యూనిట్

ఎలుక సంపద

ఒక ఊళ్ళో  ఒక పెద్ద వ్యాపారి వుండేవాడు. అతను బియ్యం, పప్పులు, నూనె వంటివి ఎన్నెన్నో సరుకులు పెట్టి లాభాలకు అమ్ముతుంటాడు. ఒక రోజు ఒక పేద పిల్లవాడు అక్కడికి వచ్చాడు ''అయ్యా, ఆకలవుతోంది'' అన్నాడు.''చిల్లిగవ్వ ఇవ్వనుపో'' అన్నాడు వ్యాపారి. ''దానం చెయ్యెద్దండీ - పని ఇవ్వండి. చేస్తాను. దానికి తగ్గ డబ్బులివ్వండి'' అన్నాడు ఆ అబ్బాయి.సరే, దుకాణంలో సహాయంగా ఉండడం మంచిదే అని ఆ పేద పిల్లవాడిని పనిలో పెట్టుకున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇతని పని గమనించాలనుకుని వ్యాపారి అబ్బాయికి చిన్నచిన్న పనులు చెప్పాడు. అవేవీ చేయకుండా చిన్నకర్ర పట్టుకుని బియ్యం పప్పుల బస్తాల చుట్టూ తిరుగుతున్నాడు. సాయంత్రం అయింది. అప్పుడు పిల్లవాడు వెదుకుతున్న పెద్ద ఎలుక కనిపించింది. గట్టిగా కర్రతో కొట్టాడు. అది చచ్చిపడింది. అది వ్యాపారి చూశాడు. ''రోజంతా నువ్వు చేసిన పని ఇదా -పో- నీకు జీతం దండగ - ఆ ఎలకని తీసుకుని వెళ్ళిపో'' అన్నాడు. ''కాదండీ - ఆ ఎలుక కందిపప్పు, మినపప్పు, అన్ని పప్పుల బస్తాలను కొరికి తినేస్తోంది. ఈ పనిలోనే రోజంతా గడిచింది'' అని అబ్బాయి చెప్పాడు. ఆ పిల్లవాడు ఎంత బతిమాలినా వినకుండా వ్యాపారి కుర్రవాడిని బయటికి తరిమేశాడు. చేసేదేంలేక ఆ చచ్చిన ఎలక తోక పట్టుకుని వీధిలోకి వచ్చాడు. ఎక్కడ దానిని పడెయ్యాలో అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఒక చిన్న వ్యాపారి ఆ కుర్రవాడి దగ్గరకొచ్చాడు. రెండు దోసెళ్ళ సెనగలు అబ్బాయికిచ్చి ఆ ఎలుకని తీసుకున్నాడు. ''ఎందుకండీ ఇలా చేశారు?'' అని  అడిగాడు. ''మా పిల్లికి తగిన ఆహారం కోసం చూస్తున్నాను. సమయానికి నీ దగ్గర ఎలుక దొరికింది'' చెప్పాడు. అప్పుడు కుర్రవాడు ఒక ముసలవ్వని అడిగి ఒక కుండ తీసుకున్నాడు. దాన్నిండా మంచినీళ్ళు పోసి, అడిగిన వారికి దప్పిక తీరేందుకు మంచినీళ్ళు, కాసిని శెనగలు ఇస్తూ తనూ అవే తింటూ కూర్చున్నాడు. ఈ కుర్రవాడు చేస్తున్న మంచి పనిని చూసి అక్కడికి వచ్చే కట్టెలమ్ముకునే వారు ఒక్కొక్కరూ రెండేసి కట్టెలు ఇచ్చి వెళ్ళారు. దాన్ని చూసి కుర్రవాడికి ఆలోచన వచ్చింది. ఆ కట్టెలను కట్టగట్టి అక్కడే దుకాణం పెట్టాడు. మెల్లగా వ్యాపారం మొదలయింది. కొద్దిరోజుల్లో అవన్నీ అమ్మేశాడు. బాగా డబ్బులు వచ్చాయి. వ్యాపారం కూడా పెరిగింది. కొన్ని కట్టెలమ్మి పప్పు, ఉప్పులు కొని చిన్నచిన్న మూటలో పెట్టి అమ్మాడు. బాగా డబ్బు వచ్చింది. ఈ లోగా వ్యాపారి దుకాణంలో ఎలుకలు పెరిగిపోయాయి. అతనికి సరుకులు అమ్మిన దానికంటే ఎలుకలు తింటున్నది ఎక్కువైంది. తను పనిలోంచి తీసివేసిన పిల్లవాడు రోజంతా చేసిన పని ఎంత ముఖ్యమైందో ఆ వ్యాపారికి అప్పుడు అర్థమైంది.  తెలివైన వాడికి చచ్చిన ఎలుకయినా, చిల్లిగవ్వ అయినా పనికొస్తాయని, తెలివి తక్కువ వాడయితే బంగారం అమ్మినా వాడికి నష్టం వస్తుంది - అని కూడా గ్రహించాడు. 

- తల్లావఝుల శివాజి

వార్తావాహిని