యూనిట్

కొడిగట్టుతున్న చిరుదివ్వెలు

ప్రతి ఇంట్లోనూ బాధ్యతాయుతంగా సంసారాన్ని నిర్వహిస్తున్న తల్లితండ్రులూ, తల్లిదండ్రుల చెప్పుచేతలలో నడుచుకుంటూ, వారి కనుసన్నలలో మెదులుతూ, క్రమశిక్షణతో నియమ, నీతిబద్ధంగా ప్రవర్తిస్తున్న పిల్లలూ ఉంటే ఆ ఇల్లు అనురాగాలు వెదజల్లే కుటుంబానికి నమూనా, చిరునామా అయిపోదూ! డా. సి. నారాయణరెడ్డి గారన్నట్లు ఇది ''చల్లని సంసారం - చక్కని సంతానం'' అవుతుంది మహా చక్కగా!

కుటుంబాలకి పిల్లలే దీపాలు తప్పకుండాను. వాళ్ళు దివిటీల్లా దీప్తిస్తున్నారా ఈ రోజుల్లో? సంపన్న కుటుంబాల పిల్లల్నే తీసుకుందాం. వాళ్ళు ఎయిర్‌ కండిషన్డ్‌ (Air-Conditioned) బస్సులూ, ఎ.సి. క్లాసులూ, భోజనాలనమర్చే స్కూళ్ళల్లో చదువుతున్నారు. సంపన్నులైన వారి తల్లిదండ్రుల్లో చాలామంది విందులూ, వినోదాలతో విలాసమైన జీవితం గడుపుతున్నారు. తల్లిదండ్రులు చాలావరకు పబ్బుల్లో గడపడంతో పిల్లలూ వాళ్ళను అనుకరిస్తున్నారు. సంపన్న కుటుంబాల్లో చాలామంది తల్లులు కూడా మద్యం సేవించడం, పేకాటలు ఆడ్డం చూస్తూ పెరిగిన పిల్లలు చిన్నప్పటి నుంచే వ్యసనాలకి అలవాటుపడుతున్నారు. తల్లిదండ్రులు తమ హడావుడిలో తాముంటూంటే పిల్లలు వాళ్ళ ఆత్మీయతకీ, ప్రాపకానికీ, చేరువకీ దూరం అవుతున్నారు. పిల్లలు ఇంట్లో తక్కువా, బయట ఎక్కువా ఉంటూ స్నేహితులతో కాలక్షేపం చేస్తున్నారు. కృష్ణశాస్త్రిగారు స్నేహితుణ్ణి ''కూరిమి చెలికాడు'' అన్నారు. కానీ ఈ ''బెస్ట్‌ ఫ్రెండ్లూ, ఆరోప్రాణాలూ'' తమ స్నేహితుల బాగు కాంక్షించటం లేదు. వాళ్ళకి అనేక దురలవాట్లని మప్పుతున్నారు. వాటిల్లో ఈ 'డ్రగ్స్‌' మహమ్మారి ఒకటి. ఈ డ్రగ్స్‌కి, మద్యానికి బానిసలై  ఒళ్ళు తెలియని స్థితిలో అతి వేగంగా కారు నడుపుతూ యాక్సిడెంట్లు చేసి తమ ప్రాణాలో, ఎదుటివారి ప్రాణాలో తీస్తున్నారు. దానితో వాళ్ళ అమ్మా నాన్నలకు కడుపుకోత మిగిలుతోంది.

