యూనిట్

చల్లచల్లగా మెల్లమెల్లగా రావె ..నిదురా హాయిగా

మనమంతా ఆరోగ్యంగా ఉండాలంటే కావలసినవి రెండే రెండు. ''కరకరా' ఆకలివేసి కడుపు నిండా అన్నం తినడమూ, కంటి నిండా ఆదమరచి నిద్రోపోవడమూను. ఎంతమందికి ఈ రెండూ లభిస్తున్నాయ్‌? ఇది మిలియన్‌ డాలర్‌ క్వాశ్చన్‌. ఉన్నవాడికి 'అరగని జబ్బూ, లేనివాడికి ఆకలి జబ్బూ'' అన్నాడో సినీ కవి. బాగా కాయకష్టం చేసి - అది మంచి వ్యాయామమైనా సరే - కడుపులో ఆకలి ఆవురావురుమంటూంటే తింటున్న ప్రతి మెతుకూ రుచిగా నోటికి హితవై కడుపు నింపుతూంటే వేళపట్టున నిద్రాదేవి ఠపీమని హాజరై మనని ఒడిలోకి తీసుకొని చిచ్చికొట్టదూ! ఆ జీవితం స్వర్గానికి ఓ చీడీ తక్కువేం కాదుమరి!

నిద్ర మీద భావకవులూసినిమా కవులూ చాలా కవిత్వమే గుప్పించారు మరి. అసలు సిసలైన తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య సరేసరి! భార్య భర్తని నిద్రపుచ్చడాన్ని గగనతలానికి తీసుకెళ్ళారు మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు.

ఏడుకొండలవాడ వెంకటరమణా - సద్దుచేయక నీవు నిదురపోవయ్యా

పాలసంద్రపుటలలు పట్టేమంచముగా - పున్నమీ వెన్నెలలు పూలపానుపుగా

కనులనొలికే వలపు పన్నీరుజల్లుగా - అన్ని అమరించెనీ

అలిమేలు మంగా  ||ఏడు||

ప్రియుడు ఒడిలో సేదతీరి పవ్వళిస్తే మెల్లిగ వీచే చల్లగాలి చప్పుడు కూడా 'రొద'లాగా ప్రియుడికి కలత చెందిస్తుందనే ప్రియురాలి గడుప మందలింపు కృష్ణశాస్త్రిగారి కవితలో విందాం.

''సడిసేయకోగాలి సడిసేయబోకే - బడలి ఒడిలో రాజు పవ్వళించేనే''

లక్ష్యసాధనలో విఫలమవుతానేమని భయపడుతున్న భర్తను లాలిస్తూధైర్యాన్నిస్తూవెన్నెల తెల్లదనాన్నిచిరుగాలి చల్లదనాన్నిలోకాతీత గాన మాధుర్యాన్నీ రంగరించి భర్తను కర్తవ్యోన్ముఖుణ్ణి చేసిఉత్తేజపరిచే అందమైన లాలిపాట శ్రీ సదాశివ బ్రహ్మం గారి ఆనవాలు.

 

రేయిమించెనోయి రాజా హాయిగా నిదురించరా హాయిగ నిదురించ

వెల్లివెరిసి వెన్నెల్లుకాచే చల్లని చిరుగాలి మెల్లంగా వీచె

స్వప్నాలలోన స్వర్గాలుకంటూ - స్వర్గాలలో దేవగానాలు వింటూ

హాయిగా నీవింక నిదురించవోయి                            ||రేయి||

చీకటివెంట వెలుగేరాదా కష్టసుఖాలు ఇంతేకాదా

చింతావంతా నీకేలనోయిఅంతా జయమేను సాధింపవోయి

హాయిగా నీవింక నిదురించవోయి                            ||రేయి||

ఊరిని వదిలిపెట్టి వేరే ఊరికెళ్ళిన భర్తకు భార్య చేసుకొనే విన్నపాలు దాశరథి గారి మాటల్లో విందాం. భర్త ప్రేమ కూడా భార్యకి నిద్రరానీయటం లేదండోయ్‌!

