యూనిట్

బంధువే రాబందు

విజయవాడ కమిషనరేట్‌ పరిధి కంకిపాడులో ది. 28-02-2017న రాత్రి గృహిణిని హత్యచేసి ఇల్లుదోపిడి చేసిన సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. హత్య కావింపడిన మహిళ పేరు కర్రి శ్రీదేవి. ఆ రోజు భర్త కర్రి శ్రీనివాసరెడ్డి తన రోజువారీ ఫైనాన్స్‌ వసూళ్ళు చేసుకొని ఇంటికి చేరుకోగా, తాళం వేసి ఉండి భార్య సమాచారం లేకపోవడంతో తాళం బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్ళాడు. భార్య శ్రీదేవిని ఎవరో గొంతునొక్కి హత్యచేసి, బీరువాలోని ఇతర గదులలోని అరకిలో బంగారు నగలు, రెండు కిలోల వెండివస్తువులతో పాటుగా రెండు లక్షల తొంబైవేల నగదు దోచుకుపోయినట్టు గుర్తించి వెంటనే శ్రీనివాస్‌ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

క్లూస్‌టీం అణువణువూ శోధించి ఫింగర్‌ ప్రింట్స్‌ సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌ నేరస్థుల ఆచూకీకై చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. తదుపరి దర్యాప్తు విజయవాడ క్రైం ఏసీపీ శ్రీ పోతురాజు ఆధ్వర్యంలోని బృందం చేపట్టింది. నేరం జరిగిన విధానాన్ని బట్టి ఇది ప్రొఫెషనల్‌ గ్యాంగ్‌ పనిగా తలచినపోలీసులు, వచ్చిన ఆగంతకులకు శ్రీదేవి టీ పెట్టి ఇచ్చినట్లు, తాగివదిలిన కప్పులవలన నిర్ధారణ అవ్వడంతో ఇందులో తెలిసినవారి హస్తం ఉండవచ్చునన్న అభిప్రాయానికి వచ్చారు. శ్రీనివాసరెడ్డిని ఎవరిపైనైనా అనుమానం ఉన్నదా? అని అడుగగా... హత్యకు దారితీసేంత గొడవలు ఎవరితోనూ లేవని చెప్పాడు. ఎందుకైనా మంచిదని శ్రీనివాసరెడ్డి మరియు అతని పరిచయస్థులైన కొంత మంది సెల్‌ ఫోన్‌ కాల్స్‌ సిడిఆర్‌కు కోరారు. చుట్టుపక్కల వారిని విచారించగా రాత్రి సుమారు 7 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఒక మహిళ శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చి వెళ్ళినట్లుగా సమాచారం తెలిసింది.

ఆ ఏరియాలోనూ బస్టాండ్‌ సమీపంలోని వాణిజ్యసముదాయాల సిసి టీవీ పుటేజ్‌ పరిశీలించడం ద్వారా ఆ నలుగురు ఒక ఆటోలో విజయవాడవైపు వెళ్ళినట్లుగా కనిపించింది. రాత్రి సమయం కావడంతో వారిని గుర్తించడం కష్టమైంది. ఆటో నంబరును బట్టి డ్రైవర్‌ను విచారించగా ఆ రోజు ముగ్గురు మగవారు ఒక మహిళ తన ఆటో ఎక్కి విజయవాడ తీసుకెళ్ళమన్నారని, నాది లోకల్‌ ఆటో నేను అంతదూరం వెళ్ళను అనగా ముప్పై రూపాయలు ఇచ్చి మధ్యలో దిగిపోయి. వేరే ఆటో ఎక్కి వెళ్ళిపోయారు అని అటో డ్రైవర్‌ చెప్పాడు. మరింత తరచి ప్రశ్నించగా వారిలో ఒక అతను మాత్రం గోదావరి జిల్లా యాసలో మాట్లాడుతున్నట్లుగా గుర్తుచేసుకున్నాడు. దర్యాప్తు బృందం తన పరిశోధనను శ్రీనివాసరెడ్డి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా పసలపూడి గ్రామంపై కేంద్రీకరించింది. ఆ కుటుంబంతో గ్రామంలో ఎవరికైనా తగాదాలు, కొట్లాటలు గానీ, తీవ్ర వైషమ్యాలుగానీ ఉన్నాయా అని ఆరా తీశారు. ఇక్కడ గ్రామంలో ఎవరితోనూ విభేదాలు లేవని విజయవాడ సమీపంలోని చల్లపల్లిలో ఉంటున్న బావ వరుసఅయిన సూర్రెడ్డితో ఫైనాన్స్‌ వ్యాపారంలో తేడాలు వచ్చినట్లు సమాచారం వచ్చింది.

