యూనిట్

''రావమ్మా మహాలక్ష్ష్మీ రావమ్మా''

మనం నివసిస్తున్న భూమి, స్త్రీ-ఇద్దరూ సృష్టికర్తలే. సమృద్ధికారులే, ''పుడమితల్లికి పురిటినొప్పులు కొత్త సృష్టిని స్ఫురించాయ్‌'' (శ్రీశ్రీ) కాసుల పురుషోత్తమ కవి చెప్పినట్టు ''ఈ సకల చరాచర జంతు చయము'' భూమి సృస్టే మరి. చెట్టూ పుట్ట, ఎలుకా, ఏనుగు, పులీ, సింహం - ఇవన్నీ భూమి చేతలే కదూ! మరి మనిషి మాటో! ఈ సకల మానవ కోటికి స్త్రీయే నిర్మాత. ఆడదే ఆధారం తప్పకుండా అందుకే దేవీస్తుతిలో ''యాదేవి సర్వభూతేషు సృష్టి రూపేణా సంస్థితా'' (ఆ దేవే ప్రాణుల్లో సృష్టిరూపంలో నిలిచింది) అనిస్తుతించారు. ఈ కలికి చిలకల కులికి, ఈ ఆడపిల్ల నిజంగా ''ఆడ'' పిల్లేనండోయ్‌! అంటే అక్కడ పిల్ల. ఎక్కడట? నభోం తరాళ లోన దీప్తించే కాంతి పుంజాల నుంచే భూమిపైకి అవతరించి జనజీవనానికి మూలమై, జనానందానికి నిలయమై, జనాభివృద్ధికి హేతువై, జనహితానికి కారణమైందీ. ''ఆడ''పిల్ల. ఆ పరాశక్తి రూపమే ఈ ఆడపిల్ల. అందుకే ఇలా అన్నారు.

-''విద్యా: సమస్తాస్తవ దేవి భేదా: స్త్రియ: సమస్తా: సకలజగత్సు'' (దేవీ! ఈ లోకంలోని విద్యలన్నీనీ వేరువేరు అంశాలే. అలాగే ఈ లోకంలో స్త్రీలంతానీ వేరువేరుగానీ అంశాలే!)

-నాద బ్రహ్మ త్యాగరాజు రాముడి గురించి పరవశించి పాడుతూ ''అలకలల్లాడగని ఆ రాణ్ముని వెట్లుపొంగెనో'' - ''ఆ రాజర్షి - విశ్వామిత్రుడు పదహైదేళ్ళ రాముడి గిరజాలజుట్టు నుదుటిపైనా వెనుకా ఊగుతోంటే ఎలా మురిసిపోయాడో కదా అని అన్నారు. సాక్ష్యాత్తు పార్వతిదేవిని కూతురిగా పొందిన కొండలరాజు హిమవంతుడూ, లక్ష్మిదేవే సీతగా యజ్ఞభూమిలో కేరింతలతో దొరికితే గుండెలకు పొదువుకుని పెంచిన రాజర్షి జనకమహారాజు ఆ ముద్దుగుమ్మల సొబగులతో,  ''పలుకు తేనెల తల్లు''ల పలుకులతో,  ''కలహంస నడకలలుకు''లు సందడిగా మువ్వల రవళులతో, గాజుల గలగలతో నడయాడుతూంటే, హడావుడి చేస్తూంటే, ఆ పిల్లలు వారి తీవ్ర తప: ఫలాలుగా, వరాల ప్రోవులుగా, అదృష్ట రాశులుగా హిమవంతుడూ, జనకుడూ ఆ బుజ్జి ఆడపిల్లలని చూసి ఎంత పరవశించారో కదా! హిమవంతుడికి మైనాకుడనే కొడుకున్నా పార్వతే ఆయన సర్వస్వం. అందుకే ఆ పర్వతరాజ కుమారి ''పార్వతి'' అయ్యింది. - హిమవంతుని కూతురు ''హైమావతి'', ''గిరిజ'', ''శైలజ'' (గిరికీ, అలాగే శైలానికీ పుట్టింది కదూ) అయ్యింది. జనకుడికి కొడుకులు లేకపోయినా మరోకూతురు ''ఊర్మిళ'' ఉంది. కానీ సీతే జనకుడి పంచప్రాణాలు. అందుకే ఆవిడ ''జానకి'' అయ్యింది. మిథిలరాజు కూతురు ''మైథిలి'' అయ్యింది. విదేహరాజు కూతురు ''వైదేహీ'' అయ్యింది. జనకుడు సీతారాముల పెళ్ళిలో సీతని రాముడికి అప్పగిస్తూ ''ఇయం సీతా మమసుతా'' - ఈ సీత నా కూతురు ''అంటూ ముద్దులగుమ్మ సీతని తన కూతురిగా చెప్పుకుంటూ ఎంత ఆనందించాడో! మిగతా వాళ్ళంతా ఆడపిల్లలని ఇంత అపురూపంగా చూసుకోవాలని ఈ ఇద్దరు రాజులూ తమ పెంపకంతో చూపించారూ, సూచించారు కూడానూ! బమ్మెర పోతన ''భాగవతం'' అనువదిస్తూ లక్ష్మిదేవిని స్తుతిస్తూ ఇలా రాశారు.