కలలనైన నిన్ను కనులజూతమన్నా

నిదురరాని నాకు కలలుకూడా రావే

తాపమింక నేనూ ఓపలేను స్వామీ

తరుణిని కరుణను ఏలగరావే              ||నీవులేక వీణా||

భావకవులు సైతం నిద్రను స్వంతం చేసుకున్నారు. తెలుగు సాహిత్యంలో చెక్కిన సజీవ శిల్పాలు ఎంకీ నాయుడుబావళ్ళు. వాళ్ళు నండూరి వేంకట సుబ్బారావుని లబ్దప్రతిష్ఠుణ్ణి చేస్తే వాళ్ళని నండూరి చిరంజీవులను చేశారుEternal Lovers.  John Keats మాటల్లో చెప్పాలంటే "Ye be everloving and she be ever fair" లేపకే నా ఎంకి లేపకే నిదరా - ఈపాటి సుఖము నేనింతవరకెరగనే

కలలోన నా ఎంకి కతలు సెపుతున్నాది

ఉలికులికి పడుకుంట ఊకొట్టుతున్నాను

కతలోని మనిసల్లె కానింతలోమారి

కనుకట్టుపనులతో కతనడుపుతున్నాది                    ||లేపకే||

తెలివిరానీయకే కలసెదిరిపోతాది

ఒక్కనేనే నీకు పెక్కునీవులునాకు.

మళ్ళీ John Keats  మాటల్లోనే Am I awake or asleep?  నాయుడు బావ ప్రేమ జగత్తులోమత్తులో ఉన్నాడు. అందుకే ఎంకి చేసేవి ''కనికట్టు పనులే'' మరి! ఉలికిపడిలేస్తే వాస్తవ జగత్తు. తనకది అఖ్ఖర్లేదు. ఎంకి మాయా ప్రపంచంలోనే నిద్రిస్తుంటే అంతాఅన్నిటా ఎంకే కనిపిస్తోంది! సాహో నండూరీ! అలాగే కలలలో కలత నిదురలో నిదురించే గోపిక కృష్ణుడికిలా విన్నవించు కుంటోంది.

మ్రోగింపకోయ్‌ మురళి మ్రోగింపకోయ్‌ కృష్ణ

తీయతేనియ బరువు - మోయలేదీ బతుకు

వలదోయిఅలము నీ కలలోన నిదురింతు

భరమోయి నీప్రేమ వరమే నేటి రేయి                ||మ్రోగింపకోయ్‌||

కృష్ణశాస్త్రి గారు కృష్ణ ప్రేమి. ఇక్కడ గోపిక కూడా ప్రేమ Wakeful - Slumber  లో ఉంది. దీన్ని మధురప్రేమ అంటారు. ప్రియురాలిగా భగవంతునికి కైంకర్యం అన్నమాట.

పరమాత్ముణ్ణి జోకొట్టే అదృష్టం కొద్దిమందిది. ఆ పరమాత్ముడురాముడు కావొచ్చుకృష్ణుడు కావొచ్చుతన కొడుకుని రాముడిలా ఊహించే ప్రతి తల్లీ కావొచ్చు.

రామాలాలీ మేఘశ్యామాలాలీ తామరసనయనా దశరథ తనయాలాలీ

''ఎంతో ఎత్తుమరిగి నావూఏమి చేతునూ ఇంతుల చేతుల వేడికి నీవు ఎంతని కందేవు''

ప్రతి తల్లీ చందమామను చూపిస్తూ పిల్లకి ఆము తినిపిస్తూ ''చందమామ రావే జాబిల్లి రావే'' అని పిలిచి పాడేటట్లు ఇంటింటా అలవాటు చేసిన అన్నమయ్యే మొట్టమొదటిగా ''అచ్యుతుణ్ణి'' ఓ అచ్యుతానంద - జోజో ముకుందా రావె పరమానంద రామ గోవిందా ||జోజో|| అని జోలపాడాడు. ఆబాణీలో ప్రసిద్ధమైన జానపద పాట

ఉంది.

