యూనిట్
Flash News
కోరలు చాచిన కల్తీ భూతం
పుట్టిన
ప్రతి జీవికీ స్వచ్ఛమైన తిండీ, నీరూ, గాలీ అవసరం. మా చిన్నప్పుడైతే ఇంట్లో
బావులుండేవి. బావిలోని నీరు కొబ్బరి నీరులా తీయగా కమ్మగా ఉండేది. బావినీళ్ళనీ, కుళాయి నీళ్ళనీ కాచి వడగట్టకుండా తాగేసేవాళ్ళం.
ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడయితే RO లు వచ్చేశాయ్! కాలం ఎంత మారిందనీ!
మనిషికి
ఆశ ఉండాలి. కానీ అత్యాశకూడదు. ''ఆశాపాశము
తాకడున్నిడుపు లేదంతంబిల రాజేంద్ర!'' - ''ఆశ అనే తాడు చాలా
పొడవైనది. దానికిక్కడ అంతమన్నది లేదు'' అని
వామనావతారంలో విష్ణువు బలి చక్రవర్తితో అనలేదూ! వ్యాపారంతో కొద్దిగా లాభం
పొందుదామని ఆశపడటంలో తప్పులేదు. అత్యాశకు పోయి కల్తీ సరకులతో లాభం గడిద్దామనుకోవడం
నేరం! ఘోరం! అన్యాయం! అక్రమం! మహాపాపం! ఎందుకంటే ఆ కల్తీలు ప్రజల ఆరోగ్యాన్నీ, ప్రాణాలనీ హరిస్తున్నాయి కదా! ఇంతకుముందుతై
పెద్దవాళ్ళు ''నాలుగు వేళ్ళూ నోట్లో
కెడుతున్నాయా'' అని
అడిగేవారు. అంటే కడుపు నిండా తింటున్నావా అని ఆప్యాయంగా అడగడం అన్నమాట! ఇప్పుడైతే
వేళ్ళమాటేమో గానీ అనేక కల్తీ పదార్థాలతో విషరసాయనాలు నోట్లోకి వెళ్తున్నాయ్!
పొద్దునే
బాలభానుడి నును లేత కిరణాలు ఎర్రగా ఆకాశాన్ని కప్పేసేవేళ! పక్షుల కిలకిలరావాలతో
మేలుకొలిపే వేళ! మొహం కడుక్కొని – అంటే పళ్ళుతోముకొని - గిన్నెలో
పాలు మరగించి, ఫిల్టరు నుంచి కాఫీ డికాక్షన్ కప్పులోకి
వంపుకొని, అందులో కొద్దిగా చక్కెర వేసి, పాలు పోసి నురుగులతో పొగలు కక్కే కాఫీని ఒక్క
గుక్క సిప్ చేస్తే... ఆ రుచి స్వర్గానికి బెత్తెడు దూరానికి తీసుకెళ్ళి ...
ఆగండాగండి! తొందర పడకండి! పాలెలావున్నాయిట - నీటితో కల్తీ! కాఫీ పొడి ఎలాగుందట? - చింతగింజల పొడితో కల్తీ! పంచదారమాటో ? – Chalk తో
కల్తీ! కాఫీ తాగుదామన్న ఆశ ఆవిరై ''అంతా
భ్రాంతియేనా'' అని
ఉస్సూరని నిట్టూర్చాలి!
ఇంతకు
ముందు తెల్లని మల్లెపూవులాంటి అన్నాన్ని నిస్సంకోచంగా, తృప్తిగా తినేవాళ్ళం. ఇప్పుడో! మెతుకు మెతుక్కీ
పంటికిందికి రాయి. బియ్యం సైజులో రాళ్ళని చేసి వ్యాపారులు కలుపుతున్నారు.
