యూనిట్

అక్రమ సంపాదనే హంతకురాలిని చేసింది

ఒక ఇన్‌ఫార్మర్‌ ద్వారా వచ్చిన సమాచారం ఉత్సాహం ఇవ్వడంతో, అప్పటిదాకా తీవ్ర ఆందోళనలో ఉన్న కడప జిల్లా పెండ్లిమర్రి ఎస్‌.ఐ. రోషన్‌ వెంటనే అందుబాటులో ఉన్న సిబ్బందిని తీసుకొని, కడప టౌన్‌కు బయలుదేరారు. అక్కడ ఒక బంగారుషాపు వద్ద తచ్చాడుతున్న మహిళ పోలీసువారిని చూసి, తప్పించుకొనే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన ఎస్‌.ఐ. ఆ మహిళను నిలువరించి  వివరాలు అడుగగా, పొంతనలేని సమాధానాలు చెప్పింది. అనుమానం వచ్చి మహిళా హోంగార్డుతో పక్కకు పంపించి, ఆమెను సోదా చేయించగా కొన్ని బంగారు నగలు, వెండి వస్తువులు ఆమె వద్ద దొరికాయి.

ఎక్కడి నుంచి వచ్చావని ప్రశ్నించగా తనది కడప పట్టణమేనని, తనకున్న ఆర్థిక కారణాల చేత సొంత వస్తువులనే తనఖా పెట్టించుకు వచ్చినట్లు చెప్పింది. ఆ మాట ప్రకారం ఆమె ఇల్లు తెలుసుకుని పోలీసు వారు వెళ్లి విచారిస్తే. అక్కడ అలాంటి వారు లేరని తెలిసింది. అనుమానిత స్త్రీ ఉనికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకొని, ఆమెనే ఇల్లు చూపమని వెనుక వెళ్ళిన పోలీసులను 'ఈ ఇల్లు కాదు, ఆ ఇల్లు' అని చెప్పి కడప మొత్తం తిప్పింది తప్ప అసలు ఇల్లు చూపలేదు ఆ మహిళ.

నేరాలు చేయడంలో ఎంతో అనుభవం ఉన్న వాళ్లే, పోలీసులను ఇంతలా తప్పు దోవ పట్టిస్తారన్న అవగాహనకు వచ్చిన ఎస్‌.ఐ. ఆమె వద్ద వున్న సెల్‌ఫోన్‌ ఐఎంఇవై, కాల్‌డిటైల్స్‌ ద్వారా టవర్‌ లొకేషన్స్‌లు పొందారు. ఆమె పేరు అనసూయ, వేంపల్లె గ్రామమని తెలిసింది. టవర్‌ లొకేషన్‌ కూడా వేంపల్లెలోనే ఎక్కువగా చూపుతుండటంతో, ఆమె ఎక్కువగా మాట్లాడుతున్న నంబర్ల ద్వారా కూడా ఆమె వేంపల్లెకు చెందిన అనసూయగానే నిర్ధారణ అయ్యింది. ఎప్పుడైతే తన వివరాలు పోలీసులు రాబట్టారని తెలుసుకుందో, అప్పుడు కొన్ని నిజాలు చెప్పింది అనసూయ.

తనది వేంపల్లె గ్రామమేనని, వివాహం అయి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారని, భర్త తాగుడుకు బానిస అయి అనారోగ్యం పాలవడంతో, పిల్లలను ప్రభుత్వ హాస్టల్‌లో వేసినట్లు చెప్పింది. తాను కూడా కూలి పనులకు వెళుతున్నట్లు, అదే క్రమంలో వ్యభిచార వృత్తిలోకి దిగినట్లు తెలిసింది. పరిచయం ఉన్న  ఆటో డ్రైవర్లు, ఇతరులు ఫోన్‌ చేస్తుంటే, అప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి కలుస్తుండేది.

అదే విధంగా గత కొద్ది రోజుల క్రితం సోగలపల్లెకు వెళ్ళగా, ఫోన్‌ చేసిన వాళ్ళు అక్కడ లేకపోవడంతో తిరిగి వస్తుండగా ఊరి చివర తాళం వేసిన ఒక ఇళ్లు కనబడటంతో ఆమెకు మరో దురాలోచన కలిగింది. అక్కడే దొరికిన రాయితో ఆ తాళం పగులగొట్టి, బీరువాలో వున్న నగలు దొంగిలించింది. ఆ నగలు ఇవేనని పోలీసులతో నమ్మబలికింది. సోగలపల్లె పెండ్లిమర్రి పి.ఎస్‌. పరిధిలోనిదే కావడంతో ఆ దొంగతనంపై కేసు ఫైల్‌ తీసి పరిశీలించగా, ఫిర్యాదు దారులు పోయాయని చెబుతున్న నగలుకు, అనసూయ వద్ద దొరికిన నగలుకు అసలు ఏ మాత్రం సంబంధమే లేదు. మళ్ళీ మరోసారి అబద్దం చెప్పిందని తెలుసుకున్న పోలీసులు, నగలును బంగారు షాపులు, నగలు తయారు చేసే వారికి చూపి వివరాలు కోరగా, అవి ముస్లిమ్‌ మతస్థులు ధరిస్తారని చెప్పారు.

ఇన్ని విధాలుగా బుకాయిస్తుందంటే, ఈ నగలు దొంగతనం వెనుక ఏదో పెద్ద మిస్టరీయే వుందని అనుమానించిన ఎస్‌.ఐ. అనసూయను తీసుకొని తన బృందంతో ది.21.09.2017రోజు రాత్రి వేంపల్లె ఆమె ఎక్కడక్కడ తిరిగిందో పరిశీలించాడు. ఊరిలోని గవర్నమెంటు బాయ్స్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌ ప్రక్కనే వున్న చైతన్యనగర్‌ ప్రాంతంలో ఆమె సంచరించినట్లు నిర్ధారించుకున్నారు. ఇంతలో గ్రౌండ్‌కు ఆనుకొనివున్న ఒక ఇంట్లోకి బాల్‌ పడిందని వెళ్ళిన స్కూల్‌ పిల్లలు, ఇంట్లో దుర్వాసన వస్తుందని చెప్పడంతో చుట్టుపక్కల జనాలు ఆ ఇంటిముందు గుమిగూడారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీస్‌ బృందం విషయం ఏమిటో తెలుసుకుందామని అటు అడుగులు వేస్తున్నంతలో. అనసూయ ''అయ్యా! ఆ ఇల్లు నూర్జాహాన్‌ అనే ముస్లిం మహిళది. 21. 09. 2017 తేదీ రాత్రి ఆమెను చంపి ఇంటిలోని, బంగారు నగలను నేనే దొంగలించాను. అవే ఈ నగలు'' అని అప్పుడు అసలు నిజం బయటపెట్టింది. ఆ విషయం యాదార్థమేనని నేరస్థలమునకు వెళ్ళి నిర్ధారణ చేసుకున్నారు. అంతట వేంపల్లె పోలీసులు హత్యస్థలానికి చేరుకుని శవ పంచాయితీ, పోస్ట్‌మార్టమ్‌ తదితర కార్యక్రమాలు పూర్తి చేశారు. నిందితురాలు అనసూయ తనంతటతానుగా నూర్జాహాన్‌ హత్య పూర్వాపరాలపై పెదవి విప్పింది.

వేంపల్లె చైతన్యనగర్‌లో బాయ్స్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌కు సమీపంలో వున్న సొంత ఇంటిలోనే నూర్జాహాన్‌ నివాసం ఉంటున్నది. ఆమె భర్తకు ఇద్దరు భార్యలు కావడంతో, అతను ప్రస్తుతం తన రెండో భార్య అయిన సాధకున్‌, ఆమె పిల్లలతో రాజీవ్‌నగర్‌లో వుంటున్నాడు. అప్పుడప్పుడు పెద్ద భార్య నూర్జాహాన్‌ వద్దకు వచ్చి, పోతుంటాడు. నూర్జాహాన్‌కు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి షేక్‌ మస్తాన్‌ వలి ఉపాధి నిమిత్తం, సౌదీ అరేబియా వెళ్ళగా, అతని భార్య పిల్లలు పాతపేటలో నివాసం వుంటున్నారు. చిన్నబ్బాయి షేక్‌ రఫీ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. నూర్జాహాన్‌ ఒంటరిగావుంటూ, ఇంటివద్దనే సిగరెట్‌, బీడీలు అమ్మే దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తోంది.

అనసూయ బయట తిరుగుళ్ళ విషయం తెలిసిన నూర్జాహాన్‌ ఆమెతో నెమ్మదిగా పరిచయం పెంచుకుంది. '' నువ్వు బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటున్నావు కదా! నా దుకాణంకు వచ్చే మగవాళ్ళు, ఎవరైనా వ్యభిరిచంచే మహిళ ఉంటే చెప్పమని అడుగుతుంటారు. ఒకవేళ నువ్వుగానీ సహకరిస్తే, ఎటువంటి భయం లేకుండా నా ఇంట్లోనే మీరు గడపవచ్చు. నీతోపాటు నాకు కూడా ఎంతో కొంత డబ్బు ముడుతుంది'' అని ప్రలోభపెట్టింది. ఎక్కడెక్కడో బయటకు వెళ్ళి, భయపడుతూ సంపాదించుకునే కంటే, ఇది ఎంతో భద్రమైనదిగా భావించిన అనసూయ ఇందుకు సమ్మతించింది. నాటి నుండి నూర్జహాన్‌ విటులకు, అనసూయకు మధ్యవర్తిత్వం నడుపుతూ, ఇంటిని వారికి కేటాయిస్తూ డబ్బు సంపాదిస్తుండేది.

వచ్చిన మగవాళ్ళు ఎంత ఇచ్చినా, అనసూయకు మాత్రం రూ. 1000లు ఇస్తుండేది. ఒక రోజు అనసూయ వద్దకు వచ్చిన వ్యక్తి, ఆమెకు ఇవ్వమని రూ.3వేలు నూర్జాహాన్‌కు ఇచ్చానని చెప్పాడు. అప్పుడు కూడా నూర్జాహాన్‌ రూ.1000లు మాత్రమే అనసూయకు ఇచ్చింది. దానితో నూర్జాహాన్‌పై అసూయ, ధ్వేషం ఏర్పడింది అనసూయకు. తనతో శారీరక వ్యాపారం చేయించి, ఆమె భారీగా లాభపడుతున్నదని తీవ్రమైన కక్ష పెంచుకుంది. సంపాదించిన డబ్బంతా బీరువాలో దాచి, దాని తాళం చిన్న పర్స్‌లో పెట్టి నూర్జాహాన్‌ జాకెట్లో దాచుకోవడం గమనించింది అనసూయ. ఎలాగైనా ఆ తాళం సంపాదించి, బీరువాలో డబ్బు, నగలను దోచుకోవాలని ఆలోచన చేయడం మొదలుపెట్టింది.

సెప్టెంబర్‌ 21, 2017న అనసూయ తన అలవాటు ప్రకారం బయటకు వెళ్ళి రాత్రి 10 గంటల సమయంలో వచ్చి ఎంతసేపు తలుపుకొట్టినా, ఆమె భర్త మద్యం మత్తులో తలుపుతీయలేదు. ఇక లాభం లేదనుకున్న అనసూయ తనకు అలవాటైన నూర్జాహాన్‌ ఇంటికి వెళ్ళి తలుపుకొట్టింది. నిద్రమత్తులో తలుపుతీసిన నూర్జాహాన్‌ ''ఈ వేళలో ఎందుకు వచ్చావు?'' అని ప్రశ్నించగా జరిగిన సంగతి చెప్పి. ఈ రోజుకు ఇక్కడే నిద్రిస్తానని వేడుకుంది. సమ్మతించిన నూర్జాహన్‌ ఒక బెడ్‌షీట్‌ అనసూయకు ఇచ్చి క్రింద పరచి, పడుకోమని చెప్పి, తను మంచంపై నిద్రపోయింది. ఆ రాత్రి ఎంతసేపటికి అనసూయకు నిద్రరాలేదు.

ఎలా నూర్జాహాన్‌ వద్ద తాళం తీసుకుని, బీరువాలోని నగదు దోచుకోవాలా అన్న తలంపుతో దొర్లుతూనే వుంది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ధైర్యం చేసి, మెల్లగా నూర్జాహాన్‌ మంచం సమీపించి, ఆమె జాకెట్‌లోని పర్స్‌ తీయడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా మేలుకొన్న నూర్జాహాన్‌ తన చేతితో అనసూయ చేతిని పట్టుకుని'' ఆశ్రయం ఇచ్చిన నా ఇంటికే కన్నం వేయాలని చూస్తావా? ఇప్పుడే పోలీసులకు ఫోన్‌ చేసి, నీ సంగతి తేలుస్తాను'' అని మంచం పక్కనే పెట్టుకున్న ఫోన్‌ కోసం వెదుకులాడసాగింది. ఆమె అన్నంత పనిచేసి, తనను జైలుకు పంపుతుందని భావించిన అనసూయ తన చేయిని విడిపించుకొని, వంటగదిలోకి వెళ్ళి అక్కడ వున్న మచ్చుకత్తి (కొడవలి) ని తెచ్చి, నూర్జాహాన్‌ తలపై రెండుసార్లు బలంగా నరికింది.

తీవ్ర గాయాలైన ఆమె మూలుగుతూ క్రింద పడిపోయింది. ఆమె మూలుగులు విని ఎవరైనా వచ్చే ప్రమాదం వుందని, కూలర్‌పై లభించిన కత్తి తీసుకొని, నిర్దాక్షిణ్యంగా నూర్జాహాన్‌ గొంతు కోసింది. ఆమె చనిపోయిందని పూర్తి నిర్దారణ చేసుకున్న మీదట, ఆమె వద్ద వున్న తాళం తీసుకొని, బీరువా తెరిచి, అందులోని బంగారు, వెండి వస్తువులను దొంగలించింది. నూర్జాహాన్‌ వద్దకు వచ్చి కాళ్ళకున్న వెండి పట్టీలను కూడా తీసింది. చెవుల కమ్మలు, ముక్కు పుడక తీయడానికి భయం వేసి అలాగే వదిలివేసి లైటు ఆర్పి బయటకు వచ్చి వాకిలి తలుపులు దగ్గరకు వేసి వచ్చేసింది.

హత్యకు ఉపయోగించిన రెండు ఆయుధాలను ప్రక్క హైస్కూల్‌ గ్రౌండ్‌ తుప్పలలోని బండరాళ్ళ క్రింద దాచిపెట్టి, ఇంటికి వచ్చి నిద్రపోయింది. తెల్లవారిన తరువాత కూడా ఊరిలో ఏ అలికిడి లేకపోవడంతో ఎవరూ ఆ ఇంటివైపు వెళ్ళలేదని అర్థమైంది. రెండు రోజులైనా ఏ హడావుడి లేకపోవడంతో ఒక వేళ హత్య బయటపడినా ఎవరో దొంగలపనిగా భావిస్తారన్న ధైర్యంతో ఆ నగలను కడపలో కుదువ పెట్టాలన్న ఉద్దేశ్యంతో వచ్చి, పోలీసులకు చిక్కింది నిందితురాలు  అనసూయ. గతంలో సొగలపల్లెలో తాళం వేసిన ఇంటిలో దొంగతనం కూడా తానే చేశానని, ఆ నగలును కూడా పోలీసులుకు స్వాధీనపరిచింది. 

పులివెందులు రూరల్‌ సిఐ రామకృష్ణుడు అనసూయను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు పంపించారు. చక్కని పరిశోధన నైపుణ్యంతో హత్యకేసు మిస్టరీని చేధించడంతోపాటు, మరో దొంగతనం కేసును ఛేదించిన కడప రూరల్‌ సిఐ హేమసుందర్‌ ఆధ్వర్యంలోని పెండ్లిమర్రి ఎస్‌.ఐ. రోషన్‌, సిబ్బంది పి.సి. 1525 హుస్సేన్‌, పి.సి. 2570 రాంబాబు, ఉమెన్‌ హోంగార్డు 166 తులసిలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

వార్తావాహిని