యూనిట్

తొందరబడితే!

ఏదీ ఆలోచించకుండా ఏం తోస్తే అది చేసెయ్యకూడదు. అలా తొందరపడితే అంతా నష్టమే అన్నారు తాతయ్య. ఎవరి తాతగారయినా ఒకటే. మనవలకి ఇష్టం కదా- అందుకని మనవలందరూ ఆయన చుట్టూ చేరారు. మంచి మాటలే కాదు - ఆయన మంచి కథ చెప్పేవరకూ నిద్రపోరు. అందుకని ఆయన ఏమీ ఆలోచించని గద్ద కథ ఒకటి చెప్పాడు. గద్దకూ, కముజు పిట్టకూ ఎలాగో మంచి స్నేహం కుదిరింది. రోజూ గద్ద ఆకాశంలో ఎగురుతూ నేలమీద ఏదయినా ఆహారం దొరికితే దాన్ని పట్టుకునేది - ఎగిరివచ్చి కముజు పిట్ట వున్న చెట్టుమీద వాలేది. కముజు పిట్ట అడవి కబుర్లు చెబుతుంటే వింటూ గద్ద తన ఆహారం తినేది. కముజు పిట్టకు మాత్రం గద్దలా కష్టపడి పురుగులు వెదికి పట్టుకునే అవసరం పోయింది. ఎందుకంటే తన గూడు వున్న చెట్టుకి దగ్గరగా ఒక నది పారుతూ వుంది. ఆ నదిలోంచి ఒకటి రెండు మొసళ్ళు వచ్చి ఇసకలో పడుకుని ఎండలో ఒళ్ళు ఆరబెట్టుకొంటుంటాయి. ఎండ బాగా తగిలితే తిన్న ఆహారం అరుగుతుంది వాటికి. అందుకని అలా విశ్రాంతి తీసుకుంటూ నోరు బాగా తెరిచి ఉంచుతాయి. అలా ఎంతసేపయినా అవి వుండగలవు. అలా నోరు తెరచి వుంచినప్పుడు రంపంలాంటి వాటి పళ్ళ మధ్య ఆహారం ముక్కలు - అంటే అవి తిన్న వాటి ముక్కలు ఇరుక్కుని వుంటాయి. మొసళ్ళు పళ్ళు తోముకోలేవు - ఇక పళ్ళు రోజూ శుభ్రం చేసుకోడం ఎలా అని దిగులు పడుతుంటాయి. అందుకని కముజు పిట్టల వంటి పిట్టలు వచ్చి మొసళ్ళు తెరచివుంచిన నోటిలో ఆహారపదార్థాలు వాటి ముక్కులతో లాగి తింటాయి. మొసళ్ళకీ మంచిదే కదా. అందుకనే అవి పిట్ట వచ్చి అలా పళ్ళు పొడుస్తుంటే మొసళ్ళు ఏమీ అనవు. నోళ్ళు బార్లా తెరిచి ఉంచుతాయి. రోజు కముజు పిట్టపని ఒకటే. ఎప్పుడు మొసళ్ళు ఇసక గట్టుకి వస్తాయా అని ఎదురుచూడ్డం - కిటికీ తలుపుల్లా తెరిచిన మొసలి నోట్లో పళ్ళ మీద వాలి చక్కగా ఆహారం తినాలి. అలా మొసళ్ళు, కముజులకి స్నేహం కుదిరింది. ఇదంతా కముజు పిట్ట తన స్నేహితుడు గద్దకి చెప్పింది. చెప్పడమేంటి?! గద్ద అది రోజు చూసి చిరాకు పడేది. కముజు సులభంగా ఆహారం సంపాదించడం - తానేమో రెక్కలు అలిసిపోయేదాకా ఎగరటం! ఇదేం నచ్చలేదు గద్దకి. అందుకని ఓ రోజు తీరిగ్గా కముజు దగ్గర కొచ్చి ''నే కూడా నీలాగే మొసలి పళ్ళ మధ్య మాంసం ముక్కల్ని ఏరుకుంటాను. ఏం?'' అనడిగింది. మొసలి గారిని అడిగి చెబుతానంది కముజు - ''ఐనా మొసళ్ళని అడగటం ఏంటి? కళ్ళు మూసుకుని నోరు తెరిచి పెడితే ఎవరేనా రావచ్చు. చెట్టు తొర్రలు ఖాళీగా వుంటే మీలాంటి చిన్న పిట్టలు వచ్చి దూరటం లేదూ! తొర్రని అడుగుతారా ఏం?'' అని దబాయించింది గద్ద. ''ఒకవేళ మొసళ్ళకి నువ్వు రావటం నచ్చకపోతేనో?' అని అడిగింది కముజు. మొసళ్ళకి కోపం వస్తే నేనేనా ఊరుకునేది - వాటి కళ్ళను నా ముక్కుతో పొడిచెయ్యనూ?!' అని మొండిగా అన్నది. స్నేహితుడు గదాని జాగ్రత్తలు చెప్పింది. గద్ద అదేం పట్టించుకోలేదు. ఒక రోజు ఎప్పటిలాగే రెండు మొసళ్ళు నోళ్ళు బార్లా తెరిచిపెట్టుకుని పడుకున్నాయి. ఒక మొసలి నోట్లో వాలింది కముజు - ఆహారం పీకుతోంది మొసలి పళ్ళ మధ్య నుంచీ. మరి రెండో మొసలి దగ్గరకు పెద్దగా రెక్కలు ఇసక రేగిపోయేలాగ చప్పుడు చేస్తూ గద్ద వాలింది. వెర్రి మొసలి నిద్రపోతోంది అనుకుని తిన్నగా మొసలి పళ్ళను తన పెద్ద ముక్కుతో గట్టిగా పొడిచింది ఆహారం ముక్కల కోసం - అంతే వెంటనే మొసలి తన నోరు అంతే గట్టిగా ఠప్‌మని మూసేసింది. గద్ద పచ్చడయింది! ఆలోచించకుండా అన్నిటికీ తొందరపడితే ఇంతే జరుగుతుందని గద్దలన్నీ తెలుసుకున్నాయి.

వార్తావాహిని