శాకాహారులకి కందిపప్పు కావలసినంత ప్రోటీన్లు ఇస్తుంది. వాళ్ళు ముద్దపప్పుతో నెయ్యి
వేసుకొని ఆవకాయతో ఇష్టంగా తింటారు కదూ! ఆగండాగండి! ఇప్పుడు పప్పుతో ''మెటనిల్ అనే రంగుపూత''
(Metanil Yellow dye) కలిపి పప్పుని బాగా పసుపు చేస్తున్నారు. అది
విషరసాయనం సుమా! ఇక ఇష్టంగా అన్నంలో వేసుకునే నెయ్యిలో వనస్పతినీ, జంతు కళేబరాల నుంచి తీసిన కొవ్వుని వనస్పతి
తయారీకి ఉపయోగిస్తున్నారు! హా హతవిధీ! ఇంక ఆవకాయంటారా - ఓహ్ - రుచి కాస్తా
ఆవిరవుతోంది! కారం పొడిలో చౌకగా దొరికే తెల్లగా పాలిపోయిన ఎండు మిరప పొడిలో ఎరుపు
రంగు వచ్చేలా వరిపొట్టునీ, నూనెతో
ప్రత్యేక మిశ్రమంలో చెక్క పొట్టునీ కలపడం చేత అది ఎర్రగా ఉంటోంది. ఇంక ఆవకాయలో
ఆవాలపొడి అవస్థ చూడండి! యాలకులూ, పొట్టూ, లవంగాలు, ఆకుల
వ్యర్థాలనూ ఆవాల పొడిలో కలుపుతున్నారు.
పసుపు
అంటేనే క్రిమి నిరోధకారిణి. Antibacterial కదూ! ప్రతి శుభకార్యానికీ, బతుకమ్మ, బోనాలు, గొబ్బెమ్మలకీ, పేరంటాళ్ళకీ, శారీరక సౌందర్య పోషణకీ, జలుబూ, దగ్గులు
వచ్చినప్పుడు కొద్దిగా పాలలో చిటికెడు పసుపుని వేసి రోగ నివారణకీ, ముక్కుపట్టేసి జలుబుతో ముక్కు మూసుకుపోతే వేడి
నీళ్ళలో చెంచాడు పసుపుతో ఆవిరి పట్టడానికి, ఆహార
పదార్ధాలలో, కూరల్లో, పులుసులో, తెలుగువాళ్ళకి, ఇష్టమైన
పులిహోరలో వాడుతున్నాం కదా! అలాంటి ''ముత్య మంతా
పసుపు ముఖమెంతొ చాయ'' -చిటికెడు పసుపుతో ముఖమంతా
కాంతులీనుతోందట! సాహో ఆరుద్ర! పసుపు సౌందర్యసాధనగా ముఖానికి రాసుకున్నా ముఖం మీది
మచ్చలూ, మొటిమలూ కూడా పోతాయి కదా!
అందుకే అనేక ఫేసియల్ క్రీముల్లో పసుపు వాడుతున్నారు చూడండి! పసుపుని ఎన్నిటికి
విరివిగా వాడుతున్నామో కదూ! పసుపులోనూ, మన
చారూ, సాంబారూ, గుత్తి
వంకాయ కూరకీ ఉపయోగించే ధనియాల పొడిలోనూ (గుత్తి వంకాయ కూరోయ్ బావా - కోరి వండాను
నీకోయ్ బావా'' - చాలా ప్రసిద్ధమైన పాట.
దీన్ని శ్రీ బసవరాజు అప్పారావు గారు రాస్తే కీ.శే. బందా కనకలింగేశ్వరరావు గారు
పాడారు. అప్పుడు అందరి నోళ్ళలోనూ ఇదే పాట వినిపించేది. గుర్తొస్తుంది కదూ!) పొట్టూ, ఆకుల పొడీ కలిపేస్తున్నారు.
