యూనిట్
Flash News
ఆడవాళ్ళు - ఆత్మరక్షణ
ఆత్మరక్షణ
అంటే తనని తాను కాపాడుకోవడం. ఇంగ్లీషులో self-defence అంటాం కదూ! మనం
తత్వశాస్త్రంలోని ''ఆత్మ'' జోలికి వెళ్ళి దీన్ని
విశ్లేషించటం లేదు. 'ఆత్మ' అంటే 'తన' అనుకుంటే సరిపోతుంది.
మరి
ఈ ''ఆత్మరక్షణ'' ఆడవాళ్ళకే పరిమితమా? అని ప్రశ్నించుకుందాం!
సృష్టిని తేరిపారి పరిశీలిస్తే మగ జంతువు కానీ, పక్షి కానీ, పురుగు కానీ తమలోని ''ఆడ'' జాతికంటే బలంగా ఉంటాయి.
మనిషి ప్రాణే కాబట్టి మగవాడు ఆడదాని కంటే బలాఢ్యుడే తప్పకుండానూ! ''బలవంతులు దుర్బల జాతిని
బానిసలను గావించారు'' అని
శ్రీశ్రీ అనలేదూ! బలహీనులంటే బలవంతులికి చులకనా, అలుసూ, చిన్నచూపూను. పైగా
జంతువులలోనూ, పక్షులలోనూ
మగవి బావుంటాయి. జూలు దులిపే సింహమూ, పురివిప్పి
ఆడే మగ నెమలీ, నెత్తిమీద
కిరీటంతో 'కొక్కొరోకో' అనే కోడిపుంజూ ఎంతబాగుంటాయినీ! కానీ మనుషుల
మాటో! భగవంతుడు ''స్త్రీత్వం'' లోనే అందమంతా ఇమిడ్చాడు. ఆడతనంలోని సహజాతమైన
సౌందర్యం చాలామంది మగవారిలో మృగాన్ని తట్టి లేపుతుంది. అందుకే దుర్బలురాలైన
స్త్రీకి ఆత్మరక్షణ చాలా అవసరం సుమా!
ఆడదానిపైన 'అత్యాచారం' చేసింది మగాడైనా, ఆ
నేరం తాలూకు గుర్తులు అతనిపైన తేలవు. అతని దౌష్ట్యానికి బలిపశువైన ఆమె మీద
గుర్తులుండిపోతాయి. ఇవి ఆమెను శారీరకంగా, మానసికంగా
వేధించి ఆమె జీవితాన్ని కకావికలు చేస్తుంది. ''నిర్భయ'' కేసునే చూద్దాం. ఆమెపైన అత్యాచారం చేసినవాళ్ళు
అతిఘోరంగా, కనీవినని రీతిలో క్రూరత్వాన్ని ప్రదర్శించారు.
పులి లేత జింకని వేటాడి గోళ్ళతో, కోరలతో
ఆ జింక పొట్టని కెలికి నమిలి, బయటకి
పడేసినట్లు ఆ అమ్మాయి శరీరాన్ని ఛిన్నాభిన్నం చేశారు. ఆ నేరాన్ని గురించి ఇంక ఎక్కువగా
రాయలేను. మనసు ముక్కలవుతోంది! ఆ నేరం చేసిన దుష్టులకి ఏం శిక్ష పడిందని కాదు
ప్రశ్న. ఆ క్రూరత్వానికి ఒక నిండు జీవితం అతి హీనంగా బలైపోయింది. ఆ అమ్మాయి తన
స్నేహితుడితో బస్సులోకి ఎక్కిందా రోజు. తన స్నేహితురాలిపై ఐదుగురు దౌష్ట్యం
జరుపుతుంటే ప్రతిఘటించి, ఆ
ఐదుగురినీ తుక్కుతుక్కుగా కొట్టిపారేయటానికి అతను మన సినిమా హీరో కాదు. ఒక బడుగు
భారతీయ పౌరుడు. అందుకే అతన్ని ఆ ఐదుగురూ కొట్టి పక్కన పడేశారు. వారిలో ఒక మైనరు
బాలుడూ ఉన్నాడు. వాళ్ళు గుచ్చిన రాడ్ ఆ అమ్మాయి పొట్ట చీల్చుకొని వచ్చింది. మన
కావ్య, పురాణాలలోనూ ఎంతటి దుష్టుడైన రాక్షసుడూ ఇంతటి
చిత్రహింస పెట్టలేదు మరి!
