యూనిట్

నొప్పిడాక్టరుగారు పనిచెయ్యడం

(గత సంచిక తరువాయి)

''దాని తెరచాపలు నాకు కిట్టవు. అవి తెల్లగా కాకుండా నల్లగా యెందుకున్నాయి? సముద్రపు దొంగల ఓడలకే నల్ల తెలరచాపలుంటాయి'' అంది చిన్న పంది గుర్రుగుర్రు.

గుర్రుగుర్రు వూహ నిజమే. దుర్మార్గులైన సముద్రపు దొంగలు నల్లని తెరచాపల మాటున తమని వెంబడిస్తున్నారు. వాళ్లు డాక్టరుగారిని పట్టుకుని క్రూరంగా కసి తీర్చుకోవాలనుకున్నారు. మరి ఆయన మత్స్యకారుణ్ణీ, పెంటానీ తమనుంచి విడిపించాడు కదా.

''వూకు గబగబా! అన్ని తెరచాపల్ని యెత్తండి'' అని అరిచాడు డాక్టరుగారు.

కాని సముద్రపు దొంగలు దగ్గర పడుతున్నారు. 

''వాళ్లు మనల్ని అందుకుంటారేమో! చాలా దగ్గరికి వచ్చేశారు. వాళ్ల భయంకరమైన ముఖాలు కనిపిస్తున్నాయి. వాళ్ల కళ్లు యేం  దుర్మార్గంగా వున్నాయి!  మనం యేం చేద్దాం? యెక్కడికి పారిపోగలం? వాళ్లిప్పుడు మనల్ని పట్టుకుని సముద్రంలోకి తోసేస్తారు'' అని అరిచింది కికా.

అవ్వా అడిగింది:

''ఓడ వెనకతట్టుమీద నుంచున్న మనిషి కనిపిస్తున్నాడా? అతన్ని గుర్తుపట్టలా? వాడే దుర్మార్గుడు బార్మలేయ్‌. ఓ చేతిలో కత్తి పట్టుకున్నాడు, యింకో చేతిలో పిస్టల్‌ పట్టుకున్నాడు. మనల్ని కాల్చెయ్యాలనుకుంటున్నాడు, మనల్ని నాశనం చెయ్యడానికి!''

కాని డాక్టరుగారు నవ్వి, అన్నాడు:

''యేం బెంగ పడకండర్రా. అతను నెగ్గలేడు. నాకో మంచి పథకం వుంది. అలలమీద యెగిరే స్వాలో పిట్ట కనిపిస్తోందా? యీ దొంగలబారినుంచి పారిపోడానికి అది మనకి సాయపడుతుంది.'' ఆయన బిగ్గరగా ''న-జ-సె! న-జ-సె! కరాచుయ్‌, కరాబున్‌'' అని అరిచాడు.

జంతువుల భాషలో 

''ప్రియమైన స్వాలో, ఆ సముద్రపు దొంగలు మా వెంటబడ్డారు. వాళ్లు మమ్మల్ని చంపెయ్యాలను కుంటున్నారు, సముద్రంలోకి తోసెయ్యాలను కుంటున్నారు'' అని అర్థం. 

స్వాలో ఎగిరివెళ్లిపోయి, ఓ క్షణంలో కొంగలతో కలిసి తిరిగివచ్చింది.

''నమస్కారం డాక్టరుగారూ! విచారించకండి, మేం మీకు సాయం చేస్తాం'' అన్నాయి.

డాక్టరుగారు ఓడ ముఖభాగంలో ఒక తాడు కట్టాడు. కొంగలు చాలా వున్నాయి. ఆ తాటిని పట్టుకుని అవి ఓడని చాలా వేగంగా ముందుకు లాగాయి. 

ఓడ బాణంలా దూసుకుపోతోంది. డాక్టరుగారైతే టోపీ యెగిరిపోకుండా వుండటం కోసమన్చెప్పి గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది.

జంతువులు వెనక్కి చూశాయి. సముద్ర దొంగల నల్ల తెరచాపల ఓడ చాలా వెనక బడిపోయింది. 

''కృతజ్ఞులం కొంగల్లారా. మీ పుణ్యమా అని ఆ దొంగల బారినుంచి బయటపడ్డాం. మీరు లేకపోయినట్లయితే సముద్రం అడుగున వుండే వాళ్లం మేం'' అన్నాడు డాక్టరుగారు.

వార్తావాహిని