మీద మధ్యతరగతీ (Upper Middle Class) మధ్యతరగతీ కుటుంబాలు చూడండి. తల్లిదండ్రులు ఐ.టి. ఉద్యోగులయితే భార్య పొద్దున్న వెళ్ళి రాత్రి రావడమూ, భర్త రాత్రివెళ్ళి పొద్దున్న రావడమూ అవుతోంది. భార్యాభర్తలు కలిసి కాఫీ అన్నా తాగుతున్నారా? ఏమో! అనుమానమే! ఇంక పిల్లల విషయం - అమ్మానాన్నలు ''కొత్త వ్యక్తులుగా'' తారసపడుతూంటే, పసి జీవితం ఆయాల పెంపకంలో, క్రెష్‌లలో గడిచిపోతోంది. తర్వాతి కాలంలో పిల్లలు కాస్త పెరిగి స్కూలుకి పొద్దున్నే వెళ్ళి, సాయంకాలం వచ్చి, ఇంట్లో ఏ పనివాళ్ళో అల్పాహారం పెడితే తినీ, ట్యూషన్లకి వెళ్ళి, ఇంటికి వచ్చి ట్యూషన్‌ వర్కులూ, స్కూలు హోంవర్కులూ చేసి, రాత్రి వేళకి ఉద్యోగాన్నించి వచ్చిన అమ్మో, నాన్నో ఉంటే వాళ్ళున్న ధ్యాస లేకుండా నాలుగు మెతుకులు కెలికీ, కతుకుతున్నారు. స్కూల్లో తోటి పిల్లల కంటే చదువుల్లో వెనుక ఉండకూడదనే వందకి తొంభైతొమ్మిది మార్కులు రావాలనే తల్లిదండ్రుల ఒత్తిడితో చదువుతున్న చదువుతో, ఒంటబట్టని తిండితో ఏమవుతోందీ? సమయం ఎంతవుతోందీ? గంట తక్కువ 12 గంటలు. ఒళ్ళూ, మెదడూ అలిసి సొలసిపోతే - నెమ్మదిగా నిద్రలోకి జారుకుని నిద్రలో సేదతీరుతున్నారు పిల్లలు. మళ్ళీ ప్రొద్దున్న లేచి, 9 గంటల స్కూలుకి 7 గంటలికే తయారై, లంచ్‌ తీసికెళ్ళి - ఇంటికొచ్చి - చదివీ - మళ్ళీ ...మరోరోజు మళ్ళీ ఇంకో రోజు..షరామామూలే. ఏమీ కొత్తదనం లేదు! ఏమీ చురుకుదనం లేదు. నిస్తేజంగా, నిర్వీర్యంగా, నిరుత్సాహంగా, నీరసంగా, నిరవధికంగా రోజుల మీద రోజులు యాంత్రికంగా సాగిపోతుంటాయ్‌! జీవన విధానంలో ఎండుదనం! మోడుదనం!  ఆప్యాయత, ఆదరణా కరవై, గొంతునొక్కేస్తున్నట్లున్న రొటీన్‌ జీవితం! బయట తెచ్చిపెట్టుకున్న ఆప్యాయత, ఆపేక్షలు స్నేహితుల రూపంలో కనబడుతుంటే వారు చెప్పిందే వేదమై, చూపిందే బాటయై, పిల్లలు దుస్సాంగత్యంతో పెడత్రోవలు తొక్కుతున్నారు. 'డ్రగ్స్‌' మహమ్మారి లేబ్రాయపు జీవితంలోని లోటుపాట్లను పూరించే పరమౌషధంగా కనబడుతోంది! హౌరా! హతవిధీ!

ఈమధ్యనే విదేశీయులు ఈ డ్రగ్స్‌ వాడకాన్ని స్కూలు పిల్లలకి అలవాటు చేస్తున్నారని పోలీసు శాఖ కలుగు జేసుకొని తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ డ్రగ్స్‌ పేర్లు హెరాయిన్‌, భంగ్‌, మారిజూనా, హషీష్‌, చరస్‌, కొకెయిన్‌, నల్లమందు, హుక్కా, గుట్కా, సిగరెట్లూ, మద్యమూ. గుట్కా, సిగరెట్లూ, మద్యమూ డ్రగ్స్‌ కోవకి వస్తాయా అంటే అవికూడా ప్రాణాంతకమైన వ్యసనాలు కదా! పిల్లలు ఈ డ్రగ్స్‌ని సిగరెట్ల లాగా, సిరంజులతోనూ, నాలిక మీద ఉంచుకొనే మాత్రలలాగా, చాక్‌లెట్ల లాగా తీసుకొంటూ వాటికి బాగా అలవాటుపడి అవిలేకపోతే ఉండలేని స్థితికి దిగజారుతున్నారు. ఈ డ్రగ్స్‌ మహమ్మారి విషపు కోరల్లో చిక్కి ఒళ్ళంతా విషమౌతుంటే గాజు గోళాల్లాంటి కళ్ళతో, మసకబారుతున్న మేధతో, క్షీణిస్తున్న ఆరోగ్యంతో, కృశిస్తున్న శరీరంతో జీవచ్ఛవాల్లా మారి తల్లిదండ్రులకి శోకపు చిచ్చు రగులుస్తున్నారు. ''మహా భారతం''లో ''విదురనీతి''లో విదురుడు సప్త వ్యసనాలను గురించి ప్రస్తావించాడు.

           ''వెలది జూదంబు పానంబువేట

            పలుకు ప్రల్లదనంబు దండమ్ము పరుసదనము

            సొమ్ము నిష్ప్రయోజనముగవమ్ముసేత

            అనెడు సప్త వ్యసనముల జనదుతగుల''

(మహాభారతము - తిక్కన - 'విదురనీతి')

''స్త్రీ వ్యామోహమూ, జూదమూ (పేకాట), మద్యపానము, జంతువులని వేటాడమూ మనసు నొప్పించేటట్లు కరకుగా మాట్లాడడమూ, కఠినంగా హింసించడమూ (Torture అన్నమాట), డబ్బుని దుబారాగా ఖర్చుపెట్టడమూ అనే ఏడు వ్యసనాలలో ఇరుక్కోవడం తగదు''.