నాలుగైదేళ్ళ
క్రితం హైదరాబాద్‌లో (ఇది ఏ ఊరిలోనైనా కావచ్చు) ఒక భార్యా, భర్తా సినిమా చూసి బైక్ మీద తిరిగి వెడుతుంటే
నలుగురు వారిని అడ్డగించి, ఆ
భర్తను చెట్టుకు కట్టేసి, ఆ
నలుగురూ ఆవిడపైన అత్యాచారం జరిపారనే వార్త పత్రికల్లో వచ్చింది. భర్తగానీ, మగతోడు కానీ ఆడదానికి పూర్తి రక్షణ ఇవ్వలేదు.
ఎందుకంటే వీళ్ళు మన సినిమాల్లో అర్థంపర్థంలేని శూరత్వాన్నీ, ధీరత్వాన్నీ ప్రదర్శించి, పదిమంది రౌడీలను ఒక్క చేతితో - వాళ్ళు కత్తులూ, పిస్టోళ్ళతో వచ్చినాసరే - మట్టికరిపించే 'సూపర్ హీరో''లు కారుకదా! నెలల పసికందుల నుంచీ, అరవై
ఏళ్ళ వృద్ధ స్త్రీల వరకూ వదిలిపెట్టని 14ఏళ్ళ
కుర్రాళ్ళ నుంచీ 80 ఏళ్ళ ముసలివారి వరకూ మగవాళ్ళలో ఉన్నారు.
త్రేతాయుగంలోని 'రామాయణం'లో
మహాపతివ్రత సీతని ఒంటరిగా ఉండగా దుష్టుడు రావణాసురుడు ఎత్తుకుపోయాడు. హనుమంతుడు
వారిధి లంఘించి సీత జాడ తెలుసుకోలేక పోయుంటే, ఆ సీతమ్మ తల్లిని తాను తినేస్తానని బెదిరించి, అంతపనీ చేసేవాడు ఆ దుష్ట రాక్షసుడు. రాముడు
లాంటి శూరుడు మరొకడుండడు. కానీ ఆ రాముడు చెంతలేని ఒంటరిదైన సీతకీ తప్పలేదు కదూ ఈ
దుస్థితి. ద్వాపర యుగంలో ''మహాభారతం'' చూద్దాం. పాండవ పట్టమహిషిని, ద్రౌపదినీ, జూదంలో
ధర్మరాజు ఒడ్డి ఓడిపోతే, రజస్వలైన
ద్రౌపదిని దుశ్శాసనుడు జుట్టుపట్టుకొని ''కురువృద్ధుల్
గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండ'' నిండు
సభలోకి ఈడ్చుకుంటూ వచ్చాడు. దుష్టచతుష్టయంలో ఒకడైన కర్ణుడు ఆమె వలువలు ఊడ్చి
వివస్త్రను చేయమన్నాడు. నూరుమంది కౌరవ సోదరులలో ఒకడైన వికర్ణుడు ప్రతిఘటించినా
లాభం లేకపోయింది. శ్రీకృష్ణుడు అడ్డుపడి తన దివ్యశక్తితో అనంతంగా చీరల దొంతరలు
ఇచ్చి ఆమెనీ, ఆమె భర్తల పరువునీ, సభామర్యాదనీ కాపాడాడు కాబట్టి సరిపోయింది కానీ
లేకపోతే ఊహించటానికే ఒళ్ళు జలదరించే ''ద్రౌపదీ కేసు'' అయిపోయేది కదూ! అలాగే వనవాస సమయంలో ఒంటరిగా
ద్రౌపది ఉంటే దుర్యోధనుడి (కౌరవులందరికీ) ఏకైక చెల్లెలు దుస్సల భర్త సైంధవుడు వావీ, వరసా మరచి చెల్లెలి వరసైన ద్రౌపదిని చెరబట్టి
తీసుకుపోతుంటే, భీముడు అడ్డుకుని తగిన శాస్తి చేస్తాడు.