తొలుత బ్రహ్మాండంబు తొట్టెగావించీ

నాలుగూ వేదములు గొలుసులమరించి

బరువైన ఫణిరాజు పానుపమరించీ

చెలియడోలికలోన చేర్చిలాలించీ

అంటూ చెలియడోలిక వైకుంఠమే అయిపోయింది. ఇవికాక అన్నమయ్య  రాసిన 32 వేల సంకీర్తనలలో చాలా జోలపాటలు న్నాయి. హరిని ఊయల లూగిస్తూ ''డోలాయం చల డోలాయం హరి డోలాయం'' అన్నాడు. అమ్మవారు అయ్యవారితో నిద్రిస్తుంటే ''పలుకుతెనెలతల్లి పవళించెనూ - కలికితనముల విభుని గలిసినది గాన'' అని శృంగారం చిందించుతూ ముద్దుముద్దుగా వర్ణించాడు అన్నమయ్య.

కష్టాలూకడగళ్ళూ కుదిపేస్తే సేదతీర్చేది నిద్ర. సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పనలో భారతరత్నసుస్వర లతామంగేష్కర్‌ తొలిసారి తెలుగులో పాడిన పాట చూద్దాం. ''నిదురపోరా తమ్ముడా నిదురపోరా తమ్ముడా - నిదురలోనా గతమునంతా నిముషమైనా మరచిపోరా'' అంటూ తమ్ముణ్ణి లాలించి నిద్రపుచ్చే పాట ఇది. తల్లి నుంచీ వేరుపడిన పిల్లాడికి తిండి సయిస్తుందానిద్రవస్తుందా చెప్పండి. ''భాగ్యరేఖ'' సినిమాలో అందరి పిల్లల నోటా నానిన ఈ పాటను చూద్దాం. ''చూడాలని వుంది అమ్మను చూడాలని వుంది - పొరపాటుపనులను చేయబోయనని నీతో చెప్పాలి - కంటికి నిద్దురరాదేనే తింటే నోటికిపోదేచూడటం మరి కూడదంటే ఏడుపొస్తోందమ్మా''. సుశీల పాడిన కమ్మని పాట ఈ పాట.

నిద్రలేమితనం ఎంత చెరుపు చేస్తుందో అతి నిద్రకూడా అంత తగనిదే. భోజన ప్రియుడైన వృకోదరుడు కడుపారా తిని గురకలు తీస్తోంటే కృష్ణుడు అంటించిన చురకలివి.

''మత్తు వదలరా నిద్దుర మత్తువదలరా

ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదురా

జీవితమున సగభాగమ్మూ నిద్దురకే సరిపోవూ

అతినిద్రాలోలుడూ తెలివిలేని మూర్ఖుడూ

చెప్పడమే నాధర్మం వినకపోతే నీఖర్మం                 ||మత్తు||

 

కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రాఆరు నెలలు తిండి తినేట్టు వరం పొందాడు. (శాపం కూడానేమో!) వాల్మీకి సృష్టించిన ఊర్మిళ లక్ష్మణుడితో పెళ్ళితో కనబడి మరి జాడకనబడదు. కానీ జానపదంలో ఊర్మిళ లక్ష్మణుడితో అడవికి వెళ్ళలేకలక్ష్మణుడు అడవిలో ఉన్నన్నాళ్ళూపద్నాల్గేళ్ళూ నిద్రపోయిందట! ఈ పాట ''ఊర్మిళ నిద్ర''గా ప్రాచుర్యం చెందింది. లక్ష్మణుడురాముడూసీతలతో అడవికి వెళ్ళినప్పటి నుంచీ ఊర్మిళ నిద్ర పోయిందని సీతే చెబుతోంది పట్టాభిషేకమయ్యాక రాముడితో.

నాడు మొదలు శయ్యపై కనుమూసీ ! నాతిపవళించుచున్నదీ

ఇకనైన యానతిచ్చీ! తమ్మునీ ఇందుముఖికడకంపుడీ!