పిల్లల్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. శౌచగృహం (టాయిలెట్స్‌)లో ఎక్కువసేపు మీ పిల్లాడు (పిల్లా) గడిపినా సూదులూ, గాజుముక్కలూ, ఖాళీసీసాలూ, సిరెంజులూ, అగ్గి పుల్లలూ, సిగరెట్‌ పీకలూ కనబడితే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. మీ పిల్లాడు (పిల్ల) నిస్తేజంగా, బద్ధకంగా ఉన్నా, ఎక్కువ నిద్దరపోతున్నా, తనవాళ్ళతో తక్కువ మాట్లాడుతున్నా గమనించండి. చదువులో శ్రద్ధ లేకపోయినా, చీటికీ మాటికీ చిరాకు చూపిస్తున్నా, స్నేహితులతో ఎక్కువ గడుపుతున్నా గమనించండి. కొన్ని సందర్భాల్లో ఇంట్లోంచి డబ్బూ, దస్కమూ, విలువైన ఆభరణాలు కనబడకపోయినా, పిల్లలు ఎక్కువసార్లు డబ్బు అడుగుతున్నా గమనించండి. పిల్లల్లో ఆకలి మందగించినా, తూకం తగ్గినా వెంటనే తగు చర్యలు తీసుకోండి.

 

తల్లి ఎంత చదివినా ఉద్యోగస్థురాలయినా పిల్లలతో కాస్త గడపగడగాలి. సాధారణంగా పిల్లల్లో ద్వైదీ భావాలు (dualities), భయాలు (Phobias), సందేహాలు (doubts), మొహమాటాలూ, సంకోచాలూ ఉంటూంటాయ్‌! తల్లి చీర చెరగుతో (సెల్వార్‌ కమీజైనా సరే!) ఆడుకుంటూ, తల్లి ఒడిలో తలదాచుకొని తన మనస్సులోని మాట పిల్ల (పిల్లాడు) పైకి చెప్పేస్తే ఆ పిల్ల్లలకి ఎంత నిబ్బరమనీ! ఎంత హాయి అనీ! ఎందుకంటే

డా. సి. నారాయణరెడ్డి గారన్నట్లు

''ఇల్లాలే ఒక తల్లియై - చల్లని మమతల పాలవెల్లియై

తన పాపలాలనలో తాను కరిగిపోతే,

అంతకుమించిన ఆనందం ఆ తల్లికేముంది - ఆతల్లికింకేముంది?

ఈ డ్రగ్స్‌ నిజంగా మహమ్మారే. దీంతో పిల్లలు బరువు తగ్గడం, మతిమరుపు, అమిత చిరాకు చూపటం, చేతుల వణుకూ, మలబద్ధకం, నిద్రలేమి, ఆందోళనతో కూడిన కుంగుబాటు, పెప్టిక్‌ అల్సర్స్‌, కాలేయమూ, గుండె పాడవడం జరుగుతోంది. వీటికి దాసులైతే ఆ వ్యసనం నుంచి బయటపడటం చాలాకష్టం. ఇలా డ్రగ్స్‌ని మాన్పించే చికిత్సలు చేస్తున్న సెంటర్లు అనేకం ఉన్నాయి. కానీ ... 'అడుసు తొక్కనేల - కాలు కడుగనేల?'' - డ్రగ్స్‌ జోలికే వెళ్ళకుండా, డ్రగ్స్‌కి ఛీకొట్టాలి పిల్లలంతానూ!

''అట్టి దురలవాట్లనన్ని మాన్పింపగా

బాలురెపుడు పాటుబడుగ వలయు

మిమ్ముచూచివారు మెచ్చి, సిగ్గుపడుచు

తెలివిదెచ్చుకొంద్రు తెలుగుబిడ్డ''   (నార్ల చిరంజీవి - తెలుగుపూలు)

డ్రగ్స్‌ని బలవంతంగా అలవాటు చేయిస్తున్న రాక్షసులు డ్రగ్స్‌ మానేసిన పిల్లలను చూసి మెచ్చుకొని తమ వికృత చేష్టలకు సిగ్గుపడతారంటారా! ఒఠ్ఠిమాట! వాళ్ళ సంగతి పోలీసులకొదిలేద్దాం.

పిల్లలని క్రమశిక్షణతో కట్టుబాట్లతో పెంచడమంటే వాళ్ళని పుస్తకాల పురుగుల్ని చేసి వేరే ప్రపంచం తెలియకుండా

ఉంచడం కాదు. వాళ్ళనీ, వాళ్ళ ఆసక్తులనీ గమనించి, వాటిని ప్రోత్సహిస్తే వాళ్ళే అనర్ఘ రత్నాలూ, జ్వలించే దివిటీలూ అవుతారు. భారతదేశపు త్రివర్ణ పతాకం ఈ భావి భారత పౌరులని చూసి విజయగర్వంతో గగనవీధిలో రెపరెపలాడుతూ ఎగురుతూనే ఉంటుంది! అందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహమూ, సహకారమూ ఎంతైనా కావాలి. వాళ్ళు పిల్లలకి వెన్నుదన్నుగా, అండదండగా        ఉంటే పిల్లలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది కనుక? అప్పుడు ప్రతీ ఇల్లూ నందనవనమే అవుతుందికదూ!

''చల్లని సంసారం - అనురాగ సుధాసారం

హాయగుకాపురం - అదే సంతోషపు తీరం'' 

(అనిసెట్టి సుబ్బారావు)

సంకలనం- డా శ్రీమతి కె. అరుణా వ్యాస్‌

వార్తావాహిని