యూనిట్
Flash News
కప్పట్రాళ్ళ గ్రామం దత్తత
పగలు, కక్షలతో నిరంతరం ఫాక్షన్ గొడవల్లో , అభివృద్ధికి
ఆమడదూరంలో పెత్తందార్ల నిరంతర శ్రమదోపిడి రాజ్యమేలే కప్పట్రాళ్ళను అభివృద్ధిపథంలో
నిలిపే బృహత్తర ప్రయత్నం చేస్తున్న కర్నూలు జిల్లా ఎస్.పి. ఆకే రవికృష్ణ గారి
కృషి ఈనెల పల్లెపిలుపులో....
కర్నూలు జిల్లా దేవనకొండ
మండలం కప్పట్రాళ్ళ గ్రామం గత నాలుగు దశాబ్దాలుగా ఫాక్షన్ గొడవలతో నిత్యం
వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ ఫాక్షన్ గొడవల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు
ప్రాణాలు కోల్పోయారు. బతకడానికి సరయిన జీవనాధారం లేక ఇళ్ళు గడిచే పరిస్థితి లేని
సమయంలో పెత్తందార్ల వెంట నడిచి వారు చెప్పిన పనిచేస్తూ పొట్టగడుపుకున్న రోజులవి.
చేసేపని తప్పా కాదా అనే ఆలోచనలకు పూర్తిగా స్వస్తి పలికి అధినాయకుని ఆజ్ఞ
పరమావధిగా ఎంతోమంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. కత్తులు, కక్షలు రాజ్యమేలుతున్న కప్పట్రాళ్ళ గ్రామంలో
శాంతిసౌభాగ్యాలు విలసిల్లే పరిస్థితులను కల్పించే లక్ష్యంతో కర్నూలు జిల్లా ఎస్.పి.
ఆకే రవికృష్ణగారు గ్రామాన్ని దతత్త తీసుకున్నారు. ఫాక్షన్ విలేజ్‌ను స్మార్ట్
విలేజ్‌గా మార్చె ఈ ప్రయత్నంలో తన వెంట జిల్లా యంత్రాంగం మొత్తం నడిచే
వాతావరణాన్ని కలిగించారు. కప్పట్రాళ్ళనే కాకుండా జిల్లాల్లో ఉన్న మిగత 72 ఫాక్షన్
పీడిత గ్రామాలను గుర్తించి సత్వరమే నేరాల అదుపునకు కృషి చేయాల్సిందిగా సంబంధిత
ఇన్స్‌పెక్టర్‌లు, సబ్
ఇన్స్‌పెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేశారు.
దత్తత తీసుకున్న కప్పట్రాళ్ళ
గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనే ప్రథమ లక్ష్యంగా ఆకే రవికృష్ణ గారు గ్రామంలో
సిమెంట్, బి.టి.రోడ్డును మరియు ఫాక్షన్ గొడవ కారణంగా
నిర్మాణంలో నిలిచిపోయిన పాఠశాల భవనాన్ని పూర్తిచేయించారు. గ్రామంలో చేపట్టబోయే
వివిధ అభివృద్ధి పనులను ఆయా శాఖల దృష్టికి తీసుకెళ్ళి దగ్గరుండి మరీ అనుమతులు, నిధులు పొందగలిగారు. నిరంతరం కక్షలు, పగలతో రగిలే పల్లెలో శాంతిని పెంపొందించడమే
లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపట్టారు. తరతరాలుగా వెళ్ళూనుకున్న ఫాక్షనిజాన్ని
కూకటివేళ్ళతో పెకలించే ఆశయంతో ఆయన గ్రామంలో ఉన్న యువకులతో సమావేశమయి వారికి ఉపాధి
కల్పించే మార్గాలను చూపే ప్రయత్నం చేశారు. ఆయన నిరంతర కృషి, పట్టుదల వల్ల ఈ గ్రామంలో వివిధ కంపెనీలు జాబ్‌మేళాలు
నిర్వహించి యువకులను తమ కంపెనీల్లో చేర్చుకున్నాయి. గ్రామానికి సమీపంలో ఉన్న 5 సిమెంట్
ఫ్యాక్టరీల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి ఊర్లో 2,500 మీటర్లకు పైగా సిమెంట్ రోడ్ నిర్మాణాన్ని
పూర్తి చేయించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఎస్.పి. రవికృష్ణగారు
కప్పట్రాళ్ళ గ్రామానికి సైకిల్‌యాత్ర చేసిన అనంతరం గ్రామంలో యువకులతో కలిసి
శ్రమదానం చేశారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా కప్పట్రాళ్ళ గ్రామంలో
ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించారు. కప్పట్రాళ్ళ
గ్రామ పాఠశాల భవనానికి భూమిపూజ కార్యక్రమంలో ఎస్.పి.మాట్లాడుతూ మూడేళ్ళ తర్వాత
నేను వేరే జిల్లాకు వెళ్తానని అనుకుంటున్నారు. ఇక్కడే ఉంటా... కప్పట్రాళ్ళ గ్రామ
ఓటరుగా గుర్తింపుకార్డు తెచ్చుకుంటా. ఎకరపొలం కొంటా. ఇళ్లు కూడా కట్టుకుంటా. అని
మనస్ఫూర్తిగా చెప్పిన మాటల్లోనే ఆయన మంచి మనస్సు, కప్పట్రాళ్ల
గ్రామంపై ఆయన పెంచుకున్న ఆత్మీయతకు నిదర్శనంగా చెప్పవచ్చు.