యూనిట్
Flash News
''సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ''
మనిషి సంఘ జీవి.
ఉలిపికట్టెలా వేరుగా, ఒంటరిగా జీవించలేడు. నలుగురితో కలిసి
ఉంటున్నప్పుడు, ఒకటే స్వభావంగల వ్యక్తులు - ఆడవారు గానీ, మగవారు గానీ - ముఖ్యంగా ఒకటే వయసుగలిగిన
వ్యక్తులు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. ఆంగ్లంలో Birds of same feather flock
together అనే సామెత ఎంత నిజమనీ! ఒకరితో నొకరు, భావాలూ, భావోద్వేగాలూ, ఊహలూ పంచుకుంటారు. హృదయాలు విప్పుకుంటారు.
సాన్నిహిత్యం పెరిగి బంధం ఏర్పడుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఆపదలలో
తోడుగా, నీడగా, అండగా, స్థిరంగా, దృఢంగా
నిలబడతారు. ఒకరి హృదయం బరువెక్కితే మరొకరు స్వాంతన చేకూర్చి హృదయాన్ని దూదిపింజలా
చేస్తారు. (అంటే తేలిక చేస్తారన్న మాట!). వాళ్ళ గమ్యాలూ, లక్ష్యాలూ, వీక్షించే
తత్త్వాలూ, సాధించాలనుకొనే విజయాలు ఇంచుమించు సరిసమానమే!
మనస్తత్వంలో, అభిప్రాయాలలో భేదాలున్నా ఆ బంధం వీగిపోనిదీ, మాసిపోనిదీ, తెగిపోనిదీ, నిరంతరమైనదీ. అతడే మిత్రుడు, సఖుడు, స్నేహితుడు, నేస్తం. (ఆడవారయితే మిత్రురాలు, సఖి, స్నేహితురాలు, నేస్తం.)
భర్తృహరి అంటాడు ''తన్మిత్రమాపది సుఖేచ సమక్రియం''
- కష్టాలలోనూ, సుఖాలలోనూ
సమానంగా స్నేహం చేసేవాడే నిజమైన స్నేహితుడు. భర్తృహరి ఇంకా ఇలా అంటాడు - మంచి
స్నేహితుడిలా ఉంటాడట!
|| పాపాన్ని వారయతి, యోజయతేహితాయ
గుహ్యంనిగూహతి, గుణాన్ ప్రకటీకరోతి
ఆపద్గతంచ
నజహాతి, దదాతికాలే
సన్మిత్ర
లక్షణమిదం ప్రవదంతిసంతః || (భర్తృహరి -
సుభాషితం)
''చెడ్డపనులు చేయకుండా అడ్డగిస్తాడు. మంచి పనులకి పురికొల్పుతాడు. (తన
స్నేహితుడిలోని) రహస్యాలను తనలోనే దాచుకుంటాడు. (తన స్నేహితుడి) మంచి గుణాలను
గురించి అందరితోనూ చెప్తాడు. కష్టాలలో ఎప్పుడూ విడిచిపెట్టడు. (అవసరమైనప్పుడు)
కావలసింది ఇస్తాడు. ఇవన్నీ మంచి స్నేహితుడి లక్షణాలని పండితులు చెప్తారు.''
ప్రపంచంలోనే
వాల్మీకి వ్రాసిన మొదటి కావ్యం ''శ్రీమద్రామాయణం'' తీసుకుందాం. సీతను పంచవటి నుంచే రావణుడు
ఎత్తుకుపోతే, సీత జాడకోసం రామలక్ష్మణులిద్దరూ కొండా, గుట్టా, చెట్టూ, చేమా వెతుకుతూ 'కిష్కింథ'కు వస్తారు. చిత్రకూట పర్వతం నుంచి వాళ్ళిద్దరినీ చూసి, తనకు శత్రువైన వాలి పంపాడని సుగ్రీవుడు భయపడితే, సుగ్రీవుడి మంత్రి హనుమంతుడు నచ్చచెప్పి
రామలక్ష్మణులని సుగ్రీవుడితో కలుపుతాడు. దీనివెనుక కథేవిటంటే వాలి అనవసర అనుమానంతో
తన తమ్ముడు సుగ్రీవుడ్ని కొట్టి తరిమేసి, సుగ్రీవుడి
భార్య రుమని తన భార్యగా చేసుకుంటాడు.
