యూనిట్

నొప్పిడాక్టరుగారు పనిచెయ్యడం

(గత సంచిక తరువాయి)

అవ్వా మత్స్యకారుణ్ణి కనిపెట్టడం మత్స్యకారుడు గుట్టమీద లేడు, అవ్వా ఓడమీదనుంచి గుట్టమీదకి యెగిరి, అన్ని చోట్లా వాసన చూస్తూ అటూ యిటూ పరిగెత్తింది. వున్నట్టుండి అది గట్టిగా మొరిగింది.

''కినెడెలె! నాప్‌!'' అని అవ్వా అరిచింది. ''కినెడెలె! నాప్‌!''

అంటే జంతువుల భాషలో

''నా వెనకే రండి, డాక్టరుగారూ గబగబా!'' అని అర్థం.

డాక్టరుగారు కుక్క వెనకాల పరిగెత్తాడు. 

ఆ గుట్ట పక్క చిన్న ద్వీపం వుంది. అవ్వా అక్కడికి పరిగెత్తింది. డాక్టరుగారు వెనకాలే వెళ్లాడు. అవ్వా అటూ యిటూ పరిగెత్తి, హఠాత్తుగా నేలోని ఓ గుంతలోకి దూకింది. ఆ గుంతలో చీకటిగా వుంది. డాక్టరు లోపలికి వెళ్లి లాంతరు వెలిగించాడు. అక్కడేం కనిపించిందని? ఆ గుంతలో నేలమీద ఎర్ర తల మనిషొకతను సాష్టాంగ పడి వున్నాడు. బాగా చిక్కిపోయి, పాలిపోయి వున్నాడు. 

అతను పెంటా తండ్రి.

నొప్పిడాక్టరు అతని చొక్కా చేతులు గుంజి ''లేవండి, మీ కోసమే మేము యెంతో వెతుకుతున్నాం! మీ కోసం బెంగ పడ్డాం'' అన్నాడు.

అతను డాక్టరుగారిని సముద్రపు దొంగేమో ననుకొని, పిడికిలి బిగించి అన్నాడు:

''నా దగ్గరనుంచి ఫో, గజదొంగా! నా కొనవూపిరి పోయే దాకా నన్ను నేను రక్షించుకోగలను.''

కాని అంతలోకీ డాక్టరుగారి సౌమ్యవదనం చూసి ''మీరు సముద్రపు దొంగ కాదు అనిపిస్తోంది. నాకు కొంచెం తిండానికేదేనా యివ్వండి. నేను ఆకలితో చచ్చి పోతున్నాను'' అన్నాడు.

డాక్టరుగారు అతనికి కొంచెం రొట్టె, జున్ను యిచ్చాడు. అతను మొత్తం పిసరు కూడా మిగల్చకుండా తినేసి, కాళ్లమీద నిలబడ్డాడు.

''యిక్కడికెలా వచ్చారు?'' అని డాక్టరుగారు అడిగాడు.

''దుర్మార్గులైన సముద్రపు దొంగలు నన్నిక్కడ పడేశారు. వాళ్లు రక్తదాహం వున్నవాళ్లు, దుర్మార్గులు. వాళ్లు నాకు తిండానికి, తాగడానికి యేం యివ్వలేదు. నా ముద్దుల కొడుకుని తీసుకుపోయారు, యెక్కడికో తెలీని చోటికి. మా బాబు యెక్కడున్నాడో తెలుసా?''

''అతని పేరేమిటి?'' అని డాక్టరుగారు అడిగాడు.

''పెంటా'' అని అతను జవాబు చెప్పాడు.

''నాతో రండి'' అన్నాడు డాక్టరుగారు. ఆ మత్స్యకారుడు గుంతలోనుంచి యివతలికి రావడానికి సాయం చేశాడు. 

అవ్వా వాళ్ల ముందు పరిగెత్తింది. 

ఓడ మీదనుంచే పెంటా చూశాడు వాళ్ల నాన్న వస్తున్నట్టు. అతనికేసి పరిగెత్తివెళ్లాడు.

''హాయ్‌హాయ్‌! మా నాన్న దొరికాడు'' అని అరిచాడు.

ప్రతి జంతువూ చప్పట్లు చరుస్తూ నవ్వడం మొదలెట్టింది.

''కీర్తి అంటే నీదే, అవ్వా,

నీలాంటి కుక్క భూమ్మీద లేదు!'' అన్నాయి. 

చిన్న పంది గుర్రుగుర్రు మాత్రం ముటముట లాడుతూ ఓ పక్క నుంచుంది.

''అవ్వా! నిన్ను చూసి నవ్వి నిన్ను బడాయికోరు అన్నందుకు నన్ను మన్నించు'' అంది.

''దాన్దేముందిలే, అలాగే క్షమిస్తాను. కాని యింకోసారి నన్ను కష్టపెట్టావో నీ తోక కొరికేస్తాను'' అంది.

నొప్పిడాక్టరు ఎర్రతల మత్స్యకారుణ్ణీ అతని కొడుకునీ వాళ్లుండే వూరికి, వాళ్ల యింటికి తీసికెళ్లాడు.

ఓడ ఒడ్డుకి వచ్చే ముందు వాళ్లకి ఓ ఆడమనిషి కనిపించింది. ఆమె పెంటా తల్లి. యిరవై రోజులుగా ఆమె రాత్రింబగళ్లు సముద్రం కేసి చూస్తూ, భర్తా కొడుకూ తిరిగివస్తారని యెదురు చూస్తూ నుంచుంది. 

పెంటాని చూడగానే వాడి దగ్గరికి పరిగెత్తి వెళ్లిపోయి, ముద్దులాడింది. 

ఆమె పెంటాని ముద్దుపెట్టుకుంది, ఎర్రతల మత్స్యకారుణ్ణి ముద్దు పెట్టుకుంది. డాక్టరుగారికి నమస్కరించింది. ఆమె కుక్క అవ్వాకి కృతజ్ఞత చెప్పి, దాన్నీ ముద్దు పెట్టుకుందామనుకుంది. 

కాని అవ్వా పొదలోకి పరిగెత్తిపోయి గొణిగింది:

''నాకు ముద్దులంటే అసహ్యం, వెధవ పని! ఆమె యెవళ్లనేనా ముద్దు పెట్టుకోదలిస్తే గుర్రుగుర్రుని ముద్దుపెట్టుకోమనండి.''

అవ్వా పైపైకి కోపంగా వున్నట్టు నటించిందంతే. నిజానికి దానికి సంతోషంగానే వుంది. సాయంత్రం డాక్టరుగారన్నాడు:

'సరే, సెలవు. యింటికి తిరిగివెళ్లే వేళయింది మాకు'' అని. 

(ఇంకా వుంది)

వార్తావాహిని