యూనిట్
Flash News
సూదిపాఠం
ఒక
ఊరిలో ఒక కోటీశ్వరుడున్నాడు. ఆయనకు డబ్బు, బంగారం, వెండి, వజ్రాలు
- మేడలు ఎన్నెన్నో వున్నాయి. కానీ భార్య, పిల్లలూ లేరు. ఈ
ఆస్తి, సంపాదన ఏమైపోతాయోనని ఆయనకు దిగులు పట్టుకుంది. ఆ
ఊళ్ళోనే ఒక గొప్ప యోగి, జ్ఞాని వున్నాడు. ఆయన ఏదైనా ఉపాయం
చెబుతాడేమోనని కోటీశ్వరుడు యోగి దగ్గరకు వెళ్ళాడు. ‘‘అందరూ
నీ వాళ్ళే అనుకో చుట్టూ వున్న సమాజానికి, మీ ఊరికీ
కావలసిన సహాయం ఇవ్వు. అలా ఖర్చు చెయ్యి. ఎంత ఎక్కువ దానం చేస్తే అంత పుణ్యం,
మంచిదీనూ’’ అని ఆ యోగి చెప్పాడు. అది
కోటీశ్వరుడికి నచ్చలేదు. ‘‘అయ్యా ఈ సంపద మీరు తీసుకోండి.
నాకు పుణ్యం ఇవ్వండి’’ అన్నాడు కోటీశ్వరుడు. ‘‘నాకెందుకు నాయనా? నేను సన్యాసిని. పైగా
ఎక్కడెక్కడికో తిరుగుతుంటాను. కానీ నేను మీకు ఒక సూది ఇస్తున్నా. అది ఎంతో
పవిత్రమైంది. విలువైనదీ. నేను తిరిగి వచ్చేవరకు నీ దగ్గరే వుంచు’’ అని ఒక సూది ఇచ్చి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయ్యాకా ఆ యోగి గారి
అనుచరుడు, శిష్యుడు కోటీశ్వరునికి ఎదురయ్యాడు. ‘‘అయ్యా, మహాయోగి ఎక్కడున్నారు?’’ అని అడిగాడు కోటీశ్వరుడు. ‘‘ఆయన చనిపోయి చాలా
కాలం అయింది. ఏం కావాలి?’’ అని అడిగాడు శిష్యుడు.
కోటీశ్వరుడు చాలా బాధపడ్డాడు. ‘‘అయ్యో, ఆ స్వామి నాకు ఒక సూది ఇచ్చారు. ఆయనకే ఇవ్వాలి. ఇప్పుడెలాగ?’’ అని అన్నాడు. ‘‘ఆయన స్వర్గంలో వున్నాడు.
నువ్వు కూడా స్వర్గానికి వెళ్ళినప్పుడు ఆ సూదిని ఇద్దువుగానిలే’’ అన్నాడు శిష్యుడు. ‘‘అయ్యా- పై లోకాలకు ఎవరైనా
ఏదైనా తీసుకుపోగలరా? అలా అన్నారేమిటి?’’ అని ప్రశ్నించాడు కోటీశ్వరుడు. ‘‘మరి సూదినే
పైకి తీసుకుపోలేని వాడివి ఎంతెంతో సంపాదించి ఎవరికీ ఇవ్వకుండా సంపదని ఎలా
మోసుకుపోతావు? కావలసినంత తిని, మిగతాది
- ఏదైనా సరే - నలుగురికి పంచు. అదే పుణ్యం’’ అని యోగి
గారి శిష్యుడు చెప్పాడు. ‘‘ఈ సూది ఎంత గుణపాఠం చెప్పిందో
కదా!’’ అనుకున్నాడు కోటీశ్వరుడు.