ఇంక
పిల్లలకి పళ్ళు ముక్కలుగా కోసిపెట్టి, రెండు
ముక్కలు నోట్లో వేసుకుందాం అనుకుంటాం! తీరాచూస్తే పళ్ళన్నీ కల్తీయే! మామిడి, ఆపిల్, బొప్పాయి, బత్తాయి, అరటిపళ్ళు, సపోటాలు - ఒకటనేమిటి! సర్వం - అన్నీ
మగ్గకుండానే ''కాల్షియం కార్బైడ్'' అనే రసాయనాన్ని చల్లి బలవంతాన పళ్ళుగా
ముగ్గిస్తున్నారు. రంగు తెప్పిస్తున్నారు. పుచ్చకాయల మధ్య రసాయనాలు ఇంజెక్ట్ చేసి
ఎర్రని రంగు వచ్చేటట్లు చేస్తున్నారు. దోసకాయ పెద్దదవటానికి ''ఆక్సిటాసిన్'' అనే మందు (Oxytocin) ఇంజెక్ట్
చేస్తున్నారు. ఈ మందుని గర్భవతులకి పురిటినెప్పులప్పుడు ఇస్తారు. ఒకటనేమిటి అనేక
కూరలని మందులతో పెద్దవిగా చేస్తున్నారు ఈ కల్తీ మాయల ఫకీర్లు! తేనె ఎంతో
ఆరోగ్యకరమైనది. పగటిపూట నిమ్మకాయ నీళ్ళలో తేనె కలుపుకు తాగితే బరువు తగ్గుతారు.
గ్రీన్‌టీలో తేనె వేసుకుని తాగొచ్చు. మాత్రలని పిల్లల కిచ్చేటప్పుడు - ముఖ్యంగా
పసి పిల్లలకి - మాత్రలు పొడి చేసి తేనెతో రంగరించి నాలికకి రాశామంటే - గుటుక్కుమని
మింగుతారు చడీచప్పుడు కాకుండా! దేవుని నైవేద్యంలోనూ తేనె ఉపయోగిస్తారు. అలాంటి
మధురమైన మధువు - తేనె - ఎలా ఉందో చేశారా? గ్లూకోస్
నీటిలో అనేక రసాయనాలు కలిపి తేనెగా అమ్ముతున్నారు.
వేసవి
రోజుల్లో పిల్లలకి సెలవులు. సంవత్సరం పొడుగూతా చదివి వేలాడిపోతూంటారు. ప్రతిరోజూ
షరా మామూలే పనులతో బాధ్యతలతో పెద్దవాళ్ళకి కాస్త తెరిపి కావాలి. ఆటవిడుపుగా
పెద్దలు పిల్లలతో ఐస్ క్రీం పార్లర్‌కి వెడతారు. వేసవి సంథ్యా సమయాన చల్లటి
తియ్యటి ఐస్ క్రీం గొంతు దిగుతుంటే భలే సంతోషంగా ఉంటుంది కదూ! ఐస్ క్రీంలలో
ఎన్ని రకాలు, ఎన్నెన్ని రంగులు, ఎన్నెన్నో రుచులు! తీరా ఆర్డరిచ్చాక ఓ చెంచాడు
ఐస్ క్రీం నోట్లో పెట్టగానే ఏముందీ? కల్తీ
విషం. ఈ చల్లని శీతల పదార్ధంలో వాషింగ్ పౌడర్ కలుపుతున్నారు. హతోస్మి!
ఇంటిల్లిపాదీ చతికిలబడరూ!
రోజూ
ఇంట్లో తింటూ, కొంచెం వెరైటీగా ఉంటుందని
సకుటుంబ సపరివారంగా హోటల్‌కో, రెస్టారెంట్‌కో
గాని వెడతాం! లేదా ఎవరిదో పుట్టిన రోజు లేదా షష్టిపూర్తి లేదా 60 ఏళ్ళ
పెళ్ళి పండుగ! ఏదైతేనేం! ఓ పండగ! ఓ ముచ్చట! భోజనం గానీ, టిఫిన్ గానీ చేద్దామనుకుంటాం. కానీ మనకి హోటల్‌వాడు
నిన్నటిదో మొన్నటిదో అన్నంలో, కూరల్లో
ఈ రోజువి కలిపి, లేదా మొన్నటి దోసె పిండితో మొన్నటి బంగాళాదుంపల
కూరని పెట్టి వేడిచేసి పెడితే - ఉత్సాహం నీరుకారి, ఆనందం
చప్పబడి, వేలాడుతున్న మొహాలతో ఇంటికి లెఫ్ట్, రైట్ కొట్టేస్తాం కదూ! భగవద్గీత 17వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ''సాత్త్విక'', ''రాజస'', ''తామస'' ఆహారాలని గురించి చెప్తాడు.
