యూనిట్
Flash News
తెల్ల తోడేలు
ధర్మపాలుడనే
రాజుకి ముగ్గురు కొడుకులు. వాళ్ళలో చిన్నవాడి పేరు గుణనిధి. రాజుగారి తోటలో ఒక
దానిమ్మ చెట్టు వుంది. చిత్రం ఏమంటే ఆ దానిమ్మ చెట్టు బంగారు దానిమ్మ కాయలు
కాసేది. ఐతే రోజూ ఎవరో ఆ బంగారు కాయలు దొంగతనం చేస్తున్నారు. రాజుగారు ఎంత కాపలా
పెట్టినా సరే ఎలాగో బంగారు కాయలు మాయం అవుతున్నాయి. అందువల్ల రాజుగారికి దిగులు
పట్టుకుంది పెద్ద రాజ్యం, పెద్ద
రాజుని - ఐనా సొంత తోటలో సొంత మనుషులున్నా సరే దొంగతనామా అని! రాజుగారి మొదటి
కొడుకు, రెండవ కొడుకు కూడా తోటలో కాపలా వున్నారు - ఐనా
దొంగతనం ఎలా జరుగుతుందో అర్థం కాలేదు. చివరికి రాజు గారి మూడవ కొడుకు
ముగ్గురన్నదమ్ములలో చిన్నవాడు తోటకు కాపలా వుంటానన్నాడు. ఆ రోజు రాత్రి చిన్న
యువరాజు గుణనిధి నిద్ర పోకుండా చెట్లు మాటున గమనిస్తున్నాడు. అప్పుడు చీకటిలో ఒక
వెలుగు కనిపించింది. అది మెల్లగా పెద్దదయింది. అది దానిమ్మ చెట్టు దగ్గరకొచ్చింది.
తీరా చూస్తే అది ఒక గద్ద. నిప్పులు చిమ్మే గద్ద. వెంటనే గుణనిధి ఎగిరి ఆ గద్దని
పట్టుకున్నాడు కానీ అది విదిలించుకుని పారిపోయింది. కానీ గుణనిధి చేతిలో ఆ నిప్పు
గద్ద ఈక ఒకటి మిగిలిపోయింది. రాజుగారికి అది చూపించి నిప్పు గద్ద దొంగతనం చెప్పాడు
గుణనిధి. ‘‘సరే మీ ముగ్గురన్నదమ్ములలో ఎవరు నిప్పుగద్దని
పట్టుకుని, దానిపై కూర్చుని ఇక్కడకు ఎగిరి వస్తారో వారికే
ఈ రాజ్యం మొత్తం ఇస్తాను’’ అని రాజు అన్నాడు. ముగ్గురు
రాజకుమారులు మూడు వైపులా బయలుదేరారు. గుణనిధి గుర్రం అలిసిపోయింది. అతను కూడా ఒక
చెట్టుకింద నీడలో నిద్రపోయాడు. నిద్రలేచి చూస్తే గుర్రం కనబడలేదు. వెతకగా వెతకగా
దాని ఎముకలు కనిపించాయి. అప్పుడొక తెల్లటి తోడేలు అక్కడికి వచ్చింది. దిగులుగా
వున్న గుణనిధిని చూసి ‘‘ఎందుకు బాధపడుతున్నావు’’ అని అడిగింది. తన గుర్రం పోయిందని, దారి తప్పి
తిరుగుతున్నాననీ గుణనిధి చెప్పాడు. ‘‘ఆ గుర్రాన్ని నేను
చంపి తిన్నాను. నా ఆకలి తీరింది. కాబట్టి నీకు గుర్రం లేదు గనక నేను సహాయం
చేస్తాను. నీకేం కావాలి?’’ అని తెల్లతోడేలు అడిగింది.
గుణనిధి జరిగింది అంతా చెప్పాడు. ఆ నిప్పుల గద్ద దగ్గరకు నువ్వు పోలేవు. చాలా
దూరం. నాతోరా. నేను తీసుకుపోతాను.’’ అన్నది. గుణనిధి
తోడేలు మీద కూర్చున్నాడు. అది మహావేగంగా కొండలు, అడవులూ
దాటుతూ పక్షుల కంటే వేగంగా పోయింది. చివరికి ఒక పెద్ద కొండ గుహ దగ్గర ఆగింది. ‘‘గుణనిధీ- ఇదే మంచి సమయం - కాపలా వాళ్ళు నిద్ర పోతున్నారు. నువ్వు
గుహలోకి వెళ్ళు అక్కడ బంగారు పంజరం వుంటుంది. అందులో నిప్పుల గద్ద వుంటుంది. కానీ
నువ్వు పంజరాన్ని తాకకూడదు సుమా’’ ఐతే గుణనిధి తోడేలు మాట
సరిగా వినిపించుకోలేదు. నిప్పుల గద్దను పంజరంతో పాటు తీశాడు. వెంటనే పేద్ద
చప్పుడయింది గుహంతా. కాపలావాళ్ళు వచ్చి గుణనిధిని కట్టేసి వాళ్ళ నాయకుడి దగ్గరకు
తీసుకుపోయారు. ఆ నాయకుడికి గుణనిధి జరిగిందంతా చెప్పాడు ‘‘సరే నీకు నిప్పుల గద్ద కావాలంటే, నువ్వు
ప్రాణాలతో ఇంటికి వెళ్ళాలంటే నువ్వొక పనిచేయాలి. ఇక్కడ కొండ వెనుక అడవిలో బంగారపు
గుర్రం వుంది. దాన్ని తెచ్చి ఇస్తే నిప్పుల గద్ద ఇస్తా’’ అన్నాడు
నాయకుడు. గుణనిధి సరేనని తోడేలు మీద కూర్చుని వేగంగా వెళ్ళాడు. తోడేలు ఒక గుహ
ముందు ఆగి - ‘‘ఆ గుహలో బంగారు గుర్రం వుంది. దానికి
వజ్రాల జీను వుంది. జీను తాకకుండా గుర్రాన్ని పట్టుకురా’’ అని చెప్పింది. గుణనిధి ఎంత జాగ్రత్తగా వున్నాసరే గుర్రం జీను అతనికి
తగలగానే పెద్దపెద్ద చప్పుళ్ళు అయ్యాయి. గుర్రాన్ని కాపాడే సేవకులు గుణనిధిని
బంధించి వాళ్ళ నాయకుడి దగ్గరకు తెచ్చారు. ‘‘నీకు బంగారు
గుర్రం కావాలంటే ఇస్తా కానీ ఇక్కడ ఒక తోటలో బంగారు రంగు రాకుమారి వుంది. ఆమెను
తీసుకొచ్చి నాకివ్వాలి. ఐతే అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకు -
అలా చేస్తే నువ్వు పెద్ద బండరాయిగా మారిపోతావు సుమా’’ అని
ఆ నాయకుడు చెప్పాడు. ఈ సారి పొరపాటు చేయకుండా అమ్మాయిని ఒప్పించి తీసుకువచ్చాడు.
ఇద్దరినీ తోడేలు ఆ రెండవ గుహ దగ్గరకు తెచ్చింది. అప్పుడు గుణనిధి తోడేలుతో ‘‘ఇంత మంచి అమ్మాయిని ఆ దొంగల నాయకుడికి ఇవ్వడం మంచిది కాదు. నేను ఈమెను
పెళ్ళి చేసుకుంటాను. కానీ బంగారు గుర్రం ఎలా సాధించడం?’’ అన్నాడు.
అప్పుడు తోడేలు ఒక ఉపాయం చెప్పింది. ఉపాయం ప్రకారం తోడేలు బంగారు రంగు అమ్మాయిగా
మారిపోయింది. అసలు అమ్మాయిని పొదల చాటున దాచి వుండమన్నాడు గుణనిధి. ఆమె అలాగే
చేసింది. అప్పుడు అమ్మాయి రూపంలో వున్న తోడేలును ఆ దొంగల నాయకుడికి ఇచ్చి బంగారు
గుర్రంతో బయటపడ్డాడు గుణనిధి. ఆ తరువాత అంత చక్కని గుర్రాన్ని బంగారు గుర్రాన్ని
ఎవరికో ఇచ్చేయడం నాకు ఇష్టం లేదు’’ అని గుణనిధి
అనుకున్నాడు. ఈలోగా దొంగల నాయకుడి దగ్గర బంగారు రంగు అమ్మాయిగా వున్న తోడేలు ఆ
రాత్రి మళ్ళీ తోడేలుగా మారి అక్కడి నుంచీ రహస్యంగా బయటపడి గుణనిధి దగ్గరకు
వచ్చింది. గుణనిధి తన కోరిక చెప్పాడు. ‘‘సరే, మళ్ళీ సాయం చేస్తాను - నేను బంగారు గుర్రం అవుతాను’’ అంటూనే బంగారు గుర్రంగా మారింది. గుణనిధి అమ్మాయిని, అసలు బంగారు గుర్రాన్ని ఒక చిన్న గుహలో వుంచి బంగారు గుర్రంగా మారిన
తోడేలును ఇచ్చి మొదటి దొంగల నాయకుడి గుహకు వెళ్ళాడు. అతను ఆశ్చర్యపడి నిప్పుల
గద్దను ఇచ్చివేశాడు. నిప్పుల గద్దతో గుణనిధి బయటకు వచ్చి చిన్న గుహలో అమ్మాయి
దగ్గరకు వచ్చాడు. బంగారు రంగు అమ్మాయి గద్దతో బంగారు గుర్రం ఎక్కి గుణనిధి
బయలుదేరాడు. ఐతే రాత్రి చీకటి అవుతోంటే ఆ రాజ్యం పొలిమేరలో ఒక గుడి ఆవరణలో
విశ్రాంతి తీసుకున్నాడు. అమ్మాయి, గుణనిధి, గ్రద్ద, గుర్రం నిద్రపోయారు. ఈ లోగా బంగారు
గుర్రం మీద దొంగల నాయకుడు, కూర్చోగానే అది తోడేలుగా
మారిపోయింది. ఆ తెల్ల తోడేలు పరిగెత్తి పారిపోయింది. ఇక్కడ దేవాలయం దగ్గర కావలి
వారు గుణనిధి అన్నలకు గుణనిధిని చూశామని చెప్పారు. ఆ రాత్రే ఇద్దరు అన్నలూ వచ్చి
బంగారు గుర్రం, అమ్మాయి, నిప్పుల
గద్ద వుండగా రాజ్యం తమ్ముడికి దక్కుతుంది గదా - వీడిని చంపితే మంచిదనుకున్నారు.
నిద్రలో వున్న గుణనిధి గొంతు నొక్కేశారు. అమ్మాయి, గుర్రం,
గద్దలతో తెలవారుతూనే ఇద్దరు అన్నలూ రాజ్యంలో తండ్రిని
చేరుకున్నారు. ఈలోగా తోడేలు తన స్నేహితునికి సెలవు చెప్పిపోదామని గుడి దగ్గరకు
వచ్చింది. అక్కడ చనిపోయిన గుణనిధిని చూసి, తన మంత్రంతో,
శక్తితో అతన్ని బతికించింది. బాణంలాగా తోడేలు, గుణనిధి మహారాజు దగ్గర వాలాడు. జరిగిందంతా విని రాజుగారు గుణనిధికి
బంగారు రంగు అమ్మాయితో పెళ్ళి చేశారు. - నిప్పుల గద్దను కోటకు కాపలా వుంచారు.
తోడేలుకు మంచి భోజనం పెట్టారు. తోడేలు గుణనిధి దగ్గర సెలవు తీసుకుని
వెళ్ళిపోయింది. గుణనిధి అన్నలను రాజుగారు కొంతకాలం కారాగారంలో వుంచారు. వాళ్ళ
బుద్ధి మారిన తరువాత, తప్పు ఒప్పుకున్నాకా తిరిగి కోటకి
రప్పించారు రాజుగారు. అందరూ హాయిగా రాజ్యంలో వున్నారు.