ఈ విశాల అవనిలో 700 మంది కోట్ల మంది మనుషులు హాయిగా కంటినిండా నిద్రపోతున్నారంటారా! అబ్బేలేదనే చెబుతున్నారు పరిశీలకులు. దాదాపు 20 శాతం ప్రజానీకం ప్రపంచకంలో నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళేనట! ఇంతకుముందు తరాల్లో ముసలితనం ఆడపులిలా మీదపడు తోంటే శరీర పటుత్వం సన్నగిల్లిపట్టుమని పదిమెతుకులు తినడంతో సరిబుచ్చినిద్రపట్టక ప్రతిరాత్రీ శివరాత్రి కావడం జరుగుతూ వుండేది.

ఇప్పుడైతే పాతిక సంవత్సరాల నిండుయవ్వనవంతులు నిద్రలేమితో బాధపడటం అమితాశ్చర్యం సుమీ! దీన్ని శాస్త్రీయ భాషలో ''అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా'' అని అంటారట! ముక్కుపచ్చ లారని మూడో ఏటినుంచే చదువుల ఒత్తిడిపదోక్లాసులో పరీక్ష ఒత్తిడిఇంటర్‌లో జీవనగమ్యం నిర్ణయించే గ్రూపులతో డాక్టరాఇంజనీరాసి.ఎ.నాసివిల్సా అంటూ తల వాచిపోయే ఒత్తిడి. ఈ ఒత్తిళ్ళన్నీ జమిలిగాసందోహంతోసంరంభంగా నిద్రమీద దాడిచేస్తున్నాయి.  ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఉద్యోగస్తులయితే నిజంగా నిశాచరులే. రాత్రిళ్ళు పనిచేసిపొద్దున్న ఆలస్యంగా నిద్ర లేవడం చేత జీవన శైలిలో అనేక మార్పులు వచ్చి నిద్రకరవవుతోంది వారికి. నిద్రలేమితో బి.పీ.లుషుగర్ల వంటి అనారోగ్యాలు మీదపడుతున్నాయ్‌. నిద్ర లేకపోవడంతో వాహన చోదకులు (డ్రైవర్లు) అనేక యాక్సిడెంట్లు చెయ్యడం చూస్తున్నాం. ధూమపానంమద్యసేవనంమత్తు పదార్ధాలు తీసుకోడం వంటి వ్యసనాలు అనారోగ్యాన్నీనిద్రలేమినీ కలిగిస్తున్నాయి.

భార్యా భ్తల ఉద్యోగాలవల్ల చాలామంది పిల్లలకి తల్లిదండ్రులతో గడపడంకలిసి పడుకోవడం తగ్గిపోతోంది. పిల్లలను పక్కలో పడుక్కోబెట్టుకొని ''అనగా అనగా ఓ ఊళ్ళో'' అంటూ తల్లులూబామ్మలూ చెప్పే దీవస-Bed-time Stories  వింటూ ఆ కథల్లోని రాజులూరాణులూ తామే అనే తీపికలలు కంటూ నిద్రలోకి జారుకునే పసిడి పసితనం కనుమరుగైంది. ఈ ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ లతో పిల్లలు నిద్రనే కాదు కావలసిన వెన్నోవిలువైనవెన్నో పోగొట్టుకుంటున్నారు. మితాహారం తినితిన్న రెండూరెండున్నర గంటలకు ప్రశాంతమైనఎక్కువ వెలుతురు చోరని పడక గదిలో నిద్రపోవాలి. హత్యలూనేరాలూఘోరాలూదెయ్యాలను చూపే టివి షోలని పూర్తిగా కట్టేయాలి. తేనె ఊటలవంటిశృతి శుభగమైన పాటలు వింటూ వీనుల విందుగామనసు నిండుగాగుండెల మువ్వల సవ్వడితో ''రావె నిదురా హాయిగా'' అంటూ నిద్రాదేవిని రెండు చేతులా పిలుస్తుంటే ఆవిడ అక్కున చేర్చక మానుతుందా!

''వెలుగురాకముందె వేగనిదురలెమ్ము

ప్రొద్దుపొడువ నిదుర బోవరాదు

సోమరితనమేల శుచిశుభ్రముల యందు

తెలిసినడుచుకొమ్ము తెలుగుబిడ్డ!'' (నార్ల చిరంజీవి - 'తెలుగుపూలు')

 

వార్తావాహిని