యూనిట్

ప్రవర్తన

మనిషిని అందలం ఎక్కించేదీ, పాతాళానికి తొక్కేసేదీ కూడా అతని ప్రవర్తనే. ''సర్వేషామపి సర్వ కారణమిదం శీలం పరం భూషణం'' అన్నాడు సుభాషితకారుడు. మంచి ప్రవర్తనే అన్నింటికన్న మిన్న అని భావం.

రాముడి గురించి చెబుతూ ఆయన ''స్మితభాషి'' ''మృదుభాషి'' ''పూర్వభాషి'' అన్నారు. ''స్మితభాషి'' అంటే నవ్వుతూ మాట్లాడేవాడు. రాజు నవ్వుతూ మాట్లాడితే ప్రజల మనసుల్లో భయాందోళనలు పోయి పూలజల్లు కురుస్తుంది. ''మృదుభాషి'' అంటే తాను మెత్తగా నొప్పించకుండా మాట్లాడేవాడు. రాజు మెత్తగా మాట్లాడితే ఆయనతో ఏదైనా చెప్పుకోవచ్చన్న ధైర్యం వస్తుంది. ''పూర్వభాషి'' అంటే మిగతావాళ్ళకంటే తానే ముందు మాట్లాడేవాడు. రాజే ముందు మాట్లాడితే శంకలూ, ఆర్తిపోయి ప్రజలకు తమక్షేమ సమాచారాలు కనుక్కునేవాడున్నాడనే భరోసా ఏర్పడుతుంది.

ప్రజల క్షేమాన్నీ బాగోగులనీ చూసుకొనే ''పోలీసు''లకి కొన్ని పద్ధతులున్నాయి.''బూచి'' యందు రిదిగో ''పోలీసు'లందరు పిరికి మందుపోయు పెద్దవారు''

'బూచి' అంటే బుస్సీదొర. అతని దుశ్చేష్ఠలతో అతను 'బూచి' అయ్యాడు. (క్రమేపి బిచ్చగాళ్ళను ''బూచాడు'' అంటున్నారు.) 'బూచి'లాగే పోలీసు భయం పుట్టిస్తున్నాడు. ''పొడిచిబాధపెట్టు పోలీసువలెగాక'' ఉండాలని అందరి ఆశ. మనిషిని ఉత్తమంగా తీర్చిదిద్దేది అతని వాక్కు అతని మృదు భాషణ.

కేయూరాన విభూషయంతి పురుషం  హారానీచంద్రో జ్వాలా

నస్నానం నవిలేపనం నకుసుమం నాలంకృతామూర్థజా వాణ్యేకాసమలం కరోతి పురుషం యాసంస్కృతా ధార్యతే  క్షీయంతేఖలు భూషణాని సతతం  వాగ్భూషణం భూషణం.

''చేతికి కడియలూ, హారాలు, ఒంటికి స్నానాలు, పైపూతలూ, పువ్వులూ మనిషిని అలంకరించవు. సంస్కరించినమాటే పురుషుణ్ణి అలంకరిస్తోంది. మిగతా భూషణాలన్నీ మంచిమాట ముందు నశిస్తాయి''. చక్కటి మాటతో పలకరిస్తూ ప్రజల సాధక బాధకాలు తనవిగా భావించే పోలీసు ప్రజల తల్లో నాలుకవుతాడు. ఉద్యోగంలో చేరేటప్పుడు ఆశయాలతో, ఆదర్శా లతో చేరతాడు పోలీసు. కాలచక్ర పరిభ్రమణంలో, చేదు అనుభవాల పరికంపనలలో చాలామంది రాటుదేలిపోతున్నారు. ఆశయాలకు నీళ్ళు విడిచేస్తున్నారు. వినయ విధేయతలూ, నీతి నిజాయితీలు పోయి అధికార దర్పం, అవినీతి అలవాటవుతోంది. 

ఒక కర్మాగారంలో పనిచేసే వ్యక్తికంటే, ఒక ప్రభుత్వ కార్యాలయంలోని ఉద్యోగికంటే పోలీసుకి ప్రజలతో సాన్నిహిత్యమెక్కువ. అటువంటప్పుడు 'దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించటం' అతని కనీస ధర్మం. గీతలో కృష్ణుడు చెప్పినట్లు ''పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కుృతాం/ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే''. ''శిష్టులను రక్షించీ, దుష్టులను శిక్షించీ, ధర్మాన్ని నెలకొల్పటానికి యుగయుగంలో పుడుతూవుంటాను'' అన్నాడు గీతాచార్యుడు కృష్ణుడు. ఉత్తమ పోలీసు చేయవలసినది అదే. అవినీతిపరుడైన పోలీసు అధికారి ప్రలోభాలకో, ఒత్తిడిలకోలొంగి దుష్టులను రక్షిస్తున్నాడు. ''వందమంది చెడ్డవాళ్ళు రక్షింపబడవచ్చు ఒక మంచివాడు శిక్షింపబడకూడదు.'' అన్నది ఆర్యోక్తి. ఇది ప్రతి అవినీతి అధికారికీ కనువిప్పు కావాలి. శిక్షింపవలసిన వారిని శిక్షించాలి.

''మండల పతి దండార్హుల దండింపక యుండరాదు. ధారుణీనతడా ఖండల సమానుడైనను మెండగుపాపంబునొంది మెలగు కుమారా!'' ''రాజు శిక్షార్హులని శిక్షించాలి. అలా చెయ్యకపోతే అతడు ఇంద్రుడంతటివాడైనా సరే పాపం పొందుతాడు.'' వ్యసనపరుడైన అధికారి ఉద్యోగంలో రాణించక పోగా తన ఇంట్లో ప్రశాంతతని కోల్పోతాడు. ''విదురనీతి''లో (మహాభారతం) సప్తవ్యవసనాలను గురించి చెబుతూ ఇలా అంటాడు. 

''వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనంబు దండంబుపరుస దనము సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ముసేత''

స్త్రీ వ్యసనమూ, జూదమూ, మద్యాన్ని సేవించటమూ, జంతువులను వేటాడటమూ, కటువుగా మాట్లాడటమూ, కఠినంగా దండించ డమూ, ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టడమూ - ఈ ఏడు సప్త వ్యసనాలని పెద్దలంటారు.

ఈవ్యసనాలలో ఎవరు దేనికి బానిసైనా తనకీ, తనవారికీ, తన ఉద్యోగానికీ ముప్పు తెస్తాడు. ప్రతి పోలీసూ దానిని నివారించాలి.

ప్రతి పోలీసూ 'కంచె చేను మేసే' వైఖరిలోని అక్రమాలనూ, అన్యాయాలను నిర్భీతిగా ఎదిరించాలి. Law protector   ఎప్పటికీ law breaker కాకూడదన్న నియమాన్ని పాటించాలి.

ఈ రోజుల్లో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళూ చీటీలు కట్టడం రివాజు. చీరలు, నగలూ, ఇంటికి కావలసిన వస్తువులకోసం ఇతర విలాసాల కోసం వేలకు వేలు పాడుతారు.ఆ అప్పు తీర్చలేని పరిస్థితులలో భర్త నీతిమంతుడైనా అవినీతి వైపు మొగ్గాల్సిరావడం చూస్తున్నాం. తమ సంస్కారాన్ని సరిగ్గా నడుపగలిగేది నీతిబాటేనని పోలీసు కుటుంబాలు నమ్మాలి. అనవసరమైన ఆర్భాటా లకు పోతే అప్పుల ఊబిలో కూరుకుపోయి అవినీతిని అలవరుచుకొని అవమానాల బారినపడి విపత్కరపరిస్థితులని ఎదుర్కోవలసి వస్తుంది.

సామ్రాజ్యాలు మారి స్వాతంత్య్రం వచ్చి, దశాబ్దాలు గడిచినా అనేక భారీ మార్పులొస్తున్నా ఈ శాస్త్రీయ, కంప్యూటర్‌ యుగంలో పోలీసు వైఖరి మారటంలేదని ప్రజలంటున్నారు. ఆ మాట నిజం కాకపోయినా సరే. ''తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు'' కదా! అవినీతి పంథాను వదిలి, నీతి బాటవైపు సాగిపోతూ జీవితం సుగమం చేసుకొనే పోలీసు అధికారికి ఉద్యోగం మూడు పువ్వులూ, ఆరుకాయలుగా సాగిపోతుంది. ఇది ప్రతి పోలీసు గుర్తుంచుకోవలసిన విషయం!

తమ ఉద్యోగానికి వన్నెతెచ్చే నీతిమంతమైన ప్రవర్తనతో ప్రజల మన్ననలను పొందుతూ ప్రతి పోలీసూ ప్రజాసేవకు అంకితం కావాలి. ఆరోజెంతో దూరం లేదు !!

వార్తావాహిని