దీనిపై శ్రీనివాసరెడ్డిని సంప్రదించగా సూర్రెడ్డి తాను కలిసి గతంలో రోజువారీ ఫైనాన్స్‌ వ్యాపారం చేశామని, విభేదాలు రావడంతో సామరస్యపూర్వకంగా విడిపోయి విడివిడిగా వ్యాపారాలు చేసుకుంటున్నామని చెప్పాడు. సూర్రెడ్డితో కుటుంబ బంధుత్వం బాగానే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశాడు. అయినప్పటికీ సూర్రెడ్డి కాల్‌ డిటైల్స్‌ సేకరించి పరిశీలించిన పోలీసులకు హత్యజరిగిన రోజు, హత్య జరిగిన సమయానికి కొద్ది గంటల ముందు నుండి అర్థరాత్రి వరకు సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌లో ఉండడం ఆకర్షించింది. దీనిపై మరింత లోతుగా విశ్లేషించగా తరచుగా సిమ్‌లు మార్చుతుండడం, కొత్తవ్యక్తులతో మాట్లాడుతుండడం వెలుగులోకివచ్చింది.

హత్యకు ముందు కంకిపాడు వచ్చి సూర్రెడ్డి రెక్కీనిర్వహించి వెళ్ళినట్లుగా నిర్ధారణచేసుకున్న పోలీసులు సూర్రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నల వర్షం కురిపించారు. హత్యకు ఎంతో పగడ్బందీ పథకం రూపొందించి ఆచరించిన సూర్రెడ్డి ఇక్కడ కూడా అతి తెలివి చూపాలకున్నాడు. కానీ, పోలీసులముందు ఆటలు సాగలేదు. వ్యాపార లావాదేవీలలో వచ్చిన స్పర్థలతో బావమర్ది శ్రీనివాసరెడ్డిపై అసూయ పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డ సూర్రెడ్డి తన నేరాన్ని ఒప్పుకున్నాడు.

సూర్రెడ్డి వరుసకు బావైన శ్రీనివాసరెడ్డితో కలిసి 2004వ సంవత్సరంలో చల్లపల్లి ఏరియాలో రోజువారీ ఫైనాన్స్‌ వడ్డీ వ్యాపారం మొదలుపెట్టాడు. వీరిద్దరి స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా పసలపూడి. కొంత కాలం తరువాత విభేదాలు రావడంతో కుటుంబ పెద్దల సమక్షంలో సామరస్యపూర్వకంగా విడిపోయి, ఇరువురు విడివిడిగా వ్యాపారం చేసుకుంటున్నారు. 2013లో సూర్రెడ్డి చల్లపల్లిలో ఇల్లుకొన్నాడు. అందునిమిత్తం ఎక్కువ వడ్డీపై రూ. 10 లక్షల అప్పు చేశాడు. ఈ లోగా శ్రీనివాసరెడ్డి గతంలో సూర్రెడ్డి వద్ద పనిచేసిన గుమస్తాను తన వద్ద కుదుర్చుకుని సూర్రెడ్డి ఏరియాలోనే పోటీగా వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నాడు. దీనితో సూర్రెడ్డికి వ్యాపారంలో బాగా నష్టాలు వచ్చాయి. మరోవైపు శ్రీనివాసరెడ్డి వ్యాపారంలో బాగా పుంజుకొని స్వగ్రామంలో 40 లక్షలతో ఇల్లుకట్టించాడు. రెండు మూడు నెలల్లో కుటుంబంతో సహా శ్రీనివాసరెడ్డి పసలపూడికి మకాం మార్చేయనున్నాడని తెలుసుకొన్న సూర్రెడ్డి ఈ లోపుగానే తన బావమర్ది ఇంట్లో భారీగా ఉండే నగదు బంగారాన్ని తలచుకొని తన అప్పులు తీర్చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. సాయంత్రం బాకీ వసూళ్ళకు వెళ్లి ఏ అర్థరాత్రో శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరుతాడని, అతని భార్య శ్రీదేవి ఒక్కతే ఇంట్లో ఉంటుందని ఆమెను హతమార్చి ఇంట్లోని సొత్తు దోచుకోవాలని పథకం వేశాడు.