తాజాగా, రుచిగా ఉండేది సాత్వికాహారం.
పాచిపట్టి, కంపుకొట్టి, పాతదయిన
ఆహారం తామస ఆహారం. ఈ హోటళ్ళవాళ్ళ ధర్మమా అని మనందరికీ తామసాహారమే శరణ్యం!
భగవంతుడా! రక్షించు నాదేశాన్ని!
అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని చాలామంది అనేక రకాల
వంటల్లో ఉపయోగిస్తారు. ఇప్పుడు కుళ్ళిన బంగాళాదుంపల్నీ, నూక పిండినీ, శనగ
పిండినీ మరపట్టి ఘాటు రంగులకి రసాయనాలు జోడించి అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని
తయారు చేస్తున్నారు. మనం శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నామని భ్రమపడే సబ్బులలో జంతు
కళేబరాల కొవ్వుని తీసి కరగించి వాడుతున్నారు. మలయాళీలు మనందరికీ అందించిన అద్భుత
వంటకం ''అవియల్''. ఆ వంటకానికి కొబ్బరినూనె తప్పనిసరి తెలుసా!
పైగా తలకి కూడా మనమంతా కొబ్బరి నూనెనే వాడుతున్నాం కదా! ఆ కొబ్బరి నూనెకీ
చేటొచ్చింది! కుప్పతొట్లలో పారేసిన కుళ్ళిన
కొబ్బరి ముక్కల నుంచి నూనెను తీసి అమ్ముతున్నారు. మిగిలిపోయిన పిప్పిని కొబ్బరి
పొడిగా పొట్లాలలో అమ్ముతున్నారు. అన్ని పిండులూ - అంటే గోధుమ పిండీ (దీనిలో తౌడు), బియ్యం పిండీ, మైదా
వగైరా, నూనెలు, పప్పులు, ధాన్యాలూ, కాఫీ, టీ, పాలు
- ఇంకా ఒకటేవిటి! కాదేదీ కల్తీకనర్హం లాగ అన్నిచోట్లా భీకరంగా బొబ్బలు పెడుతోందీ
కల్తీ భూతం!
విత్తనాలతో
బాటు ఎరువులూ, క్రిమిసంహారక మందులూ నకిలీవే మరి! తాను నాటిన
విత్తులతో, వేసిన ఎరువులతో బలంగా పెరిగి, క్రిమిసంహారక మందులు పంటలను కాటువేస్తున్న
చీడపురుగుల్ని తొలగిస్తే, రైతు
ఏపుగా, పుష్కలంగా పండిన పంటతో ''వానల్లు కురవాలి వానదేవుడా!
వరిచేలు పండాలి వానదేవుడా! మా గాదె నిండాలి వానదేవుడా! మా అవ్వ వండాలి వానదేవుడా! మేము చక్కంగా
మెక్కాలి వానదేవుడా! మా బొజ్జ నిండాలి వానదేవుడా!'' అని మురిపిస్తున్న ఆశతో, మెరిసే కళ్ళతో తన జీవన భృతిని నిర్ణయించే పంటని
నమ్ముకుంటాడు. తీరా చూస్తే ఏముందీ - సృజన, నందిని, మైత్రి అనే నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు.
