యూనిట్

దొంగ కాకి

పూర్వం గోదావరి నది మధ్యలో చిన్నదీవి వుండేది. దీవి అంటే చుట్టూనీరు వుండి, మధ్యలో భూమి ఉంటుంది కదా అది. ఆ దీవి నిండా చెట్లు వున్నాయి. అన్ని చెట్లమీదా పిట్టలున్నాయి. వాటికి గూళ్ళు, గూళ్ళలో గుడ్లూ వున్నాయి. ఒకసారి అక్కడికి ఒక పెద్దకాకి వచ్చింది. ఎన్నో పక్షులు, వాటి పిల్లలు, గుడ్లూ చూసింది. హాయిగా ఈ దీవిలోనే వుంటే రోజూ బోలెడన్ని చిన్నచిన్న పక్షులు గుడ్లు తింటూ వుండవచ్చు అని ఆ కాకి అనుకుంది. అందుకు తగిన ఉపాయం ఆలోచించింది. వెంటనే ఆ చెట్ల కింద నేలమీద వాలి ఒంటికాలిమీద నిలబడింది. పైగా నోరు తెరచి వుంచింది. ఈ వింత చూసి చిన్నచిన్న పిట్టలన్నీ కాకి చుట్టూ చేరాయి. ‘‘మీరు ఎవరు? ఎక్కడి నుంచీ వచ్చారు’’ అని ప్రశ్నలడిగాయి. ‘‘నేను ఒక పెద్ద సన్యాసిని, నాకు ఏమీ అక్కరలేనివాడిని, సొంతగూడు లేదు.. నాకు ఎవరూ లేరు. ఒంటికాలిమీద తపస్సు చేస్తుంటాను. నా రెండవ కాలు నేలమీద పెడితే ఈ చెట్లన్ని పాపం కూలిపోతాయి గదా నాకంతబలంవుంది. అందుకే ఒంటి కాలిమీద ఉన్నావన్నమాట. అంతేకాదు. నేను ఆరు నెలల కొకసారి భోజనం చేస్తాను. రోజూ నోరు తెరచి గాలిని మింగుతాను. నాకు అదే చాలు’’ అని కాకి తన గురించి చెప్పింది. ‘‘మనకీ ఒక పెద్ద వాడు - సలహాలు ఇచ్చేవాడు దొరికాడు’’ అనుకున్నాయి చిన్న పక్షులు. రోజూ అవి ఆహారం కోసం వెళ్ళేటప్పుడు తమ గుడ్లను గద్దలు, పాములూ మింగెయ్యకుండా కాకి దగ్గరగా పెట్టి పిట్టలు వెళ్ళేవి. సాయంత్రం తిరిగొచ్చి గుడ్లు గూటికి తీసుకెళ్ళేవి. అలా ఒకటి రెండు రోజులు గడిచింది. ఆ తరువాత చూస్తే గుడ్లు కాసిని కాసిని మాయం అయిపోవటం గమనించాయి పిట్టలు. ‘‘కాకి సన్యాసి కదా- ఎలా అడగాలిఅని ఇబ్బంది పడ్డాయి. ఆ పిట్టల్లో ఒక పెద్ద పిట్ట ఒక రోజు ఆహారం సంపాదించేందుకు వెళ్లలేదు- అది ఒక చెట్టు చాటున దాక్కుని కాకి సంగతి గమనించింది. అన్ని పిట్టలూ వెళ్లిపోగానే కాకి కాలు కిందకు దించి ముక్కుతో పొడుస్తూ కొన్ని గుడ్లను తినేసి మళ్ళీ సాయంత్రం పక్షులొచ్చే వేళకి మళ్ళీ నోరు తెరుచుకుని వంటికాలు మీద నిలబడి, కళ్లు మూసుకుని వుంది. పెద్ద పిట్ట ఈ సంగతి చిన్న పిట్టలకి చెప్పింది. అంతే, పిట్టలన్నీ కలిసి కాకి మీద పడ్డాయి. కాకికి ఈకలన్నీ ఒక్కటి లేకుండా పీకి తరిమేశాయి. ఎప్పుడూ అందర్నీ మోసం చేయలేం అని కాకి గ్రహించింది. ఏదయినా మరీ ఆలస్యంగా తెలుసుకుని లాభం లేదనీ కాకి పాపం తెలుసుకుంది.

వార్తావాహిని