యూనిట్
Flash News
పిచిక సాయం
పాపం పిచికలు చాలామంచివి. అవి ఒక్క చెడ్డపని చేశాయా చూడలేదు అని అంటారు చాలా మంది. కొందరు దీన్ని ఒప్పుకోరు. పొలంలో ధాన్యం కుప్పలు పోసి ఓ పూట అలా వుంచేసి చూడండి. పిచికలు వచ్చి ఒక్క పూటలో మొత్తం ధాన్యం తినిపడేస్తాయి అని ఇంకొందరంటారు. అందుకని పిచికలనైనా పిట్టలు పట్టేవాళ్లు వొదిలిపెట్టరు. ఒకరోజు ఒక పిట్టలు కొట్టేవాడు అడవికి వెళ్లాడు. ఎక్కడా ఒక్క పిట్ట దొరకలేదతనికి, అలాగని ఏ జంతువూ కనబడలేదు... అందుకని తిరిగి ఇంటికి బయలుదేరాడు. దార్లో అతనికి బాగా దాహం అయింది. కొంతదూరం వెళ్లాకా అతనికి ఒక చెరువు కనిపించింది. వెళ్లి నీళ్లు తాగి లేవబోయాడు. అప్పుడు అతనికి ఒక పిచిక కనిపించింది. అది పాపం ఎగరలేక పోతోంది. ఎందుకంటే... చెరువు గట్టు దగ్గర బురదవుంది. ఆ బురదలో దాని చిట్టికాళ్లు ఇరుక్కుపోయాయి. ఎంత ఎరగాలని చూసినా అది ఎగరలేకపోతోంది. ఇదంతా చెట్టుమీదవున్న ఒక గద్ద చూసింది. రివ్వున ఎగిరివచ్చి చిట్టి పిచికను పట్టుకుపోయి తిందామనుకుంది.. పిచిక కూడా మనలాంటి పక్షికదా అని గద్దలు అనుకోవు. ఐతే ఆ గద్ద ఎగిరి పిచిక దగ్గరికి వద్దామనుకునేలోగా పిట్టలు కొట్టేవాడు పిచిక చిక్‍చిక్‍మని అరవటం విన్నాడు. వాడు పిచిక దగ్గరకు రాగానే గద్దకు భయం వేసి ఎటో ఎగిరి పోయింది. ‘అమ్మయ్య’ బతికేంరా బాబూ’ అనుకుంది చిట్టి పిచిక. పిట్టల వాడు దగ్గర కొచ్చి ఎగరలేని ఆ పిచికను పట్టుకుని నడుస్తున్నాడు అప్పుడు ఆ పిచికకు ఏడుపొచ్చింది. గద్ద నుంచీ రక్షించాడు గానీ, తనని వండుకుని తింటాడేమోనని కంగారు పడింది. అందుకని అతన్ని బతిమాలింది. ‘‘బాబ్బాబు, ఈ సారికి నన్ను వొదిలివెయ్యండి మీకు మంచి సహాయం చేస్తాను’’ అని అన్నది. ‘‘నువ్వా? నాకా? ఏం సాయం చెయ్యగలవు?’’ అంటూ నవ్వాడు.. అతను అలా నడుస్తోంటే నేలమీద ఒక పాము చుట్ట చుట్టుకుని వుంది. దానికి దగ్గరగా వచ్చాడు పిట్టలవాడు. అప్పుడు పిచిక తన ముక్కుతో అతని చేతిని కొద్దిగా పొడిచింది. అప్పుడు అతను కిందకి చూసి పాముని గమనించాడు. జాగ్రత్తగా పక్కకి తప్పుకున్నాడు. ‘‘మంచి సాయమే చేశావు. ఐనా చిన్న పిచికను తింటే ఆకలి ఏం తీరుతుంది?’’ అని అనుకుని ‘సరేలే పాపం, వెళ్లు’ అని పిచికను వదిలేశాడు. పిచిక మాత్రం అతని వెనకే ఎగురుతూ వచ్చింది’’ పిట్టలవాడు తన పూరి గుడిసెలోకి వెళ్లాడు. పిచిక ఆ గుడిసెను చూసింది.. గడ్డి పోచలతో అల్లిన గుడిసె అది. సరేననుకుంది. ‘‘నీవు రేపు వెతికివెళ్లి తిరిగి వచ్చేసరికి నీ గుడిసె మారిపోతుందిలే’’ అంటూ ఎగిరిపోయింది పిచిక. ఎందుకంటే ఆ గుడిసెనిండా కన్నాలే. గుడిసె ఎప్పుడేనా కూలిపోవచ్చు అన్నట్టుగా వుంది. గాలికి గడ్డి, రెల్లు అంతా జారిపోతున్నాయి. అందుకని గుడిసె బలంగా లేదు. పిట్టలవాడు పిచిక మాటను పట్టించుకోలేదు. మరునాడు పిట్టలవాడు మళ్లీ వేటకు వెళ్లాడు. గుడిసెలో ఇంకెవరూ లేరు. అప్పుడు చిట్టి పిచిక తన స్నేహితులయిన పిచికలన్నిటికి జరిగినదంతా చెప్పింది. అంతే - వెంటనే వందలకొద్దీ పిచికలు వచ్చి అడవిలోని రెల్లు గడ్డి పోచలు ఏరి తెచ్చాయి. గుడిసెమీద వున్న పాతగడ్డిని పికేసి, కొత్త గడ్డి పోచలతో బలంగా అల్లి పెట్టి ఎగిరిపోయాయి. సాయంత్రం పిట్టవాడు తిరిగివచ్చి చూసి ఆశ్చర్యపోయాడు ‘ఇది నిజంగా నా యిల్లేనా?!’’ అనుకుంటూలోపలికెళ్ళాడు. ‘‘ఇంకెప్పుడూ పిచికలను పట్టుకోను’’ అని గట్టిగా అనుకున్నాడు. పిచికలకు ఈ సంగతి తెలిసి చాలా సంతోషించాయి.