ముందుగా ది. 15-02-2017 తేదీ ఉదయం సుమారు ఉదయం 10 గంటల సమయంలో సూర్రెడ్డి తన భార్యను తీసుకొని చుట్టపుచూపుగా శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆమె కుమారుడితో కలిసి తెలిసిన వారింట్లో పెళ్ళికి వెళ్ళే హడావుడిలో ఉన్నది. శ్రీదేవి వారిరువురికీ టీపెట్టి ఇచ్చింది. ఆ సమయంలో శ్రీదేవి ఒంటినిండా బంగారు నగలు అలంకరించుకొని ఉండటంతో సూర్రెడ్డికి తను ఊహించినదానికంటే ఎక్కువ సొత్తు ఇంట్లో దొరుకుతుందని నమ్మకం కలిగింది. అక్కడి నుండి వచ్చిన తరువాత ఈ పథకం తన ఒక్కడివల్ల సాధ్యపడదని, తన వద్ద డబ్బు అప్పుగా తీసుకొనే గుంటూరు జిల్లా పెదపులివర్రుకు చెందిన కంచర్ల జ్యోతితో సంప్రదించాడు.

మరో ఇద్దరు నమ్మకమైనవారిని చూడమని, పని పూర్తయిన తరువాత మనిషికి లక్ష రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. జ్యోతి తన తమ్ముడు పరికి భాషా, పెద్దమ్మ కొడుకు బూసి జయకృష్ణను ఈ పనికి అంగీకరింపచేసింది. ఈ పథకం రచించినప్పటినుండి సూర్రెడ్డితో సహా మిగిలిన ముగ్గురూ కూడా కొత్త సిమ్‌లద్వారా సంప్రదింపులు జరుపుకునేవారు. ది. 28-02-2017 సాయంత్రం నాలుగ్గంటలకల్లా ముగ్గురూ చల్లపల్లి బస్టాండ్‌ వద్దకు రమ్మని, జ్యోతిని పంజాబీ డ్రస్‌ వేసుకు రమ్మని ఎవరూ ఫోన్లు తేవద్దని జ్యోతికి ఫోన్‌ చేసి చెప్పాడు. సూర్రెడ్డి కూడా ఫోన్‌ క్రిందపడి పనిచేయడంలేదని భార్యకు చెప్పి, ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి ఇంట్లో పెట్టి వచ్చి అనుకున్న సమయానికి బస్టాండ్‌లో వారిని కలిశాడు. అక్కడే రోడ్డు ప్రక్కన కత్తులు అమ్మేవాడిదగ్గర ఒక కత్తిని కొని సూర్రెడ్డి తన కర్రల సంచిలో వేసుకున్నాడు. వీరంతా అక్కడే బస్సెక్కి కూచిపూడి బస్టాండ్‌లో దిగారు. శ్రీదేవి కాకుండా ఇంట్లో ఇంకా ఎవరైనా ఉంటే కత్తితో పొడవడంగానీ, నోట్లో పురుగుల మందు పోయడంతో గానీ చంపాలన్న ఉద్దేశ్యంతో రూ. 200పెట్టి పురుగుల మందు కొన్నారు. అక్కడ బస్సెక్కి కంకిపాడులో దిగారు. బస్టాండ్‌ వద్ద ఆటో ఎక్కి కంకిపాడు పెట్రోల్‌ బంకు వద్ద దిగారు ఆ నలుగురు. ఎవరూ గుర్తుపట్టకుండా సూర్రెడ్డి క్యాప్‌ పెట్టుకుని ముందు నడువగా, ముగ్గురు అతనిని అనుసరించారు.