పాండవుల అజ్ఞాతవాస సమయంలో వారంతా విరాటరాజు (ఇతను పాండవుల సామంత రాజు) కొలువులో
ఊడిగంచేస్తూ ఉంటారు. విరాటరాజు భార్య సుధేష్ణ సోదరుడు సింహబలుడనే కీచకుడు
మహాదుర్మార్గుడు. అతను సుధేష్ణకి మాలలను కట్టే సైరంథ్రిగా వచ్చిన ద్రౌపదిపై
కన్నేసి, ఆమె తిరస్కరిస్తే ఆమెను సభలోకి ఈడ్చుకువచ్చి
తోసిపడేస్తాడు. వంటవాడు వలలుడిగా ఉన్న భీముడితో ఆలోచించి, భీముణ్ణి తనలా అలంకరించి, ద్రౌపది కీచకుణ్ణి నర్తనశాలకి (నాట్యం చేసే
ప్రదేశం) ఆ రాత్రి రమ్మంటుంది. భీముడు కీచకుణ్ణి మట్టుబెడతాడు. కీచకుడి శవానికి
ద్రౌపదిని కట్టేసి, అతని
శరీరంతో బాటు ద్రౌపదిని సజీవ దహనం చేసి, పగతీర్చుకోవాలనుకున్న
కీచకుడి నూరుగురి తమ్ములనీ భీముడు చంపేసి, ద్రౌపదిని
రక్షిస్తాడు. అసహాయులూ, అబలలూ
అయిన సీత, ద్రౌపదులకే అవమానాలు తప్పలేదు. కానీ వాళ్ళని
రక్షించడానికి హనుమంతుడూ, శ్రీకృష్ణుడూ, భీముడూ ఉన్నారు. అందరు ఆడవారికీ అటువంటి రక్షణ
కల్పించేవారు ఈనాడు సాధ్యమేనా?
1940వ దశకంలోనే శ్రీ గురజాడ అప్పారావ్ గారు తన 'సౌదామిని' అనే కథలో ఆడవాళ్ళంతా బయటకు వెళ్ళేటప్పుడు తమ
బ్యాగుల్లో చిన్న చాకులు పెట్టుకొని వెళ్ళాలని రాశారు. ఎంత ముందుచూపో చూడండి! ఒక
సినిమాలో ఆ సినిమా హీరోయిన్ ఒక కళాశాలలో లెక్చరర్. తాను పాఠం చెబుతూ వుండే
క్లాసులో తన టేబుల్ పైన ఒక రివాల్వర్ ఉంచి ఇలా అంటుంది. ''సారీ! నన్ను నేను రౌడీలనుంచి
కాపాడుకోడానికి ఈ ఆయుథం తీసుకువచ్చాను'' అని.
ఇలా ప్రతివారికి గన్ లైసెన్సులు పోలీసువారు ఇస్తే ఇబ్బంది కదా అన్నమాట అలా ఉంచితే
ఆడవాళ్ళని వాళ్ళు లెక్చరర్లయినా, ఈ
సమస్య ఎలా బాధిస్తోందో అర్థమవుతోంది కదూ!
అమ్మాయి తనని
రక్షించుకుందుకు ఒక ''స్ప్రే'' తయారు చేశారు. ఆ స్ప్రేని అమ్మాయి దుండగుడి
కళ్ళలో, ఒంటిపైనా చల్లితే అతనికి అరగంట పాటు ఒళ్ళూ, కళ్ళూ మండుతాయి. ఇవి బ్యాగుల్లో పెట్టుకోవచ్చు.
