యూనిట్
Flash News
స్వార్థంతో చిక్కు
పూర్వం
గోదావరి నది వొడ్డున ఒక పేద్ద మర్రిచెట్టు వుండేది. చెట్టుకు బోలెడు కొమ్మలు, కొమ్మలకు వేలాడే ఊడలు, చెట్టుకు తొర్రలు, చెట్టు చుట్టూ చల్లటి నీడ.
అందుకని ఎన్నో రకాల పక్షులు ఆ చెట్టు మీద ఉండేవి. వాటికి బోలెడు గూళ్ళు. ఐతే ఇన్ని
రకాల పక్షులు కలిసిమెలిసి వుంటున్నాయి. గనుక పిట్టలకోసం వేటగాళ్లు గానీ, జంతువులు గానీ రావటం లేదు. పిట్టలన్ని హాయిగా వుంటున్నాయి. అప్పుడు ఒక
రోజు చాలా దూర ప్రాంతం నుంచి ఒక కాకి వచ్చింది. చెట్టుమీద వాలి అక్కడి పిల్లలను
అనుమతి కోరింది. ‘‘దానికేం భాగ్యం - హాయిగా మాలాగే ఈ
చెట్టు మీద వుండచ్చు’’ అని ఒక పిట్ట చెప్పింది. కానీ
ఆహారం సంపాదించడానికి పక్షులతో పాటు వెళ్ళకుండా, ఆలస్యంగా
నిద్రలేచి ఒంటరిగా వేటకి వెళ్ళేది. ‘‘అలా చెయ్యవద్దు.
అందరం కలిసి వెడితే వేటగాళ్ళకి దొరకం.. ఒకరికి ఆహారం దొరక్కపోయినా అందరం సహాయం
చేసుకుంటాం’’ అని మంచి సలహా చెప్పినా ఆ కాకి వినలేదు.
బతిమాలినా సరే ఆ కాకి వినలేదు. ఒక రోజు అన్ని పక్షులతో పాటే కాకి బయలు దేరింది.
కానీ అన్ని పక్షులూ వాలిన పొలం గట్టు, చెరువు వదిలేసి
ఇంకా ముందుకు వెళ్ళింది. అక్కడ గోదావరి గట్టున వాలింది. కాకి అలా వెళ్ళడం చూసి మరో
కాకి దాని దగ్గరకొచ్చింది. ‘‘ఈ గోదావరి నదికి వేగం ఎక్కువ
- ఇక్కడ వుండటం మంచిది కాదు, మాతో వచ్చెయ్యి’’ అని చెప్పింది. ‘‘నా తిండి, నా యిష్టం’’ అని ఒంటరిగా కాకి ఇంకా
ముందుకెళ్ళింది. అప్పుడు ఈ ఒంటరి కాకికి నదిలో కొట్టుకుపోతున్న ఒక చచ్చిన ఏనుగు
శరీరం కనిపించింది. ఆహా - ఈ ఏనుగు మీద వాలితే, తిండే తిండి
- మరొకళ్ళ సలహా, సహాయం అక్కర్లేదు’’ అనుకుంటూ రివ్వున ఎగిరి వెళ్ళి దాని మీద వాలింది. ఇంకొకవైపు చూడకుండా
ఏనుగును పొడిచి తింటోంది. ఇంతలో నది నీటి వేగం పెరిగింది. చాలా వేగంగా ఏనుగు శరీరం
కొట్టుకుపోతోంది. కాకికి ఇదేం తెలియడం లేదు. నది సముద్రంలో కలిసింది. సముద్రంలో
చాలా దూరం వెళ్ళింది. అప్పుడు కాకి తల ఎత్తి చూసింది. అంతా సముద్రం. గట్టు కనబడటం
లేదు - ఎగిరి వెళ్ళే దూరం కాదు - పైగా హఠాత్తుగా వర్షం మొదలైంది. ‘ఎలా ఎగరాలిరా బాబూ’ అనుకునేలోగా నాలుగయిదు
సొరచేపలు పేద్దవి వచ్చాయి. ఏనుగుని, కాకినీ మింగేసి
వెళ్ళాయి! స్వార్థం ఎంత చిక్కు తెచ్చిపెడుతుందో ఆ కాకికి తెలిసేలోగా దాని పని
అయిపోయింది.