ్‌ అందజేసారు.

వార్తావాహిని