అంతా నకిలీ! అంతా కల్తీ! పంట పండక, చేతికి
రాక, ఈ కల్తీ మందులూ, విత్తనాలూ
తన పొట్ట కొడితే హుతాశుడై, జీవితేచ్ఛ
అడుగంటి, గత్యంతరం లేక, వేరే
దారి కనపడక ప్రాణాలు తీసుకుంటున్నాడు. మనందరి కడుపు నింపే అన్నదాత కల్తీ రాక్షసుల
ద్రోహానికి బలైపోతున్నాడు. ఈ కల్తీ రాక్షసులకి సాటి
ప్రాణాలంటే విలువ లేదు. ప్రాణాలకి హీనంగా ఖరీదుకట్టే నర హంతకులు!
ఈ
నకిలీ వస్తువులు తినడం, తాగడం
వల్ల పక్షవాతం, రక్తహీనత, వాంతులు, విరేచనాలు, లివరు
పాడవడం, రక్తనాళాలు పూడుకుపోవడం, కాన్సర్ - చివరిగా మరణం సంభవిస్తున్నాయ్.
అమెరికాలోనైతే ఆహార ఉత్పత్తులపైన దాన్ని గురించిన పూర్తి విశేషాలనీ, విషయాలనీ ముద్రిస్తారు. ఎటువంటి మార్పులు
వచ్చినా తక్షణం చర్యలు తీసుకుంటారు. స్పెయిన్, ఫ్రాన్స్, బ్రెజిల్ దేశాలలో కఠినమైన నియంత్రణ వ్యవస్థ
ఉండటం చేత కల్తీ నేరగాళ్ళు హడలిపోతున్నారు. బంగ్లాదేశ్‌లో కల్తీ నేరగాళ్ళకి
మరణశిక్షే దండన మరి! మన దేశంలో పాల ఉత్పత్తులు కల్తీ చేసేవాళ్ళకి యావజ్జీవ కారాగార
శిక్షని ఉత్తర ప్రదేశ్, పశ్చిమ
బెంగాల్, ఒడిశాలు అమలు చేస్తున్నాయి. రెండు తెలుగు
రాష్ట్రాలూ కల్తీలు చేసే వాళ్ళమీద కఠిన చర్యలూ, శాసనాలు
అమలు చేస్తామన్నారు. కల్తీలపైన ముందస్తు నిర్భంధ చట్టం (పి.డి. యాక్ట్) తీసుకుని
వచ్చి, పాల, హోటల్, రెస్టారెంట్ల ఆహార పదార్ధాల కల్తీల భరతం
పడతామని రెండు ప్రభుత్వాలూ హామీ ఇచ్చాయి. కృత్రిమంగా పళ్ళ రంగుమార్చే విష రసాయనాలు
- కాల్షియం కార్బైడ్స్ - వాడకానికి మూడేళ్ళ జైలు శిక్ష విధించాలని ''ఆహార పదార్థాల కల్తీ నిరోధక
చట్టం'' గట్టిగా చెప్పింది. కల్తీల
వల్ల వాటిల్లే నష్టాలకి తగ్గట్టే శిక్షలుండాలి కదూ! కల్తీ రాక్షసుల కారణంగా మరణాల
సంభవిస్తే ''భారత శిక్షా స్మృతి'' లోని 272, 273 సెక్షన్లు సవరించాలని లా కమీషన్ ఇటీవల సిఫారసు
చేసింది.
జడలు
విస్తరిస్తున్న కల్తీ భూతాన్ని మొదలంటా తుదముట్టించాలి! అందుకు ప్రతి పౌరుడూ
సైనికుడిలా ఉద్యమించాలి. పదండి ముందుకు! పదండి తోసుకు! ''నీతి వేరేలేదు నిజము
పల్కుటకంటే'' - నీతితో
అవినీతిని మట్టుబెడదాం! కల్తీ భూతాన్ని అణచివేద్దాం! మీరు రెడీయేనా?!
డా|| శ్రీమతి కె. అరుణా వ్యాస్