 

|| ''హరికిన్‌ పట్టపుదేవి పున్నెముల ప్రోవర్థంపు బెన్నిక్కచం

దురు తో బుట్టువు భారతీగిరి సుతల్‌తో నాడు పూబోడిదా

మరలందుండెడి ముద్దరాలు జగముల్‌ మన్నించు నిల్లాలు భా

సురతన్‌ లేములు వాపు తల్లి సిరిఇచ్చున్‌ నిత్య కల్యాణముల్‌''

లక్ష్మిదేవిటా ''భారతీగిరీ సుతల్‌తో నాడు పూబోడి'' అట! అంటే సరస్వతీ, పార్వతీలతో ఆడుకునే పువ్వువంటి శరీరం గలది.(పూబోడిలోని వ్యాకరణం మరెప్పుడైనా చెబుతానులెండి!) ఏం ఆటలు ఆడేదో మరి! నీలిగగనమే పట్టుపరికిణీగా, నక్షత్రాలే లంగా మీది బుటాలుగా, సూర్యచంద్రుల వెలుగులే రవికెగా, నక్షత్రాలే కందహారంగా లక్ష్మిదేవి అలంకరించుకొని ''ఒసే సరూ! ఒసే పారూ!'' అంటూ సరస్వతీ, పార్వతులతో చెమ్మచెక్కే ఆడిందో, ఒప్పుల కుప్పా ఒయ్యారి భామాయే ఆడిందో! ఆ ముగ్గురు తల్లులు ఆడుతూ ఉంటే వారి కంకణ నిక్పాణాలు, పదమాపుర నిస్వనాలూ వేదఘోషలు కావూ! వారి కంఠహారాల దీప్తుల నుంచీ అనేక పాలపుంతలూ (గెలాక్సీలు) అనేక విశ్వాలు పుట్టటం లేదూ! ఇలాంటి ఆడపిల్లలు ఎవరికివద్దు కనుక! అందరికీ ముద్దు కదూ''!

 ఆడపిల్లల ఉనికే ఒక సందడి - ఒక సంరంభం - ఒక వేడుక! వాళ్ళు అలంకరించుకొనే నగలూ, ఆడుకునే ఆటలూ, పెట్టుకొనే గోరింటాకులూ, బొమ్మల, కొలువుల్లో అమర్చి పేరంటాలూ, అలంకరించే రంగవల్లులూ, అల్లికలతో కుట్లతో అనేక రూపాలసృజన - ఓహ్‌! అన్నీ మురిపాలే! అన్నీ ముచ్చట్లే! ఈ కాలం ఆడపిల్లలకి పరికిణీలూ, చెమ్మచెక్క, ఒప్పులకుప్ప (ఒప్పులకుప్ప అంటే సోయగాల రాశి - ఎంత అందంగా ఉందీ ఈ ఆటలో ఆడపిల్లని పిలవటం!) లాంటి ఆటలు తెలియవంటారా! వాళ్ళ ఆటలు వాళ్ళకున్నాయి కదా!

మన దేశంలో ఇంకా జరుగుతున్న ఈ బాల్య వివాహం ఒక ఆరని చిచ్చు, ఒక వదలని జాడ్యం, ఒక మాయని గాయం. బాలవధువుల విషయంలో మన దేశం ముందంజట! తెలుసా! ఈ మధ్యే విడుదలైన ''జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే'' (2015-2016) నివేదికలో బాల్యవివాహాల గురించి ఇలా ఉంది. మనదేశంలో 47శాతం బాలికలు 18 ఏళ్ళు పూర్తికాకుండానే పెళ్ళికూతుళ్ళవుతున్నారు. బీహార్‌లో 69 శాతం, రాజస్తాన్‌లో 65 శాతం బాల్యవివాహాలు జరుగుతున్నాయి. ఈ పెళ్ళికూతుళ్ళలో కొందరు మైనారిటీ తీరకుండానే తల్లులవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడోవంతు పెళ్ళిళ్ళు బాల్యవివాహాలేనట. బాల్యవివాహ నిరోధ చట్టం (2006) ప్రకారం స్త్రీ వివాహ వయస్సు 18 ఏళ్ళటండోయ్‌! ఆ వయసు రాకుండా జరిగే పెళ్ళి చట్టప్రకారం చెల్లదు. 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే' నివేదిక ప్రకారం తెలంగాణలో 18 ఏళ్ళలోపు జరిగే బాలికల పెళ్ళిళ్ళ శాతం పట్టణాల్లో 15.7, గ్రామాల్లో 35 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ బాల్య వివాహాలు తెలంగాణకంటే ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 18 ఏళ్ళలోపున పెళ్ళయిన వారి శాతం పట్టణాల్లో 26.3 శాతం, గ్రామాల్లో 35.5 గా ఉంది. 18 ఏళ్ళలోపు తల్లులయిన వారిశాతం 11.8గా ఉంది.

