యూనిట్
Flash News
గురువు - గౌరవం
పురాణకాలంలో ధౌమ్యుడనే
గురువుగారు ఉండేవారు. ఆయనకు బోలెడు శిష్యులు. గ్రామం చివర ఆశ్రమంలో వుండేవాడు.
అన్నిరకాల విద్యలు శిష్యులకు నేర్పేవాడాయన. ఆశ్రమంలో గురువుగారు చెప్పినట్టే
శిష్యులు నడుచుకోవాలి. గ్రామంలో గ్రామస్థులు పెట్టిన ఆహారం తెచ్చి
గురువుగారికివ్వాలి. దాన్ని గురువుగారు శిష్యులందరికీ పంచేవారు. ఆయన శిష్యులలో
ఉపమన్యుడనే శిష్యుడు వుండేవాడు. అతడిని ఒక రోజు గురువుగారు పిలిచి 'రాజు గారు యజ్ఞం చేయిస్తున్నారు, అక్కడి మునులకు వెళ్ళిసాయం చెయ్యి, యజ్ఞం అయ్యేవరకు అన్ని రోజులూ అక్కడే నీకు పని' అని పంపించాడు. ఆశ్రమ నియమాలు, గురువుగారి నియమాలు మరిచిపోవద్దని గట్టిగా
చెప్పి మరీ పంపారు.
కొన్ని
రోజులకు ఉపమన్యుడు, తిరిగి
ఆశ్రమానికి వచ్చాడు. 'ఏం నాయనా
ఇన్నాళ్ళూ అక్కడ ఉపవాసం వున్నావా? ఐనా
బాగా లావు అయ్యావే?!' అన్నాడు
ధౌమ్యుడు. 'కాదండీ యజ్ఞంలో నేనేమి భోజనం
చేయలేదు. మన ఆశ్రమంలో నియమం ప్రకారం రోజూ ఊళ్ళోకి వెళ్ళి అన్నం తెచ్చుకుని
తినేవాడిని' అన్నాడు
ఉపమన్యు. గురువుగారు చెప్పిన ప్రకారం ఊళ్ళో తెచ్చుకున్న భోజనాన్ని ముందు
గురువుగారికి ఇవ్వాలి కదా అని ధౌమ్యుడు అడిగాడు. ఉపమన్యు తప్పు తెలుసుకుని
క్షమించమన్నాడు.
ఆ
మరునాడు గురువుగారి ఆదేశం ప్రకారం ఊళ్ళోకి వెళ్ళి దానం చేసిన భోజనాన్ని
గురువుగారికి ఇచ్చాడు. ఉపమన్యుడిని పరీక్షించాలని గురువుగారు ఉపమన్యునికి ఏమీ
పెట్టలేదు. అలా మూడు రోజులు గడిచింది. పాపం ఆకలితో మాడిపోతున్నాడేమోనని జాలి వేసి
ధౌమ్యుడు ఉపమన్యుని పిలిచాడు. తిండి లేకుండా ఎలా తట్టుకున్నావని అడిగాడు గురువు.
'అబ్బే లేదండీ - భోజనం కోసం రెండసారి ఊళ్ళో అందర్నీ అడిగి అన్నం
తెచ్చుకుంటున్నాను' అన్నాడు
ఉపమన్యుడు. రోజూ ఒక్కసారే గానీ, రెండవసారి
భిక్ష అడగరాదని గురువుగారి నియమం. అది పాటించనందుకు క్షమించమని బతిమాలేడు
ఉపమన్యుడు. గురువుగారు క్షమించి ఈ సారి ఆవులను అడవిలో మేపుకుని రావాలని, మూడు రోజులయ్యాకా శిష్యుడి మీద జాలి వేసి 'ఉపమన్యా పాపం నేను పెట్టకుండా, తిండి లేకుండా ఎలా గడిపావయ్యా?' అని ఆయన అడిగాడు.
'అబ్బే పర్లేదండీ - అన్నం బదులు మూడుపూటలా అడవిలో ఆవుల పాలు పితికి
తాగుతున్నాను' అని
చెప్పేశాడు.
చెప్పిన
ఏ నియమం పాటించడం లేదని గురువుకి కోపం వచ్చింది. ఈ సారి గురువుగారి అనుమతి లేకుండా
ఒక్క మెతుకు కూడా తినను - అనుకుని
ఉపమన్యుడు
ఆవులతో అడవికి వెళ్లాడు. అడవిలో సాయంత్రానికి బాగా ఆకలి వేసింది ఉపమన్యునికి.
ఆకలికి తట్టుకోలేక ఎదురుగా కనిపించిన చెట్ల ఆకులు, కాయలు
తినేశాడు. అంతే కళ్ళు తిరిగి ఒక పెద్ద గోతిలో పడిపోయాడు. ఆవులన్నీ తిరిగి వచ్చాయి.
ఉపమన్యుడు
రాలేదేమని గురువు గారు తెల్లవారిన తరువాత ఉపమన్యుడిని వెదకమని శిష్యులని పంపారు.
ఈ
లోగా పెద్ద గోతిలో పడిన ఉపమన్యుడికి పిచ్చి కాయలు తినడం వల్ల కళ్ళు పోయాయి.
అప్పుడు ఆకాశంలో తిరిగే దేవతలు దయ తలచి చూపు ఇచ్చారు. ఆకలిగా వున్నాడని మూటలో
కొన్ని రొట్టెలు ఇచ్చారు. దీవించి మాయం అయ్యారు.
ఉపమన్యుడు
రాలేదని గురువుగారు అడవికి వచ్చి వెదికారు. గట్టిగా పిలిచారు. చివరికి గుంట లోంచి
శిష్యుడు బయటపడ్డాడు. గురువుగారు సంతోషించారు. అసలు ఏమీ తినకుండా నియమంగానే
వున్నానని చెప్పాడు. చేతిలో రొట్టెలు చూసి గురువుగారు అడిగితే జరిగినదంతా చెప్పాడు
ఉపమన్యుడు.
'పాపం నీవు తినలేదని మేము కూడా ఎవరం ఏమీ తినలేదయ్యా - పద, రొట్టెలు తిందాం' అని
గురువుగారు ప్రేమగా అన్నారు. అతడిని దీవించారు.
గురువుని, తల్లిదండ్రులను గౌరవించి వారి మంచి మాటను
గౌరవించడం గొప్ప సాంప్రదాయం, గొప్ప
పని అని ఉపమన్యుడి కథ వల్ల మనందరికీ తెలిసింది.
- తల్లావఝుల శివాజి