యూనిట్
Flash News
జనని జన్మ భూమిచ్ఛా
కన్న
తల్లి, కన్న
ఊరు స్వర్గం కంటే గొప్పవి. తల్లి ముఖంలో ఆనందం కోసం... తన ఊరి సంక్షేమం కోసం పాటు
పడే వ్యక్తుల జీవితం ధన్యం. ఈ సత్యాన్ని అక్షరాల నమ్మి ఆచరిస్తున్నారు శ్రీ జె.వి.రాముడు
గారు. బాల్యం నుంచీ తల్లిదండ్రులు నేర్పిన విలువలు... ఊరి ప్రజలు పంచిన
ప్రేమాభిమానాలే నార్శింపల్లి సమగ్ర ప్రగతిపై దృష్టి సారించేలా చేశాయి. ఎంత
ఉన్నతమైన స్థాయిలో ఉన్నా... తాను నడిచి వచ్చిన పల్లె మార్గాన్ని మరచిపోకుండా
తనవంతుగా సహాయపడుతున్నారు. స్నేహానికి, వృత్తి ధర్మానికి, పల్లె ప్రగతికి అత్యంత విలువ ఇచ్చి... తనను
ఇంతటి వ్యక్తిని చేసిన పల్లె తల్లి రుణం తీర్చుకునేందుకు, ఒకవైపు రాష్ట్ర డి.జి.పి.గా కీలక బాధ్యతలు
నిర్వర్తిస్తూనే తన స్వగ్రామమైన నార్శింపల్లి అభివృద్ధికై పాటుపడుతున్నారు.
రాష్ట్ర
ప్రభుత్వ స్మార్ట్ విలేజ్ మిషన్‌లో భాగంగా తన స్వగ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టించారు. వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించారు.
గ్రామంలోని అంతర్గత రోడ్లను సి.సి. రోడ్లుగా రూపుదిద్దారు. నార్శింపల్లి
గ్రామం మీదుగా పరిసర గ్రామాలకు, సమీప మండల కేంద్రాలకు సౌకర్యవంతంగా వెళ్లేలా
తారు రోడ్లు వేయించారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పక్కాగా ఫించన్లు అందేలా
చూస్తున్నారు. గ్రామంలో మూడు బోర్లు వేయించారు. శుద్ధ జలం అందించేందుకు ప్రత్యేక
మినరల్ వాటర్ ప్లాంటును నెలకొల్పారు. మౌళిక వసతులతో పాటు గ్రామంలో ఆదర్శ
విద్యాలయాన్ని నెలకొల్పారు. మన దేశంలో అతితక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే
జిల్లాల్లో మరియు పూర్తిగా వెనుకబడ్డ జిల్లాల జాబితాలో అనంతపురం ముందుంది. ఆ
జిల్లాలో తాడిమర్రి మండలం పూర్తిగా వెనుకబడ్డ మండలం. జలవనరులు, పరిశ్రమలు, గిట్టుబాటు వ్యవసాయం లేమి కారణంగా ఇక్కడ
చదువొక్కటే భావితరాలకు మంచిజీవితం అందిస్తుందని నమ్మి ప్రాథమిక విద్యపై వీరు
దృష్టి సారించారు.
దాని
ఫలితమే ఇంగ్లీష్ మీడియం పాఠశాల. నార్శింపల్లి గ్రామంలోని
నిరుపేద పిల్లలు అనర్ఘళంగా ఇంగ్లీష్ భాషలో
మాట్లాడే విధంగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలను నెలకొల్పారు. సదరు పాఠశాలకు అవసరమైన
స్థలాన్ని ఇచ్చారు.
ఆ
తర్వాత పాఠశాల నిర్మాణంతో పాటు మౌళిక సదు పాయాలు, నాణ్యమైన విద్యకోసం నిష్ణాతులైన
ఉపాధ్యాయుల
నియామకంతోపాటు విద్యార్థులకు భోజన సదుపాయాలు కూడా కల్పించారు. అంతేకాదు గ్రామంలో
ఉన్న నిరుద్యోగ యువతీ యువకుల అభివృద్ధికోసం ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఉన్నత
విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న యువతీ, యువకులు పోటీ పరీక్షల్లో పాల్గొని మంచి
ఉద్యోగాలు సంపాదించేందుకు అవసరమైన నైపుణ్యత, సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఉచిత టైలరింగ్
సెంటర్‌ను నెలకొల్పి యువతులు, మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు.
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఎవరికి వారు సొంత
ఊరి బాగు కోసం శ్రమించాలన్నదే ఆయన నమ్మకం. అందుకే... ఈ ప్రగతి యజ్ఞాన్ని తనతోనే మొదలు
పెట్టారు. తరతరాలు గుర్తుంచుకునే విధంగా అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరాయంగా
నిర్వహిస్తూనే ఉన్నారు. మూడు దశాబ్దాల వెనుకటికి వెళ్లి ఆ గ్రామ పరిస్థితులు తరుచూ
స్మరించుకుంటూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ గ్రామాన్ని అభివృద్ధి పథంలో
పయనించేలా తీర్చిదిద్దారు ఆయన. ఇలా ఎవరైనా అంటే ఆయన మనసులోంచి వచ్చే మాటలు మాత్రం
భిన్నంగా ఉంటాయి. ఈ అభివృద్ధి క్రెడిట్ అంతా ఆ ఊరి ప్రజలదీ, ప్రభుత్వానిదే. ప్రభుత్వం అమలు పరుస్తున్న
వివిధ పథకాలు మరియు దాతల సహకారం, అనంతపురము జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ శ్రీ ఎస్.వి.రాజశేఖరబాబు, ప్రభుత్వ సిబ్బంది , ధర్మవరం శాసనసభ్యుడు వరదాపురం సూర్యనారాయణ
మరియు అక్కడి అధికారుల తోడ్పాటులను సద్వినియోగం చేసుకున్నామే తప్పా క్రెడిట్ నా
ఒక్కడిది మాత్రం కాదని బహిరంగంగా చెబుతుండటం ఆయన విజ్ఞతను తెలియజేస్తుంది.
నార్శింపల్లి గ్రామంలో ఇప్పటి వరకూ సుమారు రూ. 12 కోట్ల విలువ గల పనులు జరిగాయంటే అతిశయోక్తి
కాదు. అంతేకాదు... తన సొంత శాఖలోని పోలీసు సిబ్బంది కోసం అనేక సంక్షేమ
కార్యక్రమాలు అమలు చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని పోలీసు కళ్యాణ మండపాన్ని
నూతన హంగులతో నిర్మిస్తున్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని శ్రీ
సీతారాముల దేవాలయ అభివృద్ధికి పాటు పడ్డారు. అనంతపురము పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఆపదలు, ప్రమాదాల సమయాల్లో వెంటనే మెరుగైన వైద్య సేవలు
అందించేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్ వాహనాన్ని అందుబాటులో ఉండేలా చర్యలు
తీసుకున్నారు.