బాల్యవివాహాలు అదుపుచేయడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని పథకాలు అమలు చేస్తున్నారు. ఆడపిల్లలను చదివించేవారికి నగదు ప్రోత్సహకాలందిస్తున్నారు. ''ఒక మగ పిల్లవాడిని చదివిస్తే అతనే విద్యావంతుడవుతాడు. ఒక ఆడపిల్లను చదివిస్తే కుటుంబమంతా విద్యావంతులవుతారు''. అన్నం చద్ది అన్నము మూట లాంటి పెద్దల మాట, మహిళా శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ''ధనలక్ష్మి యోజన'', 'అప్నా భేటీ అప్నా ధన్‌', బేటీ బచావో, బేటీ పఢావో'' (''మన ఆడపిల్ల మన ధనం'', ఆడపిల్లని కాపాడుకోండి, ఆడపిల్లని చదివించండి'')

- ఇలాంటివి ఆడపిల్ల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలు. మన దూరదర్శన్‌, ఆకాశవాణి, వార్తా పత్రికలూ, అనేక ఇతర ప్రసార సాధనాలు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలను చక్కగా విశ్లేషించి చెప్తున్నాయ్‌. కాని కొన్ని వర్గాల, కులాల, సాంప్రదాయాల వల్ల ఈ సమస్య పూర్తిగా అమలులోకి రావడం లేదు.

ఆడపిల్ల సమాజ నిర్మాణంలో తానూ ఓ సమిధని ఆహుతవ్వడాన్ని బాల్యవివాహం అడ్డుకుంటోంది. చదువు అర్థాంతరంగా ఆగిపోయి చిన్న వయసులో మానసికంగా, శారీరకంగా ఎదగని పిల్ల తల్లైతే అనేక సమస్యలు దాడి చేస్తాయి. తగిన పరిణితిలేని మొగుడూ పెళ్ళాలు చీటికిమాటికి కొట్టుకుంటారు. గృహహింస, వివాహేతర సంబంధం లాంటి వెర్రిమొర్రి చేష్టలు మొదలవుతాయి. ఆ దంపతుల అభంశుభం ఎరుగని అమాయకపు సంతానం ఏం జరుగుతుందో తెలియని అయోమయపు స్థితికీ, భయాలకూ గురవుతున్నారు. ఈ బాల్య వివాహాల ప్రభావం సమాజం మీదా, దేశం మీద బలంగా పడుతోంది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో బాల్య వివాహాల నిర్మూలన ప్రధాన అజెండాగా మారింది. 2013లో కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ బాల్యవివాహాల నివారణకు ఓ కార్యాచరణ, ప్రణాళిక రూపొందించింది.

మన వైదిక కాలంలో మంత్రదష్టులైన మహిళా మణులు 21 మంది ఉన్నారు. గార్గి, మైత్రేయి మొదలైనవారు. వీరిని ''బ్రహ్మవాదినులు'' అంటారు. అలాగే ఆదిశంకరుల కాలంలో మండవ మిశ్రుడు భార్య

