యూనిట్

ఆసరాగా వున్నాడు- ఆయువునే తీశాడు

విశాఖజిల్లా కశింకోట మండలం కన్నూరుపాలెం శివారు పొలాలలో గుర్తుతెలియని యువతి శవం కాలిపోయిన స్థితిలో వున్నదన్న సమాచారం తెలియడంతో కశింకోట ఎస్‌.ఐ. మధుసూదనరావు తన సిబ్బందితో వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మొదట సదరు సమాచారాన్ని రూరల్‌ సి.ఐ. రామచంద్రరావుకు తెలియజేశారు. యువతి ఒంటిపై వున్న గాయాలు, పెట్రోల్‌పోసి కాల్చిన విధానాన్ని బట్టి ఎవరో గుర్తుతెలియని నిందితులు హత్యకు పాల్పడినట్లుగా నిర్ధారణకు వచ్చి క్రెయిమ్‌ నెం: 45/2017 యు/ఎస్‌ 302, 201గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యజరిగిన ముందు రోజు మార్చి 18, 2017 వరకు అక్కడ శవం లేదని, చుట్టు ప్రక్కల పశువులకాపర్లు చెప్పడంతో, రాత్రి ఏ సమయంలోనైనా ఈ హత్య జరిగివుండవచ్చని పోలీసులు భావించారు. మృతురాలి చెప్పులు, గాజులు, కాలిపోయిన చీరను భద్రపరిచారు. యువతి శవం ఫోటోలను ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రసారం చేయించినా, ఆమె మా తాలుకూ మనిషే అని ఏ ఒక్కరూ రాలేదు. ఈలోపు చెప్పులు, గాజులను బట్టి పరిశోధన ముందుకు సాగించారు. ఆ బ్రాండ్‌ చెప్పులు, అరకు, నర్సీపట్నం, పాయకరావుపేట, తుని ప్రాంతాలషాపులో లభిస్తాయనడంతో ఆయా ప్రాంతాలలో విచారణ చేశారు. గాజులను బట్టి అవి ఒడిశా ప్రాంత మహిళలే ధరిస్తారని చాలా మంది గాజులషాప్‌ల వాళ్ళు చెప్పారు. శవం ముఖ కవళికలబట్టి మృతిచెందిన యువతి ఊహా చిత్రాన్ని గ్రాఫిక్స్‌లో రూపొందించి, ఆమె ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళ అయివుండవచ్చని, ఆ యువతి ఆచూకీ ఇచ్చిన వారికి రూ.50వేల బహుమానం ఇవ్వబడునని వాల్‌పోస్టర్స్‌ మరియు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా పోలీసులు ప్రచారం చేశారు. పాయకరావుపేటలోని బృందావనం కాలనీనుండి ఎవరో ఫోన్‌చేసి, హత్య చేయబడ్డ యువతి తమ కాలనీలోనే అద్దెకువుంటూ గతవారం రోజులుగా కనబడని ఇందిర అనే యువతిలానే వుందన్న అనుమానాన్ని వ్యక్తపరిచారు. హుటాహుటీన ఆ ప్రదేశానికి చేరుకున్న పోలీసులు స్థానికులను విచారించారు. ఇందిర అక్కడ ఒంటరిగా నివసిస్తోందని, పాయకరావుపేటకు చెందిన రెడ్డం నరేష్‌కుమార్‌ అన్న అతను అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటాడని, గతవారం రోజులుగా వారు ఆ ఇంటికి రావడంలేదని అక్కడివారు చెప్పారు. పోలీసులు హత్య చేయబడ్డ యువతికి చెందిన వస్తువులను చూపించగా, చెప్పులు ఇందిరవేనని, ఆమెపుట్టినరోజు సందర్భంగా కొనుక్కున్నట్లు ఇంటి చుట్టూ ప్రక్కలవారు గుర్తించారు. దీనితో హత్య చేయబడిన యువతి ఇందిరగా నిర్ధారణకు వచ్చిన పోలీసులకు నరేష్‌కుమార్‌ను అదుపులోనికి తీసుకోవడం పెద్ద శ్రమ కాలేదు. తనకు ఏపాపం తెలియదని ముందు అమాయకంగా నటించిన నరేష్‌కుమార్‌, పోలీసులు ఎంతో కృషి చేసి సంపాదించిన ఆధారాలు బయటపెట్టగానే తప్పని పరిస్థితిలో తన దుర్మార్గాన్ని వెల్లడించాడు. ప్రేమించిన కారణంగా తనను పెళ్ళిచేసుకోవాలని ఇందిర ఒత్తిడి చేస్తుండటంతో, శాశ్వతంగా ఆమెను వదిలించుకోవాలన్న ఉద్దేశ్యంతో హత్యకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు.

ఒడిశా రాష్ట్రం గంజామ్‌ జిల్లాకు చెందిన సూరపు సింహాచలం రైల్వేలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చెందాడు. 2013లో సింహాచలం తన కుమార్తె ఇందిరను తీసుకుని పాయకరావుపేట వచ్చాడు. స్థానికంగా వున్న ప్రయివేటు కళాశాలలో ఇందిర ఇంటర్‌లో జాయిన్‌ అయ్యింది. కొద్దికాలం ఇందిరతో కలిసివున్న సింహాచలం రెండు లక్షల రూపాయలు ఆమెకు ఇచ్చి, ఒడిశా  వెళుతున్నానని చెప్పి వెళ్ళాడు. అప్పటినుంచి అతను మళ్ళీ తిరిగి రాలేదు. ఇందిరకు డబ్బులు పంపడంగానీ చేయలేదు. తండ్రి ఏమయినది తెలియని ఇందిర  ఇంటర్‌ పూర్తి అయిన తర్వాత తాను చదివిన అదే కాలేజీలో అధ్యాపకురాలిగా జాయిన్‌ అయింది. కొద్దికాలం తరువాత కళాశాల యాజమాన్యం ఆమెను పాయకరావుపేట నుండి తుని కాలేజీకి బదిలీపై పంపారు. రోజూ పాయకరావుపేట నుండి తుని కాలేజీకి వ్యాన్‌లో వెళుతుండేది. ఈ క్రమంలో వ్యాన్‌ డ్రైవర్‌ రెడ్డం నరేష్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మరింత ముదిరి ప్రేమగా మారి శారీరక సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం తెలిసిన కళాశాల యాజమాన్యం ఇందిరను ఉద్యోగం నుండి తొలిగించింది. దాంతో ఇందిర మరో కాలేజీలో అధ్యాపకురాలిగా చేరింది. అక్కడ కూడా కొద్దికాలం తరువాత ఉద్యోగం మానేసింది. ఉద్యోగాలు మారినా నరేష్‌కుమార్‌తో ఇందిర అనుబంధం కొనసాగుతోంది. ఈ పరిస్థితులలో నరేష్‌కుమార్‌ పాయకరావుపేటలోని దానిశెట్టి బాబూరావుగారి వీధిలోని బృందావనం కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని, ఇందిరను అక్కడ వుంచాడు. అప్పుడప్పుడు వచ్చి వెళుతుండేవాడు. నరేష్‌కుమార్‌కు ఇంట్లో వాళ్ళు వేరే అమ్మాయితో సంబంధం ఖాయం చేశారు. వివాహానికి కూడా ముహూర్తం నిశ్చయించుకొని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఇందిర నరేష్‌కుమార్‌తో తగవు పడింది. ప్రేమించి మోసం చేస్తే ఊరుకోనని, ఎలాగైనా తనను పెళ్ళిచేసుకోవాల్సిందేనని పట్టు పట్టింది. అంతకంతకూ ఇందిర ఒత్తిడి ఎక్కువ కావడంతో, హత్యచేసి అయినా పీడ వదిలించుకోవాలని, ఆమెకు వెనుకాముందు ఎవరూ లేనందున పట్టించుకునేవాళ్ళు కూడా వుండరని కర్కోటక పథకం వేశాడు.

హత్య జరిగిన రోజు నరేష్‌కుమార్‌ తన స్నేహితుడి బైక్‌ తీసుకొని ఇందిర వద్దకు వచ్చి, సరదాగా వైజాగ్‌ వెళ్ళివద్దామన్నాడు. సంతోషంగా అతనితో బయలు దేరింది. పెట్రోల్‌బంక్‌లో పెట్రోల్‌ కొట్టించేటప్పుడు, ట్రాఫిక్‌ జంక్షన్‌లో సిసి కెమెరాలు ఉన్న ప్రదేశాలలో ఇందిరను బైక్‌ నుండి దింపి, నడచి రమ్మని చెప్పి ముందుకు ఒక్కడే వెళ్ళేవాడు. ఎవరైనా తెలిసిన వారు ఉన్నారేమో అని భావించిన ఇందిర అతను చెప్పినట్లు చేసింది. కన్నూరుపాలెం సమీపానికి వచ్చేటప్పటికీ బైక్‌ ఆపి పొలాలలో ఏకాంతంగా కాసేపు మాట్లాడుకుందాం అని తీసుకునివెళ్ళాడు. చాలాసార్లు ఆ విధంగానే కలుసుకున్నందున అనుమాన పడక అతనిని అనుసరించింది ఇందిర. మాటల సందర్భంలో పెళ్ళి ప్రస్తావన రావడంతో ఇరువురూ తగవు పడ్డారు. ఇక లాభం లేదనుకున్న నరేష్‌కుమార్‌ తనతో పాటు వెంట తెచ్చుకున్న బ్లేడ్‌ బయటకు తీసి- ఇందిర నోరు ఒకచేతితో మూసివేసి మెడమీద, శరీరంపై ఇతరచోట్ల ఇష్టం వచ్చినట్లు గాయాలు చేశాడు. తీవ్ర రక్తస్రావం జరిగి కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ఇందిర మరికొద్ది సేపట్లో చనిపోతుందని తెలిసినా, ఆమె వివరాలు తెలియకూడదన్న ఉద్దేశ్యంతో, అక్కడే దొరికిన బాటిల్‌లో బైక్‌నుండి పెట్రోల్‌ పట్టి తెచ్చి, ఆమెపై వెదజల్లి నిప్పు పెట్టాడు. తాను చేసిన హత్య ఇక బయటపడే అవకాశమే లేదన్న ధీమాతో తన పెళ్ళి పనులలో నిమగ్నమయ్యాడు.

దర్యాప్తు బృందం సునిశిత నైపుణ్యం, పరిశోధన కారణంగా కేసు చిక్కుముడి వీడి హంతకుడు కటకటాల వెనక్కి వెళ్ళాడు. హంతకుడు ఎంత తెలివి ప్రదర్శించినా, దర్యాప్తు బృందం చాకచక్యం ముందు తలొగ్గక తప్పలేదు. నిందితున్ని అరెస్టు చేసి జిల్లా ఎస్‌.పి. రాహుల్‌దేవ్‌ శర్మ ముందు  ప్రవేశపెట్టారు. ఎస్‌.పి. వారిని అభినందించి, నిందితుడి వివరాలు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం నిందితున్ని రిమాండ్‌కు తరలించారు. కార్యక్రమంలో అనకాపల్లి డిఎస్‌పి  ఎ.పురుషోత్తమ్‌, క్రైయిం పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల జరిగిన అవార్డుల ఎంపికలో అనకాపల్లి రూరల్‌ సి.ఐ. రామచంద్రరావు, కశింకోట ఎస్‌.ఐ. మధుసూధనరావుల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందంకు రాష్ట్ర డిజిపి శ్రీ యన్‌.సాంబశివరావుగారి చేతులమీదుగా ఎబిసిడి అవార్డులో మూడవ బహుమతి ఇచ్చి, వారిని అభినందించారు. 

వార్తావాహిని