శ్రీనివాసరెడ్డి ఇంటి మేడమెట్లు ఎక్కుతున్నప్పుడు క్రింద ఇంట్లో ఆడమనిషి చూసింది కానీ, చీకటివల్ల గుర్తుపట్టలేదు. తలుపు కొట్టగా శ్రీదేవి ఎవరూ అని అడగడంతో 'నేను సూర్రెడ్డి అన్నయ్యను' అని చెప్పడంతో తలుపు తీసింది. తెలిసిన వారితో పనిమీద విజయవాడ వెళ్లివస్తూ, ఇలా వచ్చామని చెప్పడంతో శ్రీదేవి వారికి టీ పెట్టి ఇచ్చింది. 'పూజ మధ్యలో వదిలి వచ్చాను.. పూర్తిచేసి వస్తాను' అని చెప్పి శ్రీదేవి పూజగదిలోకి వెళుతుండగా వెనకనే అనుసరించిన సూర్రెడ్డి ఒక్క ఉదుటున వెనుకనుండి శ్రీదేవి నోరు గట్టిగా మూసారు. మిగతా ముగ్గురుకూడా వచ్చి సూర్రెడ్డిని జతకలిశారు. జ్యోతి... శ్రీదేవి కాళ్ళు పట్టుకోగా మగవాళ్లు ఆమె నోరు మూసి గొంతు గట్టిగా నొక్కడంతో స్పృహతప్పి పడిపోయింది. బ్రతికి ఉందేమో అన్న అనుమానంతో జ్యోతి తన చున్నీతో శ్రీదేవి మెడకు గట్టిగా చుట్టి బలంగా లాగారు. శ్రీదేవి చనిపోయిందని నిర్ధారించుకున్నారు. అనంతరం బీరువాలోను, ఇతర గదుల్లో ఉన్న బంగారు నగలు వెండి వస్తువులు, డబ్బు దోచుకోవడంతో పాటు శ్రీదేవి ఒంటిపై నగలను కూడా వలుచుకున్నారు. పనిపూర్తయిన మీదట బయటకు వచ్చి తలుపులకు తాళంవేసి క్రిందకు దిగారు. కనిపించిన ఆటో ఎక్కి విజయవాడ వెళ్ళాలన్నారు. లోకల్‌ ఆటో కావడం వల్ల విజయవాడ రాలేనని డ్రైవర్‌ చెప్పిన మీదట మధ్యలోనే దిగిపోయి వేరే ఆటోఎక్కి ఉయ్యూరు వరకు వెళ్ళారు. అక్కడ మరో ఆటో ఎక్కి రాత్రి 8 గంటల సమయంలో పామర్రు బస్టాండ్‌ వద్ద దిగారు. అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న అవనిగడ్డ బస్సెక్కి వెనుక సీట్లలో కూర్చున్నారు.

సూర్రెడ్డి బాక్స్‌లలో ఉన్న నగలను తీసి తన కర్రల సంచిలో వేసుకుని బాక్సులను కిటికీలోంచి బయట పారవేశాడు. జ్యోతి, భాషా, జయకృష్ణలకు దొంగిలించిన డబ్బుల్లోంచి తలా 50,000లు ఇచ్చాడు. రాత్రి 9.30 సమయంలో చల్లపల్లిలో సూర్రెడ్డి దిగగా, మిగిలిన ముగ్గురు అదే బస్సులో వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన తరువాత ఆ కర్రల సంచిని ఎవరికీ కనిపించకుండా గదిలోని సన్‌సైడ్‌పై దాచాడు. ది. 04-04-2017న కొన్ని బంగారు నగలను తీసుకుని తన వద్ద గుమస్తాగా చేస్తున్న సూరగాని సుబ్బారావుద్వారా మణప్పురం ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టించి రెండు లక్షల నలభైవేల రెండు వందలు తీసుకున్నాడు. మరికొన్ని నగలను బడుగు పిచ్చేశ్వరరావు అనేవానిద్వారా సిండికేట్‌ బ్యాంక్‌లో తాకట్టు పెట్టించి లక్షా అరవైవేలు తీసుకున్నాడు. సమయం చూసి మిగిలిన నగలను కూడా కొద్దిరోజులలో అమ్మడం కానీ, తాకట్టుపెట్టడం గానీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు.

ఎంతో అనుభవం ఉన్న అంతరాష్ట్ర బందిపోటు ముఠాలకు మించిన పన్నాగంతో హత్య, దోపిడికి పాల్పడిన ఈ నలుగురు నిందితులు పోలీసుల పరిశోధనా, నైపుణ్య ప్రతిభవల్ల కారాగార వాసానికి వెళ్ళక తప్పలేదు. ఈ అత్యుత్తమ విధినిర్వహణకు గాను విజయవాడ ఏసీపీ శ్రీ పోతురాజు, ఎస్సైలు టివివి రామారావు, చిట్టిబాబులతో కూడిన దర్యాప్తుల బృందం రాష్ట్ర డిజిపి శ్రీ యన్‌. సాంబశివరావుగారి చేతుల మీదుగా ఏబిసిడి అవార్డ్స్‌లో మూడవ బహుమతిని పొందిన రెండవ టీంగా నిలిచింది.  

వార్తావాహిని