''ఉభయ భారతి'' గొప్ప విమషీ మణీ, చదువులతల్లే మరి! మహాకవి రాజశేఖరుడి భార్య అవంతీసుందరి మహా పండితురాలు విద్యావిశారదే! కవయిత్రి మొల్ల అచ్చంగా మన తెలుగు బిడ్డ రామాయణం రాసింది. అన్నమయ్యలాగే వేంగమాంబ ప్రసిద్ద కవయిత్రి. ఈ నాటికీ వేంకటేశ్వర స్వామికి నైవేద్యం అర్పిస్తూ ఆమె పాట తప్పక గానం చేస్తారు. ముద్దుపళని రంగాజమ్మ శృంగారాన్ని ఎక్కువ పాళ్ళతో కవిత్వంలో చూపారు. భక్తమీరా, భక్తి పారవశ్య పాటలూ, నమ్మాళ్వార్‌ కూతురు ఆండాళ్‌ రాసిన ''తిరుప్పావై'' శ్రీరంగ నాథుడిమీద కూర్చిన 30 -పాశురాలు) తెలియని వారెవరుంటారు, నుక! ఝాన్సీరాణి, రాణీ రుద్రమదేవీలు వీరనారులూ, శూరులూ! భారతాన్ని ప్రధానిగా 17 ఏళ్ళు పాలించిన శ్రీమతి ఇందిరాగాంధీ పరిపాలనదక్షత తెలియనిదెవరికి! అంతరిక్షంలో దూసుకుపోయిన సునీతావిలియమ్స్‌ విజయకేతనం ఎగురవేయలేదూ? భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోని రచయిత్రులూ, కవయిత్రులూ, మహిళా ముఖ్యమంత్రులూ, మహిళా గవర్నర్లూ, ఎవరెస్ట్‌ ఎక్కి స్త్రీజాతి గౌరవం ఆకాశపు టంచులకు తీసుకెళ్ళిన మహిళా మణులు, యుద్ధరంగంలో, విమాన చోదకంలో, పోలీసూ, రెవెన్యూ ఉద్యోగాల్లో, టెన్నిస్‌, బాడ్మింటన్‌, కుస్తి, ఫుట్‌బాల్‌, క్రికెట్‌ - ఇలా క్రీడల్లో ఆకాశపథాన్ని అందుకుంటున్న మహిళా జాతి రత్నాలు - వీళ్లని చూస్తే ఏమనిపిస్తుంది? చిలకమర్తి లక్ష్మినరసింహం గారి పధ్యం గుర్తుకువస్తోంది కదూ!

''చదువన్నేర్తురు పూరుషుల్‌ బలెన్‌ శాస్త్రంబుల్‌ పఠింపించుచో

అదుమన్నేర్తురు శత్రుసేనలను ధనుర్వ్యాపారముల్‌ నేర్పుచో

ఉదితోత్సాహముతోడ నేలగలరుర్విన్‌ ప్రతిష్టింపుచో

ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌''

 (నరకాసురవధ నాటకం - శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం)

 (శాస్త్రాలు చదివిస్తే మగవారిలా చదువుకుంటారు. బాణాలు సంధించి విలువిద్య నేర్పిస్తే (ఇప్పుడు గన్నులూ, రైఫిల్స్‌, ఏకే 47లూ అనుకోండి)

శుత్రసేనలను అంతం చేయగలరు. సింహాసనంమీద కనుక మనం కూర్చోబెడితే - అంటే మరేం లేదు - రాజకీయాలలో చాలా ఉత్సాహంతో ఈ భూమిని ఏలేసే గలరు. ఆడవాళ్ళకి, ముద్దుగా నేర్పిస్తే, వాళ్ళు నేర్వలేని విద్య ఉంటుందా!)

 స్వామి వివేకానందుల వారంటారు ''మీ ఆడవాళ్ళని మొదట చదివించండి వాళ్లని వాళ్ళకే వదిలేయండి. వాళ్ళే వాళ్లకు కావాల్సిన సంస్కరణలేవో చెప్తారు. వాళ్ళ విషయంలో మీ రెవరండీ? (తలదూర్చటానికి)''

 ఆడపిల్ల పుడితే లక్ష్మి పుట్టిందని కొంతమంది మహదానంద పడిపోతారు. అందుకే ఆడపిల్ల రాకని ఆనందనీరాజనంతో ఇలా ఆహ్వానించండి!

''రావమ్మా! మహాలక్ష్మీ రావమ్మా! నీ కోవెల ఈ ఇల్లు

కొలువైవుందువు గానీ!

కొలువైవుందువుగానీ కలుములరాణీ

రావమ్మా, రావమ్మా''

 ఆడపిల్లని రెండుచేతులూ పొదవుకొని, చిలకమర్తి వారన్నట్టు, ముద్దు ముద్దుగా చదువులు నేర్పండి. ఫలితం.. లోకం గర్వించేటట్లు దేశపతాకాన్ని సగర్వంగా ఎగురవేసి జాతి ప్రతిష్టను ఇనుమడించే ఓ ఆడపిల్ల, ఓ నారీ రత్నం, తయారవుతుంది. ఇంకా ఆలస్యమెందుకు? త్వరపడండి! విజయం మీదే!

(ఈ వ్యాసంలో కొన్ని విషయాలను 'ఈనాడు' సౌజన్యంతో తీసుకున్నాను. అందుకు వారికెంతో నా కృతజ్ఞతలు)

డా|| శ్రీమతి కె. అరుణా వ్యాస్‌

వార్తావాహిని