ఈమధ్యనే ''సిటిజన్-ఫ్రెండ్లీ'' విధానంలో భాగంగా హైద్రాబాద్ పోలీసులు ''హాక్-ఐ'' అనే మొబైల్ అప్లికేషన్‌ను
రూపొందించారు. ప్రజలను బాధించే అనేకానేక సామాజిక రుగ్మతలు - మచ్చుకి -
చట్టవిరుద్ధమైన పనులు, ట్రాఫిక్
రూల్స్ పాటించక పోవడం, ఈవ్‌టీజింగ్, నగరం నడిబొడ్డున మద్యపానం చేయడం, వ్యభిచార గృహాల భోగట్టా - మొదలైనవి ఈ హాక్-ఐ
ద్వారా ప్రజలు మిగతావారితో పంచుకోవచ్చు. పైగా పోలీసులు కాస్త అతిగా ప్రవర్తించినా, గీసిన గీటుదాటినా, ఈ 'హాక్-ఐ' చూస్తూనే ఉంటుందండోయ్! ఒక్క బటను నొక్కడం
ఆలస్యం! వెంటనే ఈ 'హాక్-ఐ' సమాచారం పోలీస్ స్టేషన్‌కీ, 'షీటీమ్స్'కీ, పెట్రోల్
మొబైల్స్‌కీ వెళ్ళిపోతుందండోయ్! పోలీసులు ఆఘమేఘాల పైన హాజరవుతారు. ఆటోల్లో, క్యాబ్‌లలో ప్రయాణంచేసే ఆడవాళ్ళు వాహనం
ఎక్కకుండా ముందే తమ స్మార్ట్ ఫోన్ ద్వారా వాహనం నెంబర్‌ను 'హాక్-ఐ'కి
పంపించవచ్చు. మధ్యలో డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తించినా, దిగి వెళ్ళేటప్పుడు వెర్రిమొర్రి వేషాలేసినా ఆ
విషయాన్ని తెలియజేయ వచ్చు. ఆపదలో ఉన్న వాళ్ళెవరైనా సరే ఈ బటన్ నొక్కితే ముందుగానే
రికార్డు చేసిన మెసేజ్ పోలీసులకూ, స్నేహితులకూ, బంధువులకూ వెళ్ళిపోతుంది. ఈ ఎస్.ఎమ్.ఎస్.తో
బాధితుల పేరూ, ఫోన్ నెంబరూ లాంటి విషయాల ఆధారంతో పోలీసులు
వెంటనే ఆపదలో ఉన్న వారిని రక్షిస్తారు.
ఒక్కొక్కసారి పనివారూ, డ్రైవర్లూ, వర్కర్లూ
నేరంచేయటానికి పూనుకోవచ్చు. అందుకే వాళ్ళ వివరాలన్నీ ఈ 'యాప్' ద్వారా - అంటే వాళ్ళ పేర్లూ, ఫొటోలూ, ఫోన్
నెంబర్లూ, అడ్రసులూ, డ్యాటా
బ్యాంక్‌లో దాచుకుంటే నేరం జరిగిన సందర్భాల్లో ఈ వివరాలు ఉపయోగపడతాయి. ప్రతి
పౌరుడూ సివిల్ డ్రస్‌లో ఉన్న పోలీసేమరి! ఈ 'యాప్'వల్ల నేరనిరోధనలోనూ, నేర
పరిశోధనలోనూ ప్రతి వ్యక్తీ పాలుపంచుకోవచ్చు. ఈ 'యాప్'లో పోలీసు అధికారులూ, సిబ్బందీ
ఫోన్ నెంబర్లు దొరుకుతాయి. ప్రజలు చేసే ఫిర్యాదులను స్వీకరించినట్లు 'ఎక్‌నాలెడ్జ్‌మెంటు' కూడా వుంటుంది. ప్రజలు తమ గురించి
తెలుపకూడదనుకుంటే అజ్ఞాత పౌర పోలీసుగా సేవలందించవచ్చుగా! ఈ 'యాప్'ను
ఇప్పటికే లక్షలాది మంది డౌన్‌లోడ్ చేసుకొని బ్రహ్మండమైన ప్రయోజనాన్నీ, ఫలితాన్నీ పొందుతున్నారుస్మీ!
తెలంగాణలో ఆడవాళ్ళ రక్షణా, భద్రతకీ '100' షీటీమ్స్ ఏర్పరిచారు. అవి విజయపథంలో
దూసుకుపోవటం చేత అన్ని జిల్లాలలోనూ మరో '100 షీటీమ్స్' మొదలు
పెట్టారు. ఇప్పుడు హైద్రాబాద్‌లో ఉన్న ఐ.టి. క్యారిడార్‌లో షీటీమ్సూ, షీక్యాబ్స్ ఉన్నాయి. ఎవరైనా అడవాళ్ళని
అల్లరిపెడుతుంటే షీటీమ్స్‌ల రహస్య కెమెరాలు ఆ దృశ్యాలనీ, సన్నివేశాలనీ సాక్ష్యంగా చిత్రీకరించి ఆ
దుండగుల భరతం పడుతున్నాయ్. షీటీమ్‌కు వంతగా, తోడుగా
భరోసా సెంటరూ, ఉమెన్ హెల్ప్‌డెస్క్‌లూ, ఆడవాళ్ళకి వ్యతిరేకంగా జరిగే నేరాల సెల్, డయల్-100 కూడా
ఉన్నాయి. అవసరమైన సందర్భాల్లో అల్లర్లు చేసే ఆకతాయిలను, కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారండోయ్! షీటీమ్స్
పెట్టీ కేసులూ, నిర్భయ కేసులూ, లైంగిక
వేధింపులకి ఇంకా కఠినమైన ఇతర సెక్షన్లు ఉన్నాయ్. 'భరోసా' సెంటర్‌లో ఆడవాళ్ళ అన్ని కేసులూ, ఎటువంటి మినహాయింపులూ లేకుండా, అంటే - శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక, భావోద్రేకాలకు సంబంధించిన వేధింపులను నిశితంగా, నిష్పాక్షికంగా చూస్తున్నాయ్. పైగా పెళ్ళయిన
ఆడవారూ, పెళ్ళికాని పడుచులూ, కులం, మతం
గురించిన వివాదాలని పరిష్కరిస్తూ ఊరట కల్గిస్తున్నాయ్.
పోలీసూ, సైనిక రంగాల్లోని స్త్రీలు గన్నూ, రైఫిళ్ళూ చేతబట్టి ''ఆదమన్నేర్తురు శత్రుసేనలను
ధనుర్వ్యాపారముల్ నేర్పుచో'' అని
చిలకమర్తి వారు అన్నట్లు ప్రవర్తించి మహిళా లోకం తల లెగరేసేటట్లు చేస్తున్నారు
సుమా! కానీ కరాటే నేర్చినా, గన్ను
పట్టడం వచ్చినా ఆడపిల్లలు తమ జాగ్రత్తల్లో ఉండాలి కదూ! చీకటి రాత్రులలో, జనంలేని ప్రదేశాలలో ఒంటరిగా వెళ్ళడం, రాత్రుళ్ళు పబ్‌లకి వెళ్ళడం పూర్తిగా మానాలి.
ఆడవారు ఆధునికత పేరుతో ఉద్రేకం కలిగించే దుస్తులూ, అలంకరణలూ చాలావరకూ మానేస్తే మంచిది కదూ!
ఆడవాళ్ళని చులకనచేసి కించపరచేలా మగవారు మాట్లాడకూడదు. వ్యక్తులుగా - అంటే
శారీరకంగా, మానసికంగా - మగవారూ, ఆడవారు ఒకరినొకరు గౌరవించుకుంటూ, శరీరాన్నీ మనస్సునీ పవిత్రంగా దేవాలయం లాగా, భావించుకుంటూ ఉంటే ఈ అసమానతలు ''ఇంకానా! ఇకపై సాగవు!''. అప్పుడు మగాడు ''మృగాడు'' అవడు కాక అవడు. అప్పుడే మహాత్మా గాంధీజీ
కలలుగన్న స్వాతంత్య్రం, అంటే
ఇలా ''ఎప్పుడైనా అర్థరాత్రి 12 గంటలికి
ఒక స్త్రీ ఒంటినిండా నగలతో తన ఇంటికి సురక్షితంగా చేరితే, ఆరోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం
వచ్చిందనుకుంటాను'' అని
అన్న ఉన్నత భావన నెరవేరినట్లే కదూ! ''స్త్రీలని
గౌరవించు దేశమే దేశము! పడతి ఏడ్చు ఇల్లు వల్లకాడు'' అని త్రికరణ శుద్ధిగా ప్రతీ వ్యక్తీ నమ్మితే
అదే ఆడవాళ్ళకి శ్రీరామరక్ష!
డా|| శ్రీమతి కె. అరుణా వ్యాస్