యూనిట్

అన్బురాజన్‌ గ్రామ దత్తత

మాటల్లేవ్‌..మాట్లాడుకోడాలు లేవ్‌... అంతా మాట్లాడేది కత్తులు.. బాంబులు.. సుమోలు గాల్లోకి లేవాల్సిందే.. అలాంటి ఊరిలో ఎంతో మంది మహిళలు, చిన్నారులు తమ కుటుంబంలో ఎవరికి ఏమి ఆపదో వస్తుందో తెలియని పరిస్థితి.. రోజు బిక్కుబిక్కుమంటూ కాలాన్ని వెళ్ళదీస్తుంటారు. గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగే గొడవ, ఘర్షణ ఊరికంతా అంటగట్టి సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది రాయలసీమ ఫ్యాక్షనిజం. 

ఇలాంటి ఫ్యాక్షనిజం వల్ల ఒరిగిందేమి లేదు..  రెండు కుటుంబాలకు ఎలాంటి నష్టము జరుగదూ.. జరిగేనష్టమంతా  వారి అనునాయులకు... సాదాసీదాగా బ్రతికే సామాన్యులకు మాత్రమే.  అడపా దడపా ఫ్యాక్షన్‌ గ్రామాలపై పోలీసు యంత్రాంగం నిఘా పెట్టినా చాపకింద నీరులా ఫ్యాక్షన్‌ గ్రామాన్ని కబలించివేస్తోంది. పట్టుదల, పౌరుషాల నడుమ అభివృద్ధి చెందాల్సిన గ్రామం అట్టడుగు స్థాయికి చేరు తోంది. దీంతో మానవత్వం కలిగిన సామాన్యుల మదిని కదిలించి వేస్తున్నాయి. ఈ ఊరును బాగుచేసే వారు లేరా? ఎవరు మా ఊరిని పట్టించుకునేది? అనుకుంటూ రాలయసీమలో కాలం వెళ్ళదీస్తున్న వారు ఎంతో మంది. కృష్ణదేవరాయలు ఏలిన కాలంలో రాయలసీమను రతనాల సీమగా మార్చారు. అది ఇప్పుడు రాళ్ళసీమగా, బాంబుల సీమగా మారుతోందని సామాన్యుడి ఘోష.

ఆయన ఒక పోలీస్‌ అధికారి. ఫ్యాక్షన్‌ గ్రామాలలో ఆయన చెబితే చాలు ముఠానాయకులకు హడల్‌. విధినిర్వహణలో కటువుగా వ్యవహరించినా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి నిత్యం పరితపిస్తున్నారు. ఫ్యాక్షన్‌ లీడర్లకు  ఒకవైపు కౌన్సిలింగ్‌ ఇస్తూనే మరోవైపు వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నారు. సమాజానికి ఏదో చేయాలన్న తపనతో కడప జిల్లాలోనే  గ్రేడ్‌ - 1 ఫ్యాక్షన్‌ గ్రామంగా పేరొందిన గునకపల్లెను దత్తత తీసుకున్నారు పులివెందుల ఎ.ఎస్‌.పి. అన్బురాజన్‌. గొడవలకు దూరంగా వుండాలంటూ పిలుపునిస్తూనే గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనకోసం కృషి. అంతటితో ఆగక గ్రామస్థులకు ప్రభుత్వ సహాయసహకారాలతో ఉపాధికల్పనకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు ఈ ప్రాంతీయులు గడగడలాడిపోతుంటారు. ఎప్పుడేమి జరుగుతుందోనన్న భయంతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవించేవారు. ప్రధానంగా కడప జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాలు ఫ్యాక్షన్‌ కోరల్లో చిక్కుకుపోయాయి. పదుల సంఖ్యలో ముఠానాయకులతో పాటు ముఠా సభ్యులు ప్రాణాలను కోల్పోయారు. ఎస్‌.పి. ఉమేష్‌చంద్ర హయాంలో కొంతమేర ఫ్యాక్షన్‌ తగ్గినా మళ్ళీ ఫ్యాక్షన్‌ భూతం బుసలు కొట్టింది. అనువైన సమయం దొరికితే చాలు ప్రత్యర్థిని అంతమొందించే ప్రయత్నాలు చాపకిందనీరులా సాగుతూనే వున్నాయి. పోలీసులు తమదైన శైలిలో వ్యవహరిస్తూనే ఫ్యాక్షన్‌ కట్టడికి తమవంతు యత్నాలు సాగిస్తూ వస్తున్నారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం గుణకపల్లె గ్రామం ఏ-గ్రేడ్‌  ఫ్యాక్షన్‌ గ్రామం. 

