యూనిట్

విద్యార్థులకు 'భరోసా'నిస్తున్న పోలీసు రామ్మూర్తి-బాహాబాహీకి దిగిన పోలీసులపై చర్యలు

విద్యార్థులకు 'భరోసా'నిస్తున్న పోలీసు రామ్మూర్తి

వృత్తి పరంగా  కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ...ప్రవృత్తి పరంగా  విద్యార్థులకు, సమాజంలో మార్పుకోసం నడుం బిగించాడు కుప్పం, స్పెషల్‌బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ (2949) డి.జి.రామ్మూర్తి. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే భయాందోళనలు పోగొట్టి, వారిలో ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నాడు. పోలీస్‌ డిపార్టుమెంట్‌లో తీరికలేని సమయాన్ని గడుపుతూ దొరికిన కొద్దిపాటి సమయాన్ని సమాజ మార్పునుకు తనవంతు కృషి చేస్తున్నారు. ఇటు విద్యార్థులకే కాకుండా, అటు అటవీ సంరక్షణను ఎర్రచందనం దుంగల పేరుతో అడవులను నరికివేస్తున్న వారిలో మార్పుకోసం ఎన్నో చైతన్యవంత కార్యక్రమాలు చేపట్టారు. ఎర్రచందనం ఎక్కువగా ఉండే పరిసర గ్రామాల్లో పోలీసులు చేపట్టే కార్యక్రమాల్లో హెడ్‌కానిస్టేబుల్‌ రామ్మూర్తి బహిరంగ సభలు నిర్వహిస్తు వస్తున్నారు. పరీక్షలు అనగానే విద్యార్థులకు ఏదో భయం, నిత్యం చదివిన పుస్తకంలోని అంశాలే కదా పరీక్షల్లో రాసేది అన్న అభిప్రాయం ఉంటే కచ్చితంగా విజేతలు అవుతారని రామ్మూర్తి విద్యార్థులకు భరోసా నిస్తారు. తరగతి గది తరగని నిధి. అందులో నేర్చుకున్న అంశాలే సమాధాన పత్రాల్లో రాస్తామన్న భావం ఉండాలి. గణితం, భౌతికం అంటే భయం అన్న భావన ఉన్న వారు ఓ సారి స్టీఫెన్‌హాకింగ్‌ను గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. అందరికీ మెదడులో 11వేల కోట్ల అయాన్‌ శక్తి ఉంటుందని 1 శాతం ఉపయోగించుకుంటే ఉపాధ్యాయుడు అవుతారని 3 శాతం ఉపయోగించుకున్న వారు ఐ.ఏ.ఎస్‌.లు అవుతున్నారన్నారు. చడవడానికి డబ్బు కాదని ఆసక్తి ఉండాలని చెబుతారు. విద్యార్థులను వేదికమీదకు ఆహ్వానించి మాట్లాడించి భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.  ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రేవతి ఫౌండేషన్‌ పేరుతో ఒక చిన్నపాటి సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు తనవంతు సాయంగా నగదు బహుమతులు, జ్ఞాపికలు లాంటివి ఇస్తూ ముందుకు పోతున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో రాష్ట్ర డిజిపి శ్రీ జె.వి.రాముడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎర్రచందనం సంపదను  కాపాడుటకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని అందరినీ చైతన్యవంతులను చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలకొద్ది చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు హెడ్‌కానిస్టేబుల్‌ రామ్మూర్తి. రాష్ట్రంలోని సీనియర్‌ పోలీసు అధికారుల మన్ననలు పొందారు. 

బాహాబాహీకి దిగిన పోలీసులపై చర్యలు

ప్రజల శాంతిభద్రతలు, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించవలసిన పోలీసులే చిత్తుగా మద్యం తాగి వీధుల్లో పడి కొట్టుకుని పోలీసులంటేనే ప్రజలకు ఎవగింపు కలిగేలా ప్రవర్తించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న నరసింహరావు, కానిస్టేబుల్‌ విద్యానిధి బార్‌లో మద్యం తాగి ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో బార్‌లోని ఫర్నీచర్‌, ఇతర ఆస్తులు ధ్వంసమయ్యాయని సదరు బార్‌ యజమాని గగ్గోలు పెడుతూ స్టేషన్‌ చేరుకున్నా ఫిర్యాదు స్వీకరించకుండా పంపించారు. ఈ రెండు సంఘటనలను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్‌.పి. భాస్కర్‌ భూషణ్‌ చర్యలు తీసుకున్నారు. ఏలూరు డిఎస్‌పిని విచారణ చేయాల్సిందిగా ఆదేశిం చారు. బుట్టాయగూడెం పోలీస్‌స్టేషన్‌లో పోస్టింగ్‌ ఉండగా డిప్యూటేషన్‌పై ఏలూరు టూటౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎఎస్‌ఐని తిరిగి బుట్టాయగూడెంకు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక టూటౌన్‌ కానిస్టేబుల్‌ విద్యానిధిని విఆర్‌కు పంపారు. డిఎస్‌పి విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించిన వెంటనే వీరిద్దరిపై మరిన్ని తీవ్ర చర్యలు తీసుకుంటా మని ఎస్‌.పి. తెలిపారు. అలాగే బార్‌ యజమాని వద్ద ఫిర్యాదు తీసుకోకుండా వెనక్కు పంపించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోనున్నారు.నీతి నిజాయితీ, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న పోలీస్‌ వ్యవస్థకు మచ్చ తీసుకువస్తున్న ఇలాంటి చీడపురుగులను ఏరి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

వార్తావాహిని