వాలీ, సుగ్రీవుడూ, హనుమంతుడూ
మొదలైన వారంతా వానరులు. రాముడు సుగ్రీవుడి ధార్మికతనీ, వాలి అధర్మాన్నీ చిటికెలో గ్రహిస్తాడు.
సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేస్తాడు. సుగ్రీవుడు రాముడి చేతిని తన
చేతిలోకి తీసుకుంటాడు. ఒప్పందం ప్రకారం రాముడు వాలిని చంపి కిష్కింధారాజ్యాన్ని
సుగ్రీవుడికిస్తాడు. సుగ్రీవుడు సీతని వెతకడానికి తన సైన్యం యావత్తూ నాలుగు
దిక్కులా పంపుతాడు. దీన్నే ''సుగ్రీవునాజ్ఞ'' అంటారు. సుగ్రీవుడి మంత్రి ఆంజనేయుడు, ''సంపాతి''
- ('జటాయువు' పక్షి
అన్న) సలహాతో దక్షిణ దిక్కులో ఉన్న లంకకు, సముద్రాన్ని
లంఘించి వెళ్ళి, సీత జాడకనుగొని, సీతమ్మతో
మాట్లాడి, రాముడికి సీత జాడను చెబుతాడు. సుగ్రీవుడు తన
సైన్యంలోని నిపుణులతో లంకకు సముద్రం మీద వారధి నిర్మిస్తాడు. వానరులంతా తలో
చెయ్యివేసి రామకార్యం పూర్తిచేస్తారు. సుగ్రీవుడూ, భల్లూకమైన
జాంబవంతుడూ, హనుమంతుడూ, వాలి
కొడుకు అంగదుడూ, వానర సేన మొత్తమూ రామలక్ష్మణులతో కలిసి లంకలోని
రాక్షస రాజు రావణుడూ, అతని
కొడుకు ఇంద్రజిత్తూ, రాక్షస
సేనలతో పోరాడుతారు. అన్నగారైన రావణున్ని వదిలి తమ్ముడు విభీషణుడు రాముడిని శరణుజొచ్చి, రాముడి పక్షాన పోరాడుతాడు. రామబాణం రావణున్ని
తునుముతుంది (చంపుతుంది). సీతా, రాములు
ఒకటవుతారు. రామ-సుగ్రీవుల మైత్రి సీతారాములని కలిపింది. దుర్మార్గుడైన రావణున్ని
చంపింది. ఈ స్నేహం నిరుపమానం! అద్వితీయం!
బ్రహ్మవిద్య, యోగశాస్త్రమని వ్యాసుడు కీర్తించిన ''భగవద్గీత''ని కృష్ణుడు, అర్జునుడికి
బోధించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పరమాత్మ! ఇంతటి పరమాత్మా పిల్లాడిలా యశోద దగ్గర
గారాలుపోయి, తన ఈడూ, జోడూ, తోడు వారైన గోపబాలకులతో అచ్చం మనలాగే
ఆడుకున్నాడు తెలుసా! వాళ్ళతోబాటు, అంత
మహారాజు - వసుదేవుడి కొడుకు ''వసుదేవసుతం
దేవం'' కూడా గోప బాలురతో
చద్దిఅన్నాలు తిన్నాడట. ఎలా తిన్నాడటా? ఇదిగో
ఇలాగ.
||శ్లో||
ఎండన్
మ్రగ్గి తిరాకటన్‌బడితిరింకేల విలంబింపగా
రండోబాలకులార
చద్దికుడువన్ రమ్యస్థలం బిక్కడే
దండన్
లేగలు నీరుత్రావి ఇరవొందం బచ్చిక మేయుచుం
దండంబై
విహరించుచుండగా అమంద ప్రీతి బక్షింతమే ||
(శ్రీమద్భాగవతము - బమ్మెరపోతన)
ఓ బాలకులారా! మీరా ఎండలో
మగ్గిపోయారు. పైగా ఆకలితో
ఉన్నారు. ఇంకెందుకూ ఆలస్యం? ఈ పక్కనే అందమైన ప్రదేశం
ఉందిస్మీ! రండి, రండి! చద్దన్నాలు తినడానికి. ఇక్కడే దగ్గరలో
లేగదూడలు నీళ్ళు తాగి, సొంపుగా
పచ్చిక మేస్తూ ఓ వరసలో విహరిస్తున్నాయి. ఇంకేం?! పట్టలేనంత
ఇష్టంతో తినేద్దాం! ఏం?
||శ్లో||
యది
దూరం గతః కృష్ణో వన శోభేక్షణాయ తం
అహం
పూర్వం, అహం పూర్వం ఇతి సంస్ప ృస్య రేమిరే
(శ్రీమద్భాగవతము
- వ్యాస మహర్షి)
(ఈ అమాయక
గోపాలబాలురు) అక్కడి తోట సౌందర్యాన్ని చూడడానికి దూరంగా వెళ్ళిన కృష్ణుడిని ''నేను ముందు, ''నేను ముందు'', అని
ముట్టుకొని ఆనందించారు.
చూడండీ! కాంక్రీటు జంగిల్‌లో
కూరుకుపోయి, సిమెంట్ గదుల్లో ఇరుక్కుపోయిన మనందరికీ
శ్రీకృష్ణుడి ప్రకృతి కాలక్షేపం ఓ దొరకలేని, అనుభవించలేని
లగ్జరీ. తన స్నేహితులని కొలను పక్కన కూర్చోబెట్టి - లేగదూడలు నీళ్ళు
తాగుతున్నాయంటే కొలనుందనే కదా అర్థం - పచ్చిక మైదానంలో, తువ్వాయిలు (లేగదూడలు) చెంగున గెంతుతూ, పచ్చిక తీరిగ్గానములుతూ ఉంటే ఎంత కన్నుల
పండుగనీ! శ్రీకృష్ణుడి బెస్ట్ ఫ్రెండ్సూ, ఆరో
ప్రాణాలూ, లేగదూడలూ, గోపబాలురూ
మరి! వాళ్ళ మధ్య చద్దన్నం తింటూంటే ఆసంతోషం పట్టతరమా!
బలరామ, కృష్ణులతో కుచేలుడు కూడా 'సాందీపని' ముని వద్ద విద్యలనభ్యసించాడు. పెద్దవాడై, గృహస్థుడై, నిరుపేద
బతుకునీడుస్తూ, 21 మంది సంతానానికి ఆకలి
తీర్చేమార్గం దొరక్క, చతికిలబడితే
భార్య కృష్ణుడి దగ్గరికి వెళ్ళమంటుంది. పక్కింటి నుంచి నాలుగు పిడికిళ్ళు అటుకులు
అప్పుతెచ్చి, తూట్లుపడిన కుచేలుడి కండువా మడతలు మడచి, ఆ అటుకులు ముడివేసి కృష్ణుడి దగ్గరికి
పంపుతుంది. శ్రీకృష్ణుడు తన వద్దకు వచ్చిన కుచేలుడిని చూసి కౌగలించుకొని, తన ఆసనంపైన కూర్చోబెట్టి, భార్య రుక్మిణి తెచ్చిన పళ్ళెం, నీళ్ళూ తీసుకొని, పళ్ళెంలో
కుచేలుడి పాదాలుంచి, నీళ్ళతో
కుచేలుడి పాదాలు కడిగి, తన
తలమీద ఆ నీటిని చల్లుకుని, కుచేలుడి
అటుకులను తృప్తిగా తిని కుచేలుడికి అష్టైశ్వర్యాలూ ఇస్తాడు. సాధారణంగా ఒక
డబ్బున్నవాడు, ఒక పేదవాడితో స్నేహంచేస్తే - ఆ డబ్బున్నవాడు
యజమానీ, డబ్బులేనివాడు నౌకరూ అవుతారు. ఇది నిజం. అందుకే
స్నేహం అంతస్తుల నెరిగి చేయాలి. కానీ శ్రీకృష్ణపరమాత్మ శ్రీమంతుడైనా, నిరుపేదవాడైన కుచేలుడికి సకలోపచారాలు చేశాడు.
వీవనలు వీచాడు. శ్రీకృష్ణుడు స్నేహానికెప్పుడూ పెద్దపీట వేస్తాడు. స్నేహబంధానికి
కట్టుబడిపోతాడు. స్నేహితుడికి గులాము అవుతాడు.
మహాభారతంలో అర్జునిడి
స్నేహానికి తలవంచిన శ్రీకృష్ణపరమాత్మని చూస్తాం. అంతటి శ్రీకృష్ణుడూ అర్జునుడి
రథానికి మామూలు సారథి అయ్యాడు. అందుకే ఆయన్ని పారవశ్యంతో మనం ''పార్థసారథి'' అని పిలుచుకుంటున్నాం కదూ! అర్జునుడి రథానికి
పూన్చిన గుర్రాలని కడిగాడు. మరి కృష్ణుడా మజాకానా! అర్జునుడు తాను నిల్చున్న
స్థానం నుంచీ తప్పుకున్నప్పుడు, శత్రువులు ''కురుక్షేత్ర యుద్ధం''లో ప్రయోగించిన చాలా బాణాలు కృష్ణుణ్ణి గాయపరుస్తాయి. భీష్మ, ద్రోణ, కర్ణుల
బాణాల శక్తికీ, తేజస్సుకీ అర్జునుడి రథం కాలకుండా కృష్ణుడు
కొన్నాళ్ళు కాపాడి, ఒక
రోజు అర్జునుణ్ణి రథం దిగమని, తర్వాత
తాను దిగంగానే రథం కాలిపోతుంది. అందుకే కృష్ణ నిర్యాణంతో కుప్పకూలిన అర్జునుడు తన
అన్న ధర్మరాజుతో ఈ విషయం చెబుతూ గుండె పగిలేలా రోదిస్తాడు.
||కం||
మన
సారథి, మన సచివుడు
మన
వియ్యము మన సఖుండు మన బాంధవుడున్
మన
విభుడు గురుడుదేవర
మనలను
దిగనాడి చనియె మనుజాధీశా!
(శ్రీమద్భాగవతము - బమ్మెరపోతన)
కృష్ణుడు అర్జునునికి all in all - ఆయనే
సర్వస్వం. ''సర్వము
తానెయైనవాడెవ్వడు'' అర్జునుడికి.
అర్జునుడి alter ego .
అందుకే కృష్ణుడు, ఒకింత
గర్వంతో, తాను పాండవులలో అర్జునుణ్ణి అని చెప్పుకున్నాడు 'భగవద్గీత'లో
- ''పాండవానాం ధనంజయః''. అర్జునుడికి కృష్ణుడు నిజమైన Friend, Philosopher and Guide
సంస్కృతంలో విష్ణుశర్మ రాసిన ''పంచతంత్రం''ని కొంతమార్చి నారాయణ పండితుడు సంస్కృతంలో
''హితోపదేశం'' అని రాశాడు. పరవస్తు చిన్నయసూరి, కందుకూరి వీరేశలింగం గార్లు ఈ 'హితోపదేశా'న్ని తెనిగించారు. అవి నాలుగు భాగాలు. వాటినిండా కంఠతా పట్టవలసిన సూక్తులు, భావ చిత్రాలు, పదాల
గుంఫనా - ఎన్నో! ఎన్నో! పరవస్తు చిన్నయసూరి రాసిన ''మిత్రలాభము''లో నేలమీద చల్లిన గింజలకోసం బూరుగు చెట్టుమీద నివసించే పావురాల గుంపు వాలి
వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంటాయి. పావురాల రాజు చిత్రగ్రీవుడి ప్రాణ స్నేహితుడూ, ఎలుకల రాజూ ఐన హిరణ్యకుడి సహాయంతో బైటపడతాయి. ఈ
కథ మధ్యలో ఎన్ని నీతులు వున్నాయని? ప్రతి
పేరాలోను రెండు, మూడు చెణకులు దొరక్కమానవు. స్నేహం గురించిన
సూక్తులు విందామా! చిత్రగ్రీవుడు - అంటే పావురాల రాజు - ఎలుకల రాజు హిరణ్యకుడిని
తన పళ్ళతో ఆ వలను తెంపమని అడగాలని అనుకొంటుంది. ''లోకమందు
మాతా పితలు, మిత్రుడును
వీరు మువ్వురే హితులు'' అంటుంది.
ఆఖరికి ఎలుకల రాజు హిరణ్యకుడు ఆ వల నంతా కొరికేసి ఆ పావురాలని బంధ విముక్తులను
చేస్తుంది. వాటికంతా ఆతిథ్యమిచ్చి, చిత్రగ్రీవుణ్ణి
కౌగలించుకొని వీడ్కోలిచ్చి పంపుతుంది. A friend in need is a
friend indeed! అనే ఆంగ్ల సూక్తి ఎంతో నిజం కదూ! ఇక్కడ విష్ణుశర్మ
ఇలా అంటాడు. మిత్రలాభము కంటే మించిన లాభము లోకమునందేదియు గానము (చూడము). కాబట్టి ''బుద్ధిమంతుడు పెక్కండ్రు
(చాలామందిని) మిత్రులను సంపాదించుకోవలెను'' అని
అంటాడు. ఇందులో ఇంకా మిత్రుల గురించిన కథలు చాలా ఉన్నాయి. మరెప్పుడైనా
చెప్పుకుందాం!
విలియం షేక్స్‌పియర్ అనే
ప్రపంచ ప్రసిద్ధ మహా నాటక రచయిత తన నాటకాలలో స్నేహం గురించి చాలా ప్రస్తావనలే
చేశాడు. 'మర్చంట్ ఆఫ్ వెనిస్' అనే సుఖాంత నాటకంలో ఆంటోనియో అనే వ్యక్తి ఆ
వెనిస్ నగర వర్తకుడు. తన ప్రాణ మిత్రుడు బసానియో పెళ్ళికోసం, తన ఓడలు సకాలంలో రాకపోవడంచేత, తన శత్రువూ, అతి
దుర్మార్గుడూ అయిన షైలాక్ అనే వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బు అప్పు తీసుకుంటాడు.
షైలాక్ ఆ డబ్బుని ఆంటోనియా 3 నెలల్లో ఇవ్వలేకపోతే ఆంటోనియా గుండె కింద ఒక 'పౌండ్ ఆఫ్ ఫ్లెష్'ని కోసి తీసుకుంటానని ఒక క్రూరమైన ఒప్పందం కుదుర్చుకుంటాడు. బెసానియోకి
పోర్షియో అనే సుందరీ, శ్రీమంతురాలూ, మహా మేధావితో పెళ్ళవుతుంది. ఆంటోనియా ఓడలు
మునిగిపోయాయని వార్త వస్తుంది. ఆంటోనియా అప్పుతీర్చలేక షైలాక్ అడిగిన పౌండ్ ఆఫ్
ఫ్లెష్‌ని ఇవ్వడానికి సిద్ధపడతాడు. బెసానియోకి దిక్కుతోచదు. పోర్షియా లాయరు వేషం
వేసుకొని తన అతి తెలివితో, వాగ్ధాటితో, చాకచక్యంతో షైలాక్‌ను ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్ళు తాగించి, న్యాయమూర్తి అనుమతితో అతని దోషం క్షమించి, నిర్దోషిగా విడుదల చేస్తుంది. షైలాక్ 'బ్రతుకు జీవుడా' అని వెళ్ళిపోతాడు. ఇలాగే షేక్స్‌పియర్ తన 'హామ్లెట్' నాటకంలో యువరాజు హామ్లెట్‌నీ, అతని ప్రాణమిత్రుడు హొరేషియోనీ, వారి గాఢ, పవిత్ర
స్నేహాన్నీ హృద్యంగా చిత్రిస్తాడు.
''సృష్టిలో
తీయనిది స్నేహమేనోయీ'' అన్నారు
ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారు. శ్రీశ్రీ తన మహాప్రస్థానాన్ని ''కొంపెల్ల జనార్దనరావు కోసం'' అంటూ తన మిత్రుడికి అంకితమిస్తాడు. ''తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం'' అంటూ తీవ్రమైన వేదనతో రాస్తాడు శ్రీశ్రీ.
''స్నేహమేరా
జీవితం - స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నాకున్నదీ -
స్నేహమేరా పెన్నిధీ''
అని రాశారు డాక్టర్ సి.
నారాయణ రెడ్డి గారు. స్నేహంలోని ఆత్మీయతని ఆస్వాదిద్దాం, ఆప్యాయతని రెండు చేతులా పొదవుకుందాం, నిజాయితీకి జేజేలు పలుకుదాం! ఏమంటారు?
డా|| శ్రీమతి కె. అరుణా వ్యాస్