పోలీసులు ఇరువర్గాలను పిలిపించి పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఫలితంలేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నివురుగప్పిన నిప్పులా వున్న గుణకపల్లెను అభివృద్ధిపథంలో నడిపించేందుకు, ఫ్యాక్షన్‌ నుండి ప్రజలను దూరం చేసేందుకు పులివెందుల అదనపు ఎస్‌.పి. అన్బురాజన్‌ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 2013లో శిక్షణను పూర్తిచేసుకుని సుమారు 7 నెలలు గ్రేహౌండ్స్‌లో అసాల్డ్‌ కమాండ్‌గా పనిచేశారు. అనంతరం చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో ప్రొబేషన్‌ కాలం పూర్తిచేసుకుని తొలిపోస్టింగ్‌ కడప జిల్లా పులివెందుల సబ్‌డివిజన్‌ పోలీసు అధికారిగా బాధ్యతలు చేపట్టారు. నాటినుండి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. విచ్చలవిడిగా సాగుతున్న మట్కా, గ్యాంబ్లింగ్‌, క్రికెట్‌ బెట్టింగ్‌లను నియంత్రించగలిగారు. ముఖ్యంగా గ్యాంబ్లింగ్‌ నిర్వాహకులపై సుమారు 2500ల కేసులు నమోదు చేశారు. దొంగతనాలను 45 శాతం నిరోధించడంతోపాటు 62 శాతం సొమ్మును రికవరీ చేయించారు. ఫ్యాక్షన్‌ లీడర్‌లకు ఒకవైపు కౌన్సిలింగ్‌ ఇస్తూనే మరోవైపు ప్రజలను చైతన్యపరచడం ద్వారా వారిలో మార్పు తీసుకురావాలని భావించారు. అనుకున్నదే తడవుగా తన పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో గుణకపల్లెను దత్తత తీసుకోవాలని భావించి, గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతోపాటు ముఠా తగాదాలతో ప్రజల జీవితాలు నాశనమవుతాయని గ్రహించాడు. స్థానిక సమస్యలతోపాటు విద్యార్థులు, నిరుద్యోగులు పడుతున్న అవస్థలను గమనించారు. విషయాలన్నింటిని ఉన్నతాధికారులకు వివరించి వాటి పరిష్కారానికి నడుం బిగించారు. మొదటగా గ్రామస్థులను ఎంతోకాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యను బోరు వేయించడం ద్వారా తీర్చాడు. శాశ్వత సాగునీటి సరఫరాకు పార్నపల్లె రిజర్వాయర్‌ నుండి ప్రజలకు నీళ్ళందించాల్సిన ఆవశ్యకతను అధికారులకు వివరించి మెప్పించి ఒప్పించారు. సరైన ఉపాధి అవకాశాలు లేక ఆదాయం లేకపోవడం, పెద్దగా చదువుకోకపోవడం తదితరాలు యువతను ఫ్యాక్షన్‌వైపు మళ్ళుతున్నారనే విషయం గ్రహించారు. వెంటనే ప్రభుత్వం నుండి పిల్లలకు మంజూరయ్యే స్కాలర్‌షిప్‌ల వ్యవహారంతోపాటు నిరుద్యోగులకు ఉపాధికల్పన కోసం కృషి చేశారు. ఐటిఐ, బిటెక్‌ చదివిన విద్యార్థులకు తనకు తెలిసిన పరిశ్రమలలో ఉద్యోగాలు యిప్పించేందుకు పాటుపడుతున్నారు. ఫ్యాక్షన్‌ను రూపుమాపేందుకు గ్రామంలో కళాజాతాలు ఏర్పాటు చేయడంతోపాటు నాకాబందీ నిర్వహించడం, ముఠా నేతలకు కౌన్సిలింగ్‌ యివ్వడం లాంటివి చేపడుతున్నారు. తమ పనులన్నింటిని పక్కనపెట్టి వారానికి రెండు సార్లు గుణకపల్లెలో పర్యటిస్తూ అందరిని ఆప్యాయంగా పలుకరిస్తున్నారు ఎ.ఎస్‌.పి. అన్బురాజన్‌. గ్రామంలో రైతులు ప్రధానంగా అరటిని సాగుచేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా కుటీరపరిశ్రమల ఏర్పాటు ద్వారా గ్రామస్థులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నారు. 

ఇంటివద్దనే మహిళలు అరటి బెండునుండి గ్లాసు, గిన్నెలను తయారుచేసే పరిశ్రమల ఏర్పాటుకు సహకారమందిస్తున్నారు. రూ. 6వేలు ఖర్చుచేస్తే చాలు యంత్రంతో గ్లాసులు, ప్లేటు తయారుచేయవచ్చు. దీంతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కు కోవచ్చునని అవగాహన కల్పిస్తున్నారు. కుటీర పరిశ్రమ ఏర్పాటు దిశగా పనిచేస్తున్నారు. గ్రామస్తులకు సుతిమెత్తగా మాటలు చెబుతూనే మాట విననివారికి కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఎదురయ్యే సమ్యలను సైతం వివరిస్తూ చైతన్యపరుస్తున్నారు. చిన్నచిన్న విషయాలకు గొడవలకు దిగవద్దని, సమస్యలుంటే తన వద్దకు వస్తే పరిష్కరిస్తానంటూ హామీ యిస్తున్నారు. ఒకవైపు వృత్తిపట్ల నిబద్ధత, మరోవైపు గ్రామస్థులను ముఠాకక్షలకు దూరం చేయాలనే బలమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. బాధ్యతలు తీసుకున్న ఏడాదికాలంలో గుణకపల్లెలో ఒక చిన్నపాటి ఘర్షణకు కూడా తావివ్వకపోవడం చెప్పుకోదగ్గ అంశం.

దత్తత గ్రామాన్ని అభివృద్ధివైపు పరుగులు తీయిస్తూనే మరోవైపు ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రం, దేశంతోపాటు పలు దేశాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్మగ్లర్లను అరెస్టు చేసే సమయంలో తమపై జరిగే దాడులకు వెరవద్దంటూ ధైర్యం చెబుతూ పోలీసులను ముందుకు తీసుకెళుతున్నారు. తన డివిజన్‌ పరిధిలో ఇప్పటివరకు 120 మందిపై ఎర్రచందనం సస్పెక్ట్‌షీట్‌లను ఓపెన్‌ చేశారు. దీంతో ఎర్రచందనం స్మగ్లర్లు అడవుల్లోకి ప్రవేశించాలంటేనే వణికిపోతున్నారు. ఇదే సమయంలో ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ రవాణాను అడ్డుకోవడంతోపటు ట్రాఫిక్‌ సమస్యను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకువచ్చారు. ఒకవేళ తాను బదిలీపై ఇతర ప్రాంతానికి వెళ్ళినా దత్తత తీసుకున్న గుణకపల్లె గ్రామాన్ని అభివృద్ధివైపు పరుగులు తీయించేలా తాను చేపడుతానంటున్నారు శ్రీమంతుడు అన్బురాజన్‌. 

 

వార్తావాహిని