యూనిట్

మొండితనం లాభంలేదు!

మొసళ్లకి పక్షులకీ స్నేహం ఎలా వీలయిందీ అంటే, దాని వెనక ఓ చిన్న కథ వుంది. మొసళ్ళకి చేతులు, కాళ్ళు ఒకటే - అవసరానికి ఎలా కావాలంటే అలా ఉపయోగించుకుంటాయి. అందువల్ల మొసలి తన కాళ్లను నోట్లో పెట్టుకోదు. తన తలనే చెయ్యిలాగ ఉపయోగిస్తుంది. ఒకసారి మొసలి ఒకటి నీళ్లలో పడిన ఏదో జంతువును తినేసింది. అప్పుడు దాని పళ్లలో తిన్నది కొంచెం ఇరుక్కుపోయింది. దానికి చాలా చిరాకుగా వుంది. పళ్లలోంచి తిన్న ఆహారం ముక్కలు ఊడి రావటం లేదుగదా. అందుకని, అప్పుడు తనకి ఎదురుగా ఒక పిట్ట కనిపించింది. ‘‘అమ్మా, తల్లీ నా పళ్లలో ఇరుక్కున్న ముక్కలు తీసి పెట్టమ్మా నీ పుణ్యం వుంటుంది’’ అని పిట్లని బతిమాలింది. ‘‘ మరి నన్ను నువ్వు మింగేస్తేనో?!’’ అని అడిగింది పిట్ట. ‘‘మింగను-నోరు తెరిచి వుంచుతాను- నా పళ్ల మధ్య ముక్కలు తీసి నువ్వే తినెయ్‍’’ పైగా దేవుడిమీద ఒట్టు వేసింది. సరేనని ఆ పిట్ట తీరిగ్గా నోరు తెరచిన మొసలి నోట్లోకి వెళ్లి పళ్లమధ్యన మాంసం ముక్కలన్నీ తిన్నది ఎంచక్కా బయటికి వచ్చేసింది. మొసలి మెచ్చుకుంది. ‘‘ ఇకపై మా మొసళ్లు ఒడ్డుమీద వున్నప్పుడు నోరు తెరచివుంచుతాం. మీరు ఆహారం కోసం కష్టపడకుండా మా పళ్లలో ఇరుక్కున్న ముక్కల్ని తినొచ్చు.’’ అని చెప్పింది. మొసళ్లన్నీ ఈ పద్ధతి బాగుందనుకున్నాయి. బాగాతినేసిన మొసళ్లు ఒడ్డున పడుకుని నోళ్లు బార్లా తెరిచివుంచడం, పిట్టలు వచ్చి వాటి నోళ్లలో దూరి పళ్లమధ్య ఆహారం ముక్కలు తీసి తినడం - ఈ రకంగా పిట్టలకి, మొసళ్లకీ స్నేహం కలిసింది. ఐతే ఒక రోజున ఒక గద్ద ఇదంతా ఆకాశంలో ఎగురుతూ చూసింది. అనవసరంగా ఎగిరే బదులు హాయిగా నాలుగు మొసళ్ల నోటిలో ఆహారం ముక్కలు తీసితింటే సరిపోతుంది అని ఆలోచించింది. నేలమీద వాలి, అక్కడ వున్న ఒక పిట్టని అడిగింది. ‘‘నేనూ మీలాగే మొసలి నోటిలో పళ్లమధ్య ఆహారాన్ని తింటా’’ అని అన్నది. ‘‘ అలా వీల్లేదు-మొసళ్లు ఒప్పుకోవు. ఐనా మీరు పిట్టకాదు కదా- పెద్ద పక్షి మీరు - మాలాగా మొసళ్లని ఇబ్బంది పెట్టకుండా పళ్ల మధ్య ముక్కలు తీయటం మీకు రాదు’’ అని బుజ్జిపిట్ట చెప్పింది. ‘‘ ఐనా మొసళ్లని, నిన్నూ అడిగేదేంటి? అలా బార్లా తెరచివుంచిన నోట్లోకి ఎవరేనా వెళ్లవచ్చు’’ అన్నది గద్ద పొగరుగా. ‘‘ఒకవేళ మొసలి నిన్ను కరిస్తేనో?’’ అన్నది ‘‘మొసలి నన్ను కరిచేలోగా నేనే మొసలి కళ్లు నా పెద్ద ముక్కుతో పొడిచేసి ఎగిరిపోతా’’ అని ధైర్యంగా చెప్పింది గద్ద. పిట్ట ఎంతబాగా చెప్పినా ‘‘ఇంక నువ్వు నాకేం చెప్పనక్కరలేదు-మళ్లీ చెప్పావంటే నిన్ను పట్టుకుని తినేస్తా జాగ్రత్త’’ అని బెదిరించింది గద్ద. ‘‘సరే మీ ఇష్టం. మొసలి గారిని నొప్పిలేకుండా పళ్ళమధ్యన ఆహారాన్ని లాగాలి సుమా’’ అని సలహా చెప్పి పిట్ట తుర్రుమంది. ఇక మరునాడు మొసలి ఏదో జంతువుని నీళ్లలోకి లాగి తినేసింది. తీరిగ్గా ఒడ్డు దగ్గర పడుకుని కళ్లు మూసుకుని నోరు పెద్దగా తెరచి వుంచింది. చిన్నపిట్ట వచ్చి దాని నోట్లోకి వెళ్లబోయింది. ఈ లోగా పెద్దగా రెక్కలు చప్పుడు చేస్తూ గద్దవాలి - పిట్టని తోసేసింది. తన ఇంట్లోకి వెళ్లినట్టు మొసలి నోట్లోకి వెళ్లి పళ్ల మధ్యన ఇరుక్కున్న ఆహారాన్ని చూసింది. తన పెద్దముక్కుతో గట్టిగా మొసలి పంటిమీద, ఇగుళ్లమీద పొడిచింది. అంతే, వెంటనే మొసలి తన నోటిని ఠక్కుమని గట్టిగా మూసేసింది. గద్ద మొసలికి ఆహారం అయింది. ఏదీ ఆలోచించకుండా మొండిగా, పొగరుగా వుంటే ఇలాగే అవుతుందని పిట్టలకి అర్థమైంది. పిట్టలకి, మొసళ్లకీ స్నేహం మాత్రం అలాగే వుంది.

వార్తావాహిని