యూనిట్
Flash News
ముల్లు
మగధ దేశానికి, మాళవదేశానికి ఎప్పుడూ తగాదాలే, ఆ దేశపు రాజులు అవకాశం వస్తే ఒకరిని ఒకరు చిత్తుగా ఓడించాలని ప్రయత్నంలో వున్నారు. ఇదే ప్రయత్నంలో ఒకసారి మాళవ దేశం రాజుగారు, మంత్రి ఒక ఉపాయం పన్ని ఒక వైద్యుడిని మగధ దేశం పంపించారు. ఆ వైద్యుడు అక్కడి వాడిలాగానే వుండి జాగ్రత్తగా కోటకి వెళ్ళాలి. అక్కడ ఆరోగ్యం బాగా లేకుండా వున్న రాజు గారికి మందు పేరుతో విషం ఇవ్వాలి. ఆ విషంతో మెల్లిగా రెండు మూడు రోజుల్లో రాజు మరణిస్తాడు. ఈలోగా వైద్యుడిగా వెళ్లిన గూఢచారి మాళవదేశం వచ్చేయ్యాలి. ఇదీ ఆలోచన. కోటలోకి ఎలాగో చేరాడు. రాజుగారు సంతోషించేలాగ మాట్లాడాడు. ఆయనకు ఎన్నాళ్ళుగానో వున్న తలనొప్పికి మందు ఇచ్చాడు. అది మందు కాదు విషం. మంత్రి గారికి ఏదో అనుమానం వచ్చి ముందుగా ఆ మందు కుక్కకి తినిపించాడు. ఆ కుక్క చచ్చిపోయింది. ఆ వైద్యుడిని బంధించారు. రాజుగారు అతనికి మరణశిక్ష వేశాడు. ఐతే మంత్రిగారు ఆ శిక్ష ఆపించాడు. ‘ఎందుకలా ఆపించారు’ అని మహారాజు అడిగాడు. మంత్రి రాజుగారి చెవిలో ఒక రహస్యం చెప్పారు. మాళవరాజుకి వైద్యుడు దొరికిపోయినట్టు వార్త రాగానే యద్ధానికి సిద్ధం అయ్యారు. మాళవరాజు సైన్యాలు మగధ సరిహద్దుల దగ్గర గుడారాలు వేసి ఉన్నాయి. ఈ వార్త తెలిసిన మగధ మంత్రిగారు రాజు గారి చెవిలో చెప్పిన రహస్య ఉపాయం ప్రకారం గూఢచారిగా పనిచేసినా వైద్యుడికి మరణ శిక్ష ఆపేసి, డబ్బు, బంగారం ఇచ్చి ఇల్లు కూడా ఇచ్చి అక్కడే వుండమన్నారు. మగధరాజు గారి మంచితనానికి ఆశ్చర్యపడ్డాడు. యుద్ధానికి సిద్ధం కమ్మని మాళవ రాజు రాయబారి ద్వారా కబురు పెట్టాడు మగధరాజుకి. అప్పుడు మగధరాజు మంత్రి ‘సంధి చేసుకుని స్నేహంగా వుందామని’ ఒక ఉత్తరం రాసి వైద్యుడికి ఇచ్చాడు. ఆ ఉత్తరాన్ని మాళవ మంత్రికి ఇమ్మన్నారు. మరొక ఉత్తరం రాసి ఇతరులు చదవడానికి వీలులేకుండా అంటించి ఇచ్చాడు. ‘దీనిని మాత్రం మాళవరాజు చేతికి ఇవ్వు’ అని చెప్పాడు మగధ మంత్రి. మాళవ మంత్రి గారికి ఇమ్మన్న ఉత్తరం వైద్యుడు రహస్యంగా చదివి సంతోషించాడు. రెండవ ఉత్తరం అంటించి వుంది గనుక చదవలేదు. రెండు ఉత్తరాలు తీసుకుని రాయబారిలాగ మాళవ సైన్యం గుడారాలకు వెళ్ళాడు. ఇతడు ఇంకా బతికే వున్నాడు గనుక ఆశ్చర్యపడ్డాడు మాళవ మంత్రి. అతను ఇచ్చిన ఉత్తరం చదివి సంతోషించారు. రెండవ ఉత్తరంలో రాజుని తిడుతూ, చంపేస్తామని బెదిరిస్తూ, లొంగిపొమ్మని రాసి వుంది. మాళవ రాజుకి వొళ్ళు మండింది. కోపంతో ఉత్తరం చించి నేలకేసి కొట్టాడు. రాయబారిగా వచ్చిన వైద్యుడిని చెంప పగలకొట్టాడు. ‘నిన్ను నేను అక్కడికి పంపిస్తే నవ్వు మగధ రాజుకి రాయబారివి అవుతావా’? అని తిట్టాడు. స్నేహం చేద్దామని ఉత్తరం రాస్తే తిట్టి కొడుతున్నాడేమని వైద్యుడు వెంటనే దగ్గరగా వున్న కత్తితో మాళవరాజుని పొడిచాడు. ఇది ఊహించని రాజు కింద పడి చనిపోయాడు. మాళవ మంత్రి కూడా ఆశ్చర్యం నుంచి కోలుకుని వెంటనే వైద్యుడిని కత్తితో పొడిచి చంపాడు. మాళవ సైన్యాలు వెనక్కి వెళ్ళిపోయాయి. ‘ముల్లుని ముల్లుతో తియ్యడం అంటే ఇదే’ అని మగధ మంత్రి రాజుతో అన్నాడు. అలాగే, అపకారం చేసే వారికి అపకారమే జరుగుతుందని రాజు, ప్రజలు అర్